Naaku Thochina Maata    Chapters   

నాకు తోచిన మాట

శ్లో|| శివః శక్త్యా యుక్తోయదిభవతి శక్తః ప్రభవితుం

నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి,

అత స్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి||

''ఏకమేవా ద్వితీయ బ్రహ్మ'' అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. మనము వేదముల నుండియు, ఉపనిషత్తుల నుండియు తత్త్వరహస్యమును గ్రహింపవలసియున్నది. కాని వేదవిద్యలు రానివారు పెద్దల నుండి ఆ రహస్యమును గ్రహింపవలయును. వేదములుకాని, పురాణములుకాని, పెద్దలుకాని చెప్పినది సత్యజ్ఞానలక్షణమేయని తెలిసికొనవలయును. లోకాతీతమైన వస్తువును సామాన్యమైన మాటలలో వర్ణింప శక్యముకాదు. కాని మహిమాన్వితులైన మహర్షులు బ్రహ్మోపదేశమును సామాన్యమైన మాటలలో కావించిరి. యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి సులభగ్రాహ్యమైన భాషలో బ్రహ్మోపదేశమును గావించినాడని వేదాంతమే చెప్పుచున్నది. ఈ అనంతమైన సృష్టికి బ్రహ్మవస్తువు సర్వాధారత్వము నొందియున్నది. ఈ బ్రహ్మవస్తువు నిత్యమైనది గాన సత్యమైనది. ఈ సత్యమునకే సత్త అని పేరు. జ్ఞాన స్వరూపమైనది బ్రహ్మము ఇది అనంతము.

దేశ కాలములచే పరిచ్ఛిన్నముకానిది ఆనందస్వరూపము. గౌతముడు దుఃఖాభావమే మోక్షమని నుడివియున్నాడు. కనుక సత్యజ్ఞానానంద రూపమైనది బ్రహ్మవస్తువనియు, అది అంతట నిండియున్నదనియు తెలియుట ఆవశ్యకమైయున్నది. బ్రహ్మవస్తువునకు లక్షణములుగ చెప్పబడినవానిలో మొదటిది సత్యము. సత్యమనగా సర్వకాల సర్వావస్థలయందుండునదని అర్థము. అట్టిది బ్రహ్మస్వరూపము ''యన్నిత్యం తత్‌ సత్యం'' అనుటచే నెల్లప్పుడు నుండునదని భావము. ఇక లక్షణములలో రెండవది, జ్ఞానము ముఖ్యమైనది అనగా ఇది సంవిద్రూపమైనది. నిత్యము చైతన్యమయమై ప్రకాశించుచు జడముగాక యుండు స్వభావమని తెలిసికొనవలయును. ఇక మూడవది ఆనందస్వరూపమై వెలయుచున్నది. పై చెప్పిన గౌతముని దుఃఖాభావమే మోక్షమను మాట నిచ్చట సమన్వయించుకొనవచ్చును. మొత్తముమీద పై చెప్పిన సత్యజ్ఞానానందరూపమగు బ్రహ్మవస్తువు సర్వాధారమై యున్నదని తెలిసికొంటిమి. అనంతమైన ఈ సృష్టియందు ఆకాశ##మే విశాలమైనదని చెప్పబడుచున్నది. కాబట్టి అన్నిటి కంటె ఆకాశము పెద్దదని తేలుచున్నది. మరియు అన్నటికంటె చిన్నదైనది భూమియని తెలిసికొనవలసియున్నది. తర్కము - ''శబ్ద గుణకమాకాశమ్‌'' అని ఆకాశ లక్షణమును తెల్పుచున్నది. అనగా శబ్దమే గుణముగా గలది యని భావము. కాని శ్రుతిమాత్రము ఎక్కడ సందున్నదో-అది ఆకాశమని చెప్పుచున్నది. భూమ్యాకాశములకన్నను బ్రహ్మవస్తువు పెద్దదని తెలియుచున్నది. ఏలన ''బృహత్వాత్‌ బ్రహ్మ'' అని ఆ శబ్దలక్షణమే చెప్పుచున్నది కనుక అన్నిటికన్న పెద్దదైనది బ్రహ్మస్వరూపమని తేలుచున్నది. ఈ బ్రహ్మ స్వరూపమునకు రూపముగాని, గుణములు గాని లేవు. కావున నిర్గుణమైనది బ్రహ్మ కాని ''యా మా సా మాయా'' అనుటచే లేనిది ఉన్నట్లు కన్పట్టుటయే మాయాలక్షణము. అనగా ఇది భ్రాంతి భ్రాంతి అనునది అధిష్ఠానపూర్వకమేగాని, నిరధిష్ఠానమైనది కాదని శంకరులు చెప్పుచున్నారు. కావున మాయ కధిష్ఠానమైనది బ్రహ్మమని తెలియవలెను. ఈ బ్రహ్మవస్తువే - జగత్తు అని భ్రమించుట జరుగుచున్నది. త్రాటిని చూచి పామనుకొనినట్లు బ్రహ్మమును చూచి జగమనుకొనుచున్నారు. పై చెప్పిన మాయలోనే ప్రపంచము ప్రారంభమగుచున్నది. అనగా సృష్టికి మూలము బ్రహ్మము. దాని నుండి మాయ స్ఫురించుచున్నది. దానినుండి సృష్టిధర్మములు ప్రారంభ మగుచున్నవని తెలియవలెను.

ఈ బ్రహ్మవస్తువునుగూర్చి చెప్పుచున్న శ్రుతులుగాని, స్మృతులు గాని అనేకములున్నవి. శ్రుతి యనగా వేదము. దాని యర్థ మెచ్చట స్మరింపబడునో దానికి స్మృతి యని పేరు. ''శ్రుత్యర్థో యత్ర స్మర్యతే సాస్మృతి రిత్యర్థః'' అని లక్షణము చెప్పబడినది. ''శ్రుతిశ్చ భిన్నాస్మృతయశ్చ భిన్నాః'' అన్నట్లు వీనియం దనేక భిన్న దృక్పధములు కన్పట్టుచున్నవి. అయినప్పటికి అన్ని మతములు ఇందే గలవు. ఇది విశాలమైనది కావుననే శంకరులు శ్రుతి స్మృత్యాదులకు ఏక వాక్యత వాక్రుచ్చిరి అది వాక్యావాంతరవాక్య భేదములచే సాధింపబడినది. ఎట్లన ఒకడు తన స్నేహితుని దగ్గఱకు కొంత ధనమును అప్పు అడుగుటకు వెళ్ళినాడు. వెళ్ళినవాడు మొదట అందఱు బాగుగనున్నారా అని అడుగును. పిమ్మట కొంత సంలాపములు జరిపి, ప్రసంగవశమున నతని నుపలక్షించి, నీవు విసుగుకొనుచుంటివేమి? అని యడుగును. ఇట్టి యోగక్షేమ పరామర్శతో - వాడు పరుల కప్పునిచ్చి బాధపడుచుండుట యెఱింగి యట్టివాని కేల అప్పులిచ్చితివి? ఇంటనే దాచుకొనరాదా? అని విరుద్ధవాక్యములు పలికి, తన సంగతి చెప్పక బయలుదేరును. పోవువాడు పోక అల్లంతదూరము నుండి వాని ప్రశ్నము మీద నాకొక పదిరూపాయ లీయగలవా? అని అడిగి అతడీయ తిరిగివచ్చి తీసికొని వెళ్ళినాడు. ఈ విధముగా వాడు అప్పు పుట్టించు కొనుటయందలి విరుద్ధవాక్యములకు స్వార్థమం దెట్లు సమన్వయమో, అట్లే శ్రుతి స్మృతుల యందలి అన్నివాక్యములకు నేకవాక్యత కుదిరియేయున్నది. కావున శ్రుతి స్మృతులలో భేదములు లేవని - అవాంతర వాక్యముల ద్వారమున ప్రధాన వాక్యాన్వయము చేసినను వానికి భేదము మాత్రము లోక దృష్టిచే గన్పట్టుచున్నదని తెలియవలెను. ఈ విధముగనే అద్వైతమును బోధింపదలచి ద్వైతమును, సృష్టిని, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అవస్థలను, ఉపాధులయందు ప్రాణప్రవేశము, ప్రాణవిభాగము, ప్రాణోత్క్రాంతి, కర్మములు, ఉపాసనలు, పుణ్యపాపములు, స్వర్గనరకములు మొదలైన వన్నియు బోధించి ప్రస్తావన రూపముగ వేదములలో, ఉపనిషత్తులలో, పురాణములలో నిక్షి ప్తములు చేయబడినవని సమన్వయపరచి యేకవాక్యతను జగద్గురువులు శ్రీ శంకారాచార్యస్వామివారు సమర్థించిరి.

cక మాయ కధిష్ఠానమైన బ్రహ్మము నుండి సర్వపదార్థములు ఆభాసించుచున్నవని తెలిసికొంటిమి. బ్రహ్మము నుండి మాయ, మాయ నుండి మహత్తు, మహత్తు నుండి అహంకారము, దాని నుండి సూక్ష్మభూతములు, వాని నుండి పంచభూతములు - ప్రపంచము సృజింపబడుచున్నవి. ప్రపంచ నిర్మాణమునుగూర్చి నేటి సైన్సు చెప్పు విషయమును, ఏనాడో తర్కశాస్త్రము విపులీకరించినది. మానవుడు నిద్రించునపుడు లేచునపుడు దైనందిన సృష్టియొక్క పర్యాలోకన చేయనగునని పెద్దలు సెలవిచ్చిరి. నిద్ర యనునది కన్నులను మూసివేయును. ఆ క్షణముననే క్రమముగ సర్వేంద్రియముల వృత్తులు ఆగిపోవును. అపుడు సూక్ష్మభూతములు అహంకారమున - మహత్తున లయమగును. అపుడు దాని మాయారూపమగు చీకటి ఆవరించును. నిద్రనుండి లేచునపుడు మాయనుండి వెల్తురు ప్రభవించును. దీనికే మహత్తత్త్వమని పేరు. దీనినే మెలకువ నొందుట అందురు. మెలకువ వచ్చిన తర్వాత అహంకారము ప్రారంభమగును. 'నేను' అనబడునదే అహంకారము. దీనినుండియే తన్మాత్రల యనుభవము జరుగుచున్నది. కావున నిద్రపోవునపుడు, నిద్రలేచునపుడు, మానవుడు సృష్టిని, లయమును అనుభవరూపముగ తెలియవలయునని సారాంశము.

ఒకసారి శ్రీ రాయడు శాస్త్రిగారికి మాతండ్రిగారు వ్రాసిన రామకథామృతమును వినిపించుట జరిగినది. అపుడు, రాయడు శాస్త్రిగారు - మీ రామరావణులకు భేదమేమి? అని నన్ను ప్రశ్నించిరి. అపుడు నేను మా రాముడు అటు ఇటు కానివాడు. కాని రావణుడు మాత్రము మూలమునందలి వాడేనని అంటిని. ఏలన సామాన్యముగ లోకమున రావణుడు పదితలలు, ఇరువది చేతులు కలిగియుండునను వాడుక ప్రబలమైయున్నది. రావణునకు దశగ్రీవుడని పేరుకదా! ఇట్లుండ సుందరకాండమున - సీతను వెదుకబోయిన హనుమంతుడు అంతఃపురమున నిద్రించు రావణుని చూచి - ''బాహూ'' - అని (రెండు బాహువులు గలవాడని) వర్ణించినట్లు కలదు. ఇది వాల్మీకి ప్రయోగము. అనగా రావణుడు కామరూపుడు గాన వ్యవహారమున నట్లున్నను నిద్రయందు తన ప్రకృతి రూపముననున్నాడనియు, అదియే సత్యరూపమని యొప్పుకొనవలెననియు వారి యభిప్రాయము. ద్విత్వ విశిష్టజాతినిబట్టి ఈ ఒకచోటి ప్రయోగము లోకానుసారముగ సాధువుగ సమన్వయించుట సమంజసమని నేను చెప్పితిని. కామరూపులు రతియందు, నిద్రయందు, మృతియందు తమ స్వస్వరూపములతో నుందురని శాస్త్రము. ఈ రహస్యమెఱిగిన వ్యాస వాల్మీకులు యథాతథముగా వారివారి నాయకులను, పాత్రలను తీర్చిదిద్దిరి కాని సామాన్య కవులవలె కల్పనా భూయిష్టముగ రచింపలేదు. భారతమున యుధిష్ఠిరుడు - ''అశ్వత్థామా హతః కుంజరః'' అన్న మాటను పాత్ర పోషణమునకుగా దీసివేయకుండ ఉన్నది యున్నట్లు వ్రాసెను. కాబట్టి సామాన్య కావ్యముల దృష్టిలో పై వ్యాస వాల్మీకుల కావ్యముల చేర్చరాదు. పై కవులు సృష్టించిన పాత్రలు మరే కావ్యమందున్నను, అందలి విషయమే ప్రామాణికమని భావించరాదు. అహల్యా సంక్రందనము, తారాశశాంకము, పారిజాతాపహరణము మొదలగు కావ్యములలో పౌరాణిక పాత్రలున్నవి. అందలి కవి వర్ణిత విషయమే ప్రమాణమని భావించరాదు. ముక్కుతిమ్మన సాక్షాత్తు శ్రీకృష్ణుడే కృష్ణదేవరాయలై సింహాసన మధిష్ఠించెనని- యాదవత్వమున సింహాసనస్థుడు గామి - అను పద్యమున వర్ణించినాడు. కృష్ణుని తర్వాత మఱొక యవతారము పురాణముల వర్ణితము కాదు. కవిత్వమున చమత్కారకారిత్వ మవసరము. ఆ ముక్కు తిమ్మనయే అస్తపర్వతమందు తిరుగు కామధేనువు పేడ వేయగా నది యెండి అందలి దావాగ్నితో తగులబడి చల్లారి గుండ్రముగా గన్పట్టుచున్న దని చంద్ర మండలమును వర్ణించెను. కావున కవులు కాలానుగుణముగ చేసిన కల్పనలన్నియు ప్రమాణములని భావింప నక్కరలేదు. మనకు వేదములు పరమప్రమాణములు. పిమ్మట ధర్మశాస్త్రములు, ఇతిహాసములు గ్రహింపదగినవి. ఇందు ధర్మములు భిన్నభిన్నములుగా నుండును. ఆయా దేశములబట్టి అవి మారుచుండును. శాస్త్రము - మేనమామ కూతురును వివాహమాడుట నిషేధించినది. కాని ఈ సంప్రదాయము ఆంధ్రులలోనున్నది. కావుననే - ''ఆంధ్రాణామయ మాచారః'' అనవలసి వచ్చినది. శంకరులు భారతములో లేని ధర్మ మితర గ్రంథములలోనున్న దాని నాచరించినను విడిచినను ప్రత్యవాయము లేదనియు, భారతమందలి ధర్మము ఇతర గ్రంథములయందు లేకున్నను తప్పక యాచరింపవలెనని వాక్రుచ్చిరి. భారతమున సుభద్ర అర్జునునకు మేనమామ కూతురు. బలరాముడు వారి వివాహము అంగీకరింపలేదు. అపుడు శ్రీకృష్ణుడు బలరామునకు నచ్చచెప్పి వారి వివాహము జరిపించుట జరిగినది. ఈ విషయము వ్యాసుడు శ్రీకృష్ణుని ద్వారమున చెప్పించుట గమనింపదగినది కాని ఈ యాచారము ద్రవిడులలో లేదు. కాని కృష్ణుడు చెప్పిన దంతయు ప్రమాణమా? అనరాదు. కృష్ణుడు కూడ వేదచోదితమే చెప్పునుగాని వ్యతిరిక్తము చెప్పడు ''మాతుల స్యేవయోషా'' అన్న మంత్ర లింగమునుబట్టియే శ్రీకృష్ణుడాధర్మమును జెప్పెనని గ్రహింపవలెను.

వేదమనునది వాగ్రూపమైనది. అది ముఖతః నేర్చుకొనదగినది కాని పుస్తకరూపమున చదువరానిది. అట్లు అభ్యసింపబడకున్న నది వేదమే కాదు. బ్రహ్మ నుండి మాయ, దీని నుండి సగుణ బ్రహ్మ, దీని నుండి శ్రుత్యాది వాఙ్మయము భాసించును. ఈ సగుణబ్రహ్మ బహు రూపములతో నుండును. నిర్గుణ బ్రహ్మకు వృత్తిలేదు. సగుణ బ్రహ్మనుండి రూపధారణములతో బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల ఆవిర్భావము జరుగును. నేడు చాలమంది ఆ దేవతలు కన్పించుటలేదు గనుక వారు లేరనుట వినబడుచున్నది కాని వారి దర్శనమునకు ప్రయత్నముచేయు టుచితము. కర్త లేక కార్యము లేదన్నట్లు ఈ సృష్టికంతయు కారణభూతుడొక డున్నాడనుట యుక్తముగదా! వాని పేరే బ్రహ్మ. వాడే దేవుడు. తిరుపతిలో దేవుడు ఱాతియందే యున్నాడు. కాని యందలి విశేషము దానిలోని దైవిక తేజస్సు లేక శక్తి అని భావించవలెను. ''భక్తానాం ఆర్తినాశనః'' అయినట్టి భగవంతుడు సర్వవ్యాప్తి నొందినవాడుగదా! నేను చెన్నపట్టణము చూడలేదు కాన నది లేదన జెల్లునా? చూచినవారు చెప్పగా గమనించి యొప్పుకొనవలెనుగదా!

ఒకసారి ఒక కలెక్టరు మా యూరికి రాగా మా నాన్నగారు కరణముగారు తమకు చేసిన అపకారము చెప్పిరి. ఆ కలెక్టరు వినివిని చివరకు నాన్నగారిపై ఎదురుతిరిగి కళ్లెఱ్ఱ జేసినాడు. అపుడు మా నాన్నగారు ''ఱాయీ! కావుమటన్న కళ్లెఱ్ఱం జేయదు - శ్రీబాలకోటేశ్వరా!'' అని కలెక్టరుగారిని ఱాయికంటే ఱాయివని నీకు చెప్పుకొనుటకన్న ఱాతితో చెప్పుకొనుట మంచిది అని ఒక పద్యము చెప్పిరి. ఇంతకు కలెక్టరుగా వచ్చిన ఆ దొరపేరు రాయ్‌. ఒకసారి నాకు తిరుపతిస్వామి దర్శనము దుర్లభ##మైనది. ధ్వజస్తంభమువద్దనే మ్రొక్కుతీర్చుకొని వచ్చితి. పిమ్మట వైకుంఠపురము వెళ్ళి అచ్చట స్వామిని దర్శించి సేవించి స్వామి కలలో కనుపించి తిరుపతిస్వామి రజోగుణ ప్రధానుడనియు, వైకుంఠపురస్వామి సత్త్వగుణ ప్రధానుడు కనుక దర్శనము కలిగినదనియు, తిరుపతి స్వామిపై కోపించుట తగదనియు చెప్పెను. ఈ భావోద్రేకముతో వేంకటేశ్వరస్వామిపై నొక శతకమును ''నా యాత్ర'' అని వ్రాసితిని. ఇదికాక బ్రాహ్మము నుండి భిన్నరూపములు ధరించిన శివకేశవాదులు చేయుపనులు శరీరాభిమానముతో కాదని తెలిసికొనవలయును. విష్ణునకు అచ్చ్యుతుడని నామము. ఏ పనులు శరీరముతో చేయుచున్నను బ్రహ్మ భావమునుండి చ్యుతుడు కాడుగాన - తత్పపదము సార్థకము. బ్రహ్మరూపము నుండి యొకప్పుడు చలింపడు గాన శివునకు స్థాణువని పేరు. కావుననే శివాలయమున ''హరోం హరోం హరోం'' అని బిగ్గరగా పదునొకండుమార్లు కేకలువేయుట గుణాతీతుడగు నా దేవుని ప్రపంచోన్ముఖు నొనర్చి కొనుటకని పెద్దలు చెప్పుదురు. ఇట్లే ఇంద్ర కశ్యపాది శబ్బిల కర్థము. ఋష్యాదులు దివ్యదృష్టితో దేవతల కథల నర్థము చేసికొనగలరు. కాని సామాన్యుల కది అసాధ్యము. కావున పురాణ కావ్యములు చదివి మంచి గ్రహించి, చెడును వదలుట అభ్యాసము చేయవలెను. శాస్త్రములు కేవలము జ్ఞానికి, అజ్ఞానికి అక్కరలేదు. కావున మధ్యముడైన సామాన్యునికి కావలయును.

2

''బ్రహ్మ సత్యం జగన్మిధ్యా'' అని పెద్దల అనుభవప్రోక్త మార్గము బ్రహ్మ నిత్యమై వెలయుచున్నది. మనకు కనబడుచున్న చరాచర జగత్తు మిధ్యారూపమై భాసించుచున్నది. సగుణ బ్రహ్మమునకు మొదట ఇచ్ఛ ప్రారంభ##మై పిమ్మట సృష్టి జరుగుచున్నది. ఎవరికి తగిన బుద్ధి లేక ఇష్టమునే మతమని భావించవలెను. ఇది వాని మతము, అది వాని మతము అనునప్పుడు ఇష్టము అనియే భావము. అట్లే మునుల మతములు వేదము ననుభవింపగా వారివారికి తేలిన భావములు. సృష్టియందు పంచభూతములు - వాని నిర్మాణము-

ఆకాశాత్‌ వాయుః ! వాయో రగ్నిః !

అగ్నే రాపః ! అబ్భ్యః పృథివీ !!

పృథివ్యా ఓషధయః ! ఓషధీభ్యో7న్నం !

అన్నా త్పురుషః !

అని శ్రుతిచే చెప్పబడినది. మరియు ఓషధులవలన పురుష దేహములు, అంతఃకరణములు జనించుచున్నవి. సగుణబ్రహ్మ కారణశరీరము లోనికి వచ్చినపుడు ఆనందమయకోశ మనబడును అన్నమయ కోశమున విశ్వుడు, సూక్ష్మశరీరమునందు తైజసుడు, కారణ శరీరములో ప్రాజ్ఞుడునను పేర్లతో నుండు దేవుడే జీవుడు. విరాట్‌ స్వరూపము సహస్ర శీర్షాద్యవయవములతో వెలయుచుండును. ఋషీశ్వరులు యోగులు దివ్యదృష్టితో విశ్వరూపమును, విరాట్టును చూడగలుగుచున్నారు. కాని యితరులకు చూపలేరు. ఆశక్తి శ్రీకృష్ణునకే కలదు. మంత్రద్రష్టలు మంత్రముల మననము చేయుదురు. శిష్యులకు చెప్పుదురు. కాని వ్రాయరు. భారతమును లేఖ్యమగు నామ్నాయమని చెప్పుటచే, ఇతరామ్నాయము లలేఖ్యములు. లక్ష్మీధర పండితుడు సౌందర్యలహరి వ్యాఖ్యయందు మంత్రబీజమును పుస్తకమందు వ్రాయుచున్నాననియు, కలియుగమున సంప్రదాయము దొరకనివారలు తీవ్రభక్తులు దాని నుపయోగించుకొనుడని దానికిగా శ్రీమంత్రమును వ్రాసెను. మంత్రమనునది యుపదేశింపవలయునే గాని వ్రాయరాదు. కాని పై వ్యాఖ్యాత సంప్రదాయము దొరకనివారు తన్ను గురువుగ నెంచుకొని పుస్తకమునుచూచి అభ్యసించుమనియు, అట్లు చేసిన వారికి సిద్ధి సమకూరునట్లు తాను చేయుదునని వ్రాసియున్నాడు. దానిని బట్టి తాను ఈశ్వరుడ ననియు తలంచినట్లే, యోగమున మణిపూరకము నందు వాయువు అగ్నిరూపము నొందునని శంకరులు చెప్పిరి. కాని స్వాధిష్ఠానమందే యిట్టిది జరుగునని లక్ష్మీధరుడు పల్కియున్నాడు. ఇట్లు ఎవరికైనను జరిగిన భయపడరాదని తన యనుభవమును చెప్పుట అతని ఆశయము. ఇట్టి సిద్ధపురుషు లెందఱో గ్రంథకర్తలయందు కలరు.

భారతమున బ్రాహ్మణగీత, సనత్పుజాతగీత, హంసగీత మొదలగు పేర్లతో నూరుగీతలు కలవు. ఏ గీతల నెవ రభ్యసించినను గమ్యము మాత్ర మొక్కటే యగుచున్నది. మార్గములు శబ్దార్థ వాక్యార్థభేదములతో నారబ్ధములగుచున్నవి. ఈశ్వరత్వము నెన్నిమార్గములతో చెప్పినను పరమార్థమొక్కటి యని తెల్పుటకే, ఎవరి యనుభవము వారు చెప్పుట మూలముగా నిన్ని గీతలు పుట్టినవని భావించవలయును. ''నమో వాఙ్మన సాతీత రూపా యానంత శక్తయే'' అన్నచోట శబ్దశక్తులు పరమాత్మ శక్తులవలె అనంతములు. ఒక్కొక్కచోట నొక్కొక్కశక్తి ప్రకాశించుచున్నది. ఈ శక్తులన్నింటికి అధికారి యుండితీరవలెనుగదా! అతడే యీశ్వరుడని విశ్వసింపవలెను. కాళిదాసు ''ప్రత్యక్షోప్య పరిచ్ఛేద్యః మహ్యాది ర్మహిమాతవ'' అని ప్రత్యక్ష శక్తులనుబట్టి అప్రత్యక్షు నీశ్వరునాధికారిక పురుషునిగా నెఱుగవలెనని చెప్పెను. ప్రత్యక్ష మెట్లపరిచ్ఛేద్యమన దక్షుడు మొదట అరువదివేలమంది కుమారుల గనెనట. వీరిని వివాహము చేసికొని సంతానము గనుమని తండ్రిచెప్ప, వారలు కన్యలకై వెదుకుచుండిరట. ఆ సమయమున నారదుడు వచ్చి వారిని మీ రెవరు? ఎచ్చటనుండి వచ్చితిరి? అను మొదలగు ప్రశ్నము లొనర్చి వీనికి సమాధానములు ముందు తెలిసికొమ్మని చెప్పెను. వారు ఆ తత్త్వము నెరుగనుత్తరముగ పొమ్మనెను. వారట్లే నారదవచనము తెలిసికొనుటకు ఉత్తరమునకు వెళ్ళిరట. మరొక అరువదివేలమంది దక్షకుమారులకుకూడ నట్లే చెప్పి పంపెనట నారదుడు. తర్వాత ఆడుపిల్లలను కనగా వారివలన నీ ప్రపంచ సృష్టి జరిగినది. అప్పుడు దక్షుడెఱిగి నారదుని ఎల్లప్పుడు దేశముమీద తిరుగుచుండుమని శాపమిచ్చెనట. ఇప్పటికిని దక్షకుమారులు భూమియొక్క అంతు తెలిసికొనుటకు తిరుగుచునే యున్నారు. కావుననే ఈ భూమి అపరిచ్ఛేద్యమైనది. ఈ భూభాగము సప్తద్వీపములతో కూడినది. అందు జంబూద్వీపమున తొమ్మిది ఖండములు గలవు. ఈ భరత ఖండము జంబూద్వీపమునందలిది. ఈ భరతఖండమున నెన్నియో పర్వతములు తూర్పునుండి పడమటి వైపునకు కఱ్ఱలవలె వ్యాపించి యున్నవి. ''పృథివ్యా ఇవ మాన దండః'' అని కాళిదాసు వర్ణించిన దందులకే. ''ఏడుకొండలవాడా వేంకటరమణా'' అని నపుడు మేరు, నీల, శ్వేత, శృంగవంతాది పర్వతములన్నియు వచ్చుచున్నవి. అనగా సమస్త జగత్తునకు ప్రభువు అని అర్థమగుచున్నది. పై చెప్పిన తొమ్మిది ఖండములలోను అర్జునుడు అయిదు ఖండముల జయించి, అచ్చటి దివ్యవస్తువుల తెచ్చినట్లు కలదు. లోకాలోక పర్వతముచే చుట్టబడిన ఈ భూమి విశాలమైనది. కాని లోకాలోక పర్వతమున కావలివైపునకూడ ప్రదేశము కలదనియే చెప్పుచున్నారు. అయినను దానిని చూచినవారు లేరు. ప్రత్యక్షమైన ఈ ప్రపంచమునే చూడజాలని మనము ప్రపంచాధినాధుడైన స్రష్టను-భగవంతుని చూచుటయెట్లు? ఎట్లన ఆప్తవాక్య ప్రమాణముచే చూడవలయును. వెలుతురులేని సూర్యుడు లేనట్లు నేనులేని ప్రపంచము లేదని భగవంతుని తలంపు. నేను అను అహంకారము సర్వప్రాణిగతమై యున్నది కనుక నేనుకు ఆధారము నేనే అను వస్తువే యని భావించవలసియున్నది. అదియే సద్వస్తువు. అది యొక్కటియే - ''కాశ్యాంతుకాశ##తే కాశీ! కాశీ సర్వప్రకాశికా!'' సర్వమును ప్రకాశింపజేయు కాశి అనగా సంవిత్తు ప్రత్యక్షమగు వస్తువునం దెల్ల ప్రకాశించుచునేయున్నది- అని శంకరులు పల్కిరి. ప్రపంచమున భోగము, మోక్షము అను రెండు విషయములు కలవు. రాజులు భోగములకు పాటుబడుదురు, బ్రాహ్మణులు మోక్షమునకు పాటుబడుదురు. అట్టివారల చరిత్రము లాదర్శముగా గ్రహింపబడినవి. వైశ్య శూద్రాదులు వారిని కనుగొని భోగముగాని, మోక్షముగాని సంపాదింపవలెను. పురాణములు, శాస్త్రగ్రంథములు మొదలైనవి నిమ్నజాత్యుద్ధరణమునకు ద్రోవసూపెడివి. కాశీలోని తులాధరుని ధర్మమునుగూర్చి చెప్పుకొనవలయును. అతడు సరకులను అందఱ కొకే ధరకమ్ముచు, హెచ్చుతగ్గులు లేకుండ, వచ్చిన లాభమును ఆయాపనులకు సక్రమవినియోగము కావించుచుండెడివాడు. తినుటకు కొంత, గుమాస్తాలకు కొంత, మరికొంత మూలధనముగను, కొంత పెళ్ళిళ్ళకు, కొంత ధర్మమునకు కేటాయించి ధార్మికజీవనుడై యుండెను. అతనిదగ్గర కొక మునివచ్చి, అతని సక్రమవినియోగ ధర్మమున కాశ్చర్యమునొంది, మూడు రోజులుండి ధర్మములన్నియు నెఱింగి వెళ్లెను. భారతమున అరణ్యపర్వములోని ధర్మవ్యాధోపాఖ్యాన మిట్టిసూత్రమునే తెలియజేయుచున్నది కదా! కాన బ్రాహ్మణులు పురాణములలో తమ చరిత్రలు, రాజ చరిత్రలు మాత్రమే వ్రాసిరి. కాని యితర కులముల నెత్తుకొనలేదనువార్త మృగ్యము. అన్ని కులములకు తగిన గౌరవము శాస్త్రములలో శాసించబడినవి. క్షౌరమునకు ముందు మంగలి మెడలో జందెము వేసి అది అయినతర్వాత దాని తీసి పంపవలెను. ''రజకస్య కరౌ శుద్ధౌ! ఉత్తమౌ గోపనాపితా'' అని యిట్లవసరములబట్టి అందఱకు గౌరవమిడిరి. మన ఋష్యాదులు దేవతలవంటివారు. వారు మంత్రద్రష్టలు. మనబోంట్లు మంత్రముల చదివికాని, విని కాని తెలిసికొనవలయును. మనోమయకోశము అందఱకు కలదుకాన, ప్రతి ప్రాణియందును వేదముగలదని వేదమునుబట్టియే తెలియనగును. ప్రాణి అంతఃకరణసహితమై యుండును. కులము అంతఃకరణమునగలదు. కులమన సమూహము, సత్త్వ రజ స్తమోగుణాదు లంతఃకరణమున నుండును. వానిబట్టి ప్రతివానిలో నింద్రియాది కులముగలదని శంకరులు చెప్పిరి. కర్మవలన ప్రతివాని హృదయమున ఉసిరిగపూతవలె సూక్ష్మముగ సంస్కారముగ అంతఃకరణములో నేర్పడును. కర్మలనుబట్టి అంతఃకరణములో గుణములయొక్క పాళ్ళు ఏర్పడును. దానిబట్టి కులమేర్పడినది. అది భ్రూమధ్యమునకు పైనలేదు. తల్లులు స్వీకరించు ఆహారములనుబట్టి గర్భమునందలి బిడ్డలయొక్క గుణగణాదులు మారుట సంభవించును. సాత్త్వికాహారమువలన బాధ కలుగదు. కారము మొదలైన వానివలన గర్భమునకు బాధకలుగును కాన రజస్వలలు, గర్భిణులుండవలసిన తీరును వేదము చెప్పినది. మహమ్మదీయులకు మనకు కొన్నిటియందు భేదమున్నను, వారి వేదాంతము మనవేదాంతమునకు సమీపమునందేయున్నది. వారు మన పునర్జన్మసిద్ధాంతము నంగీకరింపగలరు. ఖురాన్‌లో చెప్పబడిన మోక్షమార్గము, వేదాంత సిద్ధాంతము మనవానితో సమానమైనవే కాని కొన్ని ఆచారములలో మాత్రము భేదమున్నది. దేవాలయమునందలి విగ్రహములలో మూడురూపములున్నవని యాచార్యులు దెల్పిరి 1. రాతి యొక్క బాహ్యరూపము, 2. శిల్పిచే చిత్రితమైన జీవకళ, 3. వీని కాధారమైన సత్తారూపము. ఈశ్వరు డట్లు సత్తారూపముతో నిండియున్నాడు. సూర్యభగవానునియందు నల్లరంగు, ఎఱ్ఱరంగు కననగును. కాని పచ్చరంగు కనబడుటలేదు. ''యచ్చంద్రమసి, యచ్చాగ్నౌ'' అన్నచోట చంద్రునిలోని, అగ్నిలోని తేజస్సు నాదియేయని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. సూర్యకాంతి నాయది యని చెప్పలేదు. ఏలన హృదయము నందలి కాంతియే సూర్యకాంతి యని భావము. ఱాతియందే మూడురూపములున్నపుడు శరీరములో నేలయుండవు? కావున ఉపనిషత్తుల ద్వారమున వానిని తెలిసికొనవలయును. ''కర్తుం అకర్తుం, అన్యధాకర్తుం, సమర్ధః ఈశ్వరః'' అని ఈశ్వర స్వరూపము భాష్యములయందు నిరూపింపబడినది. అదియే ఈశ్వరుని రూపము శిరమున చంద్రమండలము, నాభికి దిగువ నగ్నిమండలమును కలవు. హృదయముననున్న నా తేజమే నగ్ని చంద్రమండలముల ద్వారమున సర్వకాల, సర్వదేశములయందు వ్యాపించి యున్నదని దేవుని - ''పరోక్షప్రియా ఇవ దేవాః'' ఈ సూత్రము చాలచోట్ల చూడబడుచున్నది. ఇదియే అంతరర్థము బహిరర్థము నని చెప్పబడుచున్నది. కొన్నిచోట్ల నీయంతరర్థము చెప్పకున్న మామూలుగా నుండు కథ లైతిహ్యముకొఱ కెచ్చటనైనను చెప్పినను చెప్పినదే చెప్పుట నిరర్థకము అందు తారాశశాంకవిజయమును మామూలు దృష్టితో చదివిన బూతులేగదా! అది మాటిమాటికి పురాణముల నావర్తింపనేల? అంతర దృష్టితో చూచిన అందు నీ విశేషము తోచెడు. ఆ కథయందు మనస్ధ్సానీయుడు చంద్రుడు. తార అన పెద్దది. అనగా పెద్దతత్త్వము. మహత్తత్వము బుద్ధి - జీవుడు బృహస్పతి. జీవకళ లేకున్న మనస్సు పనిచేయదు. కావున బుద్ధికళ మనస్సులోనికి వచ్చినది. తారయే చంద్రుని ముందు ప్రేమించినది. వీరికి వచ్చిన తగాదాలో చివరకు బ్రహ్మ రాజీచేసెను. అనగా నిచ్చట బ్రహ్మోపదేశముచే రాగద్వేషములు పోయినట్లు భావింపవలెను. కనుక బుద్ధి జీవునితో చేరిన మోక్షము, అదియే మనస్సుతో చేరిన సంసారము ఏర్పడును. తార జీవునితో కలసిన స్వభావస్థితి, మనస్సునకు వచ్చి వృత్తిద్వారా విషయముల నావరించుట వ్యభిచారము. తారకు బుట్టిన బుధుని చంద్రున కిప్పించి, తారను గురువున కిప్పించి బ్రహ్మ రాజీ చేసెను చంద్రుడు మనస్సు, అందలి బోధలు జీవజ్ఞానము తార వృత్తిరహితమైనచో జనకజ్ఞానము అది బుద్ధ్యాదులకు విషయముగాదు. కాన ఆశ్రయాశ్రయీ భావముతో బ్రహ్మైక్యమును భామతీకారుడు చెప్పెను కాన మనోవృత్తిద్వారా లోకవ్యాప్తి కలిగినపుడు జీవుడు మనసుతో సంబంధింపక బుద్ధి వృత్తి ప్రత్యఙ్ముఖమైన బ్రహ్మము. ఇదియే ఆ కథకు సారాంశము.

3

నిర్గుణమైన బ్రహ్మవస్తువు మాయలో ప్రతిఫలించి సగుణ మగుచున్నది. పిమ్మట ఇచ్ఛానుసారము సృష్టిక జరుగుచున్నది. ఈ సృష్టిరహస్యమును ఋష్యాదులు దివ్యదృష్టితో చెప్పగలరు. శాస్త్రాదులలో ఆకాశము తొమ్మిదిభాగములుగ విభాగింపబడినది. వీనిలో అన్నిటికంటె పైది చంద్రలోకమని తెలియుచున్నది. రావణుడు సూర్యమండలము లోనికి వెళ్లెనట కానీ, చంద్రలోకమునకు పోలేకపోయెనట. ఇక మొండియగు రావణుడు 8 వ ఆకాశములోనుండి 9 వ ఆకాశమగు చంద్రమండలము పైకి బాణప్రయోగము చేసెనట. అపుడు బ్రహ్మ ఆ విషయమును గ్రహించి రావణునితో - చంద్రుడు శివుని నెత్తిపై నున్నాడు, కాన అట్టి వానిపై బాణప్రయోగము కావించిన లోకప్రళయము రాగలదు. మానుము-అనెనట. ఈ విధముగ వాల్మీకములో నున్నది. కాని నేటి మానవుడు చంద్రశిలలు తేగలుగుట చూడ ఆశ్చర్య విషయము పై విషయము (వాల్మీకము) నమ్ముటయా, మానుటయా అన్న పెద్దల వాక్యమే ప్రమాణముగ చూడవలయును. పూర్వము భారతదేశస్థులు యోగాది అభ్యాసములచే సర్వవిషయములు గ్రహించెడివారు. శాస్త్ర నిర్ణయము ప్రకారము పురుషునకు ఐదవయేట ఉపనయనము జరుగవలసియున్నది. పిమ్మట 12 ఏళ్ళు యోగాభ్యాసము చేయవలయును. ఈ పదునేడు సంవత్సరములు గడిచినపిమ్మట బేసిసంవత్సరమున పెండ్లి చేయవలయును. స్త్రీకి ఎనిమిదేండ్లలోపల పెండ్లిచేయుట శాస్త్రయుక్తము. ''స్త్రీణా ముపనయనస్థానేవివాహః'' అని ఆపస్తంబుల ప్రవచమున్నది. స్త్రీకి ఉపనయనము వేరుగా లేదు. అందుచే వివాహానంతరము భర్తయే దానికి చదువులు, సందెలు, యోగములు, ఉపాసనలు చెప్పి కృతార్థనుచేసి ఋతుమతియైన పిమ్మట గర్భాదానము మొదలగు తంత్రముల ప్రవర్థింపచేయవలయును. స్త్రీకి భర్తయే దైవము, గురువు. ఆమె గృహకృత్యములందేకాక, భర్తకు అన్నివిధముల తోడ్పడుటవలన కృతార్థురాలు కావలయును. భర్త నిర్వర్తించు అగ్నికార్యములందలి అగ్నులు భార్యకొఱకే పుట్టినది. స్త్రీ భోగ్య వస్తువుగా పరిగణింపబడుటచే దానిని బజారుకెక్కింపగూడదు. జ్ఞాన విజ్ఞానము లన్నియు సమకూర్చుటకే దానికి భర్త ప్రాపు. కావున మొత్తము మీద స్త్రీ రజస్వల కాకముందే యోగసిద్ధి నొందవలసియున్నది. స్త్రీకి వివాహము సత్కర్మల యందు అర్హురాలిని చేయుటకే యుద్దేశింపబడినది. ''అవాఖ్యాం కర్మాణి కర్తవ్యాని'' అని ప్రధానముగా చెప్పి ''ప్రజా చోత్పాదయితవ్యా'' అని రెండవది అనుషంగికముగ చెప్పబడినది. అప్పుడే వరుడు వధువునకు నాది నుపదేశించుచున్నాడు. దాని కొఱకే 8 ఏండ్లలోనె స్త్రీకి వివాహము విధింపబడినది. ఇప్పటికాలమువారు ఆనుషంగికమును ప్రధానము చేసికొని మగవాడు ఆడవారుకూడ పెండ్లికి మా కప్పుడే ఏమి తొందర అనుచున్నారు. పెండ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని పుట్టలకు రాళ్ళకు మ్రొక్కుచు, ఒకరిద్దఱు పుట్టగనే, ఇక పుట్టకుండుపాట్లు పడుచున్నారు. వీరు చచ్చిన చీకుపడుచున్నారు. ఈ దృష్టితోనైన నెవ్వరికి తొందరలేదు. ఈ పెండ్లి అయినను కాకపోయినను కూడ చింతలేదు. ''జ్ఞానేన హీనః పశుభిస్సమానః'' ఈ లౌకికమార్గము నిటుంచి పురాణ మార్గము ననుసరింపుదము.

లోపాముద్ర రాజకన్య. 8 ఏళ్ళకే అగస్త్యుని వివాహమాడినది. ఆమె పిమ్మట పర్ణశాలలో 10 వేల ఏండ్లు లలితోపాసనా సమాధిలో నుండి విడుదల నొంది ఋతుమతియైనది. అపుడు అగస్త్యుడు సంతానమునకై ఆమె యొద్దకు వెళ్ళినాడు. ఆమె వెంటనే - మిమ్మే భర్తగా గురువుగా భావించి మీ మంత్రోపదేశముచే దేవినైతిని. కావున మీరు సాక్షాత్తు శివస్వరూపులైనచో నన్ను ముట్టుకొనుడు. లేకున్న మీతల వ్రక్కలగునని పల్కినది. అప్పుడు అగస్త్యుడు హయగ్రీవు నాశ్రయించినాడు. ఆ సమయమున హయగ్రీవుడు అగస్త్యునకు శ్రీవిద్యాతంత్రమెల్ల నుపదేశమాత్రమున సిద్ధింపజేసి పంపెను. అపుడు శివుడనైన నేను ముట్టుకొనెదనని ఆమెతో అగస్త్యుడు పల్కెను. కాని రాజకన్యయగు నామె విలాసమునకు రాజభోగములు కావలయును, లేకున్న మీతో కలియుటచే నసత్సంతానము కలుగునుగాన కూడదని పల్కినది. కావున రాజవేషముతో నన్ను గలయుమనినది. అపుడాతడు నా దగ్గర భోగములకు ధనములేదనెను. లేకున్న సృష్టింపుమని యామె కోరినది. కాని అతడు తన తపశ్శక్తిచే ధనమును సృష్టించుట కిచ్చగింపలేదు. అయినచో మీ వీలునుబట్టి ధనార్జనము చేయుమని ఆమె బదులు పల్కినది.

అగస్త్యుడు ధర్మ్యమగు పత్నిసలహాకు చేయునదిలేక సమ్మతించి ఒక రాజుదగ్గరకుపోయి ఆదాయవ్యయపట్టిక చూపుమనగా, అందు ఆదాయమునకన్న వ్యయ మెక్కువయుండుటచే వాని నర్థించుట కూడదని మరి యొక రాజును సమీపించెను. అతడును పై వానివలెనే యుండెను. చివరకు మూడవరాజుకూడ అట్లేయుండెను. ఇక చేయునదిలేక అగస్త్యుడు మువ్వురు రాజులను వెంటనిడుకొని, ధన మిప్పించెద రండని, వాతాపి ఇల్వలుల దగ్గరకు పోయెను. వాతాపి ఇల్వలులు బ్రాహ్మణ నాశనము చేయుటలో వాసి గాంచియుండిరి. ఇల్వలుడు వాతాపిని మేకనుచేసి, కోసి వండి భోజనము పెట్టుట, పిమ్మట వాతాపిని కేకవేయగనె, తిన్నవాని కడుపు చీల్చుకొని వాడు వెలువడుట జరుగుచుండెడిది. ఇట్టివారికి రాజులు వద్ధన్నను, అగస్త్యుడు బ్రాహ్మణార్థము ఒప్పుకొని కూర్చుండెను. ఇక మామూలుగ వారి తంతువు ప్రారంభ##మైనది వాడు తమ్ముని కేకవేయబోగా, అగస్త్యుడు - ''జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం'' అని పల్కెను ఈ విధముగ వాతాపి జీర్ణమైన పిమ్మట ఇల్వలుడు కాళ్ళపైబడి క్షమాపణ కోరెను. అపుడు అగస్త్యుడు తనకు, రాజులకు మూడుకోట్ల సువర్ణనాణములు, రథము, కిరీటము భుజకీర్తులు ఒక్కొక్కరికి పై విధముగ ఇమ్మనెను. వానిని స్వీకరించి అగస్త్యుడు రాజవేషము కలవాడైన పిమ్మట లోపాముద్రను కలియుటకు పోయెను అట్లు కలియగ నామెకు సద్యోగర్భమునందు ధృడస్యుడు అను కుమారుడు కల్గెను. ఇట్లు పూర్వము సంతానము ఆనుషంగికముగ నుండెడిదే కాని ప్రధానము కాదని తెలియవలయును.

కాబట్టి సంతాన మక్కరలేకున్నచో ''వానప్రస్థో బ్రహ్మచారీ'' అన్నట్లు వానప్రస్థమున బ్రహ్మచర్య మవలంబించుట యుచితము. కాని సంతాన నిరోధము భ్రూణహత్యవంటిది. భార్యాసహితముగకూడ వానప్రస్థాశ్రమము స్వీకరింప వీలున్నది. ఆయా యుగముల కనుగుణముగ ధర్మములు కూడ మారుచుండును. ఇవన్నియు వ్యవహార సంబంధమైనవి. ఈ వ్యవహారమనునది సృష్టినుండి అధికారిక పురుషుడుత్పన్నమైనపిమ్మట వచ్చినది. ఈ అధికారిక పురుషునకు లీలాస్వీకృత విగ్రహుడు అని పేరు. కాబట్టి లోకవ్యవహారమంతయు లీలాస్వీకృతవిగ్రహునివలన జరుగుచున్నదని శంకరులు చెప్పగా గౌడపాదులవారు పైమాట అనరాదని నిషేధించిరి. ఏలన, ఆకారము, శరీరము లేనివాడు నిర్గుణబ్రహ్మ యని చెప్పి అందునుండి అధికారిక పురుషుడుత్పన్నమగుట అసంభావ్యమని వారి అభిప్రాయము. అయినప్పటికి లోకవ్యాపారమునకు ఒక్కొక్క గుణముతో నొక్కొక్క రూపము శివకేశవాదులుగ ఆవిర్భవించినది. వీరితో ఈ ప్రపంచసృష్టి జరిగినది. ఈ చెప్పిన శివకేశవాది రూపములలో ఎక్కువ తక్కువలు లేవు. సీతారామాంజనేయమున ''క్షణము సర్వజగద్విలక్షణతగాంచు వాని నెన్నంగcదరమె యెవ్వానికైన'' అని చెప్పబడినది. జగద్విలక్షణత యనగా వృత్తిలేకుండుటయే. వృత్తిపోవుట యనగా సంధ్యావందనమే. ''సంధౌ భవా సంధ్యా'' అని వృత్తికి మధ్య నుండునది సంధ్య యనబడుచున్నది. కావున ''అహరహః సంధ్యా ముపాసీత'' అనగా ఎల్లప్పుడు సంధ్యావందన మాచరించుటయే. అది మంచిది సంధ్యావందన మంత్రమున ప్రత్యక్షరము ప్రఖ్యాతి గలది. మనవర్ణసమామ్నాయ మందున్న 53 అక్షరములు దేవతారూపములు. అ- అనగా అరుణాదేవి. ఈ విధముగ నాయా అక్షరములకు ఆయా దేవతలపేర్లు గలవు. కాబట్టి అక్షరోపాసనచే దేవతోపాసనకూడ జరుగుచున్నది. ఈ దేవతలందఱు ఆయా అక్షర జన్యస్థానముల యందావేశించి యుందురు. చక్రదళముల యందు 53 అక్షరములలో ఆ దేవతలు గలరు. కావున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము చేయునపుడు అ-ఆ లతో ప్రారంభము చేయవలయును గాని, ''ఓం నమశ్శివాయ'' అను మహామంత్రముతో గాదు. ఏలన సులభముగ దగ్గరలో పట్టువడు అక్షరములు ముందుండగా, మహామంత్రములతో ప్రారంభించుట యేల? ఇది యెట్లున్నదనగా, దగ్గరనున్న నదిలో అస్థికలు కలుపక, గంగకే పోవుటవంటిది. దీనివలన నష్టమేమనగా దారిలోని నదులన్నియు పోవువానిని నిందించుట జరుగును. దీనినే - ''అత్యాసన్నం పరిత్యజ్య మునేర్థత్తం చ నిష్ఫలం'' అని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. దగ్గరివారిని వదలి దూరమువారికి ఏమిచేసిన నేమిప్రయోజనము?

ఇక షట్చక్రములలో కంఠస్థానమున 16 దళముల చక్రమున్నది అనగా నిందు 16 అక్షరములు పుట్టుచున్నవి. ఈ చక్ర మధ్యస్థానమున జీవతత్త్వమైన ఈశ్వరుడు గలడు ఇతనికి ప్రాణశక్తి భార్యారూపముననున్నది. ఇక క్రింద హృదయమున అనాహత చక్రమున్నది. దీనికి 12 దళములు (12 అక్షరములు) ఉన్నవి. పిమ్మట బొడ్డుదగ్గర మణిపూరకమను చక్రమున్నది. దీనికి 10 దళములు (10 అక్షరములు) ఉన్నవి. దీని మధ్యస్థానమున విష్ణువు లక్ష్మితో నుండును. తర్వాత స్వాధిష్ఠానమందు 6 దళముల చక్రమున్నది. ఇచట బ్రహ్మ సరస్వతితో నుండును. ఇక వృష్ఠమునకు నాలుగు అంగుళములకుపైన మూలాధార చక్రమున్నది. ఇందు ప్రాణశక్తితో గణాధిపు డుండును. భ్రూమధ్యమందలి ఆజ్ఞాచక్రము రెండుదళములు (రెండు అక్షరములు) గలది యున్నది. ఇట్లు అక్షరము లన్నియు దేవతలరూపమున ప్రతివానియందున్నవి. కాబట్టి యుపాసన అ-ఆ లతో ప్రారంభమగుట మంచిది. శాస్త్రములలో చక్రవివరణ యున్నది. శ్రీశ్రీశ్రీ బకస్వామి చక్రము లాయాస్థానములలో మాంసరూపమున నుండునని చెప్పిరి నరసింహయోగి అనునతడు వెన్నెముకలో చక్రములుండునని తెల్పెను. శ్రీ విద్యారణ్యస్వామి సూతసంహితాభాష్యములో పారమార్థిక శరీరములో సుషుమ్నయందు ప్రవేశించి వాయువహ్ని రూపములనొంది పోవునపు డాయా ప్రదేశముల నాయాచక్రములు ''నరేంద్ర మార్గాట్ట ఇపప్రదీపః'' అన్నట్టు లావిర్భవించుచుండునని, అది సుషుమ్ననడకయందలి స్వభావమని యనుగ్రహించిరి. ఇక శరీరమున వెనుక భాగము (వీపు) మఱ్ఱియాకువలె గన్పట్టుచుండును. మఱ్ఱిని తెల్పు శబ్దము వటమనియు, రావిని అశ్వత్థమనియు యుపయోగించుట గమనింపతగినది. వటమనగా సన్నగానుండి వ్యాప్తినొందునదని యర్థము. అశ్వత్థమనగా రేపుకూడ నుండనిదని భావము. కనుక వీపునందలి వెన్నెముక - దాని నుండి వ్యాపించిననాడులు మఱ్ఱియాకును బోలియుండుట తెలియదగినది. ఈ చెట్టు మూలభాగమున - దక్షిణామూర్తి యుండును. యోగి వాయుధారణలో గాలి పీల్చునపుడు ఇడపింగళనాడులు గాలితో నిండును. బొడ్డుదగ్గర గుంటగా నున్ననాడి సుషుమ్న యనబడును. అపానమునుండి గాలి పోకుండ నిరోధించిన ఆ గాలి సుషుమ్న నాడియందు నిండియుండును. ఈ సుషుమ్నయందు 6 చక్రము లున్నవి. పారమార్ధిక శరీరమునందు వాయువు అగ్నిరూపముననుండి పోవునపుడు చుట్టునున్న దళముల ఆకారములు కన్పట్టును. కావున వ్యావహారిక శరీరములో చక్రములు మాకు శవశరీరములయందు కన్పించుటలేదని డాక్టరు లనుచున్నారు. పారిమార్థికమునందే చక్రములు భాసించును.

ప్రహ్లాదుని కధలో - ప్రహ్లాదుడు అనగా ప్రకృష్ణమైన హ్లాదము. నిరుపాధికమైన ఆనందము అని అర్థము. చక్రి యనగా చక్రములయందు (షట్చక్రములు) అభిమానము కలవాడు. వీడే సగుణబ్రహ్మము. గిక్రియనగా చక్రికి వ్యతిరేకి. అనగా అభిమానము లేనివాడు. అనగా సాక్షిభగవంతుడు అని భావము, ''హస హింసా గత్యోః'' అనుటచే హింస-సింహ శబ్దము లొక్కటియే. ఇవి సగుణరూపమైనవి. నరీయత ఇతి నరః - నశింపనివాడు - నిర్గుణ బ్రహ్మరూపము. కావున నృశింహ అనగా సగము సగుణము, సగము నిర్గుణమునైన రూపముగలవాడు. ఆకారాది 16 అక్షరములు ప్రాణవర్ణములు. విశుద్ధస్థానము నుండి కకారాదులకు ప్రాణము రావలెను. ఈ స్థానము తామర మొగ్గవలె హృదయమున తల క్రిందులుగ నుండును. దీనిలోని సందు - ఆకాశము దహరాకాశ మనబడుచున్నది. చంద్రమండలము శిరస్సునందు గలదు. అగ్నిమండలము బొడ్డునందు గలదు. పై చెప్పిన దహరాకాశ##మే సూర్యమండలము. ఇందే బ్రహ్మమును తెలిసికొనవలెను కనుక హృదయాకాశమున బ్రహ్మ తత్వము తేజస్సుతో వెల్గుచుండును. కృష్ణపరమాత్మ గీతలో చందాగ్ని తేజస్సు తానేయని చెప్పుకొనెను. అనగా తాను దహరాకాశ మందలి సూర్యరూపుడనని భావము. తనను కొల్చిన వానికే మోక్షమని చెప్పెను. కనుక ధూర్జటి ''ఏ వేదమ్ము పఠించె లూత'' అని చదువులలో మోక్షము లేదనెను. భగవత్పాదసేవతో మోక్షప్రాప్తి కలుగును. భగవంతుడు తేజోమయుడు. అందులో నాల్గవవంతు ప్రపంచరూపమైనది. ఆ పాదమును విమర్శించుటతో మోక్షమని, భగవత్పాద సేవ యన నర్థము, ఇట్లు కాక ఒక భగవంతుడు దొరకి ఆయన పాదము దొరకిన తర్వాత సేవనాదేశింప నక్కరలేదు. సేవ చేసెదననువాని కది యెక్కడ దొరకును? కాన శ్రీకృష్ణుడు - శ్లో|| ''యద్యద్విభూతి మత్సత్త్వం శ్రీమదూర్జిత మేవవా| తత్తదేవావగచ్ఛత్వం: మమతేజోంశ సంభవం'' తన పాదభాగమగు నీ ప్రపంచముననే తనను తెలిసికొను ఉపాయము నుపదేశించెను. లోకమున విభూతికలదియు, అందముకలదియు నగు వస్తువుల నాయా విశేషములన్నియు భగవద్రూపముగ నిశ్చయించి యనుభవించుట పాదసేవయని తెలియవలెను. కావున లోకమును భగవంతునిగా సమన్వయము చేయుపద్ధతి యిది. ఇక ఇంతకుపై ఉపాయము శ్లో|| ఉపాధివర్జం సకలం సోహం భావేన భావయేత్‌| తదాధారతయా ఉపాధీన్‌ బహుమన్యా మహే వయం!

ఉపాధుల హెచ్చుతగ్గులతో ఒకప్పుడు లెక్కచేయుట, చేయకుండుట జరుగును - అనగా శాస్త్రదృష్టిచే గణింపవలెను. అనుభవమున నది యుండదు. కనుక ''మానవ సేవయే మాధవసేవ'' యన పాదరూపమయిన మానవ సేవయే సర్వస్వరూప భూమానుభవమని యర్థము - కాని, మానవుల కాళ్ళుపిసుకుట కాదు ఒకసారి శృంగేరీ స్వామివారు నాతో సంభాషించుచు బాలయోగి అన్నము పెట్టిన మీరు తినెదరా? యని ప్రశ్నించెను. శాస్త్రమున తినుమని లేదుకనుక తిననని చెప్పతిని.

గీతలో.......

శ్లో|| శునిచైవ స్వపాకేచ | పండితాః సమదర్శినః - అన్నచోట ప్రతివానియందు బ్రహ్మవస్తు వేకరూపమున నున్నట్లు చూచుట మంచిదని భావము. అలంకారికు డొక్క శబ్దమున కొక యర్థము చెప్పవలెనన్న 1 ప్రమాణములకు సరిపుచ్చవలెననిరి. అట్లే శుని - శ్వపాకే అను సప్తముల కెల్ల వృత్తిత్వ మర్ధము అన్నిటియందు నున్న తత్వము సమమనగా బ్రహ్మమని తలపవలయుననిగాని, అందఱను సమానముగా జూడమని యర్థముకాదు. ఈ భాష స్వభావమెఱుగని పండితుల ఉపన్యాసము లిట్లే యుండును ఈ శ్లోకమునకు శ్రీ తిక్కయజ్వ భారతమున నొక పద్యము వ్రాసెను. అది గమనింపనగును. ఉపనిషత్తులలో 2 బ్రహ్మవిద్యలు గలవు. వారి వారి శక్త్యానుసారము ఏదో ఒక విద్య నాశ్రయించుట మేలు ఇవి అన్నియు నొక్కనికి నుపాస్యములు కావు. భిన్నభిన్న మార్గములు గల విద్య లొకరికి నెట్లు సాధ్యములగును, అని శంకరులు వాక్రుచ్చిరి. మద్యమాంస నివేదనతో కూడిన శక్తి ఉపాసన ఎంతమాత్రము కూడదని ఆచార్యస్వామివారు వచించిరి. కాని విద్యారణ్యులు ఉపాసనప్రధానముకాన శంకరులు చెప్పిన సమయాచారము దొరకనిచో కౌలాచారమైన నాశ్రయించి దేవిని భజించుట యవసర మనిరి.

4

శైవ వైష్ణవతములలో క్రమముగ శివుడు, విష్ణువు ప్రాముఖ్యము వహించి యున్నారు. వారిని సేవింప కైలాసమునకుగాని వైకుంఠమునకుగాని పోవలెను. అద్వైతమునందు నీవే బ్రహ్మవు (తత్త్వమసి) అనుమాటతో బోధ పూర్తియగుచున్నది. కాబట్టి ఈ ''నేను'' అను వస్తువు అహంకారాశ్రితమై వెలయుచున్నదిగాన దీనిని బ్రహ్మస్వరూపముగా సులువుగా నిరూపణము చేయవచ్చును - అనుభవింపవచ్చును. సామాన్యముగ బ్రహ్మవస్తువును రెండువిధములుగ చెప్పుచుందురు, 1 నాదబ్రహ్మ 2. పరబ్రహ్మ. నాదబ్రహ్మోపాసన 6 నెలలు చేసిన పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్కరింపనగును. నాదమనునది ప్రకృతి పురుషులమధ్య పుట్టుచున్నది, నాదోదయ, పూర్వ - నాద విరామాంతముల యందు బ్రహ్మము తోచుచున్నది. ఈ నాదమునకు ఆధిదేవత అగ్ని. ఇదిలేకున్న నాదము పుట్టజాలదు. అగ్న్యధిదేవతా మకనః ప్రేరిత ప్రాణాహత మూలాధారవిర్భూత పరాదివాగ్రూపము నాదము కనుక ప్రాణశక్తి దానిని ప్రేరేపించి నపుడు నాదోత్పత్తి ప్రకృతి - పురుషులమధ్య పుట్టుచున్నది. ఈ నాదము నాల్గువిధము లగుచున్నది. 1. పరా-ఇది సూక్ష్మరూపమైనది. ఇది మూలాధారమునుండి బొడ్డువరకు నుండు రూపము. 2. పశ్యంతి. ఇది బొడ్డుదగ్గఱనుండి హృదయమువరకు నుండు రూపము 3. మధ్యమ. ఇది హృదయమునుండి కంఠము వరకు వ్యాపించురూపము. ఇది శ్రుతిగోచరమైన వాక్కు. 4. వైఖరీ. ఇది కంఠమునుండి నోటివరకు వ్యాపించి శబ్ధనిష్పత్తిని కలిగించునది. వైఖరీ వాక్కు షట్చక్రాది స్థానములందలి కోణముల నున్న సందులనుండి అక్షరముల స్వరూపనాదముతో చేరి మనః ప్రేరణతో కంఠ్యాది శబ్దములన్నియు పుట్టుచున్నవి. కనుక నాదోత్పత్తికి అధిదేవతయగు అగ్నియొక్క ప్రాముఖ్యము గమనింపదగియున్నది. పశుపక్ష్యాది మనుష్యభాషలన్నియు నిట్లే బయలుదేరినవి. కాని ఇవి పలుకునప్పుడు అపానమునుండి గాలి పోకుండుట అనుభవము. అట్లుపోయినచో వాదముండదు. అందులకే మనవారు మాటాడునప్పుడు - రెండు మూసికొని పొమ్మని - వ్యవహారము కల్పించిరి. అట్లు వాయుస్తంభవము సూచించుటకే మనవారు బిళ్ళగోచిపెట్టి పంచెకట్టుట. మొత్తముమీద వాయువు అపానమునుండి పోకున్నచో - నోటినుండి శబ్దరూపమున వెలువడుట గమనింపనగు. కాని ఋష్యాదులు మౌనవ్రతధారులై వాయుపూరకముచేసి గొప్ప మహత్తును సాధించుచున్నారు. ''మౌనం సర్వార్థ సాధకం'' అని కదా పెద్దలు చెప్పిరి. యజ్ఞముచేయునపుడు యజమానియు నోరుమూసికొని మౌనవ్రతము పాటింపవలయును. ఒకసారి పిశుపాటి సీతారామశాస్త్రి అను నాతనికి యోగాభ్యాసమునందు శంకరాభరణరాగము తనంతట తాను మనోహరముగ జనించి యోగపర్యంత ముండెడిది. ఇందులకు కారణమేమన అతడు యోగమునందున్న సమయమున నోరు తెరిచికొని యుండెను. కాని యోగము నందిది పనికి రాదు. సర్వేంద్రియములు మూసియుండి వాయుపూరణము చేయుట మంచిది. మనము రోజు తిట్టుచున్న తిట్లయందును వేదాంతమున్నది. దుంపతెగ లేక త్రాడుతెగ అనుచున్నారు దుంప అనగా అజ్ఞానము. త్రాడు అనగా కర్మసూత్రము. ఇవి నశించుటయే వేదాంత పరమార్థము. కనుక నాదాభ్యాసమున నెన్నియో నియమము లుండుట గమనింపనగును.

భారతమున కృష్ణుని దగ్గఱకు సంజయునిరాక గమనించినచో ఆశ్చర్యము గొల్పును. సంజయుడు వచ్చినప్పుడు - కృష్ణునకు తెలియజేయబడు సందర్భమున కృష్ణుడు పండుకొనియుండెను. అర్జునుడు పాదసేవ చేయుచుండెను ద్రౌపది, సత్యభామ కూర్చుండియుండిరి. అపుడు సంజయుడు కృష్ణుడు అంతఃపురమున నుండుటగమనించి వేషము మార్చుకొని వెళ్ళినాడట. అపుడు కృష్ణుని కనుసంజ్ఞతో అర్జునుడు పాదపీఠినుండి కాళ్ళుతీయగా, ఆ పీఠమును దాసీలు సంజయునకు కూర్చుండుటకు ఉంచిరి. అప్పుడు సంజయుడు ఆ పీఠముపై చేతులుంచి నమస్కరించి తాను ఆనుకొని క్రింద కూర్చుండెనట. ఆ భగవంతునంతవాని పాదపీఠమున తాను వృష్ణము చేర్చరాదని భావము ఎచట కెట్టి వేషము చితమో అది వేయవలెను అట్లుకాక ఒక్క లాగుతో చరించుట ధర్మమా?

శిరస్సు పై భాగమునందు సహస్రారమను చక్రమున్నది. ఇదియే చంద్రమండలము. యోగులకు మాత్రమిది అమృతమును ప్రసవించును. లౌకికులకు వీర్యమును ప్రసాదించును. ''అష్టాచక్రానవద్వారా'' అని వేదము చెప్పుచున్నది. బ్రహ్మరంధ్రమునకుపైన నాలుగంగుళములలో పీఠకచక్రమున్నది ఇది బ్రహ్మస్థానము. కనుకనే వైదికులగువారు శిరస్సుపై చిన్నజుట్ట ముడినుండి దానియందొక పుష్పము నుంచెదరు. అనగా బ్రహ్మస్థానమున కది యొక పూజగ మనము గుర్తింపవలయును. మన అలంకారము లన్నియు పరమార్థసాధనకేగాని కేవలము భోగచిహ్నములు కావని గుర్తింపవలయును. శాస్త్రమున మానవులకు ఒకజడ మాత్రమే విహితము. ఇక మూడునుండి పైన రాక్షసులకు నిబంధింపబడినవి. కాబట్టి రెండు జడలవారు రాక్షసులయందు సైతము కానరారు. అందువలన మానవులు రెండు జడలు వేయరాదు. అట్లు జడను రెండు పాయలుగ చీల్చుట యనునది తల్లిదండ్రులు పోయినప్పుడు మాత్రమే జరుగవలసిన క్రియ. కావున ఈ యాచారములన్నియు నశ్లీలములని గమనించి వర్తించుట అవశ్యకము. జుట్టు లేకున్నను నది ముడువకున్నను ఎనిమిదవ చక్రమందలి తేజము క్షరించును. దానిచే వారు దుర్భలులగుదురు. ఏ మంచి వైదికకార్యములకు పనికిరారు అని ఆగమములు, సైన్సు చెప్పుచున్నవి. కాబట్టి భారతీయులు బ్రహ్మతేజస్సును క్షరింపనీరాదు. వీడినచో దయ్యములు, భూతములు పట్టుటలో ఆశ్చర్యమేమున్నది? ప్రస్తుతము నాదబ్రహ్మోపాసనమనగ తారకమంత్రమగు ఓంకారము నుపాసించుట ఇది ఆ++మ ల కలయికవలన నేర్పడుచున్నది. ఈ నాదబ్రహ్మోపాసన వలన బ్రహ్మసాక్షాత్కారము కలుగగలదు. గాని యిది సంగీత సాహిత్యముల వలన కూడ సాధ్యమగుచున్నది.

శ్లో||సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం |

ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం ||

అని పెద్దలు చెప్పిరి. ఈ నాదమునుగూర్చి తర్వాత చెప్పెదను.

నేను మొదట అప్పులబాధతో జీవితము గడుపుచుంటిని. ఒకరోజు నేను కలలో ఏదో పద్యము వ్రాయుచుండగా - అప్పిచ్చినవాడు వచ్చి నా చేయిపట్టుకొని అప్పు చెల్లించుమని కోరెను. అప్పుడు నేను -

శా|| కావ్యశ్రీ చనుమా త్వదేకరతునిం గామింతు వష్టాన ధా

నావ్యాజ ప్రతిభా యొనర్తునెది నిర్వ్యాపారునింగూడి ది

వ్యవ్యాహార సతీమణీ తొలగు మె దైనన్ఖలుండీ ఋణా

ర్ణవ్యాపార ఝురీభ్రమిభ్రమరుడేనా మిమ్ముపోషించుటల్‌||

అను పద్యమును కావ్యలక్ష్మి నుద్దేశించి నిర్వ్యాపారునైన నావద్ధ నుండక పొమ్మని విసువుతో వ్రాసితిని. మా తండ్రిగారు పోవునప్పటికి రామాయణమున 6 వేల పద్యములు వ్రాయవలసి యున్నది. గాయత్రీ మంత్ర బంధముతో పద్యరచన నీవే చేయవలసినదని తండ్రిగారు నన్ను ఆదేశించిరి. అట్లు నేను పూర్తిచేయనెంచి ఎప్పుడు పూనినను పద్యము తోచక కాలము వ్యర్థముగా గడచెడిది. ఒకరోజు కలవచ్చినది. నేను ఎచట నుండియో ఇంటికి వచ్చుచుండగా నొక తురకబూబు వాకిటి అరుగుపై పరుండియున్నది. ఆమె చొక్కాయెత్తి ఒక తరుణ వయస్కుడు పాలు ద్రావుచున్నాడు. నేనట్లే నిర్ఘాంతపోయి చూచుచుండగా నామె యేల అట్లు చూచెదవనినది. నాకు కూడ కొంచెము పాలిచ్చెదవేమో యని యంటిని. ఆమె వెంటనే కావలసినచో నెగబడి త్రాగుమన్నది. ఆ మరుసటిరోజుననే

కం|| భర్మమయ రమ్యహర్మ్యము

లర్మిలి ప్రియురాలిcగూడి యలరించెడి నీ

శర్మద పదయుగ మస్మ

త్కర్మములు దొలంచు పనికిc గాననమెనసెన్‌||

అని భకారముతో పద్యము ప్రారంభము చేయుచుండగనే ముగిసినది. తర్వాత రేపు అచ్చునకు గావలసిన పద్దెము లీరాత్రి వ్రాయుచు వారి కృతి పూర్తిచేయ బూనితిని. ఆ బూబురూప మిప్పటికిని కనుల గట్టినట్లు కన్పట్టెడిది.

చం|| ఎగబడిత్రావు కావలసెనేనని చన్నిడి త్రావువేళc బూ

ర్తిగ నొక గ్రుక్కకేనియు భరింపగరావని లేదొ యన్న న

న్నెగదిగచూచి చిన్న నగవిమ్మగు సొమ్ముగc గందపద్ధె మ

ల్లగ నవి చాలుcబొమ్మని యలక్షిత¸° యవనిం దలంచెదన్‌||

అని వినుతించి గ్రంథము వ్రాయుచుందును. కాబట్టి మనకు మోక్షము లేక స్వర్గము లేక వ్యావహారికమైన పనులు కావలసియున్నచో దేవతానుగ్రహమవసరమై యున్నది. అందులకు ముందు పారమార్థిక శరీరము నందలి దేవతలను గుర్తింపవలసియున్నది.

కర్మజ్ఞాన ఉపాసనా కాండలని మూడువిధములుగ వేదోదితము విభాగింపబడినది. ''ఆచారహీనం నపునంతి వేదాః'' అన్నట్లు కర్మకు ఆచారము ప్రధానము. వేదోక్తమైనది ఆచారము. ఇట్టి ఆచారవంతుని ఏదియు ఏమియు చేయజాలదు. ఇందులకు నిదర్శనమైన కథ చూడుడు. ఒక ఋషికుమారుడు కృష్ణాజినము కప్పుకొని ఊయలనూగుచు చదువు కొనుచుండెను అది గమనింపక వేటకువచ్చిన రాజకుమారుడు మృగమనుకొని విషదిగ్ధబాణముతో కొట్టగా నాతడు క్రిందబడెను. అంత రాజకుమారుడు భయపడి రాజధానిచేరి తన పెద్దలను కొందఱ గైకొని ఆ మునిపల్లెకుబోయి, ఆ కులపతి మర్యాద చేయడానికి మే మనర్హులమని రాకుమారుడు బ్రహ్మహత్య చేసెనని దాని బోగొట్టుకొనునుపాయ మడుగవచ్చితి మనిరి ఇది యంతయువిని యా కులపతి మీ రెక్కడ బ్రహ్మహత్యచేసితిరని అడిగెను. వారీ యాశ్రమముననే చదువుకొను కుఱ్ఱవానిని మావాడు మృగమను భ్రాంతితో గొట్టెననిరి. ఆ ముని తన విద్యార్థులనెల్ల జూపి వీరిలో మీ వాడు చంపిన దెవరినని యడిగెను ఆ కొట్టినవాడు గుర్తించి ఈ పిల్లవాని కొట్టితిని, పడిపోయెను. ఎట్లు బ్రతికెనని దిగ్భ్రాంతుడై యడుగ ఆ కులపతి చెప్పిన సమాధానము.

శా|| ఆలస్యం బొకయింతలేదు శుచి యాహారంబు ధర్మక్రియా..... (భార)

అను పద్యమున ఆమునిబాలకుని శుచిత్వము నిరూపించెను. ఆచారమిట్టిది కావున ఇట్టివారిని ఎవ్వరు ఏమియు చేయజాలరు. దినమున కొకసారి సమృద్ధిగాగాని తేలికగా రెండు మార్లుగాని తినుమని ఆపస్తంబుల వారు చెప్పిరి. భారతమున భీష్ముడును - ఇరుమారు గుడుచుచు నెడనెడ గుడువకయుండు నాతండు సదోపవాసి - అని చెప్పెను. ఆ పక్షములో కొంద ఱొక పర్యాయము నీరు త్రావుదురు. కొంద రదియు సమ్మతింపరు. అట్టి నియమముగలవారి తపము సాగును. మితిమీరి తిన్నవారి తిండి వైశ్వానరు డెంతయని జీర్ణము చేయగలడు? అనగా అగ్నిమాంద్యము కలిగి అజీర్ణరోగము పుట్టును. కాబట్టి వేళదాటక ఇట్టి సత్కార్యాచరణ సంపన్నులు ఉత్తము లగునున్నారు. నేడు ఇవన్నియు తారుమారైనవి. ''ఆలస్యా దన్నదోషాచ్చ మృత్యు ర్విప్రాన్జిఘాంసతి'' అని పరాశర మహాముని చెప్పెను. ఈ అన్నియు దోషములు నేడు మనల హింసింప కలుగుచున్నవి. ఇట్లే ఈ కాలమెల్ల చెడుననరాదు. వ్యాసుడు ఆర్గురు శక పురుషుల పేర్కొనెను. అందు విజయాభినందనుడు అను వాని శకమున యంత్రముక్త ప్రేలదని పేర్కొనెను. అనగా గరిక మంత్రించివేసి శత్రువుల నాతడు జయించును. ఇతడు కలియుగమున కృతయుగ లక్షణము నడుపగలడని తెలియుచున్నది. కావున కుల మత భేదము లంతరించవు. వేదాదులుపోవు. కావున ఈశ్వరశక్తి మిక్కిలి ఉన్నతమైనది. చిత్రమైనదికదా!

5

విద్యలన్నియు కాండత్రయరూపకముగ నున్నవి. కాని విమర్శించి చూచినచో రెండేకాండలు 'కర్మ-జ్ఞానకాండలు తేలుచున్నవి. పూర్వ జన్మలో చేసిన కర్మనుబట్టి బోధప్రాప్తి కలుగుచుండును జ్ఞానులకు కర్మ అక్కరలేదని లోకమున వాడుకకలదు. కాని యది యవిమృష్టము. ''నిత్యాన్యధిగతాని కర్మాణి'' అని ఉపనిషద్వాక్యములో శంకరులు నిత్యకర్మలు మా వారలు బాగుగా వ్రాసిరి కాన, అవి మేము వ్రాయుటలేదు. అవి తప్పక ఆచరింపదగినవని వాక్రుచ్చిరి. ''ప్రయోజన మనుద్ధిశ్య నమ దోపి ప్రవర్తతే'' అన్నట్లు ఫలము నపేక్షింపక ముందు అనుకొనక యెట్టి పనియు జరుగదుగదా! ''ఉపాత్త దురితక్షయార్థములు కర్మలు'' అని శంకరులు నిత్యములకును ఫలమును జెప్పిరి. మరి కామ్యకర్మలు అవసరము వచ్చినపుడు చేయవలసియే యున్నది. 'కామ్యాని చ ఫలార్థినాం' అని కామ్యకర్మలు చేయుటకూడ గృహస్థులకు నావశ్యకములని చెప్పిరి. నిత్యనైమిత్తిక కర్మవలన పాపక్షయము జరుగుచున్నది. శంకరుల భాష్యముతో కర్మలేదని బ్రహ్మయేనని లోకము భావించి చెడుచున్నది. కాననదియే పరమార్థమనరాదని రామానుజుడు సగుణబ్రహ్మోపాసనమైన విశిష్టాద్వైతమును నిరూపించెను.

''అద్వైత మాగమ శిరోభి రుపాసనాయముక్తం, తదేవ పరమార్థ తయా న వాద్యం'' అని నీల కంఠుడనెను. అద్వైతో పాసనతో విశిష్టాద్వైతము ముక్తి యని వారి భావము. ఉపాసన సోహంభావముతో నుండవలెనని శ్రుతి చెప్పుచున్నది. కాని అదియే పరమార్థముకాదని వారి అభిప్రాయము. అందు నేనే దేవతనని యుపాసించిన దేవతవంటివాడగునని తేలుచున్నది. ఉపాసన యన నూరకుండుటయని యర్థము. సాక్షిరూపసంస్థానము. ఇదియే అద్వైతము, అద్వైతానుభవము లేక కర్మోపాస్తుల విడుచుటవలన కొందఱు చెడుచున్నారని వారి నుద్ధరింప విశిష్టాద్వైతము బయటుదేరినది. నాల్గువేదములు చెప్పుచున్న మహావాక్యములు 1. ప్రజ్ఞానం బ్రహ్మ, 2. అహంబ్రహ్మాస్మి, 3. తత్త్వమసి, 4. అయమాత్మా బ్రహ్మ. వీని కర్థమొక్కటియే అగుచున్నది. ప్రతివాక్యమునందు జీవ-బ్రహ్మల కేకత్వము బోధింపబడుచున్నది. పరోక్ష ప్రత్యక్షములగు బ్రహ్మ జీవులకు ఏకత్వమెట్లు కుదురును? అన్నచో అర్థము కుదరని చోట లక్షాణావృత్తితో కుదుర్చుకొనవచ్చునని తక్కాదిశాస్త్రములు చెప్పుచున్నవి. ఆ శాస్త్రములలో జహల్లక్షణ యని, అజహల్లక్షణయనీ రెంటినొప్పుకొనిరి. మూడవదియగు జహదజహల్లక్షణ జీవబ్రహ్మైక్యమునుచెప్పు వేదాంతుల మతమునందేగాని మా కవసరములేదనిరి. ఏ శాస్త్రములు నొప్పుకొనని జహదజహల్లక్షణతో మీరెట్లు పక్షమును సాధించుకొనెదరన, వేదాంతులు ఈ మూడవ లక్షణము మీకును కావలసినదియే, అది ప్రత్యభిజ్ఞ యని పదాంతరముతో సాధించుకొని ఇది కలదనిరి వారి ప్రత్యభిజ్ఞయే మాకు మూడవలక్షణమని వేదాంతులనెదరు. సుబ్బయ్య అనబడు ఒక వ్యక్తిని ఒకచోట ఒకరకముగను, మరియొకచోట మరియొక రకముగను చూచినను కాలభేద, వేషభేదమేతప్ప అసలు సుబ్బయ్య మారుటలేదుకదా! కనుక దీనికి జహదజహల్లక్షణలు పనికిరావు. కనుక దీనికి సమన్వయము కుదుర్చుటకు తార్కికులు, ''ప్రత్యభిజ్ఞ'' అనుదానిని కల్పించిరి. ఇది వేదాంతుల జహదజహల్లక్షణముతోనే చేరుచున్నది. దీనికి ఉదాహరణ ఒక కథ చూడుడు.

దేవతలు, రాక్షసులు కలసి ఇంద్రుని - విరోచనుని బ్రహ్మదగ్గర తత్త్వోపదేశమునకు పంపిరి. అంత బ్రహ్మ ఒక తొట్టిలో నీరుపోసి వారిని తొంగిచూడు మనెనట. వారికి వారి ప్రతిబింబమే కన్పించినదట. ఆ పిమ్మట వారి నింకను బాగుగ అలంకరించి మరల చూడుమనెనట. ఇప్పుడింకను వారి ప్రతిబింబము బాగున్నదట. ఇదే తత్త్వము పొమ్మని బ్రహ్మ చెప్పెనట. అంత విరేచనుడు ''అర్థకామౌ పురుషార్ధౌ'' - అని భావించి సొమ్ములతో అలంకరణముతో భోగసాధనములతో నుత్తములుగ నుండుటయే తత్త్వార్థమని రాక్షసులకు బోధచేసెనట. కాని ఇంద్రుడు మాత్రము ఆలోచనలో పడెనట. వట్టిముఖము-అలంకరించిన ముఖము తేడా చూచి బ్రహ్మవస్తువు ఒకటేననియు, ఉపాధియందు భేదమున్నదనియు గ్రహించి అయినను బ్రహ్మనడుగుదమని పోయెనట. ''చతుర్వారం గురుర్య¸°'' అని నాలుగుసార్లుపోయి సందేహములన్నియు నివృత్తి చేసికొనెనట. కనుక నిట్టి అర్థముల ముడినిప్పుటకే జహదజహల్లక్షణ మేర్పడినది.

భారతమున భీష్ముడు - 24 వది మాయ. 25వది జీవుడు. 26వది ఈశ్వరత్వము. ఇరువదియైదవతత్వము ఇరువది యారవ తత్వము నెరిగిన నిరువదియేడవ తత్వమగును అని చెప్పెను. 25వ తత్వము నల్పజ్ఞత్వాదులు, 26వ తత్వము సర్వజ్ఞత్వాదులు వదలిన శుద్ధ చైతన్యమున కాయన 27వ తత్వమని పేరుపెట్టెను. ఆ స్థితి ననుభవించువఱకు కర్మములు, ప్రారబ్ధములు విడనేరవు. ''ప్రారబ్ధం భోగతో నశ్యేత్‌'' అని పురాణములు చెప్పుచున్నవి. జ్ఞానియైనను శరీర ప్రారబ్ధము తప్పదని, అది మనకువలె జ్ఞానికి బాధకముకాదని ప్రాజ్ఞులు చెప్పుచున్నారు. యముని రావణు డొకసారి - ''పురుషుడు కర్తయే దురితపుంజ మొనర్ప'' అని ప్రశ్నించెనట. మరి దోషమునకు కర్తకాకున్న, పుణ్యమునకు కర్త యగుచున్నాడా? అను ప్రశ్నములేదా? పుణ్యమునకుకూడ కర్త కాదనియే సారాంశము. ఏలన-

శ్లో|| జానామి ధర్మం నచమే ప్రవృత్తిః

జానామ్య ధర్మం నచమే నివృత్తిః ||

కేనా పిదేవేన హృదిస్థితేన

యధా నియుక్తోస్మి తథా కరోమి ||

అని యభియుక్తులు భావింపమనుచున్నారు. సాంఖ్యమున 25 తత్వములు చెప్పబడినవి. అందు 24 వది మాయ, 25వది పురుషుడు. మాయతో కలసిన బంధము - సంసారమునకు దారితీయును. మాయతో కలియకున్న ముక్తి లభించును. ఈ సాంఖ్యమతము వారు సుఖదుఃఖములు అంతఃకరణ ధర్మములని నిరూపించగా శంకరులు వారిని ''సాంఖ్యా వివేకినః'' అని మెచ్చిరి. ఇవి జీవుని లక్షణములని తర్కాదుల మతము. కాబట్టి జీవుడు సాంఖ్యులప్రకారము జ్ఞానియై మాయను వదలుటయే మోక్షము. అనగా బౌద్థాదులు. అంతకు మునుపును శుద్ధుడగు జీవుని మాయ యెట్లు సంసారమునకు దిగిచినదో - అట్లే ఇపుడును శుద్ధుడవు నా జీవుని మాయ సంసరణమున దిగిచిన జీవుడు మరల సాధనచేసి మోక్షము సంపాదింపవలసి వచ్చునుగదా! ఈ నిత్యముకాని మోక్షమునకు మాటిమాటి కాసించి శ్రమమెనయుటకన్న జీవుడిపుడున్నట్లే యుండుట మంచిది - అని పూర్వపక్షము చేసిరి. దీనికిపైన యోగమతమువారు 26 తత్వములని నిరూపించిరి ఒక సారి ముక్తుడగు జీవుని మాయ లోబరుచుకొనకుండ 26వ తత్త్వమగు ఈశ్వరుడు నియమించునని వారి మతము. సజాతీయ, విజాతీయ స్వగత భేదరహితమైనది బ్రహ్మస్వరూపము మరియు సచ్చిదానందరూపమైనది బ్రహ్మ స్వరూపము. మన మేదేని వస్తువు ననుభవించునపుడు వచ్చిన యానందము, మవోవృత్తి ఆగినపిమ్మట వచ్చిన ఆనందమని గ్రహింపవలెను. కాని ఆ వస్తువునుండియే అట్టి యానందము లభ్యమగుటలేదు. కుక్క ఎముక కొరికి కొరికి చిగుళ్ళ నొప్పిపుట్టి అందునుండి స్రవించిన రక్తమునే బహురుచ్యముగానున్నది, ఎముక యని తినుట వంటిది. కనుక అంతఃకరణము మనస్సు మొదలైన దానివలన మనకు వస్తువిషయక జ్ఞానము కలుగును. ఇంద్రియముల ద్వారమున కలిగిన జన్యజ్ఞానమును ఆపినపుడు ప్రజ్ఞానమాభాసించును. ఇది ఎట్లున్నదన పిల్లకాల్వల కట్టివేసినపుడు ఆనకట్టలోని నీరు భాసించినట్లు. ఇక యోగమతమే విశిష్టాద్వైతమని భావింపవచ్చును ''ఏతేన యోగః ప్రత్యాఖ్యాతః'' అని వ్యాసులు నుడివిరి. అద్వైతమతమునుగూర్చి చెప్పునపుడు ఇతరులకు - గొంగళిలో వేపికట్టి ఏటిలో పడవేసినట్లుండునని గౌడపాదాచార్యులు సెలవిచ్చిరి. యోగులు అనుభవమునుగూర్చి - ''ప్రకాశమానే పరమాత్మభానౌ! నశ్యత్య విద్యాతిమిరే నమస్తే? అహో బుధా నిర్మల దృష్టయోపి! కించిన్న పశ్యంతి జగత్సమగ్రం!'' సమాధిలో సత్యదృష్టికి ననుభవములో లేని జగము లోకుల యజ్ఞాన దృష్టిలో నున్న దాని వారు చెప్పనేల? అని యాక్షేపించిరి. కాబట్టి యోగ సమాధి యందు తా మనుభవించు బ్రహ్మముతప్ప ఇతర ప్రపంచ మేమియు కానరాదు. ''సత్యం తీర్థం, క్షమాతీర్థం, తీర్థమింద్రియ నిగ్రహః'' - అని వ్యాసభట్టారకు లంత స్తీర్థములను పురాణములందు గొనియాడిరి. దాని వలన అంతఃకరణ శుద్ధియగును. బహిస్తీర్థములవలన శరీరశుద్ధి కలుగుచున్నది. ఆ రెండు శుద్ధులు యోగికి యోగసాధనములు. అంతస్తీర్థముల గొప్పతనమును జెప్పుటకు నది యున్నవారికి బహి స్తీర్థము లక్కరలేదని కూడననిరి.

6

శ్రీ భగవద్గీత యందు చరమశ్లోకము ప్రధానమని - ''సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ'' - అని వైష్ణవులు భగవంతుడు చెప్పిన సూక్తిని ప్రధానముగ భావించుచున్నారు. ''తదాస్తిమితం గంభీరం న తేజో న తమిస్తతం - అవాభ్య మవభిప్రత్యం సత్కించి దవశిష్యతే'' - అని భగవంతుడు స్వరూపస్థితిని వర్ణించెను. అట్టిదియే బ్రహ్మమని అద్వైతులు. దీని యర్థమును స్వయముగ ననుభవింపనగును. కాని తాను పుణ్యము సేయక దేవుడు నా కీయలేదని దరిద్రుడై దేవుని నిందింపరాదు. ''అవశ్య మనోభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌'' మంచిగాని చెడుగాని చేసిన దనుభవింపక తీరదుగదా; భగవంతుడు వెలుతురు కాని వాడు, చీకటి కానివాడు. ప్రపంచమంతయు నిండియున్నాడు. అనభిస్రఖ్యము అన స్పష్టముగ నిరూపించుటకు శక్యముకానివాడు. అనాఖ్యుడు, స్తిమితుడు, గంభీరుడు - ఇట్లు చెప్పుచున్న నాస్తికుల మతమే యన వలసివచ్చుచున్నది అను శంక నిరాసించుచు ''సత్కించ మవశిష్యతే'' అని సిద్థాంతమును చెప్పిరి. సత్‌ అనగా ఇట్లు విమర్శించి మీ రేమియు లేదను వస్తువు. అది లేనిదే లేనిదాని ననుభవించునది ఏది? అదియే బ్రహ్మమని స్వామి యభిప్రాయము. గీతయందు భగవంతుడు, జ్ఞాని నాయొక్క స్వరూపమే యనెను. అట్టి జ్ఞానికాని వానికి తన్ను గొల్చి కృతార్థుడగుటకు భగవంతుడు కొన్ని మతములు చెప్పెను. మొదటిది కైంకర్య మతము ఇందు భక్తుడు భగవంతునికి జీతగానివంటి వాడు. తన కృత్యమంతయు భగవంతునికి చేయవలసిన దనియే భక్తుడు నిర్వర్తించిన, భక్తునకు కావలసిన వన్నియు భగవంతుడు ఇవ్వగలడు. ఇదియే - ''యోగక్షేమం వహామ్యహం'' అను భగవంతునిమాట కర్థము. ఒకరిపని యొకరు చేయుట కుదరదనువారు కర్మముల నుపాసనల తనపని యనియే చేసి ఓం తత్సత్‌ అని బ్రహ్మార్పణము చేయవలెను. అట్లు చేయుట తన ధనమును బ్యాంకులో నుంచుకొన్నట్లు. భగవంతుని యధికారములోనుండు ధనాగారమునుండి ధనము స్వీకరించునట్లు మనకు కావలసినప్పుడు వానినుండి స్వీకరింపవచ్చును. ఆ నమ్మకము లేనివాడు తాను సత్కర్మము చేసి దాని ఫలము అని కర్మమత సిద్ధాంతము చేయును. అపాయములేని యుపాయముల నెఱిగిన జ్ఞాని యీ కర్మముల బెడబాచుకొను నుపాయమును దేవుడే చెప్పియున్నాడు.

శ్లో|| అధిష్ఠానం తథాకర్తా కరణంచ పృథగ్విధం

వివిధాచ వృధక్చేష్టా దైవం చైవాత్ర పంచమం||

అని మంచిపనికాని, చెడుపనికాని చేయుటకు ఐదు కలవవలెను. కావున నేపనియైనను అయిదింటి కలయికవలననే జరుగుచున్నది. అధిష్ఠానమనగా శరీరము. కర్త యనగా జీవుడు కరణములు, ఇంద్రియములు, ఇక చేష్టలు వేణు. అవి వాయువీయములు కర్మేంద్రియ చేష్టలు. ఈ నాలుగు కాక దైవము మరొకటి ఉన్నది. మన సర్వేంద్రియములకు అధిదేవతలు గలరు. వీరి ప్రేరణచే పని జరుగుచున్నది. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, కాళ్ళకు విష్ణువు, ఇట్లు అధిపతులను చెప్పియుండిరి. కనుక ఈ ఐదింటి కలయికవలన పనులు జరుగుచున్నవి. తప్పుకాని ఒప్పుకాని ఈ ఐదింటివలన జరిగినచో - ఆయా తప్పొప్పులు ఎవరివని నిర్ణయింపనగును? ఇది జాయెంటు వ్యాపారమువంటిది. జాయెంటుదార్లెల్ల ఆస్తిలేనివారైనచో దండుగ కెవడు బాధ్యుడు? కాన నేను చేసితినని ఒకరు ఒప్పుకొనుటయే తప్పు. ఈ యుపాయము గీతలో భగవంతుడు బోధించియే యున్నాడు. ఎవరు జీవుడు వేఱు, శరీరము వేఱు అని భావించగలరో వారు యమునిదగ్గర తప్పులన్నింటికి తప్పించుకొనవచ్చునట. అనగా జీవుడు జ్ఞానమున బ్రహ్మమయుడై యుండ అధిష్ఠానమను శరీరాదులు నశింప కర్మ మెవరిది! అని అభిప్రాయము.

ఓంకారము ప్రకృతి పురుషులమధ్య ప్రారంభ##మై బ్రహ్మయందు లీనమగును. ఈ ఓంకారము పరాపర బ్రహ్మస్వరూపము. ఇది వ్యాకరణ ప్రకారము అవతి ధాతువుమీద ఔణాదిక ప్రత్యయము చేర్చగా నేర్పడును. సోహం అను పదమునందలి ము వదలి ఓకారము మొదలుకొని హకారము మీద మకారముతో ప్రత్యాహారముచేయ ఓమ్‌ అని యేర్పడుచున్నది యనియు పెద్దలు చెప్పుదురు. ఈ ఓకారజపము సన్యాసులకే యుక్తము గృహస్థులు దీనినే మంత్రమునకైననుచేర్చి జపింపవలయును. సంసారులు గాయత్రిచేయుటయు క్తము. దానిచేవారు తరింపవలయును. ''గాతారం త్రాయతే ఇతి గాయత్రి'' కనుక వారిని తరింపజేయగలదు. ఈ గాయత్రి సూర్యుని చూచుచు చేయుటమంచిది. గాయత్రీ మంత్రమునకు సూర్యపరముగా, శివపరముగా అర్థములు చెప్పుట గమనింపదగినది. పనులయందు ప్రబోధించువారు సూర్యుడు. అట్లే గాయత్రి కూడ అని సూర్యపరముగ అర్థము. ''భర్గస్య దేవస్య ధీమహి'' అను భర్గుడను పేరుగల శివుని - అని శివపరముగ అర్థము చెప్పుట కలదు. కాబట్టి అద్వైతులు శైవులు చెప్పుచున్న అర్థమునుబట్టి - బుద్ధిని ప్రేరేపించు ఒకడు - అనగానే ద్వైతమతము వచ్చుచున్నది. కాని ఈ మంత్రము అద్వైతులకే ముందు అన్వయించుచున్నది. కాని శాక్తేయులు గాయత్రీయని స్త్రీలింగముగ ఆ మంత్రమును భావించిరి. ''ముక్తా నిద్రుమ.....'' అని స్త్రీరూపముగా భావించుట జరిగినది. ఇచట శివస్వరూపమును ఆగమ శాస్త్రము చెప్పుచున్నది. మా బుద్ధివృత్తులను ప్రేరణముచేయు దేవుడు అన్న దేవునకు కర్తృత్వము వచ్చునుగదా! ఆ ద్వైతులకు ఈ మంత్ర సమన్వయ మెట్లనిప్రశ్నింపవచ్చును? కర్తృత్వాదు లారోపితములు దీనికి పురాణముల యందు వ్యాసులు-

''అనాపన్న వికారస్స న్నయస్కాంతవ దేవయః

బుద్ధ్యాదీం శ్చాలయేత్ప్రత్యక్సోహ మిత్యవధారయ''

అని చెప్పినచోట చాలయేత్తని కర్తృత్వ మారోపితము. ఇది అనాపన్న వికారుడు అను విశేషణమువలన ప్రాప్తమగుచున్న, అయస్కాంత దృష్టాంతము నట్టిదియే! ఈ బ్రహ్మవస్తువు అయస్కాంతముతో పోల్చిచెప్పబడినది. అయస్కాంతము నికారము లేనిది. చలనము లేదు. కదలు వస్తువునకు దాని దగ్గర చలనము కలుగుచున్నది. అట్టి శక్తినిర్వికారమగు అయస్కాంతమందు కల్పించుటకన్న తత్సమీపమున గదలు శక్తియిందే కల్పించుట యుక్తము. అట్లే బ్రహ్మవస్తువు సర్వగతమై యున్నది. దాని సన్నిధానమున నితర తత్వములు చలించుచున్నవి. అవి-

''యస్యసన్నిధి మా తేణ

దేహేంద్రియ మనోధియః

విషయేషుచ ప్రవర్తంతే

తద్ప్ర హ్మే త్యపధారయ||''

అని బ్రహ్మసాన్నిధ్యముచే అన్నియు ప్రవర్తించుచున్నవి. కాని బ్రహ్మము మాత్రము నిర్వికారమని భావించవలయును.

ఇక గాయత్రిజపము తర్వాత ఆగమశాస్త్రము అనేక మంత్రములు చూపుచున్నది. నమశ్శివాయ మొదలగునవి చేయమనుచున్నది. కాని విద్యారణ్యులు పంచాక్షరీమంత్రము నామమంత్రముకన్న వేదమంత్రము మంచిదని అభిప్రాయపడిరి. ''త్రియంబకం యజామహే'' అని నే జపించెద ననిరి, ''నమశ్‌ శివాయ ఓం'' అనగా మశ్‌ శబ్ధమునకు నాది అని అర్థము. శివాయ అనగా శివః అని విభక్తి పరిణామము, మశ్‌=నాది న=ఏదియు లేదు. ఓం. ఆ నేను శివః శివుడనే అనుటయే నమశ్శివాయ మంత్రార్థమని శ్రీ పద్మపాదాచార్యులు నిరూపించుచున్నారు. నమోనారాయణాయ అన్నను నమశ్శివాయ అన్నను అట్లే సమన్వయించుకొన నగును. బ్రహ్మవస్తువు తాను ఒక్కటియే యని యనుభవింపవలెను. కొన్ని మంత్రములకు ఆగమశాస్త్రము ద్విముఖములు రెండేసి యర్థములు చెప్పనది. దుర్గను ధ్యానించునపుడు ఆమెను ఆకుపచ్చ రంగుతోను బంగారు రంగుతోడను ఉపాసించవచ్చునని రెండు ధ్యానములున్నవి. ''ఉత్తిష్ఠ పురుషీ హేమప్రఖ్యాం'' అని ఒక ధ్యానము ''నవ దూర్వా సదృశీ'' అని మరియొక మంత్రముతో కుండలిని లేపి ''భయం మే సమువస్థితం, యది శక్యం ఆశక్యం వా!'' అని జపించినచో హోమరూప పరాశక్తి వలన సంసారభయము పోగొట్టుకొనవచ్చును, దూర్వా సదృశియగు దుర్గవలన లౌకికభయము పోగొట్టుకొనవచ్చును. ఈ పరాశక్తి వలన భుక్తి ముక్తి లభించునని శాక్త శాస్త్రము చెప్పుచున్నది. శంకరులు సౌందర్యలహరిలో -

శ్లో|| నరం వర్షీయాంసం సయనవిరసం నర్మసు జడం

తవాపాంగా లోకే పతిత మనుధావంతి శతశః

గలద్వేణీబంధాః కుచకలశవిస్ర స్తసిచయాః

హఠాత్త్రుట్యత్యాంచ్యో విగలిత దుకూలా యువతయః

అని వర్ణించెను. యోగమున భ్రూమధ్యమునకు దగ్గర వచ్చినపుడు సాధకునకు రుద్రకన్యలు కనబడుచున్నారు. వారికి లొంగక సాధకుడున్నచో పరాశక్తి యనుగ్రహమున శివస్థానము నెనయగలడు. లేకున్న నెత్తియడచుట సంభవించి చెడిపోగలడు. ఆ శక్తిని -

''తురీయా కాపి త్వం దురధిగమన నిస్సీమ మహిమా

మహామాయావిశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి''

అని వర్ణించుచున్నారు. ఇదియే పరాశక్తిగ భావింపబడుచున్నది. కామేశ్వరి యనియు శాక్తే యమున గలదు. ఇట్టి పరాశక్తి వలన సాధకులు మోక్షమునొందుట గలదు. భగవంతుని ధ్యానము చేయువారు వారివారి ఆశయముల ననుసరించి ఆయా దేవతల నాయా రూపములలో ధ్యానింపవలెను. అనగా ఐహిక, ఆముష్మిక లేక పరార్థ అపరార్థములకు మంత్రములు వేర్వేరుగ నున్నవి. శివుని శాంతమూర్తి పార్వతీ సహితునిగ ''శాంతం పద్మాసనస్థం'' - అను శ్లోకముతో ధ్యానింపవచ్చును. కైవల్యాపేక్షి ప్రపంచమంతయు నిండియున్న స్వరూపముగ ''చైతన్యం పరిపూర్ణ మేకమనిశం'' - అను శ్లోకముతో ధ్యానింపవలెను. లోకమున నెన్నియో మంత్రములున్నవి ఏ ఒకదాని తోడనైనను మోక్షము లభించగలదు. కాని బ్రహ్మచర్యమునందే ఆయా మంత్రోపాసన చేసి వివాహమాడుట మంచిది. ఏలన లౌకిక వ్యవహారములోబడి మంత్రోపాసన చేయుట కష్టమగుచున్నది. అందుకనియే బ్రహ్మచర్యమున తపము, జపము చేయుట మంచిది. మరియు 14 ఏళ్ళ లోపు పిల్లలు చేయు పాపమంతయు తల్లిదండ్రుల కంటుననిమాండవ్యుడు పేర్కొనెను. కాన చిన్నతనములో నుపనయనము చేసి అవటువు గాయత్రిసిద్దుడగునట్లు, ఇతరమంత్రముల జపించునట్లు యోగాభ్యాసము చేయునట్లు తల్లిదండ్రులుగాని, గురువుగాని శ్రద్ధ తీసికొనవలెను. ఏదియో ఒక చైతన్యమువలన శరీరము కదలుచున్నది. కానిశరీరము జడమని అందఱకు తెలియును. శరీరమున సంవిత్తు అనగా తెలివి, అనునది యున్నది. దాని సన్నిధితో లోకవ్యహారమంతయు జరుగుచున్నది. మన సామెతలన్నియు వేదశాస్త్ర సారములని గ్రహింపవలయును. ''ఒళ్లు ఎరుగని శివం వస్తుందా'' అని అనుచున్నాము. మనకు తెలియకుండ కామక్రోధములు జనింపవు. అంతఃకరణ మున్నపుడు కామక్రోధాధి భావములు పుట్టక మానవు. వీటిని పుట్టుచుండగనె తెలిసికొని నిరోధించుట పెద్దల గొప్పతనము. కాన నన్నయభట్టు-

కం. అవశగతి కామరోషా

దివికారము లొదవినను మదిం ధర్మగతి

ప్రవిహతి గానీక నడచు

దివిజేంద్ర తనూజ డద్వితీయుడు పేర్మిన్‌ ||

అని పుట్టిన కామక్రోధాదుల వలన ధర్మమును చెడకుండ కాపాడుకొను కర్తృత్వము అర్జునునియందు చిత్రించెనని గమనింపవలసియున్నది.

భారతమున కౌరవపాండవుల కథ యగుచుండగా నా గ్రంథము త్రిపురాసుర సంహారముతో నేల అంతమగుచున్నదని సందేహము రావచ్చును. అందులకు సమాధానముగ గచ్చద్వ్యాఖ్యాత అందలి ఆత్మార్థము గ్రహింపవలయునని నుడివెను. ఇచట త్రిపురములనగా స్థూల - సూక్ష్మ - కారణ శరీరములని అర్థము. శివుడు మూడుసార్లు త్రిపురాసుర సంహారము గావించినట్లు అచ్చట గలదు మొదట శివానుగ్రహము వలన శారీరక రోగములు నశించి దేహశుద్ధి కావలయును. పిమ్మట కామక్రోధాదులు నశించి మానవశుద్ధి యగుట సూచింపబడినది. మూడవసారి కారణ శరీరము నావరించిన తమస్సు నాశనముచేయబడుట వర్ణింపబడినది. ఇదియే త్రిపురాసుర సంహార రహస్యము.

ధర్మరాజు జూదమున నోడిపోవునపుడు దుర్యోధనుడు పై పుట్టముల పెట్టిపొమ్మన నట్లుచేసి కట్టుపుట్టములతో పోయినట్లు కలదుగదా! పాచికల నెట్లు కైకొని పోగలిగెను? పాచికల నిక్కడనే వై చిపోయిన విరాటునకు వెండిపాచికలు, రత్నమయములు బంగారు పాచికలు చూపించినట్లు కలదుగదా! ఆ సందర్భమెట్లు కుదురునని సందేహము కల్గుచున్నది. కాని వ్యాసుని బ్రహ్మసూత్రములయందలి భావమును చూచినచో జీవుడు శరీరమువదలి పోవునపుడు 17 తత్త్వముల మూట తీసికొని పోవునట. ఈ వేదాంత అర్థమే యిచ్చట నున్నది. 17 తత్త్వములనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణపంచకములు, మనస్సు బుద్ధులు.

ఒక బ్రాహ్మణుడు దారింబోవుచు మధ్యమందున్న ఒక గాడిద పిల్లను గొట్టగా, అది తల్లితో నీ బ్రాహ్మణుడు నన్ను కొట్టెనని చెప్పుకొని, ఆ తల్లివాడు బ్రాహ్మణుడైన నిన్నేల కొట్టును? వాడు చండాలుడు అనెను. అది విని సర్వభాషావిజ్ఞానము గల బ్రాహ్మణుడు అతని తండ్రి వద్దకుబోయి యా కథచెప్పి నేనెట్లు చండాలుడ నైతినని అడుగ నాతడు నీ తల్లి నడుగుమనెను. వాడట్లు చేయ వానితల్లి ఒకప్పుడు తానొక మంగలితో కలిసినట్లు సూచించెను. దానివలన నతడు ఖిన్నుడై విలోమజాతి జాతుడగుటవలన చండాలత్వము నిర్ణయించుకొని తండ్రి నడుగగ, ఆతడొక శ్లోకము చెప్పి ఇంద్రు నుపాసింపుమనెను. అతడట్లు జపింపగా ఇంద్రుడువచ్చి ఏమికావలయునని యడుగ వాడు నేను శుద్ధబ్రాహ్మణుడగునట్లు వరమిమ్మనెను అంత ఇంద్రుడు ఈ తపమునకు నూరురెట్లు తపము చేసిన శూద్రుడయ్యెదవు. దానికి పదిరెట్లు చేసిన సచ్ఛూద్రుడవగుదువు దానికి పదిరెట్లు చేసిన వైశ్యుడ వయ్యెదవు. దానికి పదిరెట్లు తపించి క్షత్రియుడవు కాగలవు. దానికి పదిరెట్లయిన దుర్బ్రాహ్మణుడ వయ్యెదవు. దానికి నూరురెట్లయిన సద్బ్రాహ్మణుడ వయ్యెదవు. అంతదాక శరీరమిది నిలువదు. ఏవియేని బోగ్యములు కోరుకొమ్ము ఇచ్చెదనిన వా డందుల కొప్పక ఎన్నిమార్లు దేవేంద్రుడు వచ్చినను తక్కు వరముల నిరసించి చివరకు శరీరము నిలువక పడిపోవుచుండ, ఇంద్రుడువచ్చి దయతో నిడు వరప్రసాదము నంగీకరించి యిప్పటికి త్రిశంకు మండలమున చండదేవుడను పేరుతోనుండి భోగముల ననుభవించుచు పూర్ణిమనాడు చంద్రదర్శనము చేయని స్త్రీల పున్నెముల ప్రోవుచేసికొను చున్నాడని భారతమున గలదు కావున పంచాంగములలో ''స్త్రీణాం చంద్రదర్శనమ్‌'' అని వ్రాయుచున్నారు. అది యెవరు పరిగణించుటలేదు అట్టు లుండనీండది. ఈ కథవలన బ్రాహ్మణత్వ మెంత కష్టపడిన వచ్చినదో తెలియుచున్నది. దాని మనము లెక్కచేయక వట్టిభోగభాగ్యములతో పోగొట్టుకొనుట చింత్యము. కావున భారతము సర్వము నొక అక్షరమైనను తీసివేయరాని సత్యేతిహాసము ఈ భారతము వ్యాసుడు చెప్పుచుండగా వినాయకుడు వ్రాసినట్లు చెప్పుచుందురు. వినాయకుడు ఆపకుండ చెప్పిననె వ్రాయుదుననెనట. అంత వ్యాసుడు - అర్థము చేసికొని మాత్రమే వ్రాయవలెను గాని లేకున్న తలపగులునని శాపమిచ్చెనట. కావున వినాయకుడు అర్థముచేసికొని వ్రాయులోపల వ్యాసుడు తర్వాతి ఘట్టము నూహించుకొని యుంచుకొనెడి వాడట. ఇట్టి ఘట్టములకే వ్యాసఘట్టములని పేరు. ఇది 'లేఖ్యంబైన ఆమ్నాయము'' అని తిక్కనగారు వచించిరి ఆయా కవులు రచించిన గ్రంథములయందు రసానుసారముగ పాత్రపోషణము సేయబడును. పురాణములు ఇతిహాసములు సత్యములు. ఆయా పాత్రల యందలి మంచి తనమునే ఆదర్శముగనుంచుకొని నడుపవలసియున్నది. కవులలో కల్పనలుండును. పురాణములలోని వర్ణనములున్ను సత్యములని చెప్పనగును.

భారతములోని చివరికథ - సర్పయాగ మెందులకు? అను ప్రశ్నకు సమాధానమందున్నది. సర్పయాగము చేయగా జనమేజయునకు శరీర మంతయు బొల్లిమచ్చలు ఏర్పడినవట. అవి భారతము విన్నచో పోవునని చెప్పగా వినుట ప్రారంభించెను అన్ని మచ్చలు పోయినవిగాని మూడు మాత్రము మిగిలినవి అందులకు కారణమేమని జనమేజయుడు వ్యాసుని అడుగగ - నీకు భారతమున మూడు సందేహములు మిగిలినట్లున్నవి. వానిని చెప్పుమనెను అంత జనమేజయుడు తన మూడు సందేహములు వరుసగా నిట్లు చెప్పెను.

1. సైంధవవధ రోజున భీముడు పదివేల ఏనుగులను ఆకాశమున కెగురవేయుట అతిశయోక్తి అనుకొంటివనెను. వ్యాసుడు వాని నన్నిటిని జనమేజయునకు ప్రత్యక్షముగ నేటికిని కలవని దివ్యదృష్టిచూసి యొప్పించెను. 2. ఆశ్రమవాసపర్వమున 18 ఏళ్ళకు మును చనిపోయిన వారిని అందఱికి చూపుట అసాధ్యమని సంశయము. వ్యాసుడు వారిని జనమేజయునకు మరల చూపి, వారి యింట నొకరోజుండునట్లు చేసి యొప్పించెను. ఈ రెంటితో రెండు మచ్చలు పోయినవి. 3. కృష్ణరాయభారమున కౌరవులకు అందఱు చెప్పిచూచిరి కాని, వ్యాసుడు చెప్పిన వినకుందురా? అని సందేహము వచ్చినది. దానికి వ్యాసుడు నేను చెప్పినమాత్రము వినెదరా? అట్లు నీవు వినెదవా? అని ప్రశ్నించి, అందులకు కలియుగమున అశ్వమేధయాగము చేయరాదని నిషేధమున్నది అని జనమేజయునకు చెప్పెను నా మాట నీవు నమ్మినచో నీ వశ్వమేధము చేయవలదని చెప్పిపోయెను.

తర్వాత మూడేండ్లకు ఒక దివ్యాశ్వము లభింపగ జనమేజయుడు ఉత్పాహముకలవాడై దాని నారంభించెను. గాయత్రీమంత్ర మంత్రితమవునశ్వమును వదలిరి. అది దిగ్విజయముగ తిరిగిరాగ దానిని శ్రవణము చేసిరి. అపుడు రాణిని దాని వద్ద పండుకొన బెట్టుట ఆచారము. అంత అందలి గాయత్రిశక్తి రాణిలోనికి ప్రవేశించి వీర్యవంతులైన కుమారులు కల్గుదురు అని శాస్త్రము. కాని ప్రస్తుతము శ్రవణముచేసిన, ఆ మాంసఖండములలో ఇంద్రుడు ఆవేశించి యుండెను. అవి కదలుట కదియేకారణమని బ్రాహ్మణులు చెప్పిరి. అంత జనమేజయుడు కోపోద్రిక్తుడై భార్యను, బ్రాహ్మణులను త్యజించెను. అపుడు వ్యాసుడువచ్చి చూచి కారణమేమని అడిగెను. జరిగినది జనమేజయుడు చెప్పి వ్యాసునిమాట నమ్మితిననగా ఆ మచ్చపోయినది వ్యాసముని రాణిని పుట్టింటినుండి తిరిగి రప్పించి బ్రాహ్మణులు బిలిపించి వారలనెల్ల సుమాధానపరచి, పిమ్మట షిష్టపశువుతో మరల యాగము చేయించి అశ్వమేధ ఫలమును జనమేజయుడు పొందునట్లు చేసెను. అని భారతమున నున్నది. కాబట్టి భారతమును ప్రత్యక్ష ప్రమాణముగ భావింపవలయును. అట్లు నమ్మినవారికే దాని యందలి ఫలశ్రుతుల యుపయోగము కలుగును.

7

శ్లో|| అకృశం కుచయోః, కృశ్నంవలగ్నే

విపులం చక్షుషి విస్తృతం నితంబే

అధరేరుణ మావిరస్థు చిత్తే

కరుణాశాలి కపాలి భాగధేయం||

అని పార్వతిని ఒక కవి వర్ణించెను. కవిత్వము వ్యంగ్యప్రధానముగ నుండును. వేదములు శబ్దప్రధానములు. అందు ఒక శబ్దమున కొకయర్థమే చెప్పవలెను. కవిత్వముననొ? అనేకార్థములు వచ్చునట్లు చెప్ప వచ్చును ఇక శక్తి స్వరూపము భ్రూమధ్యమున అర్థనారీశ్వరత్వముతో నుండును. అనాహతము నందు శివపార్వతుల వర్ణనము జరుగును. సహస్రారముపైన దృశ్యాదృస్యపీఠము కలదు. ఇది యోగిజనవేద్యమైనది. ఋషులుమాత్రమే చూడగలరు. మనలో అనేక మతములు పురుషప్రధానమైనవి కలవు. స్త్రీ ప్రధానమైన దొక్క శాక్తేయ మతము మాత్రమే కలదు. ''ప్రకృతి అలింగ తజ్జనిత భంగులు లింగములు'' - అన్నట్లు ప్రకృతికి లింగము లేదు. అట్లే బ్రహ్మస్వరూపమునకు కూడలేదు. అది అష్టమచక్రమందలి స్వరూపము. శివకేశవాభేదము ఇది ''తదభిన్నా భిన్నస్య తదభిన్నత్వం'' - అను న్యాయము ననుసరించి ఇద్దఱు ఒక్కటియే, అని అప్పయ్యదీక్షితులు నుడివిరి. బ్రహ్మాండ పురాణమున దేవి - భోగే భవాని పురుషేషు విష్ణుః క్రొదే చ కాళీ సమరే చ దుర్గా - అని నాల్గుభాగములుగ చెప్పబడినది. శివునకు, శక్తికి భేదము లేదు. అందునుండి వచ్చినభాగము విష్ణువు. కావున శివకేశవా భేదము సూచితమగుచునే యున్నది. త్రిమూర్తులలో నెక్కువ తక్కువలు లేవు. ఒకేమూర్తి మూడుభాగములుగ భాగింపబడినది. ''ఏకైవ మూర్తిర్చిభిదే త్రిధాసా'' యని కాళిదాసు నుడివెను.

సూతసంహితయందు జగద్విలక్షణస్థితి చాల గొప్పది. అది కలవారు గొప్పవారని చెప్పబడినది. ఈ దృష్టితో ఋషులు గొప్పవా రగుచున్నారు. వారికంటే దేవతలు, వీరిలో అష్టదిక్పాలకులు, వీరియందును ఇంద్రుడు, ఇంద్రునికంటెను బృహస్పతి, వీనికంటెను బ్రహ్మ, బ్రహ్మకంటెను విష్ణువు, విష్ణువుకంటె శివుడు గొప్పవాడుగ చెప్పబడుచున్నారు. కారణము పూర్వులకంటె ఉత్తరోత్తరులు ఎక్కువకాలము బ్రహ్మమయులుగ (జగద్విలక్షణస్థితి) నుండుటయే. శివుడు ఎల్లప్పుడు పార్వతిని తొడపై కూర్చుండబెట్టుకొని వేదాంతబోధ చేయుచుండును అది లోకము బోధముకొఱకు తాను బ్రహ్మమయుడై బయట తద్వివరణ మొనర్చునని భావము. కనుకనే శివుడు బాహ్యాభ్యంతరములతో బ్రహ్మమయు డగుచున్నాడు. అందువలననే శివునకు స్థాణువని పేరు వచ్చినది. అందులకే శివుని ''హరోం హరహర'' అని కేకపెట్టవలసివచ్చినది. కావున సూతసంహిత శివప్రాముఖ్యము నుగ్గడించి చెప్పుచున్నది. మన సర్వశరీరమున ఇంద్రుడు బలాధికారి, ఆతని తిరస్కరించిన బలమంతరించును. నే నొకపరి ఇంద్రమంత్రమును జపించుచుండగ ఒకడు తిరస్కరించి జబ్బుపడి చివరకు ఇంద్రమంత్రోపాసనచే బలమునొంది బాగుపడెను రాక్షసేంద్రుడైన బలి ఇంద్రుని జయించెను కాని ఇంద్రాసనముపై కూర్చుండుటకు సంశయించియు రాక్షసప్రేరణచే నిది నాదికాదు, ఎప్పుడు దిగవలసి వచ్చిన నప్పుడే దిగిపోయెదనని దాని నెక్కెను, వామనుడు దానమడుగుటకు వచ్చినపుడు బలి - మీదై నా కరంబుంట మేల్గాదే - అని గర్వించెను. బలి కోరిక ననుసరించి శ్రీకృష్ణుడు వానికి ఇంద్రత్వము నొసగుటకుగా పాతాళమున కంపెను. కాని ఇంద్రుని బ్రహ్మజ్ఞానము బలికి లేదు. అందుచే వామనుడు వానిని పాతాళమునకు త్రొక్కి తన గురుత్వముతో తత్త్వోపదేశము చేయ సమకట్టెను. కాని బలి ఒకప్పుడు భగవడాదేశమున గాడిదయై తిరుగుచుండెను. ఇంద్రుడు బలిని కనిపెట్టజాలక పోయెను. పాతాళమున లేడు. ఎక్కడచూచినను కన్పింపలేదు. ఇంద్రుడు బలి విషయమై కనబడలేదని బ్రహ్మ కెఱింగించెను. బ్రహ్మ ఈ విషయము నెఱింగియు ఇంద్రునికి చెప్పక పొమ్మనగా ఇంద్రుడు ప్రార్థించి యడిగెను. అప్పుడు బ్రహ్మ ఫలానా చోటునం దున్నాడని చెప్పగా ఇంద్రుడు బలి దగ్గరకు పోయెను. ఇంద్రుడు బలిని గాడిదవైతివని ఆక్షేపించెను. అపుడు బలి నేను తెలిసిన గాడిదనే యని తన శాంతగుణ ప్రాధాన్యమునుచాటెను. వారిద్ధరికి పరస్పర వాగ్వివాదము రెచ్చిపోయినది. కాని బలి సత్త్వగుణమున నున్నాడు కాబట్టి ఏమిచేయక మిన్నకుండెను అపుడు ఇంద్రుడు వాని నేమిచేయక మూడుసార్లు ప్రదక్షిణించి తన దారిని తాను పోయెను. ఇట్లు బలికి నారాయణుడు జ్ఞాన మభ్యసింపచేయుట పురాణములలో నగపడుచున్నది.

రామాయణమున అహల్యా వృత్తాంతము రెండుచోట్ల వచ్చుచున్నది. ఈ రెండింటిలో ఐక్యతలేదు. మొదట విశ్వామిత్రుడు రామునికి చెప్పిన కథ లోకమున వాడుకలోనున్న కథ. అసలు కథ ఉత్తర కాండలో బ్రహ్మ చెప్పినది. గౌతముడు రాజస తపస్సు చేయుచుండగా ఒకసారి పితృలోకము లన్నియు మండిపోచొచ్చెను. అపుడు బ్రహ్మ అహల్యను సృష్టించి యుంచగా అందఱు ఆమెకై తహతహలాడిరి. కాని ఎవ్వరికిని బ్రహ్మ ఆ కన్య నివ్వలేదు. ఇంద్రుడు మాత్రము ఆ కన్నెను తనకిమ్మని అడుగడాయెను. గౌతముడును ఆ అతిలోకసుందరిని అడుగలేదు. అపుడు బ్రహ్మ చేయునదిలేక అహల్యతో సంచారముగా వచ్చి ఆమెను కొన్నాళ్ళపాటు ఆశ్రయమున నుందుకొనవలసినదిగా గౌతముని కోరి అచ్చటనుంచి పోయెను. కాని లోకోత్తర సౌందర్యవతి యగు నామెను చూచినను గౌతమునకు కామాపేక్ష కలుగలేదు. బ్రహ్మ మిక్కిలి నిరాశుడైపోయెను. పితృలోకజ్వాలలు ఆరుటలేదు. గౌతముడు తపస్సును విడుచుటలేదు. కాని 1000 సంవత్సరములకు పిమ్మట గౌతముడే స్వయముగ అహల్యను బ్రహ్మ కర్పించుటకు తెచ్చెను. బ్రహ్మ గౌతముని ఆమెను వివాహము చేసికొమ్మని చెప్పెను. కాని గౌతముడు ఆమెను వివాహమాడియు తపస్సు మానలేదు. అపుడు ఇంద్రుడు ఒక పన్నాగము పన్నెను. స్త్రీ విషయకోపముగాని తపస్సు మాన్పలేదని భావించి, గౌతముడు స్నానమునకు పోవునట్లు కోడియై కూసెను. కాని గౌతముడు స్నానమునకు పోగా గంగ నిద్రలో నున్నది. కాబట్టి, ఇది వేళగాదని గౌతముడు తిరిగి రాబోవుచున్నాడు. ఈ లోపల ఇంద్రుడు గౌతముడై అహల్యను తాకి నేను ఇంద్రుడననియు చెప్పెను. అపుడహల్య భర్తయొక్క కోపతాపము లసాధ్యమని హెచ్చరించినది. భర్తకు కోపము వచ్చిన నేమి చేసెదవని అడిగినది అంతలో గౌతముడు వచ్చుచుండగా ఇంద్రుడై ఎదురు వచ్చెను. గౌతముని కోపము ఇంద్రుని శపించినది. ఈ కోపములో పితృలోకము చల్లారినది. అహల్యను ఱాయిగమ్మనియు శపించెను. అహల్య ఎంతయో తనతప్పులేదని ప్రాధేయపడినది. అపుడు గౌతముడు దివ్యదృష్టితో చూడగ ఇంద్రుడు కామముతో గాక, తనపై కోపముతో తపస్సు చెరచుటకు వచ్చినట్లు తెలిసికొన గల్గెను మరియు అహల్యకు శాపవిమోచనము రామపాద రజస్పర్శమనియు వివరించెను.

పిమ్మట ఇంద్రుడు తానుచేసిన పనిని దేవసభకు తెలియబరచెను. తనపని లోకోపకారమునకేగాని, కామమునకు కాదని వివరించెను. పితృ దేవతలును అట్లేయని తమకిడు పశువువృషణభాగ మింద్రునకు సమర్పించెదమనిరి ''గౌరావస్కందిన్‌ అహల్యయై జార'' అను వేదమును, గౌ - గౌతమ, రా - దార యని గౌతమదార నమస్కరించిన వాడా! అని ఇంద్రుని పిలుచునపుడు, అహల్యాయై జార అనుట పునరుక్తిగా నర్థము పోలుచుండగ, విద్యారణ్యస్వామి హల్య కానిది అహల్య అనగా బీటిభూమి దానిని వర్షముచే మెత్తపఱచి సస్యయోగ్యముగ చేయువాడా అని వ్యాఖ్యానించిరి.

ఉత్తర రామాయణములో ఇంద్రజిత్తు ఇంద్రుని ధ్వజస్తంభమునకు కట్టి తీసికొనిపోవుచుండును. అపుడు దేవతలు బ్రహ్మతో మొరబెట్టుకొనిరి. బ్రహ్మ ఇంద్రుని విడిపించుకొని వచ్చుచు గౌతమశాపము గుర్తుకు తెచ్చెను. బ్రహ్మ ఇంద్రునిచే మరల అశ్వమేధయాగము చేయించి యింద్రత్వ మిచ్చెను. కాబట్టి ఇంద్రుడు జ్ఞాని, బలాధిపతి. కామాపేక్ష లేనివాడు అట్టి కథలలో వ్యభిచారియైన ఇంద్రున కాపదవి నిలుచునా? బ్రహ్మాదులతని సామ్రాజ్య మప్రతిహతముగ సాగింతురా? కాన ఇట్టి కథలనుబట్టి కూడ ఇంద్రాదుల నిందించిన పాపముల పాలగుదుము. కావున మానవులును ''యాన్యస్మాకం సుచరితాని తానిత్వయోపాస్యాని'' అని శిక్షచెప్పినరీతిగా వారుచేసిన మంచిపనులే చేయవలయును, గాని చెడ్డపనులవలె నున్న పనులు చేయరాదు. కృష్ణుడు పదియవనెలయందే వ్యభిచారము ప్రారంభించెనని గలదు. అది అందఱకు సాధ్యమా? కాన వారిని మనకు సామ్యముగ తెచ్చుకొనరాదు.

ఒకసారి శంకరులు కాశ్మీరదేశముపోయి అచటి పండితుల గెల్చిశారదాపీఠము నెక్కబోయెనట. కాని వాణి శంకరుని ఆచారము చెడి పోయినది కనుక ఎక్కరాదని నిషేధించినది. అపుడు శంకరుడు ''ముండా! నీకు తత్త్వము తెలియ'' దని ఆక్షేపించెనట. తాను పరకాయ ప్రవేశము చేసినను జీవుడు వేఱు, శరీరము వేఱు, ఆ శరీరము మున్నువారల చేకొన్నది అనియు, తాను సర్వసాక్షియై యంతట నిండియున్నాననియు, శంకరులు చెప్పిరి. కావున తన ఆచారమేమియు చెడలేదనగా ఆమె ''ఈశానః సర్వవిద్యానామ్‌'' అని నమస్కరించినదట.

8

ఉ. శక్తి విహీనుడే పనికిజాలడు శక్తియ సర్వభూత సం

సక్తతగాంచి సర్వకృతి సాధనమై తనరారుచుండునా

శక్తియ ముక్తికారణము శక్తియ సర్వము శక్తిలేనిచో

శక్తులుగారు విష్ణుహర సారస సంభవ ముఖ్యనిర్జరుల్‌||

ఇట్టి శక్తిని గూర్చి చెప్పుటకే దేవీభాగవతాది గ్రంథములు పుట్టినవి శక్తివిహీను డేపనికి పనికిరాడు. శక్తిలేకున్న బ్రహ్మాదులు సైతము అశక్తులే యగుదురు - అని దేవీభాగవతము చెప్పినది. కాబట్టి శక్తియనున దొకటి యున్నదనుట సత్యము. ఇది యెనిమిదవ చక్రమున నున్నది. ఇది పురుషుడన్నను, స్త్రీ యన్నను అనుకొనవచ్చును. దీని నుండి సహస్రారము ప్రారంభమగుచున్నది. ఊర్ధ్వమూలమధశ్శాఖమ్‌ - అన్నట్లు బ్రహ్మవస్తువు మూలమునందును, దానినుండి శాఖలు విస్తరించినవి. శంకరులు ఒకప్పుడు శక్తివాదమును నిరసించగా వారికి ఒకనాడు సమాధి కుదరకపోగా ఇందులకు కారణము శక్తివాద నిరసనయే యని భావించి ఆ దేవిని ప్రార్థించి సౌందర్యలహరి శ్లోకములను రచించిరి. అపుడాదేవి వారికి ప్రసన్నయై దారి సూపెనని ప్రవాదము కలదు.

పరమేశ్వరుడు 64 తంత్రములు వ్రాసి ఒక్కొక్కదాని వలన ఒక్కొక్కసిద్ధి సాధకులకు లభింపచేసెను. ఆ సిద్ధులన్నియు భక్తులకు రావలయునని లోకము కొఱకు దేవతంత్ర మేర్పడినదని శంకరులు కొనియాడిరి. శాక్తేయ ఉపాసన అందఱకు నున్నదని భావించవలయును. ''అంతశ్శాక్తం బహిశ్శైవం సభామధ్యేచ వైష్ణవమ్‌'' అని స్మార్తుల వైష్ణవులు ఆక్షేపించుట కలదు. ఏది ఏమైనను దేవి అనుగ్రహము మాత్రము కావలసియున్నది.

కాశీఖండమున వ్యాసనిష్కాసఘట్ట మిందులకు నిదర్శనము. వ్యాసుడు కాశీయందు పండితుల వాదనలో-నదేవః కేశవాత్సరః-అని విష్ణువే దేవుడను సిద్ధాంతము చేసెను. అంత నందికి కోపము వచ్చి అతని చేతిని స్తంభింపచేసెను. దేవీ అనుగ్రహముతో వ్యాసుడు తన చేతిని స్వాధీనమునకు తెచ్చుకొని, కాశీని వదలిపోయి, మరియొక వ్యాస కాశీని నిర్మించెను. ఇది రెండవకాశి యన్నమాట. శివుడు ఈ విషయమెరింగి విఘ్నేశ్వరుని ఆ పట్టణముసంగతి చూచిరమ్మనెను. ఇక వినాయకుడు చిన్నవేషమును ధరించివచ్చి వ్యాసునిదగ్గర శిష్యుడుగా చేరి విద్యాభ్యాసము చేయుచుండెను వాని భక్తిశ్రద్ధలకు, తెలివికి వ్యాసుడు అభిమానించెను. ఒకనాడు శిష్యుని వెంటబెట్టకొని తన కాశీయందలి విశేషముల చెప్పదొడంగెను. వినాయకుడు ఆయాస్థలముల చూచుచు విశేషముల నెఱుంగుచు, ఒకచో వ్యాసునకు ద్వారమువలన దెబ్బతగిలి రక్తము కారగా, నా ద్వారమువద్ద చచ్చినవా రేమగుదురని ప్రశ్నించెను. వ్యాసుడు కోపము, విసుగుకలిగి ఇక్కడ చచ్చినవారు గాడిదయై పుట్టుదురని చెప్పగా, వెంటనే వినాయకుడు - తధాస్తు - అని తాను వచ్చినపని అయినది కనుక వెళ్ళిపోయెను. అపుడు వ్యాసుడు తన గర్వమణచుటకు వినాయకుడు వచ్చెనని తెలిసికొని, ఎవ్వరును వ్యాసకాశీయందు చావరాదని శాపించెను ఇక వ్యాసుడు కాశీకిపోయి బ్రతుకుచుండగా, శివుడు పార్వతిని, కాశీయందు వ్యాసునికి అన్నము పుట్టకుండ చేయుమని చెప్పెను. అట్లేయని అన్నపూర్ణ మాధుకరమును పుట్టకుండ చేయగా వ్యాసుడు శిష్యులతో 7 రోజులు అన్నములేక అలమటించి, ఆనాడు గంగలో మునిగివచ్చి కాశీపై కోపించి శాపమివ్వబోయెను.

మా భూత్‌ త్రైపూరుషీ విద్యా

మా భూత్‌ త్రైపూరుషం ధనం

మా భూత్‌ త్రైపూరుషీ భక్తిః

కాశ్యాం నివసితాం సదా !!

అని శపించబోగా ఇంతలో - వేద పురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దముత్తయిదువ ఒకామె వ్యాసుని పిలిచి అన్నము పెట్టెదను, స్నానముచేసి రమ్మనినది. వారందఱు స్నానముచేసివచ్చి భోజనమునకు కూర్చుండిరి. వారందఱినీ, సంధ్యావందనాది క్రియలు నిర్వర్తించుమనినది. వారు కన్నులుమూసి తెరుచులోపల ఆమె వారిముందు షడ్రసోపేత భోజనము నుంచునట్లు రుద్రకన్యల నాహ్వానించి పెట్టించినది. పిమ్మట గృహస్తువచ్చి కూర్చున్న తర్వాత వారు భోజనముచేసి లేచిరి. ఇక అన్నపూర్ణ వ్యాసుని కోపించుచున్న శివుని గుర్తెఱింగి, తాను వ్యాసుని పూర్తిగ కరుణించి శివుని ముందునకు పంపినది. ఇట్లు ముందుగ అమ్మవారి చంద్రదృష్టి ప్రసరించిన తర్వాత, శివునకు నమస్కారము చేయుమన్నది. శివుడు కోపముతో మూడవకంటితో చూచినను వ్యాసుడు చెడిపోవలేదు అపుడు శివుడు మరల కోపముతో వ్యాసుని కాలితోతన్ని కాశీనుండి పొమ్మనెను. అమ్మవారును పొమ్మనగా వ్యాసుడు దక్షారామముపోయి, అగస్త్యుల వారిచేతను, సనత్కుమారిచేతను తత్వోపదేశము నొందెను తర్వాత కాశికి వచ్చెను. కాబట్టి మొత్తముమీద అద్వైతులేకాక అందఱు దేవీ ఉపాసకులు. అన్ని తంత్రములకన్నను దేవీతంత్రమే సర్వసిద్ధిప్రదమని సౌందర్యలహరిలో శ్రీశంకరులు చెప్పుచున్నారు.

ఇట్లే రామాయణమున - తతో రావణ నీతాయా స్సీతాయాశ్శత్రుకర్శనః- అని సుందరకాండమును ముని రావణుడు తీసికొని వెళ్ళిన సీత యొక్క అడుగుజాడను పాదచారులు నడువనిదారియందు శత్రుకర్శనుడవు వాయుపుత్రుడు వెదుకనెంచెనని మొదలిడెను. సుందరకాండను తత్త్వదృష్టితో చూచిన వాయువహ్నిరూపమునొంది శరీరమందు తిరుగుటయును యోగముగా తోచుచున్నది. సీత అన నాగటిచాలు ''సీతా లాంగలిపద్ధతిః'' అని నిఘంటువు చెప్పుచున్నది. రావణుడన రవణము పుట్టించువాడు. దశవిధ ధ్యానములతో మూడు వంకలతో సీతవలె నున్న కుండలిని వెంటపోవుసాథకుని వర్ణించినట్లున్నది. శత్రు కర్శనః అన్న విశేషణమున్ను అంతశ్శత్రువుల జయించిన సాధకునకే యదిసాధ్యమని సూచించుచున్నది. ఇట్లే సుందరకాండ మెల్లను యోగమును వ్యక్తీకరించుచున్నదని పెద్దలు చెప్పుదురు. సహస్రారమునకు పైన పీఠికమను చక్రమున నఖండబ్రహ్మ రూపమది శివశ##క్యైక రూప మనిపించుకొనును. సహస్రారమున విశ్వరూపము, భ్రూమధ్యమున అర్థనారీశ్వరస్వరూపము, హృదయమున నీశ్వరాంక స్థితేశ్వరీ రూపము ఉండును. సహస్రారమునకు పై చక్రమునందే మహామాయారూపము.

శ్లో|| సుధాసింధో ర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే

మణిద్వీపే నీపోవవనవతి చిన్తామణిగృహే

శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం

భజన్తి త్వాంధన్యాః కతిచన చిదానన్ధ లహరీం||

అని శంకరులు చెప్పుటగమనింపదగినది. పూర్వము భండాసురుడను రాక్షసుడు దేవతల వేధించుచుండెను. వానికి విశుక్రాసురుడు-అనగా లోకములో నెవ్వరికి వీర్యము లేకుండ జేయువాడు. విషంగుడు అనగా ఒకరొకరిని కలవకుండ చేయువాడు - ఇట్టివార లనేకులు మంత్రులుండిరి. వైకుంఠమున కేగిన నేమియగునో యని విశుక్రుడును, వైకుంఠమును వదలి వచ్చిన నేమగునోయని విష్ణుడును నున్నట్టు లుండిరి. అప్పుడు వాని యంతమునకు విష్ణువు నారదునితో దేవతలను హిమాలయము నందు యజ్ఞము చేయుమని ఆదేశించి పంపెను. వారట్లు బహిర్యాగము చేయుచుండ విష్ణువు ఇద్దఱు సౌందర్యవతులైన స్త్రీలను సృష్టించి వారిని భండాసురుని తోటలో సంగీతము పాడుచుండుమనియు బెట్టుసరితో భండవిశుక్రాసురుల పెండ్లాడుమనిచెప్పి, తాము చెప్పినట్లు భర్తలు వినవలయునని యొప్పందము కుదుర్చుకొనుమనియు బోధించెను. సరేనని వారు నట్లే పెండ్లాడి మొదటనే వారిరువురిని స్త్రీ లిరువురు స్వాధీనము చేసికొనియుండిరి.

ఇట్లు ఐదువందల సంవత్సరములకాలము దేవతలు యజ్ఞముచేయుట జరిగినది. కొంతకాలము పోవ హోమధూమము లోకమంతయు వ్యాపించి భండాసురుని అంతఃపురమున ప్రవేశింపగా వాడు ఇదియేమని యదిరిపడి దేవతలు యజ్ఞము చేయుచున్నారని తెలిసికొని కోపించి యుద్ధమునకు బయలుదేఱను. భార్య వద్దన్నను వినలేదు. వీడు పోవుసరికి యజ్ఞగుండము చుట్టు పెద్ద కంచుకోట బయలుదేఱి, నక్షత్రమండలము వఱకు వ్యాపించియున్నది అంత భండాసురుడు కోపోద్రిక్తుడై దానిని విఱుగదన్నెను. మరల మరియొకటి పుట్టినది. ఇట్లు 189 కోటలు విఱిగిపోయినవి. చాల అలసిపోయి ఇప్పుడింత కష్టమేల? ఈ దేవతలు యజ్ఞము చేసి నామీదికి వచ్చినప్పుడే హింసింపవచ్చును భార్య యెట్లుండెనోయని తిరిగి పోయెను పోగా భార్యలిద్దఱిని చీవాట్లు పెట్టుట జరిగినది. దేవతలు వేయి సంవత్సరములు యజ్ఞముచేయగా అందునుండి బాలాత్రిపురసుందరి ఆవిర్భవించినది. దుర్బలులైనవారిని యజ్ఞకుండమున దూకుమని ఆదేశించినది. కాని ఆమె ఆవిర్భావమువలన అందఱకు తేజస్సువచ్చి ప్రకాశించిరి ఇచ్చట బాల అనగా పరోక్షబ్రహ్మవిద్య. ఆమె అందఱిని తనవెంట తీసికొని చక్రమార్గమున తాను దేవతలను గొనిపోయినది. బ్రహ్మరంధ్రము వఱకు పోయి బాల ఈశ్వరధ్యానము చేయగా ఈశ్వరుడు కనిపించెను. ఆమె అతనిని అంతర్యాగము చేయుమని ఆదేశింపగా ఈశ్వరుడు అంతర్యాగము చేయ మొదలుపెట్టెను. ఆ దేవుడు చిత్తి యను స్రక్కుతో చిత్తాజ్యమును చిదగ్నికుండమున హోమము చేయగా అమనస్కయై నిష్ప్రపంచమైన తఱి ఆరూపశక్తి సరూపయై సగుణయై చిదగ్ని గుండము నుండి లలితాత్రిపురసుందరి యని ఆవిర్భవించినది. అచటనున్న ఆ దేవతలనందఱిని ఆ దేవి ఆ యగ్నిగుండమున వైచినది. అపుడు వారిచిత్తమాలిన్యము పోయినది. అపుడు దేవతలు చిద్భావభావితులు, జ్ఞానబల క్రియాన్వితులైరి. అపుడు దేవతలందఱు దేవిని ప్రార్థించి, ఆమెను నీ యిష్టమైనవాని వివాహము చేసికొనుమని యుభయులను సేవించుకొని మఱియు కృతార్థుల మగుదుమని స్త్రీ స్వాతంత్ర్యము లోకమున విరుద్ధమని ప్రార్థించిరి. దేవియు తన కట్టి స్థితి మంచిదని తోచి కడగంట నీక్షింప పరమేశ్వరుడు కామేశ్వరావతారము వహింప నా దేవి వానిని శాస్త్రోక్తముగా వివాహము చేసికొనెను.

శ్లో|| ధ్యాయేత్కామేశ్వరాంకస్థాం కురువిందమణిప్రభాం |

శోణాంబరప్రగాలేపాం ! స్వర్వాంగీణ విలేపనాం !

సౌందర్య శేవధించేషు చాపపాశాంకుశోజ్వలాం !

స్వభాభిరణి మాద్యాభిస్సేవ్యాం సర్వనియామికాం !

సచ్చిదానంద వపుషం | సదయాపాంగ విభ్రమాం

సర్వలోకైక జననీం స్మేరాస్యాం లలితాంబికాం ||

అని యామె స్వరూపస్థితిని వేల్పులు, మునులు గొనియాడిరి త్వష్టవారికై శ్రీపురము నిర్మించెను. అందు చింతామమణియ గృహమున శివాకారమగు రత్నపర్యంకముపై నున్న కామేశ్వరు నంకమునుండి కామేశ్వరి నానాశక్తిపరివార సహితయై వేల్పులతో కొలువుదీర్చి, దేవకార్యసముద్యత యయ్యెను. ఇక నామె భండాసురుని దగ్గఱకు శివుని దూతగా పంపెను. శివుడు పోయి దేవతలు జన్నముచేసిరి. కామేశ్వరి ఆవిర్భవించినది. ఇక నీకు సురలు, మునులు, అసాధ్యులు. ఆ దేవిని శరణని బ్రదికెదవా? యుద్ధముచేసి చచ్చెదవా! అని చెప్పగా భండాసురుడు ఎగిరిపడెనట. యుద్ధమునకు వచ్చి యెత్తులకు పై యెత్తులువేసి చివరకు విఘ్నయంత్రము ప్రయోగించెను.

ఆ యంత్రము ఎదుటివారిని స్తంభింపచేసినది. అపుడు దేవతలు కామేశ్వరిని ప్రార్థించగా ఆమె భర్తృముఖాలోకనము ఉండి విఘ్నేశ్వరుబుట్టించెను. అతడు విఘ్నయంత్రమును తన్నగా భండాసురుడు రాక్షసులను సృష్టించి వారి ముందుంచెను. మరల దేవతలు కామేశ్వరితో మొరపెట్టుకొనిరి. ఆమె పదిగోరులనుండి పది విష్ణు అవతారములు సృజింపగా వారి నవి చంపినవి. ఇది దేవీ భండాసురుల యుద్ధము. శుక్రాసురుడు అనువాడు యుద్ధమునకు వచ్చెను. కాని వానిని వారాహి అను శక్తి చంపివైచెను మరల రక్త బీజాసురుడు రాగా, దుర్గ వానిని రక్తము క్రిందబడకుండ చంపినది. భండాసురుని కొడుకులు యుద్ధమునకు రాగా, బాలవారిని చంపెదనని లలితాదేవి సెలవుగైకొని తన విక్రమమున వారిని చంపినది. చివరకు భండాసురుడు, వాని కొడుకు శూన్యకుడు మిగిలిరి. అపుడు కామేశ్వరి కామేశ్వరుని వారిపై త్రిప్పికొట్టగా వారు మరణించిరి. ఇక భండాసురుడు అనగా మనకున్న మోహము. శూన్యకాసురుడనగా శూన్యవాదము.

కనుక మోహము, శూన్యము రెండును నశించినవి కావున బహిర్యాగమున, అంతర్యాగమున దేవీ అనుగ్రహము పొందినవారు మోక్షమును పొందగలరు లలిత అపరోక్ష బ్రహ్మవిద్య. బాల పరోక్షబ్రహ్మవిద్య. నానారూప సమిష్టిరూపము దుర్గ కాబట్టి వీరికి భేదములేదు శక్తి సమష్టి రూపమే మహిషాసురుని చంపినది. సహస్రారముపైన శ్రీనగరమున కామేశ్వరి యుండును. బాట హృదయమున నుండును. ఐం - క్లీం - సౌః బీజములు మూడును ఆమెకు ఒక మంత్రముగ ఉపాసన జరుగును. ఉమామహేశ్వరోపనిషత్తు ఉమయే లక్ష్మీ, శివుడే విష్ణువు. ఇట్లే స్త్రీ లెల్లరు శక్తిరూపములు. పురుషులెల్లరు శివులు, కాన ఉమామహేశ్వర రూపులగు స్త్రీ పురుషజాతులనెల్ల నమస్కారమని ముగించినది. స్త్రీపురుషుల వివాహసంగమాదులెల్ల విసదృశములగు శరీరమందలి ఏకాకారమగు బ్రహ్మము నెఱిగికొనుటకు, యోగమందలి పదారవు కళ##నెఱుగుటకు 15 కళల వాత్స్యాయనుడు కామశాస్త్రమున నిరూపించెనని పెద్దలు చెప్పుచున్నారు. స్త్రీ పురుషుల వివాహ మందలి యపూర్వ ఫలము నాలోచించిన శాస్త్రానుసారముగ దాని ననుభవింపవలెను కేవల కామమునకైన శాస్త్ర మక్కరలేదు. పశువులకు, శునకమునకు, వరాహములకు కామసుఖము నేశాస్త్రము చెప్పుచున్నది? అయినచో ఈ మంత్ర తంత్రముల యందు స్త్రీలకధికారమున్నదా లేదా? అను ప్రశ్న మొకటి లోకమును బీడించుచున్నది. వివాహ మంత్రసంస్కారముతో వధూవరు లేక రూపులగుచున్నారు శరీరభేదమున్నను నవకోణాత్మక శ్రీచక్రము ఇరువురి యందు స్ఫురించుచున్నది. కాన పురుషుని బట్టి స్త్రీ యధికారము పురుషుడు సోమయాజి యయినచో స్త్రీ సోమిదమ్మ యగును పురుషు డుపాసకుడైన స్త్రీ యుపాసకురాలగును. కాన పురుషునకు స్త్రీ సాహచర్య మన్నిట నుండదగును అది వదలిన సన్యాసమే - ఇది మరువరాదు.

9

బ్రహ్మములో మాయ స్ఫురించుచున్నది. అదియే పరాశక్తి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాని జీవుడుమాత్రము అల్పజ్ఞుడు జీవుని ఆవరించి యున్న అవిద్యయను బురదను తొలగించినచో - ఆ జీవుడు ఈశ్వరుడగుచున్నాడు. ఈ అవిద్యను తొలగించుటకే విద్యలు, పురాణములు, కర్మలు, ఉపాసనలు, మొదలగునవి యేర్పడినవి. మాయాశక్తి నుండి కామేశ్వరీ కామేశ్వరులు ఆవిర్భవించిరి. వీరే ప్రకృతి - పురుషులు. లోకమునందు వీరి యుపాసనయే పరాకాష్ఠ నొందినది. కాని నిర్గుణోపాసన కూడ ఒకటి యున్నది. శివుని 64 తంత్రముల ఫలము నిచ్చు శాక్తేయము ఉపాస్యము - అందు కామేశ్వరియే ప్రధానయగుచున్నది. దీనికి అధిష్ఠానము కామేశ్వరుడు. కామేశ్వరీ సంకల్పశక్తితో కామేశ్వరు డావిర్భవించెననియు, త్వష్టచే నిర్మాణము చేయబడిన శ్రీనగరమున నామె కామేశ్వరాంకస్థితయై యున్నదనియు ఇదివరకే చెప్పబడినది. ఆ స్థానము బ్రహ్మరంధ్రమునకు పైన నున్నది. శరీరమునకు తొమ్మిది రంధ్రములున్నవి. పదియవది బ్రహ్మరంధ్రము. ఆదారిన బ్రహ్మమీ జీవరూపమున శరీరమున ప్రవేశించుట వలన దానికాపేరు వచ్చినది అది మొదట పలుచగా నుండును దాని నాముదముపెట్టి మెల్లమెల్లగా గట్టిపరచుచున్నారు. అది జీవుని రాజద్వారము. దాని నుండి జీవుడు ఎప్పుడిష్టమైన నప్పుడు పోకుండ ఉపనయన వివాహాదులందు జీలకఱ్ఱ బెల్లము పెట్టి ఆ రంధ్రమును పూడ్చుచున్నారు. ఆయుష్యమునందు నాల్గవవంతు బ్రహ్మచర్యములో వేదాధ్యయనము చేసి ఋషి ఋణము తీర్చుకొనవలయును. ఇంకను నాలవవంతు గృహస్థాశ్రమము స్వీకరించి పితృఋణము, దేవఋణము తీర్చుకొనవలయును. మూడవ నాల్గవవంతు వానప్రస్థమున తపముచేసి, మిగిలిన నాల్గవవంతు సన్యాసాశ్రమమును స్వీకరించవలయును.

మొదట సృష్టికర్తయగు బ్రహ్మ సనకసనందనాదులను మనస్సుతో సృష్టించి, సంతానము కనుమని చెప్పగా వా రెందుకని? ప్రశ్నించిరి. వారికి బ్రహ్మ ముదుసలితనమున పిల్ల లుపయోగించెదరు. తదనంతరము శ్రాద్దాదులు జరిపి పరలోకముల సుఖమును సంపాదించెదరు. మరియు ''పుత్త్రేణ లోకాన్జయతి'' అని శ్రుతి చెప్పుచున్నదనియు చెప్పెను దానికి వారు మాకిదియే ఆత్మ, ఇదియే లోకము, మాకీ ప్రజలతో చేయవలసిన పనిలేదు, గాన నీ సృష్టితో నవసరములేదు - అని బ్రహ్మమయులై యుండిరి. తరువాత ఆస్రష్ట వశిష్టాదుల సృష్టించెను. వారలు నట్లే మాటలాడ బ్రహ్మ కోపించెను. విసుగుకొనెను. అంత వశిష్టాదులు తండ్రిమాట వినెదమనియు, పిల్లలను కన్నందువలన మన ఆత్మస్థితికి భంగము లేదనియు మిగిలినవారిని కలుపుకొని చెప్పగా, బ్రహ్మ ఇది లోకమున అందఱకు బోధచేయుమనెను. ఆ విధముగనే వశిష్ఠుడు చేయుచుండెను. కావుననే ఇప్పటి పురోహితులే వశిష్ఠులని భావింపవలయును. ఇప్పటికిని వశిష్ఠాంశగల యాజ్ఞికుడు వటువునకు బ్రహ్మోపదేశము చేయుచున్నాడు. దానిలో పిల్లలను గని సుప్రజుడ నయ్యెదననియు సుమేధుడ నయ్యెదననియు వటువుచే ననిపించి ప్రతిజ్ఞ చేయించుచున్నాడు. అందులకే వారిచే విస్తళ్ళు కుట్టించుట, గంధము తీయుట మొదలగు పనులు చేయింపరాదు. ఇక స్త్రీకి వివాహము చేయుట ఎనిమిదవయేటనే జరుగవలయును ఆనాడు శిరస్సుపై జీలకఱ్ఱ బెల్లము పెట్టి, తెల్లని వస్త్రములు దీక్షకుగానిచ్చి దర్భత్రాడుచుట్టి బ్రహ్మచారికివలె నుపాసనార్హత్వము సంపాదించుచున్నారు ''ఏతద్వైపత్న్యా వ్రతోపనయనం'' - అని ప్రమాణము చెప్పుచున్నది. గృహస్థధర్మమున భర్త సంపాదించినధనము భార్యకు ఇవ్వవలయును భార్య గృహోపకరణము లన్నియు భర్తసలహాపై అమర్చుచుండవలయును. ఈ కార్యనిర్వహణమున భార్య ఆయవ్యయముల భర్తకు నెఱిగింపవలయును.

పూర్వము ముద్గలు డనువానికి ఇద్దరు భార్యలుండిరి భర్తకు చెప్పియే ఒక భార్య అన్ని పనులు చేయుచుండెను. కాని రెండవయామె జ్ఞానవతి యగుటచే ప్రతిపని భర్తకు చెప్పనక్కర లేదని తలంచెను. ముద్గలుడు బ్రహ్మలోకమునకు పోవుచుండ పెద్దభార్య వెంటనంటిపోయెను. రెండవభార్య వచ్చులోపల తలుపువేసిరి ఈమె నరకమునకు పోయినదట. పతివ్రతను, జ్ఞానవతిని యగు నాకిట్టి స్థితి యేల వచ్చెనని యేడ్చుచుండగా యముడు చూచి మరొకజన్మ నిచ్చి, భర్తకు చెప్పుచు, అన్ని పనులు చేయుచు, ఈ కొలది లోపము నందు తీర్చుకొనుమని చెప్పి పోయెను. ఆమె అట్లే చేసి ఆ జన్మయందు తరించెను - అని ఇతిహాసములందు భార్యా భర్తృధర్మములు అనుశాసింపబడినవి అట్టి స్త్రీ పురుషులు కామేశ్వరీ కామేశ్వరుల నుపాసింప నర్హులు. కామేశ్వరీ కామేశ్వరులు స్త్రీపురుషరూపములో భావించి, పంచప్రేతమంచము మీద నున్నట్లుగా ధ్యానించుట ఒక పద్ధతి. కామేశ్వరీ కామేశ్వరుల అవయవములు వీరి అవయవములందే యున్నట్లు భావించుట మరియొక పద్ధతి - అరుణాదివాగ్ధేవతా స్తోత్రమే మన లలితా సహస్రనామము. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ - అని ప్రారంభింపబడెను. మంగళప్రదమైన శ్రీయనునది శాక్తే యులబీజము. శ్రీ బీజమునకు వాచ్యము లేక లక్ష్యమైన మాతా - తల్లి పెద్దరాణి మామూలు తల్లులు మామూలు రాణులు కారని తెల్పుటకై శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ అని చెప్పబడెనని తెలియవలెను. హన హింసాగత్యోః అను ధాతువు నుండి సింహశబ్దము పుట్టినది. శ్రీమంతమగు సింహాసనమున కధీశ్వరిగాన, శ్రీమత్సింహాసనేశ్వరి యనబడుచున్నది. అంతర్యాగమున చిదగ్నియందు చిత్తాజ్యమును హోమము చేయగా ఆమనస్కదశయందు ఆవిర్భవించుటచే చిదగ్నిసంభూత యనిపేరు.

దేవకార్య సముద్యతా

ఉద్యద్భాను సహస్రాభా

చతుర్బాహు సమన్వితా

రాగస్వరూప పాశాఢ్యా

క్రోధాకారాంకుశోజ్జ్వలా ||

అని ఇంద్రియముల పనులు చేయుటకై దేవకార్యమునకై ఆవిర్భవించినది. ఉదయించు సూర్యునివలె ఎఱ్ఱని శరీరతేజస్సు కలదియు, నాల్గుచేతులు కలదియు నగు దేవి, నాల్గు ఆయుధములు, నాల్గు చేతుల యందు కలదియునగు దేవి అనగా మనస్సును ఇక్షుకోదండ మొకచేత గలది, శబ్దస్పర్శ రూపరస గంధములను తాన్మత్ర లై దుబాణముల నొకచేతధరించినది. రాగమను పాశ మొకచేత ధరించినది. క్రోధమను నంకుశ మొకచేత దాల్చినది విష్ణువు దేవీ ఉపాసన వలన మోహినియై శివుని మోహింపచేసెను.

స్మరోపిత్వాం నత్వారతి నయన తేహ్యేనవపుషా

మునీనామవ్యంతః ప్రభవతిహి మోహా య మహితాం ||

అని శంకరులు ఆగమానుసారము గొనియాడిరి. మన్మధునకు - భక్తునకు దేవి తన బాణకోదండ పాశాంకుశముల నిచ్చి యంతవాని చేసెనని భావించవలయును. నిజారుణ ప్రభాపూరమజ్జ ద్బ్రహ్మాండ కుండలము మునిగి ఎఱ్ఱనగుచున్నదనగా రజోగుణములో నిండియున్నదని భావము. ''అష్టమీచంద్ర విభ్రాజ దలికస్థల శోభితా'' అన అష్టమినాటి చంద్రవంకవంటి ఫాలముకలదియు, ''ముఖచంద్రకలంకాభ మృగనాభి విశేషణ'' యన చంద్ర కళంకమువంటి కస్తూరిబొట్టు గలది, ''వదనస్మర మాంగల్య గృహతోరణచిల్లికా'' యన వదనమను మన్మధుని యింటికి తోరణముల వంటి కనుబొమ్మలు కలదియు నని భావము. ఈ బొట్టనగా ఇడ పింగలి నాడుల మధ్యనున్న సుషుమ్నవంటిది బొట్టు. ఇది వైష్ణవుల బొట్టు. గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములు స్మార్తులును బెట్టెదరు. జలముతోనైన మృత్తికతోనైన నూర్ధ్వపుండ్రములుబెట్టి తర్వాత వానిపై బూడిద పూయుచుందురు. కొందఱు వైష్ణవులు పచ్చనిబొట్టు, మరికొందఱు ఎఱ్ఱనిబొట్టు ధరించుచున్నారు. వానికి వేరువేరు కారణములు గలవు. నాదబిందు కళాస్థానముల సూచించునట్లు మూడు తిర్యక్‌ పుండ్రములు ధరించి, బిందు స్థానమున గంధాక్షత లుంచి, బిందువునకు క్రింది భాగమున త్రికోణస్థానమున కుంకుమ అడ్డముగా బూయుచుందురు. ఇది అమ్మవారి స్థానము. ఇది ప్రాసంగికము, ''వక్త్రలక్ష్మీపఠీవాహచ్చలన్మీనాభ'' - అను శ్లోకమున ముఖముమీద కాంతియొక్క తరంగములుగల చెఱువునుండి వచ్చు పరీవాహములవంటి కన్నులు గలదియు, ఆ కనులగుంటలు అలుగులవంటి వనియు, అందలి మీనములవంటి కనుపాపలు చలించునవి కలదియు, సంపెంగవంటి నాసిక, ముక్కుకు బులాకి, దానికి ముత్యము ఉండునట్లును, అది నక్షత్రకాంతిని తిరస్కరించునట్లును చెప్పబడినది.

పార్వతి యెప్పుడును కమ్మలు, బులాకి తీయకుండుట చేతనే శివునకు చావులేదు, కడిమిచెట్టు పూలగుత్తి యెడమచెవియందు నలంకరించుకొనియుండును. ఇది కర్ణపూరము. స్త్రీకి ఎడమ, పురుషునకు కుడి భాగములు ముఖ్యములు. ఇట్లు స్త్రీపురుషసంయోగమే అర్ధనారీశ్వరత్వము అగుచున్నది. కావున స్త్రీలు ఎప్పుడును ఎడమనుండి అలంకరించుట ప్రారంభించవలయును. దేవి సూర్య చంద్రులు కమ్మలుగా గలది పద్మరాగపు టద్దముల కాంతిని తిరస్కరించు బుగ్గలు కలది. పగడమువంటి దొండపండువంటి పెదవి కలిగి శుద్ధ విద్యాంకురములవంటి పలువరుసగలది. ఆమె కప్పురపుతమ్మ పరిమళము దిగంతముల వ్యాప్తి నొందునది. ఈమె పలుకుముందు సరస్వతి వీణయు పనికిరాదు చిరునవ్వు కాంతిపూరమున మునుగుచున్న కామేశ్వరు మనసు కలది సాటిలేని చిబుకము కలదియామె. ఇక యజ్ఞోపవీత, మంగళసూత్రముల గుఱించి ఆవస్తంబుల వారేమియు చెప్పకుండుటవలన అవి అక్కరలేదని కొందఱనుచున్నారు. అనుక్తం అన్యతో గ్రాహ్యం - అన్నట్లు బోధాయన సూత్రమునుబట్టి యజ్ఞోపవీత మంగళసూత్రధారణ చేయవలయును. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రము కలది. రత్నకంఠాభరణము కలది. చింతామణి పతకముగల ముత్తెముల హారముల దాల్చినది. ఆమె స్తనములు కామేశ్వరస్వామి ప్రేమరత్నములచే గొనదగినవి. పాదువలెనున్న బొడ్డునుండి తీగవంటి నూగారు బయలుదేఱును. ఆ తీగకు ఫలించిన ఫలములే ఆస్తనము లగుచున్నవి. ఆసూరుని కాంతిని తిరస్కరించు కౌశుంభవస్త్రధారిణి యగుచున్నది. కామేశ్వరునిచేతనే తెలియబడిన తొడలమార్ధవము గలది. పిక్కలు మన్మధబాణముల సంచులవంటివి. శీలమండలు కనబడనిది. ఏలన శీలమండలు కనబడుట దరిద్రహేతువు. తాబేటి బొచ్చెలవంటి పాదములు, తమోగుణముమ హరించు ఎఱ్ఱనికాంతిగల గోళ్ళుకలది. మ్రోగుచున్న కాలియందెలు కలది. మరాళములవంటి మందగమనము కలది. లావణ్యమునకు నిక్షేపమగు మేను కలదియునగు స్త్రీరూపము కామేశ్వరి. కావున సాముద్రిక శాస్త్రానుసారమైన లక్షణముగల స్త్రీ సమస్తాభరణ భూషితయై, శివుడైన కామేశ్వరుని తొడపై నుండునది. స్వాధీన వల్లభా=స్వాధీనపతిక, - సుమేరుశృంగమధ్యస్థా - మేరువుమధ్య శృంగమున నుండునది, సృష్టికర్త్రీ - బ్రహ్మరూపా - బ్రహ్మరూపమున నుండి జగత్సృష్టి చేయునది. గోస్త్రీ గోవిందరూపిణీ - గోవిందరూపమున పరిపాలనము చేయునది. సంహారిణీ రుద్రరూపా - రుద్రరూపమున సంహారము చేయునది. తిరోధానకరీ ఈశ్వరీ - తురీయమవు ఈశ్వర రూపమున సంహృతజీవుల తిరోధానముచేసి దాచిపెట్టునది, సదాశివా అనుగ్రహదా - సదాశివరూపమున ననుగ్రహించునది. పంచక్భత్య పరాయణా - ఈ ఐదురూపములతో నై దుపనులు చేయునది. శ్రీశివా, శివశ##క్త్యైక్యరూపిణీ - లలితాంబికా అను నామమువరకు సహస్రనామములు వాణీశ్వరుల ముఖముల నుండి దేవియే వెలువరించినది. త్రిశతీ నామములు కామేశ్వరీ కామేశ్వరులు స్వయముగా వెలువరించిరనియు కలదు. ఈ శాక్తతంత్రముల కెల్ల సారాంశమద్వైతమే! అద్వైతము శాక్తము కలసియే యున్నవి -

అస్యాం మునీనామపి మోహ మోహో

భృగుర్యదాస్వా స్తన శైలశీలీ

నానారదాహ్లాదముఖం శ్రీతో రు

ర్వ్యాసో మహాభారత సర్గకర్తా ||

శ్రీ హర్ష నైషధమునందు దమయంతి=విద్యాశక్తి యగుచున్నది. నలుడు బ్రహ్మమూర్తి యగుచున్నాడు. దమయతీతి దమయంతీ అని అన్నింటిని అణగద్రొక్కునది విద్య. ఈ విద్యాశక్తివిషయమై మునులకును మోహమే. అనగా పూర్తిగా తెలియదని భావము. భృగువు ఈమె స్తనశైలములను విడువక అభ్యసించువాడు. అనగా మధ్యఖండోపాసనలతో ఐశ్వర్యము సంపాదించినవాడు తక్కిన రెండు ఖండములయందంత విజ్ఞాని కాడు. గాన మోహము. నారదుడు ముఖోపాసనము వలన నాహ్లాదము కలవాడు. వాగ్భవఖండములను మాత్రమే యుపాసించినవాడు. వ్యాసుడు తా విద్యాశక్తి ఊరువుల నాశ్రయించి మోక్షద మవు శక్తి ఖండము నుపాసించినవాడు. ఇట్లే ఎవ్వరును పూర్తిగా నీ విద్య నెఱుగరు మోక్షవిద్యయగు శక్తిని వ్యాసుడు త్రికూటోపాసనచే తరించెను. ఇట్లు కవులు వాక్యాతిశాయి వ్యంగమున తమ భావముల వెల్లడింతురు. దేవుడు సర్వవ్యాపియై యున్నాడు. వానిని ఎవ్వరును జూచి చెప్పజాలరు. శివోపాసన చేసినవాడే శక్తిని ఉపాసించగలడు. ఈ శక్తి ఉపాసనచే శివానుగ్రహమునొంది తరువాత మోక్షము నొందును. కనుక ఈశ్వరానుగ్రహముతో మోక్షము లోకమున సంభవించును. జ్ఞాన స్వాతంత్య్రము వలన జీవన్ముక్తి లభించును. కావున - పుంలింగం సర్వ మీశానాం స్త్రీలింగం చాపి విద్దిమామ్‌ - అన్నట్లు శివుడు శక్తియే సర్వలోకము కనుక లోకమున స్త్రీపురుషుల నెల్ల శక్తి శివులనుగా భావింపవలెను.

10

కడచిన ప్రకరణములో దేవీతత్త్వమును గూర్చి తోచినంత చెప్పబడినది. ఈ దేవీ స్వరూపమున శంకరులు తురీయమైన శక్తి - అని కొనియాడిరి. త్రిమూర్తులలో హెచ్చుతగ్గులు లేవనియు, కాని సూతసంహిత మాత్రము శివుని గొప్పతనమును చాటుచున్నదనియు, అందరికన్నను శివుడు ఎక్కువకాలము బ్రహ్మమయుడుగ నుండుటవలన నట్లు చెప్పవలసినదనియు నందుగలదు. శివుడు శక్తిని తొడపై నుంచుకొని తత్త్వోపదేశము చేయుచుండుననియు చెప్పియుంటిమి. పనులేమియు లేక బ్రహ్మ మనుభావముతోనుండి అదియే బయటికి చెప్పుచుండును. సగుణ బ్రహ్మకు ననగా శివస్వరూపమున పార్వతిగను, విష్ణురూపమున లక్ష్మిగను, బ్రహ్మ రూపమున సరస్వతిగను, ఇంద్రరూపమున శచిగను వ్యవహరించుచున్నది. స్త్రీ పతివ్రత యగుచో పురుషుని అన్ని జన్మలయందును వెన్నంటివచ్చును. భార్యభర్తలకుమాత్రమే శరీరైక్యమున్నది కాని పరస్త్రీలను తల్లులవలెను పురుషులను తండ్రులవలెను జూడవలయును. ప్రాసంగికము. ఆకృశంకుచయో, - అన్న శ్లోక మిదివఱకే చెప్పబడినది. అందలి భావమేమన - బ్రహ్మరంధ్రమున నున్న తత్త్వమే కుచములయందు నకృశము, నడుమున కృశము, చక్షుస్థానమున విపులము, నితంబమున విస్తృతము, నధరమున నరుణమునై క్రిందకు వ్యాపించినది ఒక్క తేజమే ఆయాయిభాగముల విభాగమునొంది ప్రకాశించుచున్నది అదియే శక్తి. అది నా హృదయమున నావిర్భవించుగాక అని ధ్యానించెను. కపాలమునందలి పూర్ణరూపమే ఆయా భాగములయందు భాగరూపముల నొందినదని కవిభావము ఇది -

ఊర్థ్వమూల మథశ్శాఖమ్‌ |

అశ్వత్థతం ప్రాహురవ్యయమ్‌- |

ఛన్దాంసి యస్యపర్ణాని

యస్తం వేద న వేదవిత్‌ ||

అని గీతలో చెప్పబడినది. గణాధిపతికి ఈ పేరు ఏల వచ్చినది? అనగా నాడు లన్నింటిలో 101 వ నాడి బ్రహ్మరంధ్రములోనికి పోవుచున్నది. రైలు ఇంజనులోని తీగల వలె నాడులన్నియు శరీరమంతట వ్యాపించి మూలాధారమున కేంద్రీకృతమై యుండును. ఇవన్నియు విఘ్నరాజు చేతిలో నుండి బ్రహ్మరంధ్రముదాక వ్యాపించుచున్నవి. కాబట్టి పుష్టీశక్తీసమేతుడైన గణపతిని పూజించవలెను. ''ఆదౌ పూజ్యో గణాధిపః - అని అందుకనియే చెప్పిరి. పార్వతీపరమేశ్వరుల వివాహమునకు ముందు కూడ గణాధిపతి పూజ యున్నటుల బ్రహ్మపురాణమున గలదు. ఇచట మనకు ఒక సందేహము కలుగుచున్నది.

విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గదా? ఇతనికి పూజ వారి వివాహసమయమున నెట్లు కలిగినది? అని సంశయము. కాని ఈ గణపతిని భండాసురుని విఘ్నయంత్రనాశనమునకు కామేశ్వరి సృష్టించినదని చెప్పబడినది. మరియు శరీరనిర్మాణ మైనపుడే గణాధిపతి సృష్టి జరగినదని తెలిసికొనవలయును. గాని పార్వతి నలుగుపిండి బొమ్మతో కాదు. కాబట్టి మనలో పుష్టిశక్తితో గణపతిలేకున్న ఏ పనులును సాగవు. కనుక ఇది చాల ప్రధానమని భావించవలయును. షట్చక్రాధారభూతమైన బ్రహ్మతేజము కాలమునుబట్టి అప్పుడాయా అవతారముల తాల్చుచున్నది.

అనంతావై వేదాః - అన్నట్లు వేదములు అనంతము లగుచున్నవి. భరద్వాజుడు అను ఋషి మూడువందల సంవత్సరములు తన ఆయుర్ధాయమున వేదాభ్యాసము చేసెనట. కాని పూర్తికాకుండుటచే తపస్సుచేసి మరియొక మూడువందల సంత్సరములు ఆయుర్ధాయము కోరి వేదాభ్యాసము సాగించెనట. అంతకు కాకుండుటవలన మరల పైవిధముగ బ్రహ్మను ప్రార్థించెనట. అంత బ్రహ్మ వానిని పిలిచి బ్రహ్మలోకమునకు కొనిపోయి మూడు మహాపర్వతముల జూపి వానిని వేదము లనెనట. అపుడు భరద్వాజుడు ఆ పర్వతములచుట్టు తిరిగి నమస్కరించెను. అంత బ్రహ్మ ఆ మూడు పర్వతములనుండి మూడు పిడికిళ్ళు తీసి వానికి ప్రసాదించెనట. ఇవియే మనకున్న మూడు వేదములని చెప్పబడుచున్నది. కాన వేదాభ్యాసము పూర్తి యగుట చాలకష్టమైన కార్యమని తోచుచున్నది. అదియు గురుభక్తితోడనె విద్యలు ప్రాప్తించునుగాని చదివి వల్లించుటవలన వచ్చునవి కావు ఇప్పటి విద్యావిధానము వేరు. అప్పటిది వేరు.

ముగ్గురు బాలురు ఒక ఋషి దగ్గరకు విద్యాభ్యాసమునకై పోయిరి. గురువుకు శుశ్రూష చేయుచు విద్యాభ్యాసము చేయసాగిరి. విద్యాభ్యాసమనునది - గురు శుశ్రూషచేతగాని, అత్యంత ధనముచేతగాని, లేక విద్యనిచ్చి విద్య గొనుటవలన గాని లభించును. బ్రాహ్మణ నియమము తప్పకుండ ఆ శిష్యులు శుశ్రూషచేయుచుండగ ఒకనాడు గురువుభార్య-శిష్యుల గూర్చి భర్తకు హెచ్చరికచేసినది. వారి విద్యాభ్యాసము గూర్చి యామె హెచ్చరించిన దన్నమాట. కాని గురువుమాత్రము ఏమియు పట్టనట్టు మిన్నకుండెను. మరియు వారిశుశ్రూష భార్యను మనసునకెక్కినదా? యని ప్రశ్నించెనట. అంత ఒకరోజు ఒక శిష్యునిపిలిచి నీవార ధాన్యపుపైరు చెఱువు గండిపడి యా నీట మునుగుచున్నది. కాన ప్రవాహము నిల్చుటకు కట్టవేసిరమ్మని ఆజ్ఞాపించెను అంత శిష్యుడు బయలుదేఱి ప్రవాహము ఆపుటకు ఎంతయో ప్రయత్నము చేసెను. కాని ప్రవాహము ఆగలేదు. ఇక చేయునదిలేక తానె ఆ ప్రవాహమునకు అడ్డుకట్టగా అడ్డము పండుకొనెను. అంత జలదేవత అతని గురుభక్తికి మెచ్చి ఆగిపోయినది. ఆ శిష్యుడు ఎంతకు రాకయుండుటజూచి గురువుభార్య హెచ్చరించగా, గురువు అందఱను వెంటనిడికొని కొంతదూరముందుండి శిష్యుని కేకవేయగా - శిష్యుడు గురువుకు అచ్చటినుండియే నమస్కారమని పల్కెను. మరియు జరిగినది చెప్పగా గురువు సంతసించి వాని గురుభక్తికి మెచ్చి లేచిరమ్మని పిలిచి, వరము కోరుకొనుమనెను. వెంటనే యాతడు జ్ఞానము ప్రసాదించుమని కోరెను. అట్లేయని గురువు పల్కగనె అన్ని విద్యలు అతని హృదయమున ప్రకాశించినవి. అతడు సంతసించి వెళ్ళిపోయెను. ఇచట ముఖ్యముగ గ్రహింపదగినది యేమన దేవీ అనుగ్రహముతో (గురువుభార్య ప్రేరణవలన) ఈశ్వరునంతవాడగు గురుని యనుగ్రహమున శిష్యులకు తనలో నున్న విద్యలు ప్రకాశించినవి.

ఇక రెండవ శిష్యుడు కూడ ఇట్లే గురువుచే పరీక్షింపబడెను. ఈ శిష్యుడు ప్రతిదినము మాధుకరము తెచ్చి గురువు కర్పించుచుండెను. గురువు మాత్రము భోజనము చేసి శిష్యుని సంగతి పట్టించుకొనెడివాడు కాదు. శిష్యుడు ఆకలితో అలమటించి పోవుచుండెడివాడు. ఇతడు పశువులను మేపుటకు అరణ్యమునకు పోయి, అచట ఆకలికి బ్రతుకలేక ఆవుపాలను త్రాగి ఇంటికి వచ్చెను. గురువు శిష్యుని వాలకము విప్పారి యుండుట గమనించి అడుగ నాతడు చేసినపని చెప్పెను వెంటనే గురువు తన యాజ్ఞ లేకట్లు చేసినందుకు కోపించెను. మరునాడును శిష్యుడు ఆకలి భరింపజాలక దూడనోటినుండి వచ్చు నురగను ఆస్వాదించెను. ఇందులకు సైతము గురువు కోపించెను. ఆ మరుసటిరోజు ఆవులన్నియు వచ్చినవి కాని తాను మాత్రము ఇంటికి రాలేదు. గురువు వానిని వెదకికొనుచు రాగ, పాడుబడిన బావిలోనుండి శిష్యుని కంఠస్వరము వినిపించినది. కారణమేమని అడుగ నాతడు ఆకలికి భరింపజాలక జిల్లేడు ఆకులు తింటిననియు, తన్మూలమున కన్నులు కనబడకుండ పోవుటచే బావిలో పడితిననియు చెప్పెను అప్పుడు గురువు అశ్వనీదేవతల నుపాసింపుమని చెప్పి వానికి దృష్టి తెప్పించెను. ఈ శిష్యుడు మొత్తముమీద అన్నము తినకుండ గురువు నుపాసించుట ఇందుగలదు. గురువు పెట్టిన పరీక్షకాగినందున గురువు వానికి సర్వవిద్యలు ప్రకాశించునట్లు చేసెను. ఇట్లీ కధలన్నియు గుర్వనుగ్రహమున్ననే సర్వవిద్యల జ్ఞానము కలుగుననుటకు చెప్పబడుచున్నవి.

మండన మిశ్రులు హుంఫట్‌, హుంఫట్‌ అను మాటలకు అర్థము లేనట్లు, ఉపనిషత్తులనుగూడ కర్తకర్మను గొనియాడుట కన్న నర్థము లేదని పేర్కొనిరి. కాని ఈ వాదమును శంకరులు ఖండించిరి. వారు పై శబ్దముల కర్థము లేదనరాదనియు, ఏదియో అర్థముండుటవలననే దయ్యములు పారిపోవుచున్నవనియు సమాధానించిరి. మంత్రములకు నలుపు, తెలుపు, ఎఱుపు మొదలగు రంగులు కూడ కలవని మనవారు నిర్దేశించిరి. నేడీ మంత్రములపై నమ్మకము లేకుండుటవలన మనము తలచిన పనులు కూడ అగుటలేదు. రాను రాను మంత్ర సంప్రదాయము కూడ తెలియకుండ పోవుచున్నది. మానవులు పుట్టునప్పుడు అందఱు ఒక్కటిగనె యుందురు. కాని వారివారి కర్మల ననుసరించి వారిలో నుత్తమత్త్వము ఏర్పడుచున్నది. ఈ భావమునే -

జన్మనా జాయతే శూద్రః

కర్మణా జాయతే ద్విజః

వేదాభ్యాసేన విప్రోసౌ

బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణః ||

అని చెప్పుచున్నది. కనుక విద్యాజ్ఞానముకావలయునన్నచో గుర్వను గ్రహము కావలయును. శ్రీకృష్ణుడు చిన్నతనమందే శత్రుసంహారకుడయ్యు, జారుడయ్యు కంస వధానంతరము చదువుకై సాందీపని వద్ద విద్య లభ్యసించెను. సర్వమెఱింగిన పరమాత్మ గురువుదగ్గఱ చేరవలయునా? అనిన ఇది సంప్రదాయమని చెప్పుటకే యని తెలియవలెను. అంతియ కాని ఆ పరమాత్మకు తెలియని విషయము లోకమున లేదు.

పూర్వము యవక్రీతు డనువాడు గురువుదగ్గర చదువకుండ విద్యరావలయునని తపస్సు చేసెను వానికి ఇంద్రుడు ప్రత్యక్షమై, ఇది సంప్రదాయ విరుద్ధముగా నున్నదని చివాట్లు పెట్టెను. కాని వాడు మానక తపస్సు చేయుచునే యుండెను. చేయునదిలేక ఇంద్రుడు అట్లే పొమ్మని వరమిచ్చెను. ఇక యవక్రీతుని తండ్రి కుమారునకు గర్వము పెరిగి పోవునని భావించి వినయము నేర్చుకొనుమని బోధించెను. మరియు వారి ఆశ్రమమునకు సమీపమందున్న పరావసు, విశ్వావసు అను మునులజోలికి మాత్రము ఎట్టి పరిస్థితేల యందైన పోవద్ధని, రైభ్యుని ఆశ్రమమునకే అసలు పోవద్ధని కట్టడిచేసెను. కాని యవక్రీతుడు మాత్రము వాని కోడలిని చూచి మోహించెను. ఈమె మామగారు రైభ్యుడు అభిచారిక హోమము గావించి కృత్యను బుట్టించి వానిపైకి పంపెను. అది పోయి యవక్రీతుని చంపివేసినది. వానివద్ద జలపాత్ర యున్న నేమియు చేయజాలనని కృత్య వాని జలకమండలమును కాలితో తన్నెను. తర్వాత వానిని చంపెను. ఆ యవక్రీతుని తండ్రి భరద్వాజుడు దుఃఖించుచుండెను. ఇట్లుండ రైభ్యుని కొడుకులు విశ్వావసు, పరావసు లొకరాజు యజ్ఞము చేయించుచుండిరి చాలకాలమునకు తండ్రిని, యిల్లు, చూచిరావలయునని పరావసువు బయలుదేఱను. ఇతడు రాత్రివేళ ఒక అడవినబడి యింటి కేగుచుండెను. ఆ రాత్రియే తండ్రియగు రైభ్యుడును కొడుకుల జూచి రావలయునని యా దారినే పోవుచుండెను ఇద్దరు మార్గమధ్యమున చీకటిలో కలియగా తెలిసికొనలేక కుమారుడు తండ్రిని దొంగయని భావించి చంపెను. తర్వాత తమ్మునియొద్దకు బోయి తాను చేసిన పితృహత్యను తమ్మునితో జెప్పి తనకు బదులు వానిని తత్ప్రాయశ్చిత్తము నడుపుమని పంపెను. ఆ తమ్ముడట్లే పోయి పన్నెండేళ్ళు చేయవలసిన ప్రాయశ్చిత్తమును పన్నెండురోజులలో తీవ్రనియమమున పాపుకొని వచ్చెను. ఇక అన్నగారు ఇదే సమయమని భావించి రాజుగారితో తమ్ముడు వచ్చినచో యజ్ఞము నాశనమగునని యెక్కులు చెప్పెను. తమ్ముడు రాజువద్దకువచ్చి తండ్రిని చంపినది తానుకాదనియు, అన్నగారు చంపిరనియు, వాని పాపమునకు తాను ప్రాయశ్చిత్తము నాచరించితిననియు చెప్పెను. ఎంత చెప్పినను రాజు వినక వానిని వెడలగొట్టెను. ఇక అన్నగారు యజ్ఞమును జేయించి రాజువలన అనేక భూరిదక్షిణలు గైకొని పోవు చుండెను. మార్గమధ్యమున తమ్ముడు అన్నను జూచి జరిగినదానికి చింతిల్లుచుండగా, అన్నవానిని పాడు బావిలో పడద్రోసిపోయెను. కానీ అతడు పాడుబావిలో నుండి మానసిక యజ్ఞము చేయ సరస్వతి నది యుద్భవించి వానిని పైకితెచ్చి యుంచెను. ఈతని గొప్పతనమునకు ఇంద్రాదులందరు వరము లీయగా నితడు వారిని మూడు వరములు కోరెను. మొదట యవక్రీతుని బ్రతికించుట, రెండవది తండ్రిని బ్రతికించుట, మూడవది అన్నగారి పాపములు పరిహృతములగుట, కోరగా దేవతలాతని మంచితనమునకు ఆశ్చర్యపడి వరములిచ్చుటయే గాక, అక్షయధనము నిచ్చియు పోయిరి. కాబట్టి గురుశుశ్రూష లేని విద్య గర్వకారణము కాగలదని తెలియవలెను. యవక్రీతుని గర్వము ఇంతపనిచేసినదికదా! గర్వకారణమైన విద్య దుష్ఫలితమే ఇవ్వగలది. తన కపకారి యగు యవక్రీతుని తన తండ్రిని బ్రతికింపకోరుటయేగాక ధనాశతో తన్ను బావిలో త్రోసిన అన్నకు పాపము లేకుండ చూచెను.

ఈ కథలో విశ్వానసుని ఎవ్వరైన గొనియాడవలెను. ''గురువులేని విద్య కూడదెవ్వరికైన'' - అని పెద్దలు చెప్పిరి. ఈ విషయమునే శ్రీనాధుడు - శాస్త్ర మాచార్య సన్నిధిcజదువడేని - అను పద్యమున విశదీకరించెను. సకల జీవులకు మనోమయకోశము, వేదశాస్త్రాది విద్యలున్న ననియు నవి గురు ప్రబోధము వలన భాసించుననియు సంప్రదాయము. అట్టి సంప్రదాయమునకు మూలము - వ్యాసభట్టారకుడు వేదములనే కాండమున కాకాండము విభాగము చేయుట వలన నాపేరాయనకు వచ్చినది. ఇతడు ద్వాపరమున నవతరించెగదా? అదివరకీ విద్యా విభాగము లేదాయని ప్రశ్నింపరాదు. సృష్టికి ప్రారంభమందు విష్ణుదేవుడు తనయందలి సగభాగముతో నొక పురుషుని సృష్టించి, వానిచే వేదవిభాగము చేయించి వేదవ్యాసుడని, అపాంతరతముడని వానికి పేర్లు పెట్టెను. అపాంతరతముడనగా హృదయ తమస్సును పోగొట్టువాడని యర్థము. వ్యాసుడు తన పనికాగనె విష్ణువు నందు లీనమగుదునని యనగా విష్ణువు ద్వాపరమున కృష్ణద్వైపాయనుడవై పుట్టుమనెను. వ్యాసుడు పురాణముల నన్నింటిని మనోమయ కోశము నుండి వెల్వరించెను. కాని వ్రాయుటకాదని తెలియవలెను. ద్వాపరయుగమున వ్యాసుడు ఇతిహాసపురాణములు వెల్వరింపగా తత్పూర్వమవి లేవను వారికి పై సమాధానము చెప్పవలసియున్నది. మనోమయ కోశమునకు యజుర్వేదము శిరస్సని ఋగ్వేదము కుడిరెక్కయని సామవేదము ఎడమ రెక్కయని ఆదేశము పురాణము మాంసపిండమని బ్రహ్మ పుచ్ఛమని పక్షిరూపముగ రూపుంచి వేదమే చెప్పుచున్నది. ఇతిహాస పురాణాదులన్నియు వేదములతోబాటు మనోమయకోశముననున్నవే కాని క్రొత్తగా పుట్టినవికావు. ఉన్నవానినే ప్రకాశింపచేయువారు వ్యాసాదులగు మౌనివరేణ్యులు. అట్టి మహాత్ములకెల్ల నిత్యము ప్రణతులమై యుండి తదనుగ్రహముతో మనము విద్వాంసులము కావలయును.

11

సగుణ బ్రహ్మమునుండి ఇచ్చామాత్రముతో శరీరమును ధరించి త్రిమూర్తులు శివ, బ్రహ్మ, కేశవులు వచ్చుచున్నారు. దేవతలు మానవుల కంటె గుణగరిష్టులై జ్ఞానులై సత్వగుణ ప్రధానులగుచున్నారు. మానవులు వారి వారి మనస్తత్వములను బట్టి ఆయా దేవతలను పూజించుదురు. శాబర ఆగమ వైదికాది మంత్రములెన్నియో గలవు. ఆయా మంత్రములచే నాయాదేవతలను ఆరాధించి యిష్టసిద్ధిని బడయవచ్చును. మంత్ర స్రష్ట స్వతంత్రుడై యుండును. వర్ణమాతృకోపాసన చేయువానికి మాటలన్నియు మంత్రములై వెలయును. రామాయణమునందలి ఇంద్రజిత్తునకు మంత్ర నిర్మాణశక్తి యున్నదని తెలియుచున్నది. కాబట్టియే ఆతడుమంత్ర సమ్మేళన శక్తిచే అస్త్రనిర్మాణముగావించి రౌద్ర, బ్రహ్మ, నాగాస్త్రములను మేళవించి ప్రయోగించినట్లు తెలియుచున్నది.

ఆగమ శాస్త్రముననుసరించి శివ, విష్ణువులకు గుళ్ళుగలవు. కాని బ్రహ్మకు మాత్రము ఆలయము లేదు. అందులకు కారణముగా స్కాందపురాణమున నొక కథ కలదు. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులకు కలహము వచ్చినది. వారి మధ్య శివుడు లింగరూపమున తుదిమొదలు తెలియకుండునట్లు ఆవిర్భవించెను. అపుడు శివుడు వారిద్దరిని పిలిచి తన పాదముగాని, తలగాని ఎవరైనను ముందు తెలిసికొనిరమ్మనెను. ఈ కార్యక్రమము నందు హంస వాహనమెక్కి బ్రహ్మ ఊర్థ్వభాగమున తల కనుగొనుటకు పోయెను. విష్ణువు పాదములు కనుగొన వరాహరూపమున భూమిత్రొవ్వుచు క్రిందకు బోయెను. కాని విష్ణువు మాత్రము వెదకి వెదకి వేసారి శివుని పాదములు తెలియక తిరిగివచ్చి శివుని తమ పాదములు తెలిసికొనలేక పోయితినని చెప్పుకొనెను. ఇట్లే బ్రహ్మకు కూడ శివుని శిరస్సు అగపడలేదు. అపుడు బ్రహ్మ అటు ఇటు చూడగ ఒక ఆవు కన్పించినది బ్రహ్మ ఆ ఆవును చూచి శివునితల నేను చూచివచ్చితినని సాక్ష్యము చెప్పుమని అడిగెను. ఇంతలో శివుని శిరస్సునుండి జారివచ్చిన మొగలిరేకును పట్టుకొని బ్రహ్మ దానిని కూడ శివునితల చూచెనని చెప్పుమని అడిగెను. వారిద్దరు తాను శివుని తల చూచినట్లు సాక్ష్యము చెప్ప నొప్పించుకొని శివుని దగ్గఱకు వెంటనిడుకొని పోయెను. అపుడు శివుడు వారిని సాక్ష్యమడుగుచుండగా ఆవు బ్రహ్మ శివుని చూచినన్నట్లు తల ఆడించెను. కాని చూడలేదన్నట్లు మరల తోకనాడించెను. అపుడే శివుడు ఆవు అసత్యమాడుచున్నదని గ్రహించి - ఆవు ముఖము అసత్యమాడుటవలన ఉదయమె చూడరాదనియు, తోక సత్యము చెప్పుటవలన నది చూచినవారలకు పున్నెమబ్బుననియు చెప్పెను. ఇట్లే మొగలిరేకునుగూడ తన పూజకు పనికిరాకుండునట్లు శపించెను. ఇట్లే బ్రహ్మ సైతము శివుని చూడలేకయు చూచినట్లు అసత్యముపల్కెను కాబట్టి వానికిగుడియు, పూజయు లేకుండునట్లు శపించెను.

సూత సంహిత సత్త్వగుణ ప్రధాన దేవతలు పూజించుట యుక్తమని బోధించుచున్నది. శివకేశవులకు మాత్రము పూజ శాస్త్రాచారముల యందు నిర్ణయింపబడినది శివుడు తెల్లని రూపముగలవాడు. సత్త్వగుణసంపన్నుడు కాని అతడు లయకారుడు కాబట్టి తమోగుణ వ్యవహారము గలవాడగుచున్నాడు. విష్ణువునల్లనిరూపముగలవాడు. కాబట్టి తమోగుణ ప్రధానుడు కాని ఇతడు పాలనకర్త యగుటచే సత్త్వగుణమున వ్యవహారము కలవాడగుచున్నాడు బ్రహ్మ ఎఱ్ఱనిశరీరము కలవాడు కాబట్టి రజోగుణ ప్రధానుడగుచున్నాడు. సృష్టి రజోగుణ ప్రధానమగుట బ్రహ్మకు సత్త్వ సంబంధము లేమి లేకుండ పోయినదని తెలిసికొన వలెను ఈ విషయము సూతసంహిత నొక్కి వక్కాణించుచున్నది.

దేవతలకు చేయు పూజను మూడు విధములుగ చేయవచ్చును. దేవతను విగ్రహరూపముగ ఆరాధించుట - కాయికము, ఒక మార్గము. లేక మంత్రోచ్ఛారణముతో నమస్కరించుట వాచికము మరియొక మార్గము. లేక మనస్సునందే ధ్యానించుట మానసికము మరియొక మార్గము, పూజాది కలాపమునందును, ధ్యానాది సమాధిస్థితియందు నున్నవారికి ఇతరులు నమస్కరింపరాదు. ఏలన, నమస్కారమునకు ప్రత్యభివాదనము చేయవలసియున్నది అట్లు చేసినచో వారి ధ్యానాదులకు విఘ్నము వాటిల్లచేసిన వారగుదురు. ఎవరైనను నమస్కారముచేయునపుడు కుడిచెవి మూసికొని' ప్రవరచెప్పి - కులగోత్రాదుల నెఱింగించి నమస్కరింపవలసి యున్నది. అదియు తనకంటె గొప్పవాడైన శుచియగువానికి తానును శుచియైచేయుట శ్రేయస్కరము. ఇంటికి అతిథివచ్చినపుడు భోజనసమయమున మొదట యజమానునకు హస్తోదకము వేయవలెను తర్వాతనే అతిధికి వేయవలయును. కాని అతిథి స్వీకరించిన పిమ్మటనే యజమానుడు ఆ జలమును పుచ్చుకొనవలసియుండుట గమనింపవలయును. భర్త అనుజ్ఞపై భార్య అతిథిసేవ చేయవలసియున్నది. కేశవనామములు చెప్పునపుడు పుచ్చుకొను ఉదకము (మూడుసార్లు) ఒకదాని పిమ్మట మరియొకటి కలవకుండ పుచ్చుకొనవలయునే గాని, వెంట వెంటనే మూడు నేకమగునట్లు తీసికొనరాదు. అట్లే ప్రాణాహుతులు వేసికొనునపుడు విడివిడిగా స్వీకరించుట యుక్తము 5-3 ఒకటైన ఆబ్రాహ్మణుడు అని తెనాలి రామకృష్ణుడు ఆక్షేపించినాడు. స్త్రీ వాసస్సుతో సత్కర్మలేవియు చేయరాదు. ఆ వస్త్ర మాచమనమునకు పనికిరాదు. స్త్రీ వాసస్సు అనగా స్త్రీ కొఱకు కట్టిన వస్త్రము. అది ఉదికినను అందులకుదప్ప మఱి ఎందులకు నుపయోగింపదు. పై చెప్పిన విషయము లన్నియు ఆచారకాండకు సంబంధించినవి. ఇట్టి వనేకములు గలవు.

ఆచారహీనుడైన వాని వేదములుకూడ బాగుచేయచాలవు పితృదేవతలు దేవతల కుమారులుగ గ్రహింపవలసి యున్నది. ఒకప్పుడు పదేతలు బ్రహ్మనుతత్త్వము చెప్పుమనిరి. అపుడు బ్రహ్మ వారి కుమారుల నడిగి తెలిసికొమ్మనెనట. వారలట్లు పుత్రుల తత్త్వమడుగ వారు తండ్రులను బిడ్డలారా! అని సంబోధించిరట దానివలన వారలు పితృదేవతలైరి. పితృదేవతలు మూర్తులు, అమూర్తులు నని రెండు విధము లగుచున్నారు

''సోమః పితృమాన్‌ యయోంగిరస్వా నగ్ని ష్వా

త్తోగ్నిః కవ్యవాహన ఇత్యాదయో యేపితరః'' -

అని తర్పణ మొనర్చుచున్నారు. ఈ ఏడింటిలో మూడు మూర్తకులములు, నాలుగు అమూర్తకులములున్నవి. కాన ఈ ఏడుగురు దేవతలకు దేవతలగుచున్నారు. వీరు పితృలోక ప్రధానులు. వీరుకాక మనవంశమున పోయినవారు స్వపితరులు అనబడుచున్నారు. అమూర్తులకు, సూక్ష్మశరీరము మాత్రము కలదు. మూర్తులకు స్థూలశరీరము కూడ నుండును. పితృలోకము వేఱుగానుండి, వారు జ్ఞనులుగకూడ నుండెదరు. వీరిని తృప్తిపరచుటకు శ్రాద్ధములు పెట్టవలయును కాని నేడు చచ్చిన వారికి శ్రాద్ధమేల! ఈ బ్రాహ్మణులు తిన్న వారికి తృప్తి యెట్లుకలుగును? అని మనవారు శ్రాద్ధములు నిరసించుట మనము చూచుచునే యున్నాము. శ్రాద్ధము పెట్టనివానికి ఏ పుణ్యము చేసినను అక్కరకురాకుండ పోవును. కాబట్టి శ్రాద్ధనియమము లెట్టివో కొన్ని తెలిసికొనుట ఆవశ్యకమైయున్నవి.

''కర్తుం పూర్వేహ్ని నియమో !

భోక్తుశ్చైవ వరేహని'' -

అని మొదటి నియమము శ్రాద్ధకర్తకు కలదు. రేపు శ్రాద్ధమన తొలినాడు బ్రహ్మచర్య - ఏకవార భోజనాది నియమము ఉండవలయును. శ్రాద్ధమునాడు కర్తకు భోక్తకు నియమము లుండుట చూచుచున్నాము గదా అయినచో మనవారు శ్రాద్ధమునాడు మఱికొన్ని గారెలు వగైరా వండుకొని రాత్రికూడా ఫలహారమని తినుచున్నారు. కొందఱు బుద్ధిమంతులు భోక్తనుగూడ బిలచి ఆ అల్పాహారము బెట్టుచున్నారు. ఇది యంతయు లౌకికము శాస్త్రమొప్పదు. భోక్తుశ్చైవ అను చకారమువలన తద్దినము రోజున, మరుసటిరోజున కర్తభోక్త ఇద్దరును నియమముగా నుండవలెను. ముందురోజుననే బ్రాహ్మణులకు నియామకము జరుగవలయును. శ్రాద్ధమునాడు కర్త శ్రాద్ధవిధి నిర్వర్తించినట్లు తెలియచేయుటకు విశ్వేదేవతలు ఏర్పడియున్నారు.

వీరు శ్రాద్ధవిధికి సాక్షులు. మంత్రమున - వసురుద్రాదిత్య రూపాణామ్‌ - అన్నపుడు తండ్రి - తాత - ముత్తాతలకు శ్రాద్ధవిధి గలదు. ఇందు తండ్రి వసురూపుడని, తాతరుద్రరూపుడని, ముత్తాత ఆదిత్యరూపుడని చెప్పబడుచున్నారు. వీరు క్రమముగ వసు - రుద్ర - ఆదిత్య లోకములం దుండెదరు వారు లేకున్నను, వారు ఎక్కడ నున్నది వారి రికార్డు ఆ లోకములందుండును. శ్రాద్ధమునందు ఆరుగురు బ్రాహ్మణులకు తప్పక పెట్టవలయునని శాస్త్రము చెప్పుచున్నది. పితృస్థానమునందు ముగ్గురు, విశ్వేదేవతలస్థానమునందు ఇద్దరు, విష్ణుస్థానమున నొకడుగా బ్రాహ్మణులుండవలయును. ఆరుగురకు పెట్టలేకున్న పక్షమున ముగ్గరికైనను పెట్టవలయును. ముగ్గురకు పెట్టలేకున్న ఇద్దరికి పెట్టవలయును. ఆ యిద్దరకు పెట్టలేకున్న ఒకరికైనను, ఆ ఒక్కరికి పెట్టలేకున్న ఆ కర్త అడవికేగి పితృదేవతలను గూర్చి పెద్దగ నేడ్వవలయునని కలదు. దానితో పితృదేవతలు దయదలచిపోదురు. ఇక శ్రాద్ధమునందు భోక్తలు కావలసినవెల్ల అడిగి పెట్టించుకొని తినవలయును. లేకున్న వారి నాలుక కోయబడును. ఇక పెట్టువారును చక్కగ వారికి కావలసినది పెట్టవలయును. లేకున్న వారి చేతులు కోయబడునని చెప్పబడియున్నది. చేయబడు పదార్థములు సైతము - ''శ్రాద్ధే శాక చతుష్టయం'' నాలుగుకూరలు, భక్ష్యభోజ్యములు మొదలైనవి చక్కగ చేయవలసి యున్నది. శ్రాద్ధ కల్పమునందు విష్ణువు పెత్తనదారుగ నుండును. శ్రాద్ధమునందు ఆయా బ్రాహ్మణుల నాయా దేవతలుగ భావించవలయును. ఆయా దేవతలను వారి రూపమున తృప్తి నొందించుచున్నాము కాబట్టి, ఆయా లోకములందలి పితృదేవతలుకూడ తృప్తి నొందుచున్నారు. విశ్వేదేవతలు ఆయా లోకములకు ఈ శ్రాద్ధ విషయమును తెలియజేయుచుందురు. ఆయా లోకములందలి అధికారులగు వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలుచెప్పగానే వారి పితృదేవత లెక్కడ నెట్లున్నది విచారించి వారికి దగిన యాహార మిచ్చుచుందురు. వారు దేవలోకమున నున్న అమృతాహారము, రాక్షసాది రూపముననున్న మాంసశోణితాదికము, పశువుగ నున్నగడ్డి - ఇట్లు వారి వారి ఆహారములుగ మార్చి చెందచేయుదురని శ్రాద్ధకల్పమున నున్నది. ఈ వ్యవహారము సరిగా జరుగుచున్నదా? లేదా? అని విష్ణుదేవు డేటేట విమర్శించుచుండును. కాన విది తప్పింప నెవరి శక్యముకాదు. దీనికి మన మనియార్డరు వ్యవహారమే దృష్టాంతము.

పితృపూజలు చేయువారికి హరివంశము నందలి కథ మార్గదర్శకముగ నున్నది. భరద్వాజుని కొడుకులు ఏడ్వురు విద్యాభ్యాసమునకై గురుకులమున కేగిరి ఈ ఏడుగురు గురుధనమైన ఆవును, దూడను, అడవికి మేపుటకు తోలుకొని పోయిరి. అక్కడ వారికి మిక్కుటముగ ఆకలి అయినది. వారిలో నల్వురు మాత్రము గోవును తిందమని పలికిరి. కాని వారిలో ముగ్గురు మాత్రము అందులకు ఒప్పుకొనలేదు. కాని పై నల్వురును తినుటకే నిశ్చయించిరి. వారిలో చివరివాడు మాత్రము మాంసము ఊరకతినుట ధర్మముగాదని చెప్పి మూడు మాంసపు పిండములను పితృదేవతల కర్పించునట్లు చేసెను. మిగిలినది వారు ఏడ్వురు ఆరగించిరి. ఇక సాయంకాలమున ఆ దూడను మాత్రమే ఆశ్రమమునకు చేర్చిరి. గురువు ధేనువును గూర్చి యడుగగా నా యందరు గోవును పులిచంపి తినెనని జవాబిచ్చిరి. గురువు నమ్మి ఆవు పోయినను శిష్యులింటికి వచ్చిరని సంతసించెను. ఈ పాపమునకుగా ఏడ్వురును ఒక్కసారి చనిపోయిరి. అదియుగాక వారిలో ఏది చేసినను అందరును కలసియే చేయవలయునని నియమమున్నది. వీరు చనిపోయి మరు జన్మందు దశార్ణ దేశమున నందొక బోయవాని కడుపునపుట్టిరి. వీడు పూర్వజన్మమందు గురుని ఆవు మాంసమైనను పితృదేవతలకు అర్పించి తినిరి గనుక తత్పుణ్య ఫలముచే వారికి ఈజన్మమందు పూర్వజన్మజ్ఞానమున్నది. కాన బోయలైనను హింసాదికము చేయక తల్లిదండ్రుల సేవించుకొనుచు జ్ఞానముతో కాలము గడుపుకొని, ఈజన్మమంతరించిన పిమ్మట వారు కాలాంజనగిరియందు మృగములై జన్మించిరి. అపుడు కూడ వారికి పూర్వవృత్తాంత జ్ఞానమున్నది. దానివలన నప్పుడును దపించిరి. మరల వారు చక్రవాకములై శరద్వీపమున బుట్టిరి. తర్వాత మానససరోవరమున ఏడు హంసములై జన్మించిరి. ఇపుడు కూడ వారికి పూర్వవృత్తాంత స్మృతి యున్నది ఇన్ని జన్మములు చేసిన పాపమునకు పశ్చాత్తాపము నందుచు ధ్యానయోగముతో కాలము గడుపుచుండిరి.

ఇట్లుండగా భాభ్రవ్యడు అను రాజు భార్యలతో జలక్రీడలాడుటకు ఆ సరస్సునకు వచ్చెను. అందు విహరించుచున్న ఆపక్షులలో ఏడవపక్షి రాజుతోకూడ జలక్రీడలాడు రాణిని చూచి - ఇట్టిభోగమింకొక జన్మమున నుండదుగాన పుట్టినచో రాజై పుట్టవలయునని పల్కెను. అంతమిగిలిన పక్షులన్నియు ఆ యేడవ పక్షిని అట్లే పుట్టుమని శాపమిచ్చినవి. అంత ఆ యేడవపక్షి వానిని విడిచి యుండలేననియు, సామాన్యముగా నంటినిగాని ఈ భోగాపేక్షతో చెడిపోదునుగదాయని యేడ్చెను. అందులకు మొదట నల్వురు - మిగిలిన ముగ్గురితో ఇద్దరిని (రెండుపక్షులను) మంత్రిపురోహితుల కడుపున బుట్టి, ఏడవవానికి మంత్రి పురోహితులై యుండుడని శపించిరి. ఈ విషయమును ఆ నల్వురు వారిని అనుగ్రహించి చెప్పితిమనియు, భోగములనుభవించి సుఖమునొందుడనియు జెప్పిరి ఆ శాపముతో నాముగ్గురకు పూర్వజన్మజ్ఞానముకూడ పోయినది. ఇది కూడ గోవధము మాంసభక్షణము సమానమైనను - పితృద్దేశముతో చేయుమని చెప్పిన విశేషమున నా మువ్వురు విశేషభోగము ననుభవింపనైరి.

జలక్రీడలాడుచున్న రాజదంపతులు ఏడవపక్షి అందమునకు అత్యాశ్చర్యము నొంది చూచుచుండగా, నది వారి కడుపునబిడ్డయై పుట్టినది. ఇట్లే ఆరవది పురోహితుని కడుపున, ఐదవది మంత్రి కడుపున బుట్టెను. మిగిలిన నాలుగు పక్షులు కురుక్షేత్రమున నొక బ్రాహ్మణుని కడుపున జన్మించినవి వీరు పుట్టుటతోడనే పూర్వజన్మ జ్ఞానము కలిగి వేదవేదాంగముల కొలది కాలముననే చదివి సంసారమున విసుగుకలిగి తల్లిదండ్రులను మహాప్రస్థానమునకై సెలవిండని కోరిరి. వీరికి మాత్రము పూర్వజన్మ జ్ఞానమున్నది. వీరి తల్లిదండ్రులు మాత్రము పోషణ, శ్రాద్ధాదులు ఎట్లని భావించి కుమారుల పోకకు సమ్మతింపరైరి. కాని వీరు మాత్రము మేము మామూలు కుమారులవంటివారము కామనియు, కుమారుల వలన సేవ మీకు జరుగదనియు, అందులకు ధనమవసరమై యున్నదనియు, కావలసినచో ధనమిప్పించెదమనియు పల్కిరి అంతవారు -

శ్లో|| సప్తవ్యాధా దశార్ణేషు మృగాః కాలాంజనేగిరౌ

చక్రవాకాశ్శరద్వీపే హంసాస్సరసి మానసే

యేస్మజాతాః కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః

ప్రస్థితా దూరమధ్వానం యూయంతేభ్యోవసీదత ||

అను శ్లోకమును తల్లిదండ్రులకు వ్రాసియిచ్చి, ఆశ్లోకమును రాజు దగ్గర చదివి వినిపించిన కావలసిన ధనము లభింపగలదని చెప్పి వారు మహాప్రస్థానమునకై సాగిపోయిరి. వీరిలో మిగిలిన మువ్వురు - రాజు మంత్రి పురోహితులై జన్మించి భోగముల ననుభవించుచుండిరి. ఇక పై చెప్పిన తల్లిదండ్రులు ఆ శ్లోకమును ఈ రాజు దగ్గరకు తీసికొని రాగా, ఆ సమయమున రాజుగారు వనవిహారము వెళ్ళియుండిరి. అతడు భార్యకు కోపము వచ్చినదని విహారమునకు పోయి రెండు రోజులుండి మూడవ నాడు నిద్రయందు కలలో గురువు కనబడి ఆకలియయి ఆవును తింటిరి, సరే ! ఆ మాట సత్యము చెప్పక అబద్దము కూడ నాడి పడరాని పాట్లు పడుచుంటిది గదా ! నాయనలారా ! ఆ పాపము శమించినది అని చెప్పెను. దానికి నాశ్చర్యపడుచు తరువాత ఊరియందు ప్రవేశించు సందర్భమున పై బ్రాహ్మణుడు కనిపించి పై శ్లోకము చదువగనే, అతనికి పూర్వజన్మ జ్ఞానము కలిగినది. బ్రాహ్మణునకు కావలసినంత ధనమిచ్చి పంపి, బిడ్డలకు రాజ్యాదులర్పించి మహాప్రస్థాన మాచరించి, బ్రహ్మలోకమునకు పోయిరి.

కావున శ్రాద్ధవిధి నిర్వర్తించిన వారు జ్ఞానవంతులై తరించెదరు. అంతియగాదు పూర్వజన్మ స్మృతియు వారికి లభించును. ఇక పితృదేవతలన్ననో దేవతలకు కూడ పూజ్యులగుచున్నారు. వారి లోకమునకు సంబంధము లేకున్న అలమటించి పోవుదురు. కావున మన పితరులు శ్రద్ధతో నెల్లవారు వారివారి కూలాచార ధర్మములను బట్టి తప్పక శ్రాద్ధవిధి నడుపవలెను. కావున మానవులు వేదవేదాంగాది విద్యాభ్యాస యుక్త బ్రహ్మచర్యముతో ఋషులను, యజ్ఞయాగాది క్రతువులతో దేవతలను, శ్రాద్ధములతో పితృదేవతలను ఉపాసింపవలయును ఈ ఉపాసనతో ఋణత్రయము తీరిన తర్వాత యోగముతో గాని, సాంఖ్యముతో గాని, ముక్తినొంద యత్నింపవలెను. ఈ యోగమున అష్టాంగములున్నవి. అవి యమనియమాసన ప్రాణామాయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనునవి. ఇచట చెప్పబడిన యమనియమాది ఆసనములు కర్మకాండ యందు చెప్పబడినవి. కాన యోగమునకు నైదు మాత్రమే యంగములందురు. సమాధి ఫలముగాన యోగము చతురంగమే యందురు కొందరు. ఉపాజ్‌ పూర్వకమైన అన్‌ ధాతువునకు ఊరకుండుట యని యర్థము వేమన చెప్పిన -

ఆ.వె. మాటలుడుగకున్న మంత్రంబు నిలువదు

మంత్రముడుగకున్న మనసు నిలదు

మనసు నిలువకున్న మరిముక్తి లేదయా

విశ్వదాభిరామ వినుర వేమ||

అను పద్యమున కదియే అర్థము. ఆ స్థితి చేకూరుటకే సంధ్యావందనము ఏర్పడినది. అచట గోచరమగునది బ్రహ్మవస్తువు దానిపై మనస్సు ఉండుట సంధ్య యగుచున్నది ఒకప్పుడు పరశురాముని యజ్ఞము చేయించిన దత్తాత్రేయస్వామి యజ్ఞాంతమందు నీ పరశురాముని యాగముతో నా సంధ్య పోయినది అని విసుగుకొని సంధ్యావందనమును చేయబోవ సిద్ధసాధ్యాది దేవతలు దత్తదేవుని సంధ్యావందనము చూచుటకై పోగా పరశురాముడు నదియొడ్డుననున్న వాడున్నట్లుండి యదృశ్యుడయ్యెను. చాలసేపటికి వారికి మామూలు శరీరముతో కనబడెను. ఇది యేమని ఆశ్చర్యపడుచుండగా నా దేవతల కాదత్తదేవుడు - సమష్ట్యభిమానిగ నుండుటయే సంధ్య. అట్టిస్థితి కుదిరినప్పు డీ తత్త్వములన్నియు స్థూలసూక్ష్మములతో నందుండిపోవును. మరల నిటుతిరిగి నివియన్నియు భాసించును - అని చెప్పెను.

ఇట్టి స్థితికి మానవుడు వచ్చుటకే సంధ్యావందనము చేయుట. కావున వృత్తికి వృత్తికి మధ్యనున్న బ్రహ్మవస్తువును కనిపెట్టు తెలివియే, ఆసంవిత్తే సంధ్యాదేవి యనబడుచున్నది అట్టి స్థితి కుదురుటకు బహిర్యాగమగు క్రియారూపమైన సంధ్యావందనము మూడువేళల తప్పక చేయవలసి యున్నది ఇందు సూర్యోపాసనము గాయత్రీ ఉపాసన, అర్ఘ్యప్రధానము కలవు. ఇందును అర్ఘ్యప్రధానము ముఖ్యమని కొందఱు, గాయత్రి ముఖ్యమని కొందఱు సూర్యోపాసన ముఖ్యమని మరికొందఱు అనుచున్నారు. ఇచట అశౌచాదులు వచ్చినను విడువక నాచరించు నర్ఘ్యదానము ముఖ్యమని కొందఱు, గాయత్రీమంత్రము బ్రహ్మధ్యానము గాననిదియే ముఖ్యమని కొందఱు, అన్నిటికి నుత్తమమైనది గాన సూర్యోపస్థానము ముఖ్యమని కొందఱు చెప్పెదరు. స్త్రీ పురుష భేదము పాటింపక అందఱును సంధ్యావందనము చేయవలయును. సూర్యుని చూచుచు ప్రాతస్సాయం సమయముల నర్ఘ్యమీయవలెను. రామాయణమున హనుమంతుడు లంకలో సీతను వెదకుచు విసిగి వేసారి చివరకొక సరస్సు సమీపమున వేచియుండెను. కారణమేమన సీత సంధ్యావందనము చేయుటకై సరస్సు దగ్గరకు వచ్చువేళ యిది యని ఆతడు భావించినట్లు వాల్మీకి వ్రాసిపెట్టెను. దీనినిబట్టి స్త్రీలు కూడ సంధ్యావందనము చేయుట ఆవశ్యకము. దానినిబట్టి శూద్రాదులును సంధ్య నుపాసింపవలెను. ద్విజులు సమంత్రకముగచేయు సంధ్యయన బహిర్యాగము ద్వారమున అంతర్యాగము సిద్ధికావలసియున్నది. అది కలుగుతఱి అందఱకు ననుభవము ఏక రూపమే. ఈ యంగత్రయముతో గూడిన సంధ్యోపాసనము తురీయము. అదియే యిందు ప్రధానమని కీ.శే. లగు మా తండ్రిగారు శ్రీరామ కథామృత కవియగు తా. వెంకటప్పయ్యశాస్త్రిగారు తమ గురుపరంపరా ప్రాప్తమను సిద్ధాంతమున నుడివిరి.

ఇక దీని కధికారు లెవరన? ''యో దేవః సవితా అస్మాకమ్‌ ధియో ధర్మాది గోచరాః'' అను గాయత్రీ పురాణ శ్లోకముతో అందఱును అర్ఘ్యప్రదానము చేయవచ్చును. మంత్రము మాత్రము స్వరప్రధానమై యుండును గనుక ఉచ్చారణలోప ముండరాదు. పూర్వము వృత్రాసురుడు ఈ స్వరలోపముచే చచ్చెనను ఇతిహ్యసమొకటి శ్రౌతమే కలదు. కావున నెల్లజీవులకు యథావిధిగ నాచరించు సంధ్యావందనమే ముక్తినిధానమని వేరుగ చెప్పనక్కరలేదు. కాన మనవారెల్ల సంధ్యోపాస్తిచే ముక్తులయ్యెదరు గాక !!!

12

మానవుని మనస్సు నాదమునందు సులభముగ లయమగుచున్నది. అనగా వృత్తిరహితమైన బ్రహ్మానందమును పొందుచున్నదని యర్థము. పరమాత్మ స్వరూపము బ్రహ్మానంద పర్యవసాయి అయినను లీలాస్వీకృత విగ్రహుడైన విష్ణువు బ్రహ్మమయుడై యుండియు లోకవ్యవహారము సాగించుచు, తన వ్యవహార సమయమున బ్రహ్మరూపమునుండి చ్యుతుడు గాక అచ్యుతుడై వెలయుచున్నాడు. విష్ణువు సహజమైన బ్రహ్మభావము నుండి చ్యుతుడు కాడు కావుననే అచ్యుతుడని పిలువబడుచున్నాడు. శ్రీరామునకు 11 వేల సంవత్సరములలో ఒక్కేసారి దేహాభిమానము కలిగినదట. మారీచుని సంహరించివచ్చి పాడుబడిన పర్ణశాల జూచి శరీరాభిమానముతో ఓకైక? ఓ తల్లి ! నీ కోరిక నెరవేరినదని విలపించెను. ఇట్టి తిట్టు కైక నెప్పుడు తిట్టలేదు. కావున నిచ్చట రామునకు మానుషాభిమానము కలిగినదని వృద్థసంవాదము కలదు. ఆగస్త్యుడు రాముని - రావణుడు సీతను తల్లివలె రక్షించె (మాతేవ పరిరక్షితా) నని యుండగా నేల సంహరించితివని ప్రశ్నించెనట. అసలు రావణుడు - రాముని చేతి యందు మరణము కోరియే సీతను దీసికొనిపోయెను గాని కామముతో గాదని పెద్దల వాదము. కాన రావణుడు తెలిసిన మూర్ఖుడనబడుచున్నాడు. దుర్యోధనుడు మాత్రము తెలియని మూర్ఖుడగుచున్నాడు. రావణుడు సీత నపహరించు సందర్భము లోకమున పరిపరివిధములుగ నున్నది. అసలు సీతయే యని కొందరు, కొందరు అసలు సీత కాదనియు, మాయాసీత యనియు తెల్పుచున్నారు. ఈ మాయాసీతయే అగ్నియందుండి ద్వాపర యుగమున ద్రౌపదియై అగ్నినుండి జన్మించెనని దేవిభాగవతమున గలదు వాల్మీకమున మాయాసీత యెక్కడ లేదని కొందరు పండితులు వాదించుచున్నారు వాల్మీకము నాదికావ్యమని వ్యవహరింతురు. కావ్యము వ్యంగ్య ప్రధానమని లక్షణము గదా! ''జీవితం వ్యంగ్యవైభవం'' ఆ వ్యంగ్యము నెల్లరు కనుగొన లేరనియే దానిలోని వ్యంగ్యమంతయు ఆధ్యాత్మ రామాయణముగా వ్రాయబడినదని పెద్దలు అనుచున్నారు. అధవా వాల్మీకము వ్యంగ్యకావ్యము కాదనినను దానినిబట్టి మాయాసీత లేకున్నను ఆధ్యాత్మరామాయణమునుబట్టి, దేవీభాగవతాది గ్రంథములనుబట్టి, లౌకిక ప్రవాదమునుబట్టి మాయాసీత వ్యవహారములో లేకపోలేదు అంతరార్థమును ఆలోచించినచో రావణాసురుడు దేవీ అనుగ్రహము కొఱకు సీత నెత్తుకొని పోయెనని చెప్పవలయును. దీనికి రామాయణములోనే సనత్కుమార రావణసంవాద, కపిలముని సందన్శనములు నిదర్శనములు. దహరాకాశములోని బ్రహ్మతో మాయలీనమై యున్నది. లంకయనగా శరీరము క్రిందిభాగము. అందునున్న తెలివియే మాయాసీత, అది నాగలిచాలువలె చక్రముద్వారా వ్యాపించియున్నదని యోగము. వాయుజుడు (హనుమంతుడు) దేవీతత్త్వమును వెదకుచున్నాడు సీత హనుమంతునితో భాషించుచు రామునకు ఎక్కడ వలసిన నక్కడనే సీత యున్నదని పల్కెను. అనగా రావణుడు తెచ్చిన సీత మాయాసీత యని తెలియుచున్నది. రావణుడు తెచ్చునపుడు అసలుసీత అగ్నులయందు లీనమైయుండెనట. దీనిలో వాది దౌర్బల్యమేగాని వాదదౌర్బల్యము లేదు. ప్రాసంగిక మాకథ యిట్టులుండ ప్రస్తుత మనుసరింతము

మనస్సునకు వృత్తియందే ప్రపంచము వచ్చినది. వృత్తి లయమైనచో ప్రపంచము లేదు. అది నాదమునందు సులభముగ లయము నొందును. అని శంకరులు భాషించిరి. కాని యేది యెట్లున్నను అవతార పురుషులకు కష్టసుఖము లనునవి లేవు. మనము గ్రంథములందు చదువునది యెల్ల వ్యావహారికలోకమునకు మాత్రమే యగుచున్నది. కావ్యములు వ్యంగ్యప్రధానముగ, కాంతాసమ్మితములై అలరారుచున్నవి. వేదములు ప్రభుసమ్మితములు, పురాణములు మిత్రసమ్మితములు. ఇక కావ్యము వ్యంగ్యప్రధానమంటిని గనుక ఇందు వాచ్యార్థముకాక వ్యంగ్యార్థము స్ఫురించుచున్నది. శ్రీహర్షుని నైషధమునకు వ్యంగ్య వైభవములో వేదాంతపరమైన అర్థము గ్రంథమంతట తోచుచున్నది. కాని మనవారు ''కావ్యాలా పాంశ్చవర్జయేత్‌'' - అను వాక్యప్రమాణమున కావ్యముల చదువరాదని నిషేధించిరి. అయినను కావ్యములందు వర్ణించిన మంచి విషయమును గ్రహించి చెడును విసర్జించవలయుననియే పై వాక్యార్థముగ సమన్వయించి చూడవలయును ''సత్కావ్యకృత్యాద్యవసే చరంచ సమీర సేకాది వదీరయంత్యేత్యాది వాక్యములును కావ్యములవలన కర్తవ్యత్వబుద్ధి నిశ్చయమగుచుండును చమత్కారిత్వమందు నుండుటవలన మనము నాకర్షించును గాన నిట్టి కావ్యములకా నిషేధము తగులదు. అట్లు తగిలిన వాల్మీకమును కావ్యమేగదా?

ఇక శ్రీహర్షుడు తన కావ్యమగు నైషధమును వ్యంగ్యవైభవ విలసితముగ వెలయించె నంటిమి. ఈవ్యంగ్యమనునది పదైక దేశమని వర్ణగతమని అనేకవిధములుగ నుండును. అంతియగాక ప్రబంధగతమని వాక్యగతమని గలదు శ్రీ హర్షుడు తన కావ్యమును ప్రబంధగత వ్యంగ్యముగా రచించెను. ఇందు ప్రతిశ్లోకము వేదాంతార్థమును స్ఫురింపజేయును. రలయో రభేదః - అను సూత్రప్రమాణముచే నల శబ్దమునశు నర అని అర్థము చెప్పవచ్చును. నరుడనగా నశింపనివాడని యర్థము క్షయించు స్వభావముగల శరీరమును కాపాడువాడని భావము. కాబట్టి శరీరాధికారి నరుడు అగుచున్నాడు ఈభావము నాతడు మొదటి శ్లోకమునందే పొందుపరచెను. క్షితి రక్షిణః కధాః - క్షితి అన నశించునది శరీరము. దాని రక్షించువాడు నరుడు. అతడు మహోజ్జ్వలమగు తేజోరాశి. సితచ్ఛత్రిత కీర్తిమండలుడు అని మొదటి శ్లోకమున నామరూప రహితః పరమాత్మా - అని వస్తునిర్దేశముచేసి రెండవ శ్లోకమున దీనిని వివరించెను. శ్రీకృష్ణుడు గీతయందు - యశ్చంద్రమసి యచ్చాగ్నౌతత్తేజో విద్ధిమామకం - అని చంద్రునియందలి అగ్ని యందలి తేజము నాయదిగా తెలిసికొనుమని చెప్పెను. కాని సూర్యమండలము సంగతి చెప్పలేదు. దాని కర్థము చంద్రమండలము సహస్రారము. అగ్నిమండలము నాభిస్థానము ఈ రెంటియందు వ్యాపించిన తేజము డహరాకాశగతమగు సూర్యతేజము తనదిగా నివ్చయించి నుడివెను. నైషధమునందలి - రసైః కధామస్య సుధావధీరిణీ నలస్స భూజాని రభూత్‌ గుణాద్భుతః ..... అను శ్లోకమున ఎవరికథ రసములతో సుధను తిరస్కరించునదియో ఆ నలుడు భూమిజాయగా గలవాడై గుణాద్భుతు డాయెను అని నిర్గుణమును సగుణముచేసి వర్ణన మొదలిడెను. వేదాంతపరముగ పరమాత్ముని కథయని మరియొక అర్థము. మరియు -

సువర్ణ దండైక సితాత పత్రితజ్జ్వల త్ప్రతాపావళి కీర్తి మండలః - మొదటి శ్లోకమున సితాతపత్రమును మాత్రమే చెప్పి రెండవ శ్లోకమున దానికి సువర్ణ దండత్వమునుగూడ సంపాదించెను. ఈ శ్లోకము వలన బంగారపు కఱ్ఱపై భాగమునగల తెల్లని గొడుగు కలవాడు నలుడని భావము. సహస్రారమునందలి పరమాత్మ స్ఫురణ మరియొక అర్థముగా తోచును. ఇట్లు ప్రతి శ్లోకమునకు వేదాంతార్థము చెప్పి తీరవలయును - ఇందలి దమయంతి విద్యాశక్తి యని ఇదివరకే చెప్పబడినది.

ఒకనాడు నలుడు వనవిహారమునకై వెళ్ళెను. శరీరమే ఉద్యానవనము. అందలి నాడులే వృక్షములు. ఆ ఉద్యానము నందొక సరస్సు. అదియే ఐరంమదీయ సరస్సు. అందు బంగారు రెక్కలుగల హంస ఒంటి కాలిమీద నిలబడి నిద్రబోవుచున్నది. మన శరీరమునందలి హంస కూడ నిద్రించుచునే యుండును. ఈ హంసను జాగ్రత్తగా పట్టుకొనవలసి యున్నది. నలుడా హంసను బట్టుకొనగా నది యాతని చాల బాధపెట్టెను. తనను వదలుమని సామోక్తులతో పలికెను. చివరకు విడిపించుకొనలేక దుఃఖించెను.

'మదేశపుత్రా జననీ జరాతురా'' ఇత్యాదిగా నెంతయో ప్రాదేయపడినది. ఇదియంతయు మొదట హంసవిరోధము చేసినవాని సాంసారిక విద్యుతివలని బాధ. పరమార్థమునకై పాటుపడుచుండగా సంసార తాపత్రయము హెచ్చినట్లు హంస యెంతయో బ్రతిమాలెను. కాని లాభములేక రాజుచేతిలో సొమ్మసిల్లెను. ఇట్లు ఆ హంస నలునకు స్వాధీనమైనది. రాజు తర్వాత దీనదయాళు డగుటవలన నిన్ను చంపుటకు బట్టలేదు. కాని నీ రూపము చూచి యానందించుటకే పట్టుకొంటిని రూపము చూచు పని నెరవేరినది గాన నిక నీవు యధేచ్ఛగా బొమ్మని వదలెను. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారమైన పిమ్మట హంస ఉచ్చ్వాస నిశ్వాసములు) ఎట్లు పోయిన నేమి? ప్రాణాయామాదిక మనవసరము. కాని రాజును వదలి పోయిన హంస మరలవచ్చి అతని భుజముపై వ్రాలినది. అనగా యోగాభ్యాసపరులకు నిర్ణీతకాలమున యోగసమాధి దాని యంతతానె ఆవహింప గలదని భావము. వచ్చిన హంస రాజున కొక సందేశమిచ్చినది. ఇది హంస దౌత్యము అనగా నీహంసయే జ్ఞానమును, విద్యను ప్రకాశింపచేయునదని భావము. కథయందు దమయంతి తండ్రి భీమరాజు అనగా నియమమని భావము. వీనికే దమయంతీ రూపమైన విద్యాశక్తి పుట్టినది. ఇక దమయంతి స్వయంవరమునకు దేవతలుకూడ వచ్చినట్లు కలదు. దేవతలు కథలో కామముతో వచ్చినట్లుండిరి కాని ఆంతర్యమున - దేవతలు నల దమయంతులకు సంబంధము కలిగించుటకు వచ్చిరి. పైకి వారు స్వార్ధమును జూపు చున్నట్లున్నను ఆంతర్యమున పరోక్షప్రియులు దేవతలు. కాబట్టి నలుని ఇష్టాపూర్తములకు సంతసించి భూమియందే స్వర్గసౌఖ్యము నాతనికి కావించుటకే దేవతలు వచ్చినట్లు ఊహింపవలయును కావున దమయంతిని వివాహమాడుటకు దేవతలు రాలేదు. అదియును గాక వారు దమయంతి నలుని గుణగణములను విని చూచి వరింపకున్న వట్టి మొద్దుకనక అట్టి అవివేకి మనకు వద్దనియు భావించిరట. మరియు దమయంతి నలునే వరించినచో పరదారపై ప్రణయము మనకేల? అని భావించిరట. కావున దేవతలకు దమయంతిపై నిజమైన ప్రేమలేదనుట తెలియవలెను. మొత్తముమీద స్వయంవరము నాడు నల్వురు దేవతలు నలరూపధారులై రాగా భీమరాజు ప్రార్థనపై సరస్వతియే స్వయముగా వచ్చి దమయంతికి నలుని చూపి చెప్పినది. ఇందు సరస్వతి ఆయా దేవతలగూర్చి చెప్పుచు సర్వదేవతారూపుడు నలుడని ప్రశంసించి బహు చాకచక్యముగా నిరూపించి చూపినది. అయినను దమయంతి నలుని నిజరూప మెఱుగక ఒప్పుకొనలేదు. చివరకు దేవతలను ప్రార్థించి వారు ప్రసన్నులుకాగా నిజమైన నలుని వరించినది.

ఈ విధముగా విద్యాశక్తికి ఆత్మతో సంబంధము వర్ణింపబడినది. వచ్చిన దేవతలు నలదమయంతులకు వరములిచ్చి పోయిరి ఇంద్రాగ్ని యమవరుణులచే నలుడు గొప్ప వరముల నొందెను. కావున శ్రీహర్షుని నైషధము ప్రబంధగత వ్యంగ్యమునకు చక్కని యుదాహరణముగ గైకొన వచ్చును.

శ్రీ హర్షుడు తర్కమున గొప్పవాడు. ఒకప్పుడు శంకరులతో వాదించి చార్వాక మతమును స్థాపించెను. అట్టియెడ శంకరులు వానియుక్తి చాతుర్యమునకు మెచ్చుకొని మాటాడక మిన్నకుండెను. కాని శ్రీహర్షుడు భోజనమునకు కూర్చుండగా అన్నము పురుగులవలె కన్పింపసాగెను. అపుడు శ్రీహర్షుడు తల్లితో శంకరులతోడి తన వాదమును, తత్ఫలితమును గూర్చి చెప్పెను. ఆమె వెంటనే శంకరుల పాదములపైబడి పుత్రభిక్ష నర్థింపగా శంకరులు నేనేమియు ప్రయోగము చేయలేదని సమాధానమిచ్చెను. మరియు శ్రీహర్షుని వాదమునకు మాత్రము తన మనస్సు బాధ నొందినదనియు చెప్పెను. బ్రహ్మజ్ఞానియై ఆస్తికుడైన వాని మనస్సుకు బాధ నొందించిన వాడు ఏడురోజులలో స్వయముగా నశించునని శాస్త్రము నందు గలదు. ఇట్లే రావణయుద్ధము ఏడు రోజులతోనె ముగిసినదికదా! శ్రీహర్షుడు మరునాడుదయమున స్నానముచేసి, విభూతి పూసికొని శంకరుల దగ్గరకు వెళ్ళి మరల దేవుడు కలడని వాదించెను. ఇట్లు తన తర్కవాదముతో వేదముల కన్యార్థము కల్పించి శంకరుల వాదమును శ్రీహర్షుడు పరాస్తము కావించి పలుబాధలకు గురియయ్యెను. కానపరిహాసమునకైనను నాస్తికవాదము గ్రహింపరాదు.

ఇట్లే రామాయణమునకు కూడ వ్యంగ్యార్థము గ్రహింపవచ్చును. ఉత్తరకాండయందు అగస్త్యుడు రాముని-సీతను తల్లివలె చూచిన రావణు నేల చంపితివని ప్రశ్నించెను. ఇచట ఒక సందేహము పొడగట్టుచున్నది. నలకూబరుని వలన రావణునకు ఇష్టము కాని స్త్రీని ముట్టరాదని, ముట్టినచో తల పగులుననియు శాపము గలదు. ఈ విషయమును నారదుడు బ్రహ్మతో చెప్పగా బ్రహ్మయు తథాస్తని దీవించెను. కాని రావణుడు సీతను మెడను తొడనుబట్టి తీసికొని వెళ్ళినట్లు రామాయణమున గలదు. కాని ఆతని తల పగులలేదు. కారణ మాతడు సీతను మాతృభావముతో ముట్టుకొనెను గాన అని తెలియవలెను. ఒకానొకప్పుడు రావణుడు సనత్కుమారుని దగ్గరకు పోయి విష్ణువు యొక్క గొప్పతనమును గూర్చి చెప్పుమనెను. అంత సనత్కుమారుడు ఆతని గౌరవించి విష్ణువు యొక్క గొప్పతనమును గూర్చి, ఆతని చేతిలో చచ్చుట పుణ్యమని బోధించెను. అంత రావణుడు అట్లు విష్ణువుచేత చచ్చు వున్నెము నాకు గలదా? అని మనసులోపల దలచెను, సనత్కుమారుడు విష్ణువు రాముడై దశరథుని గర్భమున జన్మించి నిన్ను చంపుననెను, నాటినుండి రావణుడు రాముని రాకకు నిరీక్షించుచుండెను. అంతియగాదు ఇక్ష్వాకు వంశీయుల నందఱను సంతానవంతుల మాత్రమే యుద్ధమున నిహతుల కావించుచుండెను. ఇక్ష్వాకు వంశ నాశనము చేయుటకు ఇష్టపడలేదు. మరియు దశరథ కౌసల్యలకు రాముడు పుట్టునని తెలిసి వారిని రావణుడు పెట్టెయందు బంధించి యుంచెను. కాని ఆ పెట్టెను ముసలి ఎత్తుకొనిపోయెను. అని యేదో ఒక గాధ అన్యపురాణాంతర్గతము కలదు. ఆ కౌసల్యా దశరథులు మరొకరు అని తెలిసికొనవలెను. తర్వాతనే ఈ దశరథునకు కౌసల్యకు రాముడు జన్మించెను. దశరథుని పరాక్రమమును రావణుడు మొదటినుండియు పరీక్షించుచుండెను. 12 ఏళ్ళకే దశరథుడు రాజర్షియై సింహాసన మెక్కెను. నాడు లోకమున నొక నియమము గలదు. 12 పర్యాయముల కొక్కసారి శ##నైశ్చరుడు రోహిణిని భేదించును. అప్పుడు కఱవుకాటకములు లోకమున నేర్పడును. దశరథుడు అది తప్పించుటకై ప్రయత్నము చేయనెంచెను. కాని వశిష్టుడు లాభము లేదనెను. అయినను దశరథుడు ఖగోళమున యుద్ధము చేయుటకు నిశ్చయించి సుమంత్రుని రధమాయితము చేయుమని ఆజ్ఞానించెను. 400 గుఱ్ఱములు పూన్చిన నూరు రధములపై యుద్ధమునకు తరలెను. కాన శతరథుడు వాడు యుద్ధమునకు పోవుచు వశిష్టుని సెలవడుగగా నాతడు విజయమగునని కమండలూదకము రధముపై జల్లి దీవించెను. యుద్ధమున శనికి ఎదురుగా రథము నిల్పి రోహిణిపైకి పోకుండ నిరోధించెను. శని దశరధుని నూరు రధములలో 90 రధముల విఱుగగొట్టెను. పది రధములు మాత్రము మిగులుటచే దశరధుడని పేరు వచ్చెను. అపుడు దశరధుడు బ్రహ్మచర్యమున నున్నాడు గాన దీక్షతో బ్రహ్మశిరోనామకాస్త్రమును లోకోపకారమునకై శనిపై ప్రయోగించెను. అంత శని శరణు వేడెను.

అంతియగాక దశరధుని రాజ్యపాలన పర్యంతము రోహిణిని భేదింపనని పల్కెను. ఇట్లు దశరధుడు అజేయుడై ఖగోళముతో యుద్ధ మొనరించెను. అరువదివేల యేండ్లు రాజ్యము నేలెను. ఇట్టి దశరధ పరాక్రమము చూచి, వీనికి తప్పక రాముడు పుట్టగలడని భావించి, ఆతనితో యుద్ధము చేయక, రాముని రాకకై రావణుడు నిరంతరము నిరీక్షించుచుండెను. కానిచో రామజన్మమునకుగా దశరథు డొనర్చిన అశ్వమేధము నందలి గుఱ్ఱమును రావణుడుగాని వాని తరపున మరొక్కడుగాని పట్టుకొనకుండ నేల వదలిరి? పిలువని పేరంటమునకు పోవు రావణుడు పిలుపుగల మేధ్యాశ్వ విషయమగు యుద్ధమును వదలుట ఆలోచింపదగిన విషయము గదా! ఇదంతయు ధ్వని వైభవము.

13

రామాయణమునందలి రావణుడు తెలిసిన మూర్ఖుడని తెలిపి యుంటిని ఏలన విష్ణ్వంశ సంభూతుడైన రాముని చేతిలో చావు కోరి, వాని రాకకు వేచియుండెను. మొదట సనత్కుమారుడే రాముని చేతిలో రావణునకు చావుకలదని చెప్పెను తరువాత కపిలముని నిన్ను చంపుటకు మానుషదేహముతో వచ్చెదనని చెప్పెను. అదియుగాక ఇక్ష్వాకువంశ సంజాతుడైన అనరణ్య మహారాజు తన వంశమునందు బుట్టినవారిచే రావణునకు చావు గలదని శపించెను. కాబట్టి ఈ మూడు కారణములచే రావణుడు రామునిచేత చావవలసియున్నది. ఇది తెలిసియే రావణుడు రాముని రాకకు వేచియుండెను. ఇట్టి రాము డెవరి గర్భవాసమున జన్మించునాయని ఇక్ష్వాకువంశరాజుల నందఱను విమర్శించి చూచుచునే యుండెను. కుమారులులేని రాజును ఇక్ష్వాకువంశమున జనింపడు. చివరకు దశరధుడు 12వ యేట రాజర్షియై, ఖగోళములో శనితో యుద్ధము నొనరించి గెలుపొందుట చూడ రావణునకు ఆశ్చర్యము గొల్పెను. కావున తప్పక రాముడు దశరధునికే జన్మించునని ఆశపడియుండెను. దశరధునకు 360 మంది భార్యలు, ముగ్గురు రాణులు గలరు. వారందరిలో నందగత్తెయును, చివరిదియును నగు రాణి కైక. ఈమె కేకయరాజు కుమార్తె. దశరధున కంతమంది భార్యలున్నను నాతడు - సమాధి జితేంద్రియః - అని జితేంద్రియుడుగా పొగడ్త నందియుండెను. కైకను చేసికొనిన రాజు సార్వభౌముడగునని ఆమె జాతకమునం దుండుటచే రాజామెను చేసికొనెనుగాని, కేవలము అందమునకు మాత్రమే వశుడైగాదని తెలియవలెను కేకయరాజు మాత్రము తనకూతురు నిచ్చునపుడు ఆమెకు పుట్టు బిడ్డకు రాజ్యమిచ్చునట్లు కట్టడిచేసికొనెను. దశరధుడట్లేయని అంగీకరించి తనకిష్టమైన పని నెరవేర్చుకొనుట కిది మంచిదని భావించెను. దశరధుడు అరువదివేల యేండ్లు రాజ్యము చేసెను. కాని సంతానము లేకపోవుటచే పుత్రకామేష్టి చేయ మొదలిడెను.

ఈ యజ్ఞము ఋశ్యశృంగుని బ్రహ్మత్వమున వశిష్ఠుడు నిర్వర్తించెను. ఇందు అశ్వమును గాయత్రీమంత్ర మంత్రితముచేసి వదలుట శాస్త్రసమ్మతము. ఈ గుఱ్ఱమునేరాజు పట్టినను వానిని జయించివచ్చుట ఆ గుఱ్ఱముతోడ వెళ్ళినవారికి పనియైయున్నది. ఆ గుఱ్ఱము మొగమున నొక ఫలకముకట్టి దానిపై మేము లోకైక వీరులమై ఈ యశ్వమేధము జేయుచుంటిమి. ఎవరైన పరాక్రమశాలురున్న దీనిని బట్టుకొనుడు. మేము జయించి విడిపించుకొని పోదుము అని వ్రాయుదురట. ఇట్లు ఎవ్వరికి ఓడిపోకుండ దిగ్విజయముచేసి వచ్చిననే యజ్ఞము సాగగలదు. లేకున్న లేదు. కాని దశరధుని గుఱ్ఱము మాత్రము రావణుడు పట్టుకొనక యుపేక్షించి యుండెనుగదా ! అందులకు కారణము యజ్ఞవిఘ్నము వాటిల్లినచో తా నారంభించిన పని కాజాలదు. ఇది విఘ్నమైనచో రాముడు జన్మించడు గదా! అందులకే యుపేక్షించినేమొ; అంతియగాదు. అజేయపరాక్రముడైన రావణుడు దశరధునిపై గూడ దండెత్తి చంపకున్నది రామావతారము కొఱకే యని తోచుచున్నది.

యజ్ఞమున యజ్ఞపురుషుడు పాయసముతెచ్చి యివ్వగా రాజు రాణులకు పంచియీయగా గర్భవతులై నల్వుర కుమారులగనిరి. రాముడు జన్మించెనన్న వార్త తెలియగనె రావణుడు ఎంతయో పరమానందభరితుడై యుండెను. ఇక రాముని బలపరాక్రమము లెట్టివో పరీక్షించి చూచుటకు సంసిద్ధుడయ్యెను. మొదట ఋషుల యజ్ఞము నాశనముచేయ సంకల్పించెను. విశ్వామిత్రుని యజ్ఞమునుమారీచాదులచే ధ్వంసముచేసెను. ఇక అయోధ్యకు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల గొనిపోవుటకై వచ్చెను. ఒకప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని నిర్మూలించుటకు తపస్సు చేసెనట. శివుడు ప్రత్యక్షమై విశ్వామిత్రునకు పాశుపతమును, మహితాస్త్రముల నెన్నింటినో యొసంగెనట. ఆ యిచ్చునపుడు శివుడు ఈ అస్త్రవేదము నీకుగాకున్న నీ శిష్యునకు తప్పక పనిచేయునని శాసించెను. కాని వశిష్ఠుని బ్రహ్మదండము పాశుపతమును యుద్ధమున మ్రింగివేసినది. అపుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ప్రభావమునకు చలితుడై మరల తపమొనరించి తాను బ్రహ్మర్షియై రాణించెను. ఇట్టి విశ్వామిత్రుడు రాజుకడ కరుదెంచి రాజకుమారుల పంపుమని యర్థించెను. మొదట రాజు బిడ్డల విడువజాలకున్నను, వశిష్ఠు ననుమతితో యాగరక్షణకు అంగీకరించి పంపెను. మార్గమధ్యమున విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల విద్యలను అస్త్రమంత్రోపదేశమును గావించెను. ఈ మంత్రోపదేశములచే రామునకు అస్త్రదేవతలన్నియు స్వాధీనములైనవి. రాముడు యాగరక్షణమునకుగా రాక్షప సంహారము గావింపగా రావణునకు రాముని బలము కొంత కొంత తెలిసివచ్చినది కాని రాముని మహిమ ఎట్టిదో తెలిసికొనుటకు రావణుడెంతయో ఉబలాటపడుచుండెను. రామలక్ష్మణులు యజ్ఞరక్షణ గావించి మిధిలకు పోవుచుండగా మార్గమధ్యమున ఱాతిని నాతిగా చేసెను.

ఈ విచిత్రమును విని రావణుడు - రాముడు తప్పక విష్ణువే యని భావించెను మరియు మిధిలలోని శివధనస్సు విరుచుటకు రావణుడు కూడ వెళ్ళెనుగాని, దానిని తనచేతితో నెత్తజాలక మెత్తబడెను. ఇక దీనిని యెత్తగలిగినవాడు దేవుడేయని భావించియుండెను. దీనినిబట్టి తన బలమెంతయో రావణుడు నిశ్చయించుకొనినట్లే యున్నది. ఇక రాముడన్ననో ప్రదక్షిణించి ధనస్సును కుడిచేతితో నెత్తి, యెడమచేత బట్టి నారిగూర్చి లాగబోవ నది బెండువలె విరిగిపోయినది. ఈ విచిత్రము చూచిన రావణుడు అత్యాశ్చర్యచకితు డగుటయేగాక, తన కోరిక ఈడేరి నందులకు ఇంతింతయనరాని సంతసము నొందెను. శివధనుర్భంగముతో రామునకు సీతతో వివాహము జరిగినది. లోకకళ్యాణ ప్రదమైన వీరి వివాహము సీతకళ్యాణ మనుపేర పాటగా ప్రసిద్ధినొందినది. ఇంతకుమున్ను మరియొకపాట గౌరీకళ్యాణమనియే కలదు.

సీతాకళ్యాణానంతరము మార్గమధ్యమున రామునకు పరశురాముని దర్శనమైనది. పరశురాముడు మహాబలవంతుడు. అంతియగాక శివుని శిష్యుడు ఈ పరశురాముడు క్షత్రియసంహారము గావించుచు దశరధ - జనకుల మాత్రము విడిచిపుచ్చెను. కారణమేమన జనకుడు గొప్పవేదాంతి. అట్టివానిని చంపరాదు. ఇకదశరధుడు పరశురాముడు వచ్చినప్పుడెల్ల అంతఃపురమున నుండెడివాడు. అట్టివానిని గూడ చంపరాదు. కావున వీరిద్ధఱిని విడిచివైచెను. దశరధుని విషయమున మాత్రము చాలమంది అంతఃపురమున నుండుట పిరికితనమని భావించుచున్నారు కాని అదిమాత్రముకాదు. కారణమేమన పరశురాముడు బ్రాహ్మణుడగుటచే నట్టివానితో యుద్ధము కూడదు - కావున దశరధు డట్లు చేసెను. రామునిమీదికి పరశురాముడు వచ్చినపు డెంతయో ప్రాధేయపడెను. చివరకు రాముడు వైష్ణవాస్త్రముతో పరశురాముని కొట్టబోవ వేదననొంది పరశురాముడు కాలుమాత్రము నరికి వేయకుమని ప్రార్థించెను. తన ఊర్థ్వలోకములకైన పున్నెపు మెట్టులమీద నా యస్త్రమును వదలుముని పరశురాముడు రాముని వేనోళ్ళ గొనియాడివెళ్ళెను. ఈ సంఘటనలన్నియు రావణున కెంతయో బలము నిచ్చినవి. తర్వాత దశరధుడు పన్నెండేండ్లు కుమారులతో సర్వసౌఖ్యము లనుభవించెను పరశురాముని గెల్చి, యాగరక్షణ గావించినవారికి, వివాహమైన పిమ్మట యువరాజ పట్టాభిషేకము చేయవలసియున్నది. కాని దశరధుడు మాత్రము ఆపని చేయక మిన్నకుండెను అందులకు కారణము కేకయ రాజువలన తనకు మాటరాగలదని భావించెను. కాని ప్రజలు మాత్రము రాముని పట్టాభిషేకము చూడవలయునని తొందరపెట్టిరి. అపుడు దశరధుడు మాత్రము వలదని ప్రౌఢముగమాటాడెను. అరువదివేల సంవత్సరములనుండి రాజ్యము చేయుచున్న నన్ను వదలిపొమ్మని మీ భావనయాయని గద్దించెను. కాని ప్రజలు పట్టుపట్టుటతో ఊరకుండజాలక తనకు నది యిష్టముగాన రామపట్టాభిషేకమునకు లగ్నము పెట్టుమనెను.

చిన్నతనమునుండియు రామునిపై కైకకు ప్రేమ అధికము. దశరధు డెప్పుడైనను ముద్దుకు భరతుని యెత్తుకొన్నను, కైక భర్తను నిందించి రాముని యెత్తుకొనుమని రాపిడి పెట్టెడిది. దశరధుడట్లే యని భరతుని దించి రాముని యెత్తుకొనెడివాడు. ఈ యెత్తు దశరధుడు కైకచే రాముని పట్టాభిషిక్తుని గావింపుమని పల్కించుటకు వేసినదియేగాని, రామునిపై ప్రేమలేక కాదు. కాని యెట్టకేలకు మంథర వారి మధ్య ప్రవేశించి రామపట్టాభిషేకము చెడగొట్టినది. అంతియగాక రాముని పదునాలుగేండ్లు అరణ్యవాసము గావింపుమని కోరినది. ఇక దశరథుడు చేయునది లేక రాముని పిలచి నా ధర్మము నేను నిర్వర్తించితి. ఇక నీ ధర్మము ప్రకారము నీవు చేయుమని చెప్పెను. రాముడు మాత్రము తండ్రియాజ్ఞకు లోబడి అరణ్యవాసమునకు పోయెను. పోవునపుడు తల్లియగు కౌసల్య కుమారుని యుండుమని కోరినది. కాని లాభములేకపోయినది. రాముని వెంట సీతయు పోబోవగా రాముడు వద్దని నివారించెను. అపు డామె రాముని రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుషనిగ్రహమ్‌ - అని పరిహసించినది. (రాముడు పురుషరూపమునున్న స్త్రీయని భావము). అపుడు రామునకు సీత వాక్యమునకు కించిత్కోపము, సంతోషము, ఆశ్చర్యము కలిగినవట. బ్రహ్మాండ పురాణమున -

శ్లో|| ద్విధాకృత త్వాత్మనో దేహి

మర్ధేన పురుషోభవత్‌

అర్ధేన నారీ తస్యాంతు

విరాజ మసృజత్ప్రభుః

అని ప్రారంభించి ఆద్యశక్తిర్మ హేశస్యచతుర్థాభిన్న విగ్రహి-అని విభాగమున జెప్పి - భోగేభవాని పరుషేషు విష్ణుః క్రోదేచ కాళీ సమరేచ దుర్గా అని వర్ణింపబడినది. ద్విధాకృత్వా అను శ్లోకమున పురుష - స్త్రీలు రెండు భాగములు అని చెప్పబడినది. వారే శివశక్తులని తెలియవలెను. కనుక ఇవి రెండు భాగములుగ గన్పట్టుచున్నవి. అందు ఆదిశక్తి (ఈశ్వరశక్తి) స్వరూపము నాలుగు భాగములై, ఒక భాగము పార్వతి, రెండవది విష్ణువు, మూడవది కాళి, నాల్గవది దుర్గగా నైనవని చెప్పబడుచున్నది. కావున రాముడు పురుష రూపముగనున్న శక్తిస్వరూపమని సీత గ్రహించి యున్నదనియు కాబట్టి తన సతి తత్త్వవేత్తయని భావించి రాముడు సంతసించెనట. భర్తనట్లు పలుకరాదని కోపము కూడ వచ్చెనట. ఆశ్చర్యమెందుకన నింత రహస్యము నెట్లు తెలిసికొనినది? అని. ఉన్న ఉనికిని చెప్పుటచే నామె పాతివ్రత్యమునకు లోపము లేదనియు తోచుచున్నది.

ఇక తప్పనిసరిగ రాముడు సీతాలక్ష్మణులతో అరణ్యమునకు పోవలసివచ్చినది. ఈ జంజాటకముతో వచ్చిన రామునకు విశ్వామిత్రుడిచ్చిన అస్త్రములను పురశ్చరణము చేయుటకు సమయము చిక్కుటలేదు. ఈ అస్త్రములు రావణునిపై పనిచేయుటకు తపస్సు చేయవలసియున్నది. కాని సంసార బంధమైన సీతతో కూడ వచ్చుటచే నది సాధ్యము కాదుగదా! కాబట్టి కఠోర బ్రహ్మచర్యము అవలంభించి యుండవలెను. అయినను నిత్యము సీతారాముల వనవిహారములు, జలక్రీడలు, విలాసాదు లెన్నియో జరుగుచునే యున్నవి. ఈ రీతిగా అరణ్యవాసము చేయుచున్న రాముని చూచిన దేవతలకు నిట్టి విలాసపురుషు డెట్లు రావణవధ చేయగలడను ననుమానము వచ్చినది. అపుడు దేవతలు రాముని పరీక్షించుటకు కాకాసురుని పంపిరి. ఈ కాకి వచ్చి సీత ముఖముపై తిరుగుచుండగా, సీత విసిగిపోవుచుండగా రాముడు చూచి నవ్వెను. అది కొంతసేపటికి చెట్టుపై వ్రాలినది సీతారాముల జలక్రీడానంతరము, రాముడు నిద్ర నందెను. అపుడు కాకి సీత స్తనాంతరము గీరిపోవుచుండెను. రాముడు నిద్రమేల్కొని చూచి, జరిగినది విని కోపించెను. కాని సీత మాత్రము తనకు తాను రక్షించుకొనగలదు. కామశాస్త్ర ప్రకారము మొదట స్త్రీముఖము చూచి సంతసించువాడు తండ్రియని, వక్షస్థలముగని సంతసించువాడు బిడ్డయని, నాభిక్రింద చూచువాడు భర్తయని నిబంధింపబడినది. ఈ శాస్త్రానుసారము కాకి ముక్కుతో సీత స్తనాంతరము స్పృశించెను. గాన బిడ్డతో సమానమగుచున్నది. కాని రాముడు దానిపై బ్రహ్మాస్త్ర ప్రయోగము గావించెను. ఈ కాకి దేవతలచే పంపబడి రాముని బ్రహ్మచర్యమును పరీక్షించుటకు వచ్చినది. అదియునుగాక రాముడు సైతము దానిని పరీక్షించుటకే బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసెనుగాన నది కాకి వెన్నంటి ముల్లోకముల చుట్టినది. కాని దాని సంహరింపలేదు. దివ్యాస్త్రములు అప్పుడే నిద్ర లేచినవారికి, ఉపస్పర్శనాదులేకుండ నశుచులుగాన పలుకవు రాముడు నిద్రలేచిన వెంటనే బ్రహ్మాస్త్రము ప్రయోగించెనన నది నిద్రకాదని, ఆత డశుచికాడని తెలియుచున్నది. ఆ కాకి తన బాధ నందరకెఱింగించినది. కాని రామునిది నిజమైన నిద్రకాదు, అది సమాధిస్థితియని అందఱచే తెలిసికొనబడినది. ఇక దేవతాధిపతి యగు ఇంద్రుడు కాకిని రామునే శరణువేడుమనెను. ఇది యొక పరీక్ష. ఇక కాకి రాముని శరణుజొచ్చినది. కాని రాముడు నా అస్త్రము ఊరకపోవునది కాదు కనుక కాకిని ఏదేని బలియివ్వవలయునని కోరెను.

అపుడా కాకి ఒక కంటిని మాత్రము బలి యిచ్చెదనని యిచ్చినది. నిద్ర లేచినప్పుడు అస్త్ర ప్రయోగోప సంహారములు మామూలుగ నడచుచున్న ఈ విచిత్రమును చూచుచున్న దేవతలు రాముడు అసిధారావ్రతముగా బ్రహ్మచర్య మాచరించుచున్నాడని, ఆతని నిద్ర సమాధి యని సంతసించిరి. పదమూడు వత్సరము లట్లు అరణ్యవాసము సాగినది. పదునాలుగవయేడు వచ్చిన పిమ్మట రాముడు సీతతో ఆశ్రమ దర్శనము చేయుచు వచ్చుచుండెను అగస్త్యాశ్రమము దర్శించి, ఆ మహాముని వలన ఇంద్రధనుస్సు సంగ్రహించెను. అత్రిమహాముని ఆశ్రమమునకేగి ఆ ముని దంపతులకు సీతా రాములు నమస్కరించిరి. అంత రాముడు సీతను అనసూయ దగ్గరచేరి నీతులు నేర్చు కొనుమని చెప్పెను. అపు డనసూయ సీతను తన వృత్తాంత మంతయు చెప్పుమని కోరగా సీత కల్యాణపర్యంతమున తన గాధనంతయు వివరించినది కాని కైకనుగూర్చి వల్లెత్తుమాటనక, ఆమె వరములు మామగారి శ్రేయస్సునకే యని పల్కినది. ఆరాత్రి అనసూయ సీతను చక్కగా అలంకరించి రామునిదగ్గరకు పంపినది. ఆమె సీతకు చేసిన అలంకారము సంవత్సరమంతయు చెరిగిపోకయుండునట్టిది. మరియు నా రాత్రి మునులందఱు ఖరదూషణాదులను రాముడు చంపునట్లుగా కోర నిశ్చయించిరి. వారికి నభయమిచ్చి రాముడు ఖరదూషణాదుల నిహతుల గావించెను. అంతియగాక శూర్పణఖ ముక్కుచెవులు గోసిరి. ఈమె రావణునితో తన దైన్యమును చెప్పుకొని చింతించెను. రాముడు పదునాల్గువేల మంది రాక్షసులను రెండు గడియలలో సంహరించెను. అపుడు రావనుడు మారీచుని సహాయము కోరగా నాతడు మాయలేడియై వచ్చెను. సీత ఆ లేడిని కోరగా రాముడు దాని వెన్నంటిపోవుట, తదనంతరము లక్ష్మణుడు పోవుట జరిగినది ఇపుడు సీత పర్ణశాలయందు ఒంటరిగా నుంట చూచి రావణుడు వచ్చి, ఆమెను మాతృభావముతో స్పృశించి తీసికొని పోయెను అంతఃపురమున సీతను గడియ సేపుంచి, పిమ్మట ఉద్యానవనమునందు చెట్టుక్రింద నుంచెను. ఆమెకు నాడువారి కాపలాపెట్టెను. దేవీ అనుగ్రహము లంకపై కల్గునట్లు, పవిత్రతకొఱకు సీతను ఊరంతయుత్రిప్పి చెట్టుక్రింద నుంచెను. ఇక తానుకూడ సీతను చూడవచ్చినప్పుడు పరిశుద్ధుడై, చక్కని వేషము ధరించి వచ్చెడివాడు. అట్లువచ్చిన రావణుడు సీతతో తన్ననుగ్రహింపుమని కోరుచు, కోడివలె రమించెదనని పల్కెను. కోడికి క్షణక్షణము రమించు శక్తి కలదు. ఇచట ఈరమించుశబ్దమునకు అప్పయ్యదీక్షితులు చక్కని వ్యాఖ్యానము చెప్పిరి. రమించుట యన ధ్యానమని భావముకాబట్టి వెంటవెంటనే ధ్యానింపగలనని రావణుని భావమని తేలుచున్నది. కాబట్టి రావణుడు తెలిసిన మూర్ఖుడనుటకు సందేహింప నక్కరలేదు.

ఇక రామరావణ యుద్ధము వచ్చినప్పుడు ముందుగ రావణుని తమ్ముడగు విభీషఱుని పోనడిచినాడు. విభీషణుడు చావని వరము కలవాడు ధర్మపరుడని పేర్పడినవాడు. ఇతడు సీతను రామున కర్పింపుమని చెప్పిన కొలదినేరమునకు నీవున్న నను లక్ష్మివరింపదు లేచిపొమ్మని చెప్పి సభలోపరాభవము చేసి వెడలనడచెను. సీతను రామున కిమ్మని మాల్యవంతుడు మున్నగువార లనేకులు చెప్పలేదా! వారినెల్ల నిట్లుపోనడచెనా! వానికి నీతితెలియదా! తనవాడు బలవంతుడు తనకు వ్యతిరేకముగా నున్న, ప్రభువు వాని బందీకృతు నొనర్చి, కార్యానంతరము విడిచిపెట్టవలెను. తనయంత బలముగల సజ్జనుడగు తమ్ముని బలము తనకుకాకున్న పోనీ యది పరులపాలు చేయునంతటి యజ్ఞుడా! కాకూడదు నీతిజ్ఞులకిట్టి సందేహ మా చరిత్రమున కలుగకమానదు. అట్లు పుచ్చుచో నీ వే మనుజుని గొప్పచేయుచున్నావో వాని బంటువై బ్రతుకు మనెనట! తర్వాత యుద్ధములో నైనను తక్కినవారి గొట్టెనేగాని తన తమ్మునిమీదికి పోయినట్లు లేదు. మయశక్తి వానిపై వైచుటయందును దూరాలోచనముగలదు. రామలక్ష్మణుల సన్నిధానమున నాశక్తి తమ్మునిమీద వేయుటకు నాలోచనమున్నది. విభీషణుడు ప్రత్యస్త్రమేమియు వేయకున్నను అమోఘాయుధము వాని మీదికి వచ్చినపుడు బ్రహ్మస్త్రము స్వయముగా వచ్చి వానిని కాపాడునట్లు వరమిచ్చెను. కాన తన శక్తితో వాడు చావడు. ఇట్లుండ శరణాగతత్రాణ వ్రతముగల రాము డేమిచేయునో చూతమని వాని యాలోచనము. దానికి లక్ష్మణు డడ్డముసొచ్చెను. రాముడా శక్తికి శాపమిచ్చెను.

ఇదియంతయు పర్యాలోచింపగా విభీషణుడు చావనివాడై నను తన వద్దనుండి రామునెదిర్చినవాని చేతులో, కాళ్ళో నఱికి కుంఠితుని చేసి తన పనిరాముడు నెరవేర్చుకొన వచ్చును. రావణసంహారమైన తర్వాత లంకకు రాముడు తన తమ్ములలో నెవరినైన నుంచి పరిపాలింప చేయ వచ్చును. వాలినిజంపి రాముడు సుగ్రీవునకు నారాజ్య మీయలేదా? అట్లే తన్నుజంపి తనరాజ్యము శరణుచెందిన తన తమ్మునకిచ్చిన, రాజ్యము తనవంశమందే స్థిరముగా నుండగలదు. వంశకర్త లేనిచో తనవంశము నిర్వంశమగును. కావుననే రావణుడు విభీషణుని తనపక్షమందు లేకుండ వెడల నడచెను. రావణుని ఆశయమిట్లు ధ్వనించుచున్నది. ''అంగుళ్యగ్రేన తాన్హన్మి'' అని రాముడు విభీషణునకు శరణమీయవలదని సుగ్రీవునితో చెప్పెను. రావణునకు సురాసురులెల్ల సహాయులై వచ్చినను అంగుళ్యగ్రముతో వారినెల్ల సంహరించుటయేకాక మఱల సృజింపగలను. హంగుకొఱకు మిమ్మును దెచ్చుకొంటిని కాని రావణునకు వెఱచికాదు - అని చెప్పి నేను శరణాతగ రక్షణము మరలనని చెప్పి సుగ్రీవునిచేతనే వాని బిలిపించి రాముడు రాక్షస సంహారము కాకముందే విభీషణుని లంకకు రాజుగా పట్టాభిషేకము చేసెను రావణుని యూహ అప్పటికప్పుడే ఫలవంతమైనది.

14

సంస్కృత నాటకకర్తలలో వాసికెక్కిన మురారి అనర్ఘరాఘవమను నాటకమున రామాయణసారము ప్రస్తావనయందే చెప్పెను. -

శ్లో|| యాన్తిన్యాయ ప్రవృత్తస్య తిర్య చోపి సహాయతాం

అపంధానంతు గచ్ఛంతం సోదరోపి విముంచతి ||

అని న్యాయముగా నడచు నాయకునకు తిర్యగ్జంతువులు సహాయమగును. అన్యాయపరుని వాని తమ్ముడే విడిచిపోవును - అని ఆశ్లోకార్థము ఇతడు రామాయణసారమును రెండు మాటలతో రమణీయముగ చెప్పెను.

శ్లో|| యదిక్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్యఛరితం

గుణౖ రేతావద్భి ర్జగతి పునరన్యోజయతి కః

స్వమాత్మానం త త్తద్గుణగరిమ గంభీర మధుర

స్పురద్వాగ్బ్రహ్మాణః కథ ముపకరిష్యంతి కవయః||

అని చెప్పెను. పూర్వకవు లందఱచేత పరిపరివిధముల వర్ణింప బడినదియే రామకథ యని దాని వదలిన నట్టి గొనములతో పుడమిమీద మరల నంతవాడెవ డవతరింపగలడు? అందుకని యూరకున్న రామాయణ మందలి ఆయా గుణాతిశయముల దలచి గంభీరముగా, మధురముగా స్ఫురించు వాగ్భ్రహ్మగల కవులు తమ హృదయముల కెట్లు తృప్తి కలిగించుగొనగలరు? అని శ్లోకాభిప్రాయము.

ఇట్లే కీ.శే. మా తండ్రిగారు తా. వేంకటప్పయ్యశాస్త్రిగారు వారి శ్రీరామకధామృతమను గ్రంథమున నిట్లు వ్రాసిరి.

ఆ| వె| చేనికాపు చెఱకుచెట్టు పెట్టి రసంబు

గాచియచ్చు పోసిc ఘనతబెట్ట

బాకవిదులు దాని బహుభక్ష్య భేదాస్తి

ననుభవింప జేయుట సదు పనియె||

వాల్మీకి మహాముని చెఱకుతోటవేసి దానిరసము పాకముచేసి బెల్లపు అచ్చుపోసి సర్వమధురముగబెట్టినను, ఇతర కవులు తమతమ నానావిధములగు పిండికలిపి చిత్రవిచిత్రములగు రుచులూరు భక్ష్యములుబోలె ప్రతిభా ప్రభావానుసారముగ కృతులు రచించుట సామాన్యపు పనియా? అదియు విశేషమేయని భావము.

రామాదులు పుట్టిన పిమ్మట నొకనాడు దశరధుడు రాముని జాతచక్ర విశేషముల తెలియగోరి వశిష్ఠాశ్రమమునకు బోయెను. అపుడాయాశ్రమమునందు దుర్వాసమహర్షి చాతుర్మాస్యదీక్ష యందుండెను. వశిష్ఠుడు ఇది గమనించి తనకంటె పెద్దయగు దుర్వాసుని రామునిగూర్చి యడుగుమని దశరధునికి ప్రబోధించెను. అట్లేయని దశరధుడు దుర్వాసుని రామునిగూర్చి ప్రశ్నించెను. అందులకు వెంటనే దుర్వాసుడు రాముడు దరిద్రుడగునని దశరధునకు చెప్పగా నాతడు కొందలమంది వానిగూర్చి మరల ప్రశ్నించెను. దుర్వాసుడు రాముని జీవితమున జరుగబోవు విషయములన్నియు వివరించి రామునికథ చదివిన నెంత జడులకును దుఃఖము రాకుండదు అయిన రామకథను జదివి దుఃఖించిన వారికెల్ల మోక్షములభించునని రూఢిగ చెప్పెను. కాబట్టి మొత్తముమీద రాముడు - సాక్షా ద్విష్ణోః చతుర్థాంశః - అని వాల్మీకి వచించెను భగవదవతారమే యగుచున్నాడు ఆతనికి దుఃఖమెక్కడిది? వైకుంఠమునుండియెట్లు ప్లానువేసికొనివచ్చెనో అట్లు నడిచెను. అచ్యుతుడగుదేవునకు లోకముకొరకు చూపు సుఖదుఃఖములు సత్యములు కావు గాన, ఆతడు దుఃఖమయుడు గాడు. రాజవంశమున రావణసంహారార్థము అవతరించిన రాముడు రావణునిక్కడకు పిలిచి గాని, తాను తమ్ములతో, తండ్రితో, మంత్రులతో, సామంతులతో దర్జాగా నక్కడకు పోయిగాని శత్రుసంహారము చేయక, ఒక తమ్ముని మాత్రము చేకొనిపోయి నారలుగట్టి కూరలుదినుచు భార్యతో బీదవానివలె సంచరించుచు కోతులను కొండముచ్చులను ప్రోవుచేసికొని యిట్టినడక నడువనేల యనియు నొక సందేహము విమర్శకులకు తోచకమానదు.

అనేక వీరహోమాదుల చేసి అస్త్రశక్తులు సంపాదించి దేవతల గెలిచియున్న రావణుమీద తాను దేవుడైనను, విశ్వామిత్రు డస్త్రవేదము నుపదేశించినను, పురశ్చరణము చేయక ఆయుధములు వీర్యవత్తతమములు కానేరవని లోకమున విద్యాసంప్రదాయము నెలకొల్పుటకు నట్లు ప్రవర్తించెనని సమాధానించు కొనవలెను.

కాననే మనమిదివరకు చెప్పుకొన్న కాకాసుర వృత్తాంతము సార్ధకమగుచున్నది. కాకున్న రామబాణ మమోఘమన్న పేరు చెడ రాముడు కాకిమీద బ్రహ్మాస్త్రము వేసిన నది దానినప్పుడే కాల్పక మూడులోకములు కాకి తిరిగివచ్చినదాక యోర్చుకొని తిరుగుచున్నదన, ఈ ప్రకారికా కథను బట్టి అతనికేమి గొప్పతనము వచ్చినది? నాయకుని గొప్పతనము చెడగొట్టు పతాకాప్రకరుల కవులు కావ్యముల నిబందింపవచ్చునా?

సుందర కాండమున హనుమంతుడు లంకకు పోవుటంతయు యోగానుగుణముగ చెప్పబడుచున్నది. హనుమంతుడు లంకకు పోవునపుడు సముద్ర లంఘనమునకు విహాయనమున కెగిరెను. విహాయసమనగా యోగమార్గము. ''తతోరావణనీతాయాః సీతాయాః - అని సీత అడుగుజాడ బట్టుటకు చక్రభేదము చేసి బ్రహ్మపదము ద్వారమున ప్రవేశించెను. కాబట్టి హనుమంతుని లంకాప్రవేశము సీతాన్వేషణము యోగమార్గమునకు సంబంధించినదై యున్నది ప్రశస్తమైన హనువు (బుగ్గ) గలవాడగుటచే హనుమంతుడయ్యెను. దీనికి లోకమున ఇంద్రుని వజ్రమునకు బ్రద్ధలు కాలేదుగాన ప్రశస్తములని అర్థము. అంతరార్థమున యోగధారణవలన ప్రశస్తములైన హనువులు కలవాడని భావము తాలువుకూడ దశవిధ ధారణస్థానములలో నొకటిగా లెక్కింపబడినది కాబట్టి హనుమంతునకు హనువులలో ధారణ జరుగుచున్నది. ''శ్రతు సైన్యానాం నిహంతా'' - అన్నచోట అంతరశత్రుసైన్య వినాశకుడు హనుమంతుడు. శత్రుసైన్యము నాతని యేమియు చేయజాలవు. ''అపిమర్ద్య పురీం లంకాం! అభివాద్యచ మైధిలీం! సమృద్ధార్ధోగమిష్యామి - మిషతాం సర్వరాక్షసాం-'' అన్నట్లు రాక్షసుల విఘ్నములు హనుమంతుని యేమియు చేయజాలవు. రాక్షసులు గ్రుడ్లు తెరిచివైచికొని చూచుచుండగనె తాను బ్రహ్మమయుడై పోగలడు. పై శ్లోకముల వలననే సుందరకాండ పారాయణ ఫలము లభింపగలదు. హనుమంతుడు అక్షుని చంపగా ఇంద్రజిత్తు వానిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించెను. కాని అది హనుమంతుని యేమి చేయజాలకుండెను. అయినను హనుమంతుడు ఇంద్రజిత్తుని మోసము చేయుటకు బ్రహ్మాస్త్రమునకు కట్టుబడినట్లు నటించెను. రాక్షసులు వానిని బంధించిరే కాని ఇంద్రజిత్తు మాత్రము తనకు, తమకులమునకు చావు తప్పదని - సంశయితాస్మ సర్వే - అని భావించెను అయినను హనుమంతుని బంధించి తండ్రిదగ్గర అప్పగించెను. రావణుడు హనుమంతుని ప్రశ్నలు వేయగా నాతడు తోకచుట్టపై కూర్చుండి సమాధానము లిచ్చెను. అప్పుడు హనుమంతుడు రావణుని -

గీ|| వాలిసందిట నొక్కి త వగరుదక్కె

కార్తవీర్యుని కొట్టున కందువాఱ

నమ్మగటిమకి తెలిదీవి యన్నులిడ్డ

పుండుపై నేడు పోలేరు బొబ్బవొడమె.

అని యెత్తిపొడిచెను.

వాలి ఒకప్పుడు రావణుని ఆటబొమ్మగ చేసి అంగదుని ఊయెల తొట్టికి కట్టెనట. అట్లే బొమ్మవలె మూడేండ్లుండెనట. మరియు ఒకప్పుడు కార్తవీర్యునిచే పట్టుబడగా రెండువేల వత్సరములకు పులస్త్యబ్రహ్మ పోయి కార్తవీర్యుని బ్రతిమాలి తీసికొని వచ్చెనట. మరియొకసారి నారదోపదేశముచే శ్వేతద్వీపము జయింపబోయెను అచట నున్న దందఱును స్త్రీరూపులే వారందఱు రావణుని చూచి పురుగని భావించిరి. వారిలో నొకతె పట్టుకొనగా దాని చేయి కొఱికెనట. అది విసరికొట్టగా లవణసముద్రమున బడెనట. ఇట్టి పరాక్రమవంతుడు రావణుడు. అంతియ గాక శివధనుస్సు నెత్తజాలని బేలవని కూడ హనుమంతు డాక్షేపించెను. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటింపగా లంకాదహనము జరిగినది. వలదని మండోదరి వాదించుచున్నను వినక రావణుడు చావు కావలయునని కోరి తెచ్చుకొనెను.

ఒకనాడు రావణుడు పశ్చిమ సముద్రము పైకి విహారమునకై పోయెను. దారిలో నాతనికి ఆయుధముల దగ్గరనుంచుకొని తపస్సు చేయుచున్న కపిలమహాముని కనిపించెను. రావణుడా కపిలుని యుద్ధమున కాహ్వానించెను. కపిలు డా రావణు లెక్కచేయక చేయెత్తియు నంతగా నడిచిన చచ్చునేమో యని చేయియూపు తగ్గించి కొట్టెను. ఆ దెబ్బకే రావణుడు దద్ధరిల్లి మూర్చనొందెను. మూర్చదేరి లేచి చూచుసరికి కపిలుడొక రంధ్రమును జొచ్చి యొకగుహయందు ప్రవేశించెను. ఈ విషయము ప్రహస్తుని వలన తెలిసికొని, కపిలుడు భగవంతుడని భావించి రావణుడు తానును తన ఆయుధముతో నాకన్నమున దూరిపోయెను. పోవుచుండగా నాతనికొక చక్కని సౌధము కన్పించెను. అది సమస్త రాజభోగములతో నలరారుచుండెను. దాని చుట్టును మూడుకోట్లమంది విశిష్టాద్వైత భక్తులు బరాబరులు చేయుచుండిరి. రావణుడెట్లో మెల్లగా ఆ భవనమునందు ప్రవేశించి చూచెను. అందొక హంసతూలికా తల్పమున్నది. దానిపై నొకమహాపురుషుడు సన్నని వస్త్రమును గప్పుకొని శయనించి యుండెను. ఆతని పాదములచెంత లక్ష్మిదేవి కూర్చుండి పాదసేవ చేయుచుండెను. ఆ లక్ష్మీ సౌందర్యము చూచి రావణుడు ముగ్ధుడై ఆమెను గైకొని పోవుటకు చేయిచాచెను. అంత శయనించియున్న మహాపురుషుడు ముఖముపై వస్త్రము తొలగించి రావణునిచూచి ఒక్కసారి హుమ్మని కోపించెను. ఆ కోపముతో ముక్కునుండి వచ్చిన గాలికి రావణుడు అల్లంతదూరమునపడెను. ఈ మహాపురుషుని అద్భుతచర్యకు ఆశ్చర్యచకితుడై ఆతనిని ఎవరని ప్రశ్నించెను. అపుడాతడు నిన్ను చంపెడువాడ లెమ్మని వేషము వేసికొని వచ్చెదనని మాయమైపోయెను. ఇట్లు కపిలముని ప్రవచనములనను, సనత్కుమారుని మాటవలనను రావణుడు తాను భగవంతుని చేతియందు చచ్చుట నిక్కమని భావించెను. రావణుడు దుర్మార్గుడైనను చాలగొప్పవాడు. తన నిర్యాణమునకే నీతి విరహితమైన పనులనెన్నింటినో చేసెను కాబట్టి సీతను దీసికొనిపోవుట కామముకొఱకు గాక మోక్షము నొందుటకే యని తెలియవలెను. కావుననే నలకూబరు శాపమాతని నేమియు చేయలేదు.

యుద్ధ ప్రారంభమునకు ముందు హనుమంతుడు చూచి వచ్చిన తర్వాత అంగద రాయబారము జరిగినది. రావణుడు హనుమంతుని, అంగదుని కూడ ఆక్షేపించెను. రావణునకు స్వర్గజయము నాటికి నాలుగువేల ఆక్షౌహిణుల సేనకలదు. రామయుద్ధము నాటికి ఇంకను పెరిగినదని విభీషణుడు చెప్పెను. విభీషణుని సాయముతో రావణుని రాముడు నిశ్శేషముగా వథింపకల్గెను కాని యుద్ధమున కుంభకర్ణునికి విభీషణుడు నమస్కరింపగా కుంభకర్ణుడు విభీషణుని తన యెదుట పడకుండ తప్పించుకొని యుండుమనెను. రావణుడు రామునిశక్తి పరీక్షించుటకు విభీషణునిపైశక్తి ప్రయోగము చేసెను ఆ సమయమున లక్ష్మణుడు వానిని వెనుకకు నెట్టి తాను ముందుండి శక్తిచే మూర్ఛనొందెను. రాముడు కోపించి రావణు శక్తిని హతాశాభవ దుర్బుద్ధే - అని శపించెను. ఈ శాపముతో శక్తికి తేజస్సు తగ్గిపోయినది కాని లక్ష్మణమూర్ఛ తప్పలేదు. ఇక రాముడు ఆశక్తిని లక్ష్మణు హృదయమునుండి పీకి విరువబోవ రావణుడు వానిపై కుప్పన గూరలుగ బాణములు గురిసెను. రాముడు వాని లెక్కచేయక ఆశక్తిని పీకి విరిచి పారవైచి లక్ష్మణు శరీరము గాపాడ హనుమకు నప్పగించి రావణుని శరీరము జల్లెడవలె బాణములచే తూట్లు గావించెను. ఇపుడు రావణునకు భయము వేయగా పారిపోదలచిన, రాముడు వానిని యుద్ధము మాని పొమ్మనెను తనవంటివానికి భయపడినవానితో యుద్ధము చేయుట న్యాయముకాదనికాక యుద్ధములో రావణుని లెక్కచేయక విడిచివేసెను. ఇది రామునకే చెల్లునుగాని చేతికి చిక్కిన శత్రువు నే యోద్ధయు విడిచిపుచ్చడు. రావణుని విడిచిన నాతడింకను రాక్షసబలము దేగలడు. వాని చంపిన దుష్టులగు రాక్షసు లింకను మిగిలిపోవుదురని రాముని అభిప్రాయము. ఇట్లు గాలించి గాలించి రావణుడు పంపుచుండ క్రోతులవలన రాక్షసబలము లెల్ల నిహతములగు చుండెను. సర్వ రాక్షస హననమైన పై మూలబలము నెల్ల జక్కాడి రాముడు తుదకు రావణు జంపెను. రావణ మరణానంతము రాముడు విభీషణుని శాస్త్రప్రకారము రావణునకు ఉత్తరక్రియలు జరుపుమని ఆజ్ఞాపించెను - ''మరణాంతాని వై రాణి'' - అని చెప్పి మరణముతో వైర మంతరించి పోయినదని అంత వానికి చక్కగా శ్రాద్థాదులు జరిపించెను.

ఇక రావణ వధతో విభీషణుడు సీతను రామున కప్పగించెను. అపుడు సీతను చూచినంత రాముని ప్రకృతి మారెను. ''రావణాంక పరిభష్టా నమా మర్హసి మానిని'' అనుచు రావణాంక పరిభ్రష్టయని నిందించెను. అంతియగాక భరత సుగ్రీవ లక్ష్మణులలో నెవరియొద్దనైనను కాలము గుడుపుమనియు ఆజ్ఞాపించెను. ఇచట వాల్మీకి చెప్పినమాట అనౌచిత్యముగా నున్నదని కొంద ఱనుచున్నారు. ఇంతియ గాదు మరొకడు రామాయణము నాటికే విడాకులున్నవని భావించెను. మూలమున - భరతే లక్ష్మణ వాసి - అని సప్తమి యున్నది. కాబట్టి, దానికి వృత్తిత్వ మర్థము చెప్పవలసియున్నది. అందుచే బిడ్డలవంటి భరత లక్ష్మణుల దగ్గఱనుండి గాని, సామంతులైన సుగ్రీవాదుల యొద్దనుండి గాని తపోవ్రతము సాధింపుమని యర్థము గాని, ఇందు విపరీతార్థము అనౌచిత్యము ఏమియూ లేవని భావించవలయును. రాముడు అక్కరలేదని నిందించిన సీత మాయాసీత అసలు సీత అగ్నులయందు దాగియున్నదని చెప్పియుంటిని. మరియు రామాయణమున ''ప్రియాతు సీతా రామస్య'' రామునకు సీత ప్రియమైనది. అని యున్నది గనుక తు అన్న శబ్దము వలన రామునకు చాలమంది భార్యలుండిరని భావించుచున్నారు. కాని ఇది సమంజసము కాదు. సీతను రావణుడు తీసికొనిపోయినపుడు రాముడు సీతకై మిక్కిలి విలపించెను. తర్వాత సాయములేక ఏడుగడపినను సుగ్రీవుడు తోడైన తర్వాత వెంటనే సీతను వెతకు పని బూనక రెండు నెలలు నీ యింటికిబోయి రాజ్యసుఖము లనుభవించి రమ్మనెను. సుగ్రీవుని పిలుచుకొనిరమ్మని లక్ష్మను నంపెను. 40 దినములు లక్ష్మణుడు లేకుండ ప్రస్రవణాద్రియందు నొంటరిగ రాముడు తపించినట్లు కనబడుచున్నది. ఇపుడు సీత కన్పింపగా అగ్నిప్రవేశము చేసిరమ్మనెను. అట్లే సీత పరిశుద్ధయై రాగ యింద్రాది దేవతలు - దశరధుడు కూడ అతనినిచూచి ప్రశంసించుటకు వచ్చిరి రాముడపుడు తండ్రిని చూచి కైకను దిట్టిన విషయము స్మృతికి దెచ్చి శాపము తొలగింపుమని ప్రార్థించెను. అట్లే యని దశరథుడు తొలగించెను. రాముడు సీతతో అయోధ్యకు వచ్చుచు మార్గమధ్యమున భరద్వాజాశ్రమమున విందారగించెను. అక్కడ నుండియే భరతునకు తమ రాకను గూర్చి హనుమతో సందేశమంపెను సీత కెట్టి లోకోపవాదము రారాదని రాముని అభిప్రాయము ఇక అయోధ్యకు రాగనె మరల రాముడే రాజు కావలసివచ్చినది. కాని రాముడు లేనియప్పుడు భరతుడే రామపాదుకల బెట్టుకొని పాలన సాగించెను. రాముడు వచ్చినపుడు ఆ భరతుడు దాని నంగీకరింపకపోయెను. కాని రాముడిపుడును రాజగుట కంగీకరింపలేదు. తర్వాత భక్తివశ్యుడై భరతుని పేరుమీద రాముడు పదివేలయేండ్లు పరిపాలించెను. అందువలననే లోకమున - రాముని రాజ్యం భరతుని పట్టం - అను సామెత పుట్టినది.

15

ఇక ఉత్తరరామాయణము దగ్గరకు వచ్చితిమి శ్రీరాముడు సీతను దెచ్చిన పిమ్మట పదివేల వత్సరములు జరిగిన పై పాలనను గురించి ప్రజలేమనుకొనుచున్నారో తెలిసికొనవలయునని గూఢచారుల నియమించెను. గూఢచారు లందఱు రాముని పాలనకు ప్రజలు రంజిల్లుచున్నారని చెప్పిరి. కాని రాముడు తనను గూర్చి నిందించువారిని తెలుపుడని కోరెను, వారిలో భద్రుడనువా డొకనాడు రావణుడు కొనిపోయిన సీతతో రాముడు కాపురయుము చేచున్నాడని ప్రజలు నిందించుచున్నారని రామునకు తెల్పెను. అంతకుముందురోజే రాముడు సీత చెవిలో నొక విషయమును గుసగుసలాడెను. అందలి రహస్య మేమన సీత నిక దేవతలు దేవలోకమునకు రమ్మని ఆహ్వానించిరట అంతియగాదు. సీతకు పిమ్మట రాముని కూడ రమ్మనిరి. ఈ విషయ మిట్లుండగా మరునాడే లోకోపవాదము వచ్చినది రాము డిదే సమయమని తన తమ్ముల రావించి లోకోపవాదము తెలియజేసెను. తమ్ములు వచ్చునపుడు భరతుడు కాలినడకతో బయలుదేరెనట. లక్ష్మణుడు రథమున, శత్రుఘ్నుడు అశ్వముపై బయలుదేఱిరి. కానీ అందఱకంటె భరతుడె ముందుచేరెనని లక్ష్మణుడు చెప్పుచున్నాడు. కాబట్టి రామునిపై భరతునకుగల ప్రీతి యెట్టిదో వ్యక్తమగుచున్నది.

రాముడు సీతనుగూర్చి దుఃఖించుచు, చేయవలసినదేమి యని తమ్ముల ప్రశ్నించెను. భరతుడు మరల తన తల్లిపై ననుమానముపడెను. లక్ష్మణుడు రామునిది స్త్రీదుఃఖమే యని భావించి, ఈసారి సీతపనినేమియు చేయనని మదిలో దలచెను. ఇక రాముడు తమ్ములు ప్రత్యుత్తరమియకుండుట గమనించి తానై లక్ష్మణునితో సీతను గంగ కావలియొడ్డున విడచిరమ్మని చెప్పెను. అంతియగాక సీత తాను గంగాతీరము చూడవలయునని కోరిన కోరిక ఈ రీతిగా తీర్చుమని లక్ష్మణున కాదేశించెను. సీత పోబోవునపుడు చెల్లెండ్రు అందఱు చూడవచ్చిరి. వారందఱకు పారితోషికము లర్పించి సీత తాను రేపే ఋష్యాశ్రమాదుల చూడబోవుచున్నానని పల్కెను. ఇక తప్పదనుకొని వేకువనే లక్ష్మణుడు రథముపై సీతను గంగాతీరమున దించి, అపుడు లోకోపవాదమును గూర్చి విన్నవించెను. అందులకు సీత తల్లడిల్లి లక్ష్మణునకు మరియొక జన్మలో రామునే భర్తనుగా చేసికొందునని చెప్పుమని కోరినది. మరియు లక్ష్మణుడు పోబోవునపుడు సీత ముసుగు తొలగించి తనను ఒకసారి తిలకించుమని కోరినది. అందులకు కారణము తాను ఇపుడు గర్భవతిననియు దీనికై మరొక లోకోపవాదము రాకుండుటకై యని పల్కినది. అందులకు లక్ష్మణుడు మిక్కిలి దుఃఖించి, రాముడులేని సమయమున తానిట్లు చూడజాలనని పల్కి నమస్కరించెను. ఎట్టకేలకు ఆమెను వదలి రథముపై నెక్కి మూర్చనొందెను. కొంతసేపటికి సేదదేఱి దుఃఖించెను. సుమంత్రుడు మాత్రము లక్ష్మణుని ఆర్తిచూచి బాధపడెనే గాని తనకుమాత్రము ఇట్లు జరిగినందుకు దుఃఖములే దనెను. అందులకు కారణము సుమంత్రుడు రామునిగూర్చి దుర్వాసుడు చెప్పినదంతయు తెలిసియుండుటయే కారణము దుర్వాసుడు రాముని గూర్చి చెప్పిన కథ యంతయు ఎవ్వరికి చెప్పక రహస్యముగా నుంచవలయునని దశరధుడు సుమంత్రునితో చేతిలో చేయివేయించుకొనెను. ఈవిషయముకూడ లక్ష్మణునితో సుమంత్రుడు చెప్పెను. కాబట్టి జరుగనున్నది జరుగకమానదని సుమంత్రుడు లక్ష్మణుని దుఃఖించక ఊరకుండుమనెను. అంతియగాక సీత కెట్టి లోపమును రాదనియు ఇరువురు కొడుకులు పుట్టెదరనియు వారు రాముని తర్వాత నయోధ్యనేలుదురనియు పల్కెను. లక్ష్మణుడు కొంత తృప్తిపడి ఇంటికి పోయి రామునితో సీత విషయము నివేదించెను. అరణ్యమునందు సీత లక్ష్మణుడు పోగనే బిట్టు విలపించుచుండెను. ఈరోధన ధ్వనిని వినిన మునికుమారులు పోయి వాల్మీకికి చెప్పగా నాతడు వచ్చి సీతను తన ఆశ్రమమునకు తోడ్కొని పోయెను. ఈమె ఎవఱని మునిపత్నులందఱు ఆశ్చర్యము నొందగా వాల్మీకి తాను ప్రతిదినము సీతను సమాధిస్థితి యందు చూచుచుందుననియు ఈమె శ్రీరాము పత్ని సీతయనియు పల్కెను. ఇక సీతమున్యాశ్రమమునందు వారిచ్చిన కందమూల ఫలాదులతో తృప్తినొంది దుఃఖము కొంత మరచిపోయినదట.

ఇదివిని ఆధ్యాత్మ రామాయణమున పార్వతి శివుని రామకథ అవకతవకలని ఆక్షేపించినదట ఏలన ఒక మహారాణిపై అపవాదురాగా విచారింపక అడవులకంపుట అన్యాయముకాదా యని ఆక్షేపించెను. అంతియగాక రాముడు అవతారము చాలింపదలచిన చెప్పిపోవచ్చునుగదా ఈ వాదులు, ముందొకరు వెనుక ఒకరు పోనేల? అని ఆక్షేపించినది. అపుడు శివుడు పార్వతికి - రాముని ప్రారబ్ధములు చాల కలవనియు, అవి విష్ణ్వావతారమున ప్రాప్తించినవనియు వాని పాప ఫలితమిప్పుడు అనుభవింపక తప్పదనియు నిరూపించెను.

ఒకప్పుడు దేవదానవులకు యుద్ధము కల్గినది. దానవులు పరుగెత్తుకొని వచ్చి భృగుమహర్షి ఆశ్రమమున దాగియుండిరి. వీరిని బట్టుకొనుటకు ఇంద్రుడు, విష్ణువు వెన్నంటిరి. రాక్షసులంతలో భృగ్వాశ్రమమున బ్రవేశించి, భృగుపత్నిని శరణమడిగిరి. వీరిద్ధరు భృగ్వాశ్రమమున ప్రవేశించి యడుగగా భృగుపత్ని వారిపై కోపించినది దానికి భయమంది ఇంద్రుడు మొదటనే వెనుకకు తగ్గియుండెను. కాని విష్ణువు మాత్రము అడ్డువచ్చిన భృగుపత్నిని చక్రముచే ఖండించి రాక్షసుల నంతమొందించెను. పత్నీ విరహితుడైన భృగువు విష్ణువుపై కోపించి ఆవేశముతో నీవు నీభార్య చావగా నిట్లే యేడ్చెదవని - శపించె. కాని విష్ణువు నీశాప శక్తి నన్నేమియు చేయజాలదని త్రోసిపుచ్చి వైకుంఠమునకు బోయెను. అట్టియెడ నాశక్తి భృగువునే బాధింప మొదలు పెట్టెను. అందులకు విష్ణువు దయామయుడు గాన భృగుశాపమును రామావతారమున ననుభవించెదనని పల్కెను. ఈ శాపఫలితము వేయివత్సరము లనుభవింపవలసి యున్నది. కావుననే రాముడు ఇన్నివత్సరములు సీతను వదలియుండవలసి వచ్చినదని పార్వతికి శివుడు బదులు పల్కెను.

వాల్మీక్యాశ్రమమున సీతకు ఇద్దరు మగబిడ్డలు జన్మించిరి. ఆ బిడ్డలలో నొకనిని కుశము (దర్భ) తోను, మరియొకనిని లవము (ఆవుతోక వెండ్రుక)తోను అభిమంత్రించుటచే వారు కుశలవులైరి. ఒకప్పుడు శత్రుఘ్నుడు లవణాసురుని చంపుటకు పోవునపుడు అప్పుడే పుట్టిన కుశలవులను చూచెను. అతడు తిరిగి వచ్చునపుడు వాల్మీకాశ్రమమున విడిదిచేసెను. ఆ సమయమున శత్రుఘ్నుడు కుశలవుల రామాయణ గానమును వీనులవిందుగా వినగా, సామంతులు వారినిగూర్చి వాల్మీకిని అడుగుమనిరి. కాని శత్రుఘ్నుడందుల కంగీకరింపక మిన్నకుండెను. మరునాడు శత్రుఘ్నుడు అయోధ్యకు పోయెను. కొంతకాలమునకు రాముని అశ్వమేధమునకు వాల్మీకి కుశలవులతో పోబోయెను. కాని కుశుడు తమ జీవితము పూర్తిగా మారబోవు చున్నదని యూహించి వాల్మీకిని తత్త్వోపదేశము చేయుమని కోరెను. అపుడు వాల్మీకి సంకల్పము నాపిన నున్న తత్త్వముండునని చెప్పెను. ఇదియే చరమవృత్తి, తుది బ్రహ్మలో లయమగునని పల్కెను. ఇక వారు బయలుదేఱి అయోధ్య చేరిరి. అచట వాల్మీకి కుశలవులను కూరలు, దుంపలు తిని రామాయణగానము రాజ వీధులందు చేయుచుండుడని ఆజ్ఞాపించెను.

శ్లో|| కర్శయంత శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః

మాంచైవాన్త శ్శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్‌ ||

అని యుపదేశము శరీరమును శుష్కింపచేయరాదని పల్కుచున్నది. ఉపవాస మనునది అరణ్యకులకు, విధవలకు, సన్యాసులకు తప్ప వేరెవ్వరికి అక్కరలేదు. కావున గృహస్థుడు - అతిధిభ్యో అన్నంపచామి అని వంటతయారు చేయవలసినదిగా గ్రహింపవలయును. అతిథులకు పెట్టి మిగిలినది భుజించియుండుట వీరి ధర్మము.

కుశలవులగానము రామునకు వీనులవిందుకాగా వారిని పిలిపించి సవనశాలయందు పాడుమని కోరెను. వారు రామాయణగానము చేయగా విని తన కథయే యని భావించి వాల్మీకిని ఈ విషయమై అడగిరమ్మని తనవారి నంపెను. అంతియగాక సీతనుగూడ అడుగుమని చెప్పెను. వాల్మీకి ఆనతిపై సీతప్రతిజ్ఞను అందఱు వినవలయునని రామునికోరికయై యున్నది. మరునాడు రాముడు సీత పాతివ్రత్యముగూర్చి అందరిని వినవలసినదిగా కోరి సమావేశపరచెను. ఋష్యాదులు అందఱు ఆ విశేషముచూడవచ్చిరి. వాల్మీకి, అతనివెంట సీత దోసిలియొగ్గి మూర్తీభవించిన పాతివ్రత్యమువలె వచ్చినది. వాల్మీకి జరిగినదంతయు చెప్పగా రాముడు సాంతము వినెను. ఇక సీత పాతివ్రత్యమునకు శపథముచేయుచు భూదేవిని ప్రార్థించి ఆమెయందు ప్రవేశించినది. అందులకు రాముడు కోపించి నారాయణాస్త్రమును ప్రయోగించెను. అపుడు బ్రహ్మాది దేవతలు ఉన్న సంగతి వివరించి రాముని శాంతపరచిరి. పిమ్మట రాముడు శాంతించి కుశలవులతో కాలము గడపుచు రాజ్యము చేయుచుండెను. ఇట్లు వెయ్యేండ్లు రాజ్యపాలనము సాగినది. ఇట్లు విష్ణుని భృగుశాపము తీరినది.

ఒకనాడు యముడు బ్రాహ్మణునివేషమున వచ్చి రామునితోనేకాంతముగ సంభాషించుచు, ఎవ్వరు లోనికి రారాదనియు అట్లు వచ్చినవానిని చంపవలసినదిగా రామునివద్ద మాట తీసుకొనెను. ద్వారము నొద్ద లక్ష్మణుడు రామాజ్ఞచే కావలికాయుచుండెను. రాము డట్లేయన సంభాషణ సాగుచుండెను. ఇంతలో దుర్వాసుడు రామదర్శనార్థము విచ్చేసెను. కాని లక్ష్మణుడు అంగీకరింపకయున్న, దుర్వాసుడు శాపమివ్వ నుంకించెను. అట్టి యెడ చేయునదిలేక లక్ష్మణుడు లోనికేగి దుర్వాస ఆగమనవార్త తెలియబరచెను. అంతలో యముడు తన సంగతి చెప్పుచు, రాముని స్వర్గమునకు రమ్మని జ్ఞాపకముచేయుటకు బ్రహ్మ తనను బంపె ననెను. అంతరాముడు తానువచ్చినచోటుకు పోగలనని పల్కెను. ఇక తనకిచ్చినమాట వమ్ముకారాదు అని యముడు లక్ష్మణుని విషయమై అనిపోయెను. వచ్చిన దుర్వాసుడు చక్కగా భోజనముచేసి పోయెను. సంధిగ్ధావస్థయందున్న రాముడు లక్ష్మణుని చంపలేక, ఊరకుండలేక దుఃఖించెను. మరునాడు వశిష్ఠాదుల రావించి సభలో వివరించెను. ఋష్యాదులు నాగరులు లక్ష్మణుని చంపరాదని పలికిరి. చివరకు వశిష్ఠుడు ఇక్ష్వాకుల సత్యసంధత్వమును వివరించి, లక్ష్మణుని చంపుమనియే అభిప్రాయ మిచ్చెను. కాని రామునకు చేయాడలేదు. కావున తమ్ముని పరిత్యజించెను. పరిత్యజించుట చంపుటతో సమానమే యగునుగదా! కాన లక్ష్మణుడు మహాప్రస్థానముపోయి సరయునందు ప్రవేశించి అవతారము చాలించి ముందుగ స్వర్గమున కేగెను.

ఇక రాముడు భరతశత్రుఘ్నుల రావించి భరతుని రాజ్యముగైకొనుమని పల్కగా భరతుడు నీయదికాని రాజ్యము నాదికాదని యుగ్గడించెను. ముఖ్యముగ రాముడు రాజ్యముతనదికాదని కేకయునివాక్య ప్రకారముతండ్రి భరతుని కీయవలసినది గాన ఇచ్చెదనని గట్టిగా చెప్పెను. కాని రాముని బలవంతముపై భరతుడు రాజ్యమును అన్నగారిపై నున్న భక్త్యనురాగ సూచకముగ కుశునకు పట్టాభిషేకము చేసెను. అపుడు రాముడు స్వార్జితమని కుశున కొక యుంగరము మాత్రమే ఇచ్చెను. ఈ ఉంగరము అగస్త్యునిచే దానమివ్వబడినదిగాన తనకు స్వార్జితమైన దదియే యని భావించి దానిని కుశునకు అప్పగించెను. ఈ ఉంగరము అగస్త్యున కెట్లు లభ్యమైనదనగా నొక యైతిహ్యమున్నది. శ్వేతుడనువాడు రాజర్షి. మూడువేలవత్సరములు తపమాచరించి శరీరపతనమై బ్రహ్మలోకమున కేగెను. కాని ఆతనికి ఆకలిదప్పులు పోలేదు. అట్లుండుటకు కారణమేమని బ్రహ్మనుప్రశ్నించెను. బ్రహ్మ శ్వేతుని తపస్సునుగూర్చి వర్ణించి, తపమువలన బ్రహ్మలోకము వచ్చినది. అతిధిపూజలేని మహారణ్యమున వసించుటచే నాకలిదప్పులు పోలేదనెను. కావున శ్వేతుని తన పూర్వ శవ శరీరమాంసమును తినుచుండు మనెను. అట్లే ప్రతిదినము శ్వేతుడు తన శవశరీరభాగములను కోసి తినిపోవుచుండెను. కాని మరునాటికి ఆశరీర భాగము లన్నియు చక్కగా పూడియుండును. ఇట్లు జరుగుచుండగా నొకరోజు అగస్త్యముని ఆ అరణ్యమున చెఱువుగట్టుపై తపస్సుచేసికొన ప్రయత్నించి ఆ రాత్రి యక్కడ పండుకొనెను. మరునాడు శ్వేతునివిమానము వచ్చినది శ్వేతుడు తన అలవాటు ప్రకారము పీనుగును కోసుకొని తినుచుండెను. ఇది చూచిన అగస్త్యుడు అందులకు కారణమేమని ప్రశ్నించెను. శ్వేతుడు తన వృత్తాంతమెల్ల వానికిచెప్పి, బ్రహ్మ అగస్త్యుని చేతనేమైన బెట్టిన నీ అదత్తదోషము పోవునని చెప్పెను. గాన మహానుభావా! యీయుంగరము నిచ్చెదను గొనుమని ప్రార్తించెను. కాని అగస్త్యుడు తనకక్కరలేదనెను. ఎట్టకేలకు వానిని యుద్ధరించుటకు ఆ యుంగరము గైకొనగా నాశవము మాయమైనది. వాడును విమానమున ఆకలి దప్పులులేని స్థితినొంది దివ్యలోకమున కేగెను. ఇట్లు అగస్త్యునకు లభించిన మణిమయమగు నుంగరము రామున కివ్వబడినది. దీనిని రాముని ఇంద్రాంశము నీయందుగలదు గాన గ్రహింపుమని అగస్త్యుడు ప్రబోధించి ఇచ్చెను. ఈ యుంగరమునే రాముడు కుశునకు ఇచ్చెను.

మరియు రాముడు పితృవాక్య పరిపాలనయందు తనకంటె పరశురాముడు కారణమేమన తండ్రియాజ్ఞాపింపగనే తల్లిగొంతు కోసివేసెను. ఇట్టిపని మిగిలిన నల్వురు కుమారులు చేయజాలరైరి. అపుడు జమదగ్ని కుమారుని భక్తికి మెచ్చి వరమడుగు మనగా తల్లినీ బ్రతికించుమనియు, అన్నల శాపము తొలగించుమనియూ ఈ ఘోరకృత్యము తల్లి మరచి యుండునట్లును చేయుమని కోరెను. కాబట్టి పరశురాముడు తనకంటె మిన్నయని రాముడు పలికెను. కాని యింతకంటెను పితృవాక్యపరిపాలనయందు పూరుమహారాజుగొప్పవాడగుచున్నాడు ఏలన తండ్రి వార్ధక్యమునుబాపి, తాను స్వీకరించిన యుత్తముడు. కాబట్టి పరశురామునికన్న పూరుడే గొప్పవాడని రాముడు చెప్పెను.

రాముడే తాను అవతారము జాలించునపుడు తనతో రాదలచిన వారి నందఱను రమ్మనెను అపుడు మానవులేగాక వృక్షాదులుకూడ బయలు దేఱినవి. అందఱు సరయువువద్ద శరీరములు వదలి దివ్యవిమానములలో పోగా ఇంద్రుడా హ్వానించి ప్రశంశించెను. ఇక తనతో వచ్చిన వారల నందఱను బ్రహ్మకు నప్పగించి గోలోకమున నుండుడని పంచితాను వైకుంఠమునకు వేంచేసెను. ఇక రాజ్యపాలన చేయుచున్న కుశుడు ఎవరులేని యయోధ్యయందలి రాజ్యము నాకేలయని మరియొకచోట రాజ్యపాలన సాగించెను. అంత అయోధ్యలోని కోటశక్తి కలలోనికివచ్చి విలపించి తనదురవస్థ విన్పించినది. ఆ శక్తి అయోధ్యను పాలింపు మనగా మరల కుశుడువచ్చి పాలించుచుండగా, అందలి ప్రజలు రామునే మరచిపోయిరి. ఒకరోజు కుశుని ఉంగరము సరయూనదియందు జారిపడినది. ఈ విషయము మంత్రి కెఱింగించగా, నతడు వెదికించి విసిగివేసారి దొరకలేదని విన్నవించెను. ఇక చేయునదిలేక కుశుడు తనతండ్రి యిచ్చిన ఉంగరములేనందున దుఃఖించి, కోపించి ముల్లోకములు దహించెదనని నారాయణాస్త్రమును ప్రయోగింప నెంచెను. ఆ అస్త్రప్రభావమున లోకమంతయు పొగలు క్రమ్మినవి. పాతాళమున వాసుకి ఇదిచూచి, ఆశ్చర్యచకితుడై, జరిగినది తెలిసికొని, ఆ యుంగరము పాతాళమున నుండి యుండునని భావించి తీసినవారిని తెచ్చియిమ్మనెను. ఆ యుంగరము కుముద్వతి యను నాగకన్యకకు దొరికినది. ఈ విషయము వాసుకికి నివేదింపగా, దాని తండ్రితో నుంగరము కుసున కిచ్చివేయవలసినదిగా ఆజ్ఞాపించెను. వారి ప్రార్థనతో వాసుకి వారితో భూలోకమునకువచ్చి ఆయుంగరమును కుశునకు సమర్పించెను. అపుడు కుసుడు నారాయణాస్త్రము నుపసంహరించుకొనెను. మరియు సర్పరాజుల అభ్యర్థనతో కుశుడా కుముద్వతిని పెండ్లియాడెను. వివాహానంతరము నాగులందఱు కుశునకు బంధువులైతిమి గనుక, కుశుడు మాకు వరమీయవలెనని కోరిరి. కుశుని రాజ్యపాలన పర్యంతము గరుత్మంతునిబాధ లేకుండునట్లు నాగకులము వరము నొందెను. మరియు మానవుల అభ్యర్థనతో తన రాజ్యపాలనయందు మానవులుపాము కాటునకు గురికారాదనియు శాసించెను.

ఇట్లు ఇక్ష్వాకురాజులు ఉత్తమోత్తములై మానవులకు మార్గదర్శకులై వెలయుచున్నారు. తరువాత కుముద్వతీకుశుల వంశవృక్షము నలుబది తరములదాక యితర పురాణములంబట్టి కాళిదాసుడు కీర్తించెను. ఇట్టి రామాయణ గేయకావ్యరూపమగు నితిహాసమును లోకవ్యవహారములు, ధర్మకర్మములు, నివృత్తమార్గములు, తత్త్వానుభవములు మున్నగునవి యెన్నియో పాఠకులు గ్రహింపవలసి యున్నది. ముందు ప్రకృత గాధ యందలి పూర్వపర విరోధము లేకుండ సమన్వయము కుదురుట కష్టము తరువాత తక్కినవన్నియు గ్రహించుట అంతకన్న కష్టము. కాన ఈ గ్రంథము లేకపోయిన నేమ అనకూడదు. ''వాఖ్యానతో విశేష ప్రతిపత్తిర్నహి సందేహ దలక్షణం'' అని పరిభాష. వ్యాఖ్యానములవలన పెద్దల వాగ్ధోరణుల వలన గురువుల సంప్రదాయముల వలన రహస్యముల నెఱుంగవలయును. నాకు తెలియుననువాని కేమియు తెలియదని యుపనిషత్తు తెలుపుచున్నది.

16

శ్లో|| అవతారాస్సంత్వన్యే సరసిజనయనన్య సర్వతో

కృష్ణాదన్యఃకోవా ప్రభవతిగోగోపగోపికా ముక్త్యైభద్రా ||

మనకు భగవ దవతారములు అనేకము లున్నవి. వానిలో కృష్ణావతారము చాల విశిష్టమైనదిగ వర్ణింపబడెను. ఏలన ఈ అవతారమున భగవంతుడు పెక్కుమందికి మోక్షప్రాప్తిని కల్గించుటవలన నని శ్లోక భావము. కాబట్టి కృష్ణావతారము తనంతట తాను లోకమున ప్రభవించుటచే లీలావతారమై వైశిష్ట్యము నొందుచున్నది. ఇక రామాది అవతారములు శాపగతావతారములుగా పురాణములు పేర్కొనుచున్నవి. ఇప్పుడీ కృష్ణపరమాత్మను మనము రెండు విధములుగ చూడవలయును. భాగవత కృష్ణుడని భారతకృష్ణుడని ఇరుతెఱంగుల చూడనగును. భాగవత కృష్ణునిలో వ్యభిచారము, అలౌకిక శక్తుల ప్రదర్శనము మొదలగునవి అన్నియు గలవు. ఇక భారత కృష్ణుడన్నచో మర్యాదల దొలగనీని పెదమనిషిగా కన్పట్టును. శ్రీకృష్ణుడు పదియవమాసమందే వ్యభిచారము చేసినట్టు - మేఘైర్మే దురమంబరమ్‌ - అను శ్లోకము తెల్పుచున్నది. ఈ కృష్ణ పరమాత్మయందలి మణికాంతివంటి భగవత్తత్త్వము తెలిసికొని ఆనందించుటవలననే గోగోపికాముక్తి లభించినది. ఈ కృష్ణదేవుని చరితములు - పురిటిలోపలనే పూతనను జంపుట, ఆరునెలలవాడై శకటాసురుని, ఏడాది బాలుడై తృణావర్తుని జంపిన యిట్టి అనేకాద్భుతములబట్టి వానీ స్వరూపమిట్టిది యని చిత్రింపరాకున్నది. కాన నీ కథయే అసత్యమన్న ఇక మనపంట పండినట్లే. సత్యపక్షమున సమన్వయము చేయవలయునుగదా! ఆ ప్రకరణములోని వర్ణనమునుబట్టి శరీరాతీతమైన అఖండతేజమా కృష్ణపరమాత్మ శరీరమునకు తానువేరుగా నుండి శరీరకృత్యము తనదికాదనివ్యవహరించినట్లు కనబడుచున్నది. అత్రి మొదలగు మహర్షులకే అట్టి శక్తి యుండ భగవంతుని విషయ మేమనవలెను? అందువలననే శంకరులు - ఈ శరీరముతో వ్యభిచరించినను దోషము తనకంటదని లోకము కొఱకు పరకాయప్రవేశముచేసి కామశాస్త్రము నెల్ల నెఱింగితి ననెను. కాబట్టి శరీరము వేఱు, ఆత్మ వేఱు, అను భావముతో ననుభవించి సంచరించినవారికి పుణ్యపాపములు ఏవియును అంటవు. అట్లని అందఱు వ్యభిచార మొకపనిగా సాగింపరాదు. యోగులు వీర్యమును ఊర్థ్వముఖము చేసి గొప్ప శక్తుల సంపాదించుచున్నారు. శ్రీకృష్ణుడు తన రూపమును రాజకన్యల యందును, గోపికల యందును విస్తరించి నారాయణాది కుమారులను యాదవులను సృష్టించెను. కురుక్షేత్ర యుద్ధము రానున్న దనునప్పుడు తన గోపికా కుమారాదులను పండ్రెండువేలమందిని ఒకవైపునుంచి, తానొక్కవైపుననుండి యిందులో ఎవరు ఎవరికి కావలయునో కోరుకొనుమని ముందుగా అర్జునునికి అవకాశ మొసంగెను. అపుడర్జునుడు శ్రీకృష్ణుని కోరుకొనెను. దుర్యోధనుడు నారాయణాది గోపాలబలమును తీసికొని హృష్ణుడై పోయెను.

భారత పాత్రలలో శ్రీకృష్ణ ద్రౌపదులు మిక్కిలి రాజకీయ చాతుర్యము గలవారు. వీరిని మించినది కుంతి. కుంతి యెల్లప్పుడు కుమారులను రాచకార్యములందు ద్రౌపది సలహాను పాటించుమని చెప్పుచుండెడిది. అనగా ద్రౌపదిమాట రెంత విలువ నిచ్చినదో కుంతి మనస్సు గుర్తింపవచ్చును.

పూర్వ మొక నవాబు తనకు తాంబూల మిచ్చుచున్న ఒక బ్రాహ్మణుని సలహాను రాచకార్యములందు పాటించుచుండెడివాడు. అతడు చనిపోవుచు తన కుమారుని నిందించెను. అందులకా నవాబు కుమారుడు నీవు నాకేమియు ఉపదేశింపకయే నన్ను నిందించు కారణమేమని తండ్రిని బ్రశ్నించెను. అపుడా నవాబు తనకు నిత్యము తాంబూల మిచ్చు బ్రాహ్మణుని సలహాను తనవలెనే పాటించుచుండుమని కుమారుని కోరెను. ఇట్లుండగా నొకనాడు ఒక జమీందారు నవాబు కుమారుని తన సంస్థానమునకు వచ్చినచో నేబదిలక్షల ధనమిచ్చి సత్కరించెదనని చెప్పెను. అట్లేయని నవాబు కుమారుడు తగుపరివారముతో బయలుదేరెను. కాని తండ్రిచెప్పిన మాట మరచిపోయెను. కొంతదూరము పోయిన పిమ్మట తండ్రిమాట జ్ఞప్తికివచ్చి ఆ బ్రాహ్మణుని పిలిపించి పోవుటయా? మానుటయా? అని సలహా నడిగెను. అంత నాబ్రాహ్మణుడు ఇట్లు సమ్రాట్టు ఒక సామంతుని దగ్గరకుపోయి ధనము తానుగా స్వీకరించుట రాజవృత్తికాదు. భోగినివృత్తి కాబట్టి తాము తిరిగిపోయి, రాజధానినుండి వానినే ధనముతెచ్చి అర్పించునట్లు వార్తనంపుమని సలహాను చెప్పెను. అంత నా నవాబు కుమారుడట్లే యని వెనుదిరిగిపోయి జమీందారునకు కబురుపెట్టెను. ఆతడును చేయునదిలేక చక్రవర్తికి ధనముతెచ్చి సమర్పించిపోయెను. కాబట్టి స్త్రీ పురుష భేదమును బాటింపక వారి యుక్తమత్త్వమునుబట్టి వారివారి సలహాను పాటించుట యుక్తమని తోచుచున్నది. అందువలననే కుంతి ద్రౌపది సలహాను పాటించుమని కుమారుల కోరినది.

ద్రౌపది పూర్వజన్మ వృత్తాంత మతి విచిత్రమైనది. పాండవులైదుగురు పంచేంద్రులు. ద్రౌపది పూర్వజన్మయందు కుష్టురోగముతో బాధపడు నొక ఋషిభార్య ఆమె భర్తను పతియే దైవమని సేవించుచుండెను. ఒక నాడు అన్నమునందు భర్తవ్రేలు ఒకటి ఊడిపడినది. దానినొక క్రేవ నుంచి అన్నము దినెను. అట్టి పతిసేవాపరాయణయగు నామెను జూచి అతడు వరమేదియని కోరుమని అడిగెను. అంతట నామె తనకుగల మన్మధాతురత తీర్చుమని కోరినది. అందుల కాతడు నాకుష్టు ఇక ఐదురోజులలో పోనున్నది. ఆపిమ్మట నేను నీయిష్టము తీర్చెదనని, అట్లుచేసి కొన్నివేల సంవత్సరములు తన తపశ్శక్తితో నొక విమానము సంపాదించి దానిపై పత్నినిడుకొని తానన్ని లోకముల తిరుగుచు నాయమ నన్ని విషయముల సుఖముల మాన్పించి ఇక నేను బ్రహ్మలోకమున కేగెదను. నీవు తపముచేసి నీ యభీష్టము నెరవేర్చుకొనుము. అనిచెప్పి ఆ ముని బ్రహ్మలోకమునకేగెను. అంత ద్రౌపది తపస్సుచేసి శివుడు ప్రత్యక్షమై యేమికావలెనని యడుగ పతి-పతి యని ఐదుసార్లు అనెను. శివుడు ఆమె నోరుమూసెను. మరియు నీకు ఐదుగురు పతులు లభిcచెదరనియు పల్కెను. అందులకామె ఐదుగురువలన పతివ్రతా ధర్మము చెడునని వద్దని పల్కినది. కాని శివుడు ఐదుగురు భర్తలు లభించినను, ఆ ఐదుగురు ఒక్క ఇంద్రాంశకల వారలగుటచే పాతివ్రత్యము చెడదు అని ఆమె కన్యాత్వము చెడకుండునట్లు వరమిచ్చెను. మరియు ఇంద్రుని పిలుచుకొని వచ్చినచో తనకు రాబోవు భర్తలను చూపించెదనని ఇంద్రుని గైకొని వచ్చు నుపాయమును చెప్పెను. ఇంద్రుడు రాబోవుచుండగా ఈమె ఆకాశగంగలో శివాజ్ఞచే నేడ్చుచు కూర్చుండెను. ఆమె కన్నీటి చుక్కలన్నియు బంగారు కమలము లగుచుండెను. ఇంతలో శివుడు వరుణదేవుడై హిమాలయముపై భార్యతో జూదమాడుచుండెను. అపుడు ఇంద్రుడు తన సామంతుడగు వరుణుడు తన రాక కెదుర్కొనక యుపేక్షించుచున్నాడని భావించి వానిని కోపించెను. వెంటనే వరుణరూపముననున్న శివుడు ఇంద్రుని బట్టి తెమ్మని యాజ్ఞాపింప నా తపస్విని వానిచేయి పట్టుకొనెను. ఆ సమయమున ఇంద్రుని చింతించుచుండగనె చేయి వదలించుకొనుమాత్రము శక్తియులేక తగ్గిపోయెను. అపుడు వరుణుడై యున్న శివుడు ఇంద్రుని ఈ కొండశిఖర మెత్తుమని ఆజ్ఞాపించెను, ఇంద్రుడట్లే యొనర్ప ఆ కొండశిఖరము అడుగు భాగమునుండి నల్వురు ఇంద్రులు బయలు వెడలిరి. అపుడు శివుడు ఆ ఐదురుగు ఇంద్రులను లోకోపకారము కొఱకు భూలోకమున బుట్టుడని శాశించెను. వారు నీకు భర్తలయ్యెదరని యామెకు చెప్పెను. కాబట్టి పాండవులందఱు ఇంద్రాంశసమానముగ గలవారె యగుచున్నారు. అయినను ఇంద్రాంశ యమాంశలతో ధర్మరాజు మొదలగువారు ఆయాదేవతల వరములతో పుట్టిరి. ఆ ప్రత్యర్థిని యగు సతి రామాయణమున అగ్ని నెనసిన మాయాసీత తన్నుజేర ద్రౌపదియై జన్మించెను.

వివాహానంతరము నారదోపదేశముతో ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరము ద్రౌపదితో నుండునట్లు ఒడంబడిక జరిగినది. ''ద్రౌపద్యాః పాండుతనయాః పతిదేవర భావుకాః! నదేవరో ధర్మరాజ న్సహదేవో న భావుకః!'' అని కాళిదాసు చమత్కరించెను. అనగా ద్రౌపది ధర్మరాజుతో నుండగా మిగిలినవారు మరుదులు. భీమునితో నుండగా ధర్మరాజు బావగారు మిగిలినవారు మరుదులు. ఇట్లు చమత్కారముగ చెప్పబడినదిగ సహదేవుడెప్పుడును బావకానేరడని చకారము లేకుండ నిన్నివరుసలొ శ్లోకమున వర్ణించెను.

ద్రౌపది వివాహసమయమున అర్జునుడే మత్స్యయంత్రమును కొట్టి నందున ద్రుపదుడు అర్జునునకే ద్రౌపది నిచ్చెదనని పల్కెను అపుడు ధర్మరాజు పెద్దవానికి వివాహముకాకుండ చిన్నవాడు పెండ్లాడుట విషేధమని కూడదని వచించెను. కాబట్టి తల్లి యనుమతిని ఐదుగురు ద్రౌపదిని వివాహమాడ నిశ్చయించితిమనెను. ఇట్లు ఒక స్త్రీ ఐదుగురిని వివాహమాడుట ఆర్యమతమందు నెందును గన్పట్టుట లేదని ద్రుపదుడన ధర్మరాజు ప్రచేతసులు పదిమంది ఒక స్త్రీని శాస్త్రవిధి వివాహమాడి నట్లును, అట్లే ఏడుగురు ఒకదానిని వావాహ మాడినట్లును వేదములయందు గలదని చెప్పెను కాబట్టి ద్రౌపది పాండవులను వివాహమాడుట తప్పులేదు. అయినను పెద్దల సలహా ననుసరించి చేయుదమని భావించుచుండగా వ్యాసు డచ్చోటికి విజయము చేసెను. ఆ మహాత్ముని సలహా ననుసరించి వారి వివాహము జరిగినది. ఆ వ్యాసమహర్షి ఈ పంచేంద్రోపాఖ్యానము చెప్పి వారి పూర్వజన్మపు శరీరములను శివుని వరమున నాకన్నె కన్యాత్వమెప్పుడు భగ్నము గామియు వివరించి దివ్యదృష్టితో జూపించి ద్రుపదు నొప్పించెననియు నందు గలదు.

దేవీ భాగవతమున కృష్ణునకు పాండవులు సాయము చేసిరా? లేక పాండవులకు కృష్ణుడు సహాయము చేసెనా? యను జనమేజయు ప్రశ్నము కలదు. వ్యాసుడు పాండవులే కృష్ణునకు సహాయము చేసిరని తేల్చెను. కురుక్షేత్రయుద్ధమున పదునెనిమిది యక్షౌహిణుల నూటడెబ్బది యారుకోట్ల మంది రాజులు నిహతులైరి. అంతకుమున్ను జరాసంధుని కృష్ణు డెదుర్కొనునప్పుడు మాటిమాటికి ఇరువదినాల్గు అక్షౌహిణుల సైన్యము అంతరించినది. ఇట్లు శ్రీకృష్ణుడు దుష్టసంహారము గావించుచు చివరకు భారత యుద్ధమున మెరికలవంటి మహావీరులను గూడ అంతమొందించెను. పాండవులు కృష్ణసహాయముతో అందఱిని అంతమొందించిరి. ఆ కాలము కామప్రధానము కాక ధర్మ ప్రధానమై వెలసినది. దీనికి దృష్టాంతము యయాతి మహారాజుకు మాధవి అను కుమార్తె గలదు. విశ్వామిత్ర మహర్షివద్ద గాలవుడు అనునతడు విద్యాభ్యాసము గావించి గురుదక్షిణ నిచ్చుటకేమి కావలయునో కోరుకొనుమని గురువు నర్థించెను. కాని గురువు నీ శుశ్రూషకు మెచ్చితిని వేరే గురుదక్షిణ ఏమియో వద్దనెను కాని గాలవుడు తప్పక ఏమికోరినను ఇవ్వగలనని పల్కెను అపుడు కోపముతో విశ్వామిత్రుడు నల్లని ఒక చెవిగల తెల్లని గుఱ్ఱములను ఎనిమిదివందలు తెమ్మని కోరెను. ఇక గాలవుడు అశ్వాన్వేషణమునకు ప్రారంభించెను. బాల్య స్నేహితుడగు గరుత్మంతుని సహాయముతో ఇంద్ర లోకమునకు కూడ పోనెంచెను. కాని మార్గమధ్యమున వారు మేరుపర్వతముపై పోవుచుండగా నొక ఋషి తపస్సు చేసికొనుచుండెను. అతనిసైగ నెగసిపోవు గరుడుని ఱక్కలు విఱుగునట్లుగా నా ఋషి శపింపగా వారు క్రిందబడిరి. గరుత్మంతునకు ఱక్కలు పోయినవి. వారి పయనము అసాధ్యమైనది. అపుడు గాలవుడు తాను పోవుచున్నపని వివరించగా నాముని ప్రసన్నుడై గురుదక్షిణార్థము పోవుచున్న ధర్మము నెంచి ఱక్కలు వచ్చుననెను. మరుక్షణముననే గరుత్మంతునకు ఱక్కలు వచ్చినవి. మరల వారి ప్రయాణము సాగినది. ఇక నూర్థ్వలోకములకు బోక భూలోకమున సంచరించుటకు వచ్చిరి. అపుడు అచటిరాజు యయాతి పరిపాలించుచుండెను. గాలవ గరుత్మంతులు పోయి రాజును అట్టి అశ్వముల నర్థించిరి. కాని యయాతి అట్టి గుఱ్ఱములు తనవద్ద లేవని పల్కి గురుదక్షిణార్దియగు యాచకుని ఊరకపంపరాదు గాన తన కుమార్తెయగు మాధవిని వారికి ఇచ్చిపంపెను. మరియు తన కూతురెవరికైన నిచ్చి గుఱ్ఱముల సంపాదించుకొనుమని చెప్పి పంపెను. తర్వాత గరుత్మంత గాలవులు కాశీకి పోయిరి. అచట దివోదాసు అనునతడు రాజ్యము చేయుచుండెను. అతని దగ్గర నున్న రెండువందల గుఱ్ఱములను, మాధవినిచ్చి గ్రహించినపుడు, వారు మాధవిని ఒక కొడుకు గనినపిమ్మట తమకు మరల ఇవ్వవలసినదిగా సమయము చేసికొనిరి. ఆ రాజట్లే యని గుఱ్ఱములిచ్చి పంపెను ఈ దివోదాసు మాధవి అనువారలకే వ్రతర్దనుడు అనువాడు జన్మించెను. పిమ్మట రాజు అనుకొనిన మాట ప్రకారము మాధవిని గాలవాదుల కర్పించెను. వీరు మరల మాధవిని తోడ్కొని సేనజిత్తు అనువాని తండ్రికిచ్చి పైవలెనె రెండువందల గుఱ్ఱములను గ్రహించి, సేనజిత్తు జన్మింపగనే మరల మాధవిని స్వీకరించిరి. పిమ్మట శైబ్యుని నుండి మరి రెండువందల గుఱ్ఱముల స్వీకరించి శిబిచ్రకవర్తి జన్మింపగనె మాధవిని మరల గ్రహించిరి. ఇట్లు గాలవునకు ఆరువందల గుఱ్ఱములు లభించినవి. మాధవి మాత్రము కన్యగానే యున్నది. కాన మిగిలిన రెండు వందల గుఱ్ఱములు లభించుట దుర్లభ##మైనది. అందుల కాతడు ముందు లభించిన ఆరువందల గుఱ్ఱములను విశ్వామిత్రునకు సమర్పించి, మిగిలిన రెండువందలకు గాను మాధవిని స్వీకరించి పై వానివలె నీవు నొక కొడుకును గనుమని సమర్పించెను. అపుడు విశ్వామిత్రునకు మాధవి యందు అష్టకుడు అనువాడు జన్మించెను. మొత్తముమీద మాధవికి నలుగురు ధర్మసంతానము గలిగినది. పిమ్మట మాధవి తనకు వివాహము అక్కరలేదని పల్కి తపస్సు చేసి బ్రహ్మ లోకమునకు పోయినదని భారతమున గలదు.

పిమ్మట కొంత కాలమునకు అష్టకు డశ్వమేధయాగము ప్రారంభింపగా అన్నలు అందఱు విచ్చేసిరి. యాగాంతమున అవబృధస్నానముచేసి అష్టకుడు అన్నలతో వాహ్యాళి వెడలెను త్రోవలో నారదమహర్షి కనబడిన వారి రథ మెక్కించుకొనిరి. ఈ మన ఐదుగురిలో ఆకాశయానమున బ్రహ్మలోకమున కేగుచో యోగశక్తిచాలక ముందెవరు భ్రష్టులగుదురని నారదుని ప్రశ్నించిరి. నారదుడు అష్టకుడే ముందు యోగభ్రష్టుడు కాగలడని పల్కెను. కారణ మేమని నారదుని ప్రశ్నించగా అతడు క్రింది విధముగా సమాధానము చెప్పెను. ఒకసారి నారదుడు అష్టకునియింట ఒక సంవత్సరము చాతుర్మాస్యదీక్ష నిర్వర్తించెను. అనంతరము నారదుడు అష్టకునితో కలసి విహారముపోగా ఆలమందలు కన్పించినవి. వానిని గాంచి నారదుడు ఈ ఆలమంద లెవరివని ప్రశ్నింపగా అష్టకుడు నేను బ్రాహ్మణుల కిచ్చినవని అడుగనిదే తనదానమును, తన అహమును ప్రకటించుచు పల్కెనుగాని, బ్రాహ్మణుల గోవులని పల్కలేదు. కాబట్టి అష్టకునకు అహంకారము నశింపలేదు ఒకుక అతడే ముందు యోగభ్రష్టుడు కాగలడని పల్కెనట.

పిమ్మట అతనివదలి మన నలుగురమేగుచో యోగభ్రష్టు లెవరనగా కాశీరాజు కుమారుడగు ప్రతర్ధనుడని నారదుడు బదులుపల్కెను. అందులకు కారణముకూడ నారదు డెఱింగించెను. ఒకసారి నారదుడు ప్రతర్దనుని యింట చాతుర్మాస్యదీక్ష నిర్వర్తించెను. ఒకనాడు వారు గుఱ్ఱములు పూన్చిన రథముపై విహారము చేయుచుండగా బ్రాహ్మణు డొకడు వచ్చి రథాశ్వ మొకటి యిమ్మని యాచించెను. అపుడు రాజు కాదనలేక ఒక గుఱ్ఱమునిచ్చి మూడింటితో విహారము చేయుచుండెను. ఇట్లు కొంత దూరముపోగా మఱొకబ్రాహ్మణు డట్లే యాచించిన వానికి ఒక గుఱ్ఱము నిచ్చి పంపెను. అట్లే మరియొక గుఱ్ఱమునుగూడ యాచకునకు ఇచ్చి ఒక గుఱ్ఱముతో రథము తోలుకొనుచు నింటికి వచ్చుచుండ నా యొక్కటియు బ్రాహ్మణయాచకునకు ఇచ్చి పంపవలసివచ్చెను. చివరకు నాల్గు గుఱ్ఱములు పోగా ప్రయాణము దుర్లభముకాగా రాజే రథము దిగి ఆ కాడిని తన మెడపై బెట్టుకొని రథములాగ నారంభించెను లాగుచు మారకుండక బ్రాహ్మణులకు యుక్తాయుక్తములు లేవని (విప్రాణాం సాంప్రతం నాస్తి) పల్కెను. అందువలన ప్రతర్థనుడు దానమిచ్చియు యుక్తాయుక్తములు లేవని విప్రనిందను జేసెను. అంత చేసిన వాడింత యోర్చుకొనలేక పోయెను గాన యోగభ్రష్టుడగునని పల్కెను.

తరువాతనున్న మువ్వరిలో నెవడు వెనుకబడునని ప్రశ్నము పుట్టెను. దానికి నారదుడు సేనజిత్తు యోగమునుండి పతితుడగునని, కారణమిట్లు తెల్పెను. నారదుడు సేనజిత్తునింట చాతుర్మాస్యము నిర్వర్తించి, ఆతడు చేయించుకొనిన అందమైన బండిని బాగుగ నున్నదని మెచ్చ నాతడివ్వగా నీతడు స్వీకరించెను. మరల నాతడు మరియొకబండిని చేయించుకొనగా, మరల నారదుడు సన్నిహితుడై ఈ శకటము నాకిచ్చిన దానికన్న బాగుగనున్నదని, అదియు నాతడిడ స్వీకరించెను. పిమ్మట మరల రాజు పై వానికంటె అందముగ నుండునట్లు మరియొక బండిని చేయించుకొని దానిపై నాసీనుడగుటకు బ్రాహ్మణులచే స్వస్తివాచనము చేయించుచుండగా నారదుడు ఎప్పటివలెవచ్చెను. నారదుడు వచ్చుచున్నాడు. ఇదియు నివ్వవలసి వచ్చునేమోయని, నారదాగమనముచూచి తత్తరపడి బ్రాహ్మణుల స్వస్తివాచనము తొందరగా గానిమ్మనెను. గాన నితడు యోగమునుండి పతితుడు కాగలడు. శరీరముతో నెగిరిపోవు నాకు బండి ఎందులకు? అడుగని నాకు నిడనేల? తొందరపడనేల? అని పల్కెను.

ఇక మిగిలినది నారదుడు శిబిమాత్రమే మీ యిద్దఱిలో నెవరు పతితులగుదురని ప్రశ్నింపగా నారదుడు సంతప్తుడై నా తప్పు నాకు తెలియదు కాన అట్టి తప్పేదియేనున్న నేనే పడుదునేమోగాని శిబిమాత్రము పతితుడు కాడని నిశ్చయముగ చెప్పెను. అనగా నారదునికన్న శిబి చాల గొప్పవాడని భావముకదా? అందులకు కారణమేమనగా ఒకసారి నారదుడు శిబియింట చాతుర్మాస్యముచేయుచుండెనట. ఆ సమయమున శిబి యింటికి నల్లనిబాపడువచ్చి అన్నము పెట్టుమని యడిగెను అందులకు శిబి సరేయని పల్కగా యాచకుడు నీ యిష్టమైన భోజనముగాక నాకిష్టమైనతిండి కావలెననెను. అది శిబి కుమారుని ఖండించి వండిపెట్టుట. నల్లని బ్రాహ్మణుడు దానిని గోరెను. ఆ మాటచెప్పి తా నెచటికో పోవుచుండ రాజు మీ యిష్టమైన భోజనము పెట్టెదనుండు డనగా, నేనిక్కడనేయున్న నాపనులు చెడవా? నీవా భోజనము నావద్దకు తెమ్మనెను. శిబిచక్రవర్తి ఆ మాటల కంగీకరించి తన కుమారుని ఖండించి వంటకముగావించి దాని పళ్ళెరము నెత్తిన పెట్టుకొని బ్రాహ్మఱుని కొఱకు ఊరంతయు గాలించెను. ఈ వింతనుగాంచిన యూరిప్రజ ఈ బ్రాహ్మణుడు నీ కెక్కడ దొరకెను? దుర్మార్గుడని బ్రాహ్మణుని అనేకవిధముల నిందించిరి. కాని శిబి మాత్రము పల్లెత్తుమాట అనలేదు. మరియు నా బ్రాహ్మణుడు శిబిచక్రవర్తి యొక్క అశ్వశాలలను, గజశాలలను తగులబెట్టుచున్నాడని ప్రజలవలన నెఱింగి అచటకు బోయెను. అంత శిబి తానుతెచ్చిన వంటకముగూర్చి నివేదించెను. అందులకా బ్రాహ్మణుడు మరి నాలుగుకొంపలు తగులబెట్టి వచ్చెదనని పల్కెను. అంతియగాక తెచ్చినమాంసము కుమారునిది యగునా కాదా? అనియు దుఃఖించుచు పెట్టిన తాను భుజింపననియు పల్కెను. మరియు శిబిని అందలి మాంసఖండము నొకదానిని ముందు తినుమని బ్రాహ్మణుడు కోరగా శిబి యట్లేయని నోటకరచుకొన బోయెను. వెంటనే బ్రాహ్మణుడు అతనిచేతి నెగురగొట్ట నా ముక్క వళ్ళెముతో సహా క్రింద పడినది మరుక్షణముననే ఆ మాంసమంతయు కుమారుడై నిల్చినది.

అపుడా బ్రాహ్మణుడు శిబి ప్రార్థనముతో యథావిధి భోజనము రాజు సరసన కూర్చుండి చేసి వెడలిపోయెను. మరునాడు రాజు కచేరికి పోగా ప్రజలు తండోపతండములుగా వచ్చిరి. వారందఱు మిన్నకుండక రాజు గావించిన పనికి ధర్మాధర్మ విచారమును గూర్చి ప్రశ్నించిరి. అందులకు రాజు అతిథి కోరికను పాపపుణ్యముల నిమిత్తములేకుండ నిర్వర్తించుట గృహస్థుని ధర్మమని తనకిం దేమాత్రము కోరిక లేదని పల్కెను. ఆ మరునాడే బ్రాహ్మణుడు కాల్చిపోయిన అశ్వశాలలన్నియు బంగారు కట్టడములచే మిలమిల మెఱయుచు ప్రకాశించినవి. కాబట్టి శిబి అతిథికొఱకు తన కుమారుని సైతము అహంకారమును బోనాడి, రాజసమును విడనాడి కుమారుని వధించి భోజనము నిర్వర్తింప జేసెను. ఇట్టివానికి యోగమేల చెడును? మోక్షమునుబొందుట కాత డర్హుడయ్యెడివాడా? వాని ప్రశ్నమున నారదుడు దిమ్మరబోయెను. ఇక నారదుడు ఇట్టి వన్నియు సమయానుకూలముగ బయటపెట్టి లోపములున్న వారాచరితము మార్చుకొనునట్లు చేయుటకు లోకోపకారమునకే యుదయించెనని తలంపవలయును. మాధవి కుమారులు నల్వురు రత్నములవంటివారు. మరణానంతరమున నక్షత్రరూపమున ఆకాశమున మెఱయుచున్నారు. యయాతి కామ్యలోకము లన్నియు తిరుగుచు ఇంద్రలోకమునకు పోయెను. అంత ఇంద్రుడు యయాతి గొప్పతనమునుగూర్చి ప్రశ్నించగా, యయాతి తాను గొప్పవాడననియు తనకంటె తనకుమారుడు గొప్పవాడనియు సమాధానము చెప్పెను. అపుడు వెంటనే ఇంద్రుడు యయాతిని స్వర్గలోక భ్రష్టుని గావించెను. యయాతి పతనమందుచుండగా దౌహిత్రులాతనిగాంచి ఆగుమనియు, ఎవరనియు ప్రశ్నించెను. యయాతి ఉన్నసంగతి వివరించగా వారు యయాతి, తమ తాతయని తెలిపి, ఆ నల్వురు తమపుణ్యమున నాల్గవవంతు యయాతి కిచ్చి మరల పైకి పొమ్మనిరి అపుడు యయాతి తేజశ్శాలియై ఊర్థ్వలోకమునకు పోయెను. కాబట్టి మాధవి కుమారులు ధర్మసంతాన మందమా? అధర్మసంతాన మందమా? అధర్మసంతానము కాకపోవుటవలననే అట్లు చేయగల్గిరి. కావున ద్రౌపదియు భర్తలు ధర్మనిరతులేకాని అధర్మమేమాత్రము వారియందు లేదు.

భారతమున రాజ్య మెవరిది? అను ప్రశ్నవచ్చినపుడు నన్నయ భారతమున నున్న ప్రక్షిప్తమో విక్షిప్తమో యగు -

ఉ. ఆయము గర్వమున్‌ విడిచి యన్యపతుల్‌ పనిసేయ నిట్లు గాం

గేయ భుజాబలంబున నికృత్త విరోధిసమాజుడై కుమా

రాయిత శక్తిశాలి ధృతరాష్ట్రుడు రాజ్యము సేయుచుండె న

త్యాయతకీర్తితో తనకు హస్తిపురం బది రాజధానిగాన్‌ ||

అను పద్యమునుబట్టి ధృతరాష్ట్రునిదే యని నిర్ణయింపవలెను. కనుక సంస్కృత భారతమున మాత్రము ధృతరాష్ట్రుడు అంధుడగుటచే రాజ్యార్హత లేదనియు, విదురుడు దాసీపుత్రు డగుటచే నాతడును రాజ్యార్హుడు కాడనియు నిర్ణయమైనది. కనుక పాండురాజే రాజని నిశ్చయమైనది.

శ్లో|| ధృతరాష్ట్ర స్త్వచక్షుష్ట్వా ద్రాజ్యం నప్రత్యపద్యత

పౌరవత్వా ద్విదురో రాజా పాండు ర్భభూవహి||

ఏవార్థముగల హ అను నవ్యయముతో వ్యాసర్షి పాండురాజే ఆ కులమున రాజని నిర్దారణ చేసెను. మనుస్మృతిలో చిన్నవాని కుమారుల కన్న పెద్దవాని కుమారులు సమర్థులైనచో రాజ్యార్హతను నిర్ణయించినది. ఇక కౌరవ పాండవులలో సమర్ధు లెవరను ప్రశ్న యుద్ధమునందే తేల్చవలసి యున్నది. అదియునుగాక కృష్ణరాయబార సందర్భమున గాంధారి -

శ్లో|| రాజ్యంతు పాండోరిదమ ప్రధృష్యం|తస్యాద్యపుత్రాః ప్రభవంతినాన్యే

న్యాయాగతం రాజ్యమిదం చ కృత్ప్నం యుధిష్ఠిరశ్సాస్తువైధరపుత్రః ||

అని పాండురాజు కొడుకు యుధిష్ఠిరుడే రాజు కావలయునని పల్కినది. దీనినిబట్టి యుధిష్ఠిరుడే రాజు అగునని భావము ఆమెయే అరణ్యపర్వమున కౌరవులది అధర్మద్యూతమని పల్కినది. పాండురాజు యమలోకమున సభాస్తారుడుగ నున్నాడనియు ధర్మరాజుతో రాజసూయము చేయుమని చెప్పవలసినదిగా తన్ను బంపెననియు - అట్లయిన దాసు మహేంద్రసభ##కేగెదనని, నారదు డీవిషయము ధర్మరాజుతో చెప్పగా నాలోచించి అజాతశత్రుడు కృష్ణసహాయముతో దానిని నిర్విర్తించి తన తండ్రి నింద్రలోకమున ఇంద్రునితో సమానముగ నుండబంచెను. ధీరశాంతో యుధిష్ఠిర ఏకఏవ - అని ధర్మరాజు ధీరశాంతుడైన నాయకుడుగా నలంకార శాస్త్రములు నొక్కి వక్కాణించుచున్నవి రామాదులు ధీరోదాత్త నాయకులు. భీమ లక్ష్మణులు ధీరోద్దత నాయకులు. కృష్ణుడు మొదలైన వారు ధీరలలితులైన నాయకులు. తక్కిన మూడు విధములైన నాయకులింక ననేకు లున్నను మొత్తముమీద అలంకారశాస్త్రములు ధర్మరాజువంటి ధీరశాంతనాయకుడు మఱొకడు లేడని చెప్పుచున్నవి. ధర్మరాజు ధర్మవర్తనుడేగాక యుధిష్ఠిరుడు. ఇతడు జూదమున ఎనిమిది పందెములలో సర్వస్వము నోడిపోయెను. తరువాత నింకను ధనకనక వస్తువాహనాదులను, తమ్ములను, ఎట్టకేలకు భార్యనుగూడ నొడ్డి ఓడిపోయెను. మహాలక్ష్మివంటి ద్రౌపదిని దక్కించుకొనలేక పోయితినని ధర్మపాశబద్ధుడనై జూదమున పణముగా పెట్టుచుంటినని ధర్మజుడు చివరకు విసువుతో పాచికలను పారవైచెను.

ఆ ధర్మరాజు ఏ ధర్మపాశమునకు బద్ధుడై భార్యనొడ్డెనో అది భీష్మాదుల బుద్ధుల కందలేదు. ద్రౌపదిని సభకు దెచ్చుటకు ప్రాతిగామిని పంపగా నామె ఎవరెట్లు ఓడిరని ప్రశ్నించినది అంతియగాక నీకు దెలియనిచో సభికుల నా విషయము అడిగిరమ్మని వెనుకకు పంపినది ఇంతలో ధర్మరాజు చక్కని తంత్రము నొకదానిని పన్నెను. క్రొవ్వియున్నవారు దుష్టులు చాటున పరాభవించిన లోకవాద మనేకవిధముల సర్వగలదని దుశ్శాసనాదులు వచ్చులోపల ద్రౌపది రజస్వలావేషధారిణియై వచ్చి అత్తమామల మధ్య సభలో నిలువబడియుండునట్లు చాటుగా కబురంపెను. ఆమె యట్లే ఏకవస్త్రయై వచ్చినిల్చినదేగాని వాస్తవమునకు ద్రౌపది రజస్వల కాదు. ఏలన ద్రౌపదివంటి రాజకన్య రజస్వల ఆయియున్నచో సభామధ్యమునకు వచ్చుట సాధారణమైన విషయముగాదు. వాస్తవమునకు రజస్వలయగు స్త్రీ చిన్నచెంబుతో నీరు త్రాగరాదు. పుడకతో పండ్లు తోమరాదు. పర్ణమునందు నీరు త్రాగకూడదు. పురుషదర్శనము చేయరాదు. ఇట్టి వ్రతముతోనుండి స్నానముతర్వాత మొదట భర్తనుచూచినపిమ్మట ఇతరులను చూడనగును. ఇట్లున్నవారికి భర్తవంటి కుమారుడు పుట్టగలడు కాని యితరులనుజూచిన అట్టివారే పుట్టుట శాస్త్రవిహితము. ద్రౌపది సభలో నెన్నియో ప్రశ్నలువేసినది. కాని పాండవ వనవాసము, యుద్ధము జరుగక తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామము రాక తప్పదను విషయము ముందే నిర్ణయింపబడినది. ధర్మరాజు రాజసూయము పూర్తియైనపిదప పదమూడవరోజు వ్యాసభగవానుడువచ్చి ధర్మరాజుతో నీ వన్నివిధముల ఉత్తముడవైనను నీకు బంధువిరోధమను ప్రారబ్ధము కలదు. శివునితో నీ విషయము ముచ్చటింప కైలాసమున కేగుచుంటినని వెళ్ళిపోయెను. ఆనాడు రాత్రి శివుడు మిక్కిలి కృద్ధుడై ధర్మరాజుకు కలలోకన్పించి పదమూడేండ్లు గడచిన పిమ్మట, పదునాలుగవయేడు నీ నిమిత్తముగ ప్రజాక్షయము చేయుదునని పల్కెను.

కాబట్టి ప్రజాక్షయ మను విషయ మేనాడో నిర్ణయింపబడినది. అంతియగాక తన నిమిత్తత్వము తీసివేయమని ధర్మజుడడుగగా శివుడు ఈ ప్రజాక్షయమను విషయ మెప్పుడో వ్యాసకృష్ణులచే నీ నిమిత్తముగా నిశ్చయింపబడినది. ఇప్పుడు నేనెట్లు తీసివేయుదునని సూచించెను. ద్రౌపది వివాహానంతరము ద్రుపదునియింట పాండవు లొక సంవత్సరముండిరి. వారితో కృష్ణుడుకూడ నుండెను. ఈ సంగతి ధృతరాష్ట్రునకు తెలిసినది. ఇపుడే పాండవులమీద నెత్తిపోయి బలములేని సమయమున చంపవలెనని కర్ణుడన, భీష్మాదులు పాండవులను హింసించవద్దని సలహా చెప్పి, వారిని పిలిపించుమని సూచించిరి. అది దుర్యోధనుడు కూడ తాను రాజ్యము చేయుచు వారికి ఊరక మవారులో భోజనముమాత్రము పెట్టనెంచి వారి రావించుట కొప్పుకొనెను. అట్లేయని విదురునిపంపి వారిని పిలిపించిరి. విదురునిమీద భారముతో ద్రుపదుడు తన యల్లుండ్రను, కూతును పంపుటకు నిశ్చయించెను. అట్లు బయలుదేఱి పాండవులు నవోడతో తల్లితో హస్తిపురికేగునపుడు మొదటినుండి కౌరవుల దురాగతము నెఱింగిన శ్రీకృష్ణుడు మాత్రము శంకించి ధృష్టద్యుమ్నుని పిలిచి, పాంచాలసైన్యమొక అక్షౌహిణినిగొని వారికి బాసటగా పొమ్మని, తానుకూడ నొక అక్షౌహిణి యాదవసైన్యమునుగొని వెంటబోయెను. వీరిరాకనుచూచిన దుర్యోధనుడు సింహాసమునుండి దిగరాదనుకొని భావించియు, కృష్ణపరమాత్మను తక్కుంగల పాండవులను జూడగనే వెంటనే దిగిపోయెను.

అపుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును సింహాసనముపై ఆసీనుడవుకమ్మని సన్నచేసెను. ధర్మరాజు కూర్చుండగనే కృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు వేత్రహస్తులై బరాబరులు చేయుచుండిరి. ఈవిధముగ ధర్మరాజు ఐదేళ్ళు రాజ్యపాలన అత్యంత వైభవముగ సాగించెను. పిమ్మట నొకనాడు భీష్మాదులు తమ్మునాశ్రయించి అడుగుధృతరాష్ట్రుని రాజ్యవిషయమై ధర్మరాజును అడుగుమని బ్రబోధించిరి. అట్లేయని ధృతరాష్ట్రు డడుగగ ధర్మరాజు పెత్తండ్రితో నీ యిష్టమువచ్చినంత తీసికొని మిగిలినది నాకు ఇవ్వుమని సమాధానము చెప్పెను. ఈ మాట అనగనె ధృతరాష్ట్రునకు ప్రాణము మరల వచ్చినట్లయినది దిమ్మరపోయి మరల తెలివి తెచ్చుకొని ధృతరాష్ట్రుడు తనకు హస్తినాపురమిమ్మని, రాజ్యము రెండుభాగములు చేసితినని, అర్థరాజ్యము నాకిచ్చి అర్థరాజ్యములో మీరుపోయి తెలివిగల వారు గాన నింకొకచోట రాజధాని సమర్చుకొనుమని పంపెను. అపుడు ధర్మరాజు తమ్ములతో, ధృష్టద్యుమ్నునితో, శ్రీకృష్ణునితో అర్థరాజ్య పరివారముతో ఖాండవప్రస్ధమునకు పోయి అచట నగర నిర్మాణమునకు పూనుకొనెను. శ్రీకృష్ణ వ్యాసులు వాస్తుశాస్త్రము నిర్ణయింపగా తదనుగుణముగా నగరనిర్మాణము జరిగినది. విశ్వకర్మవచ్చి ఈ లోకమున ఇంద్రప్రస్థమును నిర్మించెను. ఇందొక చిత్రము గమనింపవలసియున్నది.

ఈ నగర నిర్మాణమునకు వ్యాసకృష్ణులు కొలతకు దారమును బట్టుకొనిరి. ఆ కొలత ప్రకారము కట్టినచో తప్పక యజమానికి యుద్ధము సంభవించునని విశ్వకర్మ నొక్కి వక్కాణించెను. అపుడు వ్యాసకృష్ణులు యుద్ధము వచ్చుట సరేకాని, జయమెవరిది? అని ప్రశ్నించిరి. అందులకు విశ్వకర్మ జయము ఈ నగరనాయకునికే అని నిర్ణయించెను. అట్లయినచో శీఘ్రముగ నగరనిర్మాణము ప్రారంభింపుము. యుద్థములులేకుండ చేతులు ముడుచుకొని కూర్చున్న కీర్తివైభవము లెట్లు వచ్చును? అని విశ్వకర్మకు ఆదేశించి తన్నిర్మాణము పూర్తి గావించిరి. అట్లు నిర్మించి ఇంద్రప్రస్థమున నుండి పాండవులు ఇరువది నాలుగు సంవత్సరములు మహాకీర్తితో మహావైభవముతో దేవతలకన్న మిన్నయగు సౌఖ్యము లనుభవించిరి. ఈ రాజ్యవిభాగము రాబోవు యుద్ధమునకై శ్రీకృష్ణుడొప్పినది. పిమ్మట రాజసూయము తర్వాత ధర్మరాజు కలలో నీశుడు చెప్పుట అంత ధర్మజుడు తమ్ములతో నాలోచించి తన మూలముగ ప్రజాక్షయమగునని శివుడు చెప్పెను గనుక అరణ్యమునకు పోయెదనని పల్కగా, అర్జునుడు పోవుట అంగీకరింపక, అన్నను రాజ్యపాలన చేయవలసినదిగ ప్రార్థించెను. అంతియగాక శాంతముగ, ధర్మవర్తనుడై రాజ్యమనుభవించునట్లు తమ్ములందఱు ప్రార్థించిరి. అపుడే ధర్మరాజు తమ్ములతో పదమూడు విధములైన ఒడంబడికలు చేసికొనెను. అవి యేవనగా పదునాల్గు సంవత్సరములు పర్యంతము ఎవ్వరేమి చెప్పినను తానుచేసెదననియు, మానాభిమానములు వరలి వర్తింతుననియు అనగా భార్యను సభలో అవమానించినను మిన్నకుందుననియు మొదలగు ప్రతిజ్ఞలు చేసెను. అప్పుడే తమ్ములందఱు ధర్మరాజు అడుగుజాడలలో పదునాలుగేండ్లు నడుచుటకు ప్రతినచేసిరి.

ఇట్టి ప్రతినలన్నియు జరిగిన తర్వాతనే పాండవులు జూదమున ఓడిపోవుట జరిగినది. ధర్మరాజు తాను ఓడిపోవుట గూడ ధర్మపాశ బద్ధుడనై యని చెప్పి మిన్నకుండెను. సభలో న్యాయా న్యాయములు ధర్మరాజే చెప్పవలయునని భీష్ముడంతటివాడు పల్కెను. అంతియగాదు ధర్మరాజు శాంతికి ముగ్ధుడై పరశురాముడు అరణ్యపర్వమునకై వారము చేసెను. భీముడు, ధర్మరాజు జూదమాడి ఓడినందుకు అతని చేతులు తగులబెట్టెదనని పల్కగా అర్జునుడు తాము చేసిన ప్రతినలగూర్చి వివరించి, అతని కోపమునుండి విరమింప చేసెను. ఇట్టియెడ గూడ ధర్మరాజు చలింపక మిన్నకుండుట జూడ నాతని శాంతగుణ మెట్టిదియో వ్యక్తమగుచున్నది.

17

శ్లో|| నారాయణం సమస్కృతం నరంచైవ నరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్‌ ||

అను ప్రార్థనతో భారతపఠనము ప్రారంభింపవలయును. క్రిందటి ప్రకరణమున ద్రోపది రజస్వలా వేషముతో సభకు వచ్చినదని భారతకథను చెప్పియుంటిని. అట్లు వచ్చిన ద్రౌపది వలువలూడ్చుమని దుర్యోధనుడు ప్రాతిగామిని పురికొల్పెను. గాని ప్రాతిగామి సందేహించుచుండగా దుశ్శాసనుడు ఆ పనిని నిర్వర్తింప నాయెను. అట్టియెడ ధర్మరాజు సత్యమునకు బద్ధుడై మిన్నకుండెను. పరశురాముని యంతటివాడు వచ్చుటయే మానుకొనివాడు. కురువృద్దులందఱు లోలోన కుందిరేగాని పైకి మాటాడక ఘోరకృత్యమును గాంచుచుండిరి. అయ్యెడ ద్రౌపది మాత్రము తన అభిమాన సంరక్షణకై శ్రీకృష్ణపరమాత్మను హా! నాధ! హా! రమానాధా! వ్రజనాధార్తి నాశన! కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్థన - అని ప్రార్థించినది. కాని ద్రౌపది ప్రార్థించిన సమయమున కృష్ణుడు సౌంభకాసురునితో పోరుచుండెను. ఆ యుద్ధమున నా రాక్షసుడు మాయా వసుదేవుని సృష్టించి కృష్ణుడు చూచుచుండగ ఆతని తండ్రిని సంహరించుచున్నట్లు నటించెను. మరియు కృష్ణుని చేతనయినచో తండ్రిని రక్షించు కొనుమని సవాలుకూడ చేసెను. అంతియగాక ఆ మాయా వసుదేవుడు చేతకాని కొడుకును కంటిననియు విలపించు చుండెను. అపుడా సౌంభకాసురుడు మాయావసుదేవుని రక్తము చిందునట్లు కత్తివ్రేటు వేసెను. ఆ రక్తముచూచి భగవంతుడగు కృష్ణునకు మాచుషభావము వచ్చి మూర్ఛ నొందుచుండెను. ఆ సమయమున ద్రౌపది మొరవిని, మూర్ఛపోకుండనే ప్రపంచమున ఆపన్నులెవరని తాను దివ్యదృష్టితో పరికించెను. మరియు ప్రస్తుతమగు ద్రౌపది వస్త్రములు అక్షయమగునట్లు వరమిచ్చెను. ఉగ్రసేనుని సభలో చెక్కుచెదరకున్న తన తండ్రిని జూచి రక్కసుజంపెను. అంత దుశ్శాసనుడు వలువలూడ్వజాలక అలసి యూరకుండెను.

పాండవుల కపుడు కొంచెము ప్రాణము వచ్చినట్లు అయినది. ధృతరాష్ట్ర గాంధారులు మాటాడక మిన్నకుండిరి. అయ్యవసరమున అంతఃపురదాసీలు వచ్చి దుర్యోధనుని శయ్యాగారము తగులబడుట, అంతఃపురమున నక్కలు కూయుట మొదలుగాగల దుర్నిమిత్తముల నెల్ల నెఱింగించిరి. అందులకు ధర్మాత్ములగు పాండవులకు పతివత్రయగు ద్రౌపదికి పరాభవముచేయుటవలన నేమి యగునోయని ధృతరాష్ట్రుడు భయభ్రాంతుడై కోడలిని దగ్గరకు పిలిచి ''నీవు మహాసాధ్వివి నీకు జరిగిన పరాభవమునకు మమ్ము క్షమించుము. మరియు నేదేని వరము కోరుకొనుము'' అని చెప్పెను. ద్రౌపది అందుల కియ్యకొని మొదటి వరముగా ధర్మరాజు వారికి దాసుడు కాకుండ శస్త్రాస్త్రములతో సర్వతంత్ర స్వతంత్రుడై యుండునట్లు కోరినది. అందులకు కారణము ధర్మరాజును దాసత్వమునుండి విముక్తినొందించుటకు మరియు ధర్మరాజు యొక్క కుమారుని ప్రతివింధ్యుని యువరాజని ప్రజలనుటచే జీతగాని కొడుకు అని ప్రజలనకుండుటకు అట్టి వరము కోరితి ననెను యాదవ పాంచాలాదులు యువరాజని వాని గౌరవించు భాగ్యమంతరింపకుండుటకు అట్లుకోరినది. ఇక రెండవవరము కోరుకొమ్మనెను. దానికి ద్రౌపది పాండవులందఱు స్వేచ్ఛాచారులై వారి వారి ఆయుధములతో కౌరవులకు దాసులు కాకుండ అలరారుట. పిమ్మట నాతడు మూడవవరము కోరుకొమ్మనెను. కాని ద్రౌపది రాజకాంత మూడవది కోరరాదని మిన్నకుండినది. ద్రౌపదియొక్క ధర్మప్రవర్తనకు మిక్కిలి చకితుడై ధృతరాష్ట్రుడిట్లడిగెను. ఒకే వరముగా అడుగవలసిన విషయమును రెండుగ అడిగితివే గాని మూడవ వరము అడుగని దానవు రెండు వరములలో రాజ్యవిషయ మెత్తవైతి వేల? అని ద్రౌపది నడిగెను. అందులకామె సమాధానముగ - పాండవాశ్శస్త్రసంపన్నాస్స్వాని భాగ్యాని భుంజతే - అని పాండవులు వారి బలపరాక్రమములతో స్వతంత్రముగా నున్న వారి భాగ్యముల ననుభవింపగలరని ఆడుది సంపాదించి పెట్టు రాజ్యమేలువారు కారని ధీరస్వాంతయై పల్కినది అపుడు ధర్మరాజు లేచి ధృతరాష్ట్రునకు నమస్కరించి - అన్నిటికి నీవే పెద్దవాడవున్నావు. మమ్మిక నేమి సేయుమని యెదవని ప్రశ్నించెను. అందులకు ధృతరాష్ట్రుడు కొడుకుల తప్పులు క్షమించుమనియు, కొడుకులను కనిపెట్టి చూడుమనీ అర్థించెను. పాండవులను ఇంద్ర ప్రస్థమున నుండి మీ రాజ్యము మీరు చేసికొనుడని చెప్పెను. దానికి సమ్మతించి తమ రాజ్యముతో తాము పాండవులు ఇంద్రప్రస్థమున కరిగిరి. ధృతరాష్ట్రుడు చేసిన ఈ పనికి దుర్యోధనుడు తండ్రిని అనేక విధముల నిందించి మరల వారిని జూదమునకు పిలుపించుమని ప్రేరేపించెను.

ఈసారి రాజ్యసంబంధము లేకుండ, ఓడినవారు పన్నెండేండ్లు అరణ్యవాసము, ఒకయేడజ్ఞాతవాసము చేయునట్లు నిర్ణయించుకొనిరి. ఈ విధముగనైన దుర్యోధనుడు కొంతకాలము రాజ్యమనుభవించవచ్చు నని అభిప్రాయపడెను. మరల జూదమునందు శకుని కనుకట్టు విద్యచే కౌరవులే గెల్చిరి. పాండవులే ఓటమినొంది అడవుల పాలైరి. ధర్మజుడు వారికి సంబంధములేని రాజ్యము వారికెయుంచి తానరణ్యమున కేగెను. పాండవులు అరణ్యమునకు పోవునపుడు వారితో లక్షయేబదివేల బ్రాహ్మణులు, ఇరువదినాల్గువేల రథములు, ఐదువందల మంది దాసీలు కూడ వెళ్ళిరి. మరియు పరాభవమప్పుడు సభలో కర్ణుడు ద్రౌపదిని -

కం. లేరిచట మగలు నీకును

వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్‌

వారిజలోచన! నీపై

కూరిమిగల మగని వెదకికొను మొరుననడే!

ఇట్లు ఆక్షేపించెను. దానికి దుర్యోధనుడు తనతొడ జూపెను. భీము డీ మాటవిని యుద్ధమున దుర్యోధనుని - చండగదాభిఘాత భగ్నోరుతరోరుజేయుదునని - పల్కెను. ఈ ప్రతిజ్ఞను అందఱు వినియు మిన్నకుండిరి. ఉగ్రరణాంతరమున గదతో తొడగొట్టుట ధర్మము కాదని ఎవరైనా అనిరా? మరియు దుశ్శాసనుని రక్తము త్రావెదననియు పల్కెను. ధర్మజాదులు అరణ్యవాసమునకు పోవునప్పు డొక్కరు ఒక్కొక్క విధముగ పోయిరి. ధర్మజుడు ధర్మాత్ముడు గనుక దీనమగు తన మొగము చూచినవారు నష్టులగుదురేమో యని ముఖము వస్త్రముచే కప్పుకొనిపోయెను.

భీముడు కౌరవుల యుద్ధమున చంపెదనన్నట్లు భుజబలము ప్రదర్శించుచు పోయెను. అర్జునుడు యుద్ధమున బాణవర్షము నింతకన్న తఱచుగా కురిపించెదనన్నట్లు ఇసుక చల్లుకొనుచు పోయెను. నకులుడు అందగాడగుటచే తననెవ్వరు చూడరాదని దువ్వ పూసికొని పోయెను. ఇట్లే సహదేవుడు తలవంచుకొని పోయెను ద్రౌపది జుట్టు విరియబోసికొని కౌరవకాంతలును ఇట్లు పోవలయునని సూచించుచు నేడ్చుచు పోయెను. ధౌమ్యుడు రౌద్రయామ్యసామగానముచేయుచు పోయెను. అది పదుమూడు సంవత్సరముల తర్వాత ఈ మంత్రముల దుర్యోధనాదుల కర్మాంతరములకు ఉపయోగింతునని భావము. ఇట్లు పాండవులందఱు అరణ్యవాసమునకు పోవుచు భావికార్యమును సూచించుచు పోయిరి. కృష్ణుడు కూడ పాండవులు అడవులకు పోయినగాని తన పనిగాదని యూరకుండెను. ఏలన పాండవులు అరణ్యవాసము చేయుచు ఆయుధ సంపాదనము చేయవలసియున్నది అని కృష్ణుని యెత్తుగడ. కావున రామాయణము నందలి రామునివలె పాండవులును పదునాలుగేండ్లు అరణ్యముల పాలై ఆయుధముల నార్జించిరి. పాండవులకు తీర్థయాత్రలు చేయించుమని ఇంద్రుడు లోమశునికూడ పంపెను. పాండవులు లోమశుని సాయమున తీర్థయాత్రలు చేయుచుండగా అంతర్వేది దగ్గర సముద్రమున నొక వేదిక కన్పించినది. లోమశుడా వేదికను జూచి ధర్మరాజును దానిపై కూర్చుండుమని నిర్దేశించెను. అట్లేయని ధర్మరాజు దానిపై అధిష్ఠింపగనే సమాధిగతుడై వాలభిల్యాదుల వేదగానమును వినుచుండెను. ఈ సంగతి లోమశునకు తెలియజేయగా ఆతడెంతయో ధర్మజుని కొనియాడెను. కారణము అది ధర్మవేదిక. ఇతరు లెవ్వరెక్కినను అది నీట మునిగిపోవును.

రాజసూయసందర్భమున ధర్మజునకు తమ్ములందఱును దిక్కుల జయించి ధనకనకవస్తువాహనాదుల తెచ్చి అర్పించిరి. వీరిలో సహదేవుడనువాడు దక్షిణ దిగ్విజయమునకై పోయెను. అచట నీలుడను రాజుతో భండన మొనర్చుచుండెను. అయ్యెడ సహదేవసైన్యము అగ్ని కాహుతి కాబోయినది. అపుడు సహదేవుడు అగ్ని సూక్తము జపించి అగ్నిదేవుని శాంతింపచేసెను. అట్టియెడ అగ్నిదేవుడు నీలునితో సహదేవుని సైన్యమును దహింపజాలనని చెప్పగా నీలుడు చేయునదిలేక సహదేవునితో రాజీకుదుర్చుకొనెను. ఇట్లే మైంద ద్వివిదుల గెల్చి సహదేవుడు ధనరాసుల దెచ్చి అర్పించెను. మరియు సముద్రపుటొడ్ఢుచేరి లంకకు ఘటోత్కచుని ద్వారమున తనసంగతి చెప్పిపంపెను. ఈ సంగతి వినగనె విభీషణుడు ఐదువందలమంది జనముతో బంగారము రత్నరాసులను కానుకగా పంపెను. ఇట్లే నకులుడు హూణాదులచే పన్నుకట్టించెను. అర్జునుడు గంధర్వులచే పన్నుకట్టించెను. ఈ విధముగ రాజులందఱును ధర్మజునకు వశ##మైరి. రాజసూయము దిగ్విజయముగ నెరవేరనున్నది కాన జరాసంధుడు అను చక్రవర్తిని గెల్చినగాని రాజసూయము చేయుటకు వీలులేకున్నది జరాసంధుడు అజేయపరాక్రముడు. వానికి హంసడింభకులు సేవాపతులు ఆయుధములతో చావని వరముకలవారు. ఇట్టి హంనడింభకులకు తమ తండ్రిచే రాజసూయము చేయించవలయునని కోరిక పుట్టినది. వారు తమచక్రవర్తియగు జరాసంధుని రాజసూయమునకు ఒప్పించిరేకాని వారికి కృష్ణునిగూర్చి సందేహము వచ్చినది. అందులకు వారు వెనుకాడక జనార్ధనుడను బ్రాహ్మణుని పిలిచి కృష్ణుని రాజసూయమునకు రమ్మని, వచ్చునపుడు కొంత యుప్పు తెమ్మని చెప్పిపంపిరి. జనార్థనుడు భక్తుడగుటచే అందులకు లోలోన కుంది చేయునదిలేక పోయి చెప్పెను ఆ మాటలకు కృష్ణుడు ఆగ్రహోదగ్రుడై సాత్యకితో తాము తలపెట్టిన రాజసూయము గూర్చి చెప్పుమనియు కాబట్టి తాను రాననియు కబురుపంపెను.

ఇక సాత్యకి పోయి వారితో మిమ్ముచంపి కృష్ణుడు రాజసూయము చేయనున్నాడని పల్కగనే వారు తమ ఉప్పుసంగతి నడిగిరి. అందుల కాతడు సమాధానముగ.... యాదవు లుప్పుమోసిన మురారికి సోలలుమోయకింక పోవచ్చునె - అని పరిహసించి యుద్ధములో మీ యొడళులకైన గాయముల పూడ్చుటకుగా యాదవులు నూరినఉప్పు తెచ్చెదరని కోపముగ బల్కెను. అందులకు వారు కృద్ధులై సాత్యకిని పట్టుకొనబోగా తప్పించుకొనిపోయి కృష్ణున కున్నసంగతి నెఱింగించెను పిమ్మట జరాసంధునకు కృష్ణాదులకు యుద్ధము జరిగినది హంసడింభకులు ఆయుధములతో చావని వారగుటచే వారి చావునకు కృష్ణుడొక యెత్తుగడ నెత్తెను. డింభకుని దగ్గరకు వారి స్నేహితునొకని పంపి హంసుడు యుద్థమున చచ్చినట్టు వార్తపెట్టెను. ఆ మాట విని డింభకుడు చనిపోయెను. వానిని సముద్రమున బడద్రోచి, సముద్రమునబడి చచ్చెనని హంసునకు వార్త చెప్పగా వాడును అందుబడి మరణించెను. ఇట్లు కృష్ణుడు తన మాయోపాయముచే హంసడింభకుల ముందు పరిమార్చెను. ఇక మిగిలినది జరాసంధుడు, శ్రీకృష్ణుడు, భీమార్జునులను తీసికొని బ్రాహ్మణవేషధారులై జరాసంధుని నగరమున ప్రవేశించి రాజప్రాసాదమున దొడ్డిదారిగుండ ప్రవేశించిరి జరాసంధుడు వారు అతిధులని భావించి అర్ఘ్యపాద్యాదు లొసంగి సత్కరించెను. పిమ్మట వారు శత్రువులని భావించి, భీమునితో మల్లయుద్ధమునకు కడంగి వానిచే నిహతుడయ్యెను. ఆ ఉదయముననే జరాసంధుడు తన కుమారుడగు సహదేవునికి పట్టము కట్టియుండెను. కనుక కృష్ణుడు నీ తండ్రి చేసిన పట్టాభిషేకము చెల్లదని భీమార్జునుల గలుపుకొని వాని నభిషేకించెను. అంతనాతడు కృష్ణభీమార్జునులకు పన్నుకట్టి స్వాధీనమయ్యెను. ఇపుడు ధర్మరాజు యొక్క రాజసూయమునకు అడ్డువచ్చు వారెవ్వరు లేరు. నిర్విఘ్నముగ సాగిపోయినది.

కుంతి సంతానప్రాప్తి చూచిన ఆమె పతివ్రతయేనా? అను ప్రశ్నము కొందఱకు పొడముచుండును. సామాన్యముగ నేస్త్రీకైనను సంతానము లేకున్నచో దేవరన్యాయముతో సంతానము మునుపటికాలమున పొందవచ్చును. అట్లు స్త్రీ ధర్మసంతానము పొందగోరినప్పుడు విరూపముతో పురుషుని పొందవలయును. మరియు నా పురుషుడు ఒక్కసారి మాత్రమే స్త్రీయందు వీర్యమునుంచిన మాత్రమున సంతానమిచ్చు శక్తిగల వాడుగ నుండవలెను కాని మాటిమాటికి సంతానము కలిగినదాక వారికి సంసార బంధము ఉండరాదు. కలియుగమున నిట్టి సంప్రదాయములు, శక్తులు, తగ్గిపోయినవి. కాబట్టి సంతానహీనులు దత్తత చేసికొన వలయును అని శాస్త్రములు విధించుచున్నవి. అస్యాం జాయేత పుత్ర పుత్రస్సమే పుత్రో భవిష్యతి - అని కన్యాదాన సమయమున మంత్రముపఠించి నచో పుత్రికా పుత్రుడు వంశకర్తకాగలడు, అట్లుకాకున్న ఆ బిడ్డ దౌహిత్రుడే యగును. ప్రస్తుతము పాండురాజునకు క్షేత్రజ సంతానము కావలసియున్నది. ఏలయన అడవియందు పాండురాజు వేటాడుచుండగ ముని దంపతులు మృగములై విహరించుచుండిరి.

ఈ రహస్య మెఱుగని పాండురాజు బాణముతోకొట్టగా అందు మగజింక చనిపోయినది. అంత ఆతని భార్యయగు ఆడుజింక - వేటన్యాయము తప్పి క్రీడించు మమ్ము బాణముతో కొట్టితివి గాన, నీవును భార్యనంటినచో నీతల శతధా భిన్నమగునని - పాండురాజును శపించినది ఈ కారణముచే నాతడు భార్యల తాకరాదు. ఇట్టి శాపోపహతుడైన పాండురాజు తిరిగి నివాసమునకు వచ్చి అందఱును ఇంటికి పొమ్మనియు తాను తపస్సు చేసి కొనెదనని పల్కెను. ఈ మాటలకు కుంతియు పాండురాజుతో తపస్సు చేసి తరించెదనని పల్కినది. మాద్రియు నామెతో పాటైనది. ఇక తప్పదని పాండురాజు తన భార్యలతో కలసి తపస్సు ప్రారంభించెను రాజ్యము వాని పేరనే విదురాదులు నిర్వర్తించుచున్నారు. ఆతని తపస్సు గట్టిపడి - ఆకాశగమనమున బ్రహ్మలోకమునకు పోవుటకు సంతన కట్టునంతటి మహత్తు కలదియైయున్నది. ఒకప్పుడు బ్రహ్మలోకమునకేగు మునులతో ఇరువురు రాణులతో అట్లుపోవుచు శతశృంగ పర్వతమువరకు ప్రయాణముసాగించెను. తదుపరి గమనశక్తి తగ్గుచున్నట్లు తోచెను. అందులకు కారణమేమనియడుగ అపుత్రకుడు బ్రహ్మలోకమునకు పోలేడని ఋషులు చెప్పిరి. అపుడు పాండురాజు చింతాక్రాంతుడు కాగా ఋషులు నీకు దివ్యమగుక్షేత్రజ సంతానము కలుగగలదు. దాని ప్రయత్నము చేసికొనుమని వచించిరి. పాండురాజు భార్యతో నాలోచింప అయ్యెడ కుంతి పాండుని మరణానంతరము సన్నిహితుడవై తపశ్శక్తితో సంతానమిమ్మని కోరినది. కాని పాండురాజు సంతానమిప్పుడే కావలయునని కోరగ ఆమె తన చిన్నతనమున దుర్వాసుడిచ్చిన మంత్రప్రభావమును గూర్చి చెప్పినది. అపుడు పాండురాజు నాజ్ఞచే కుంతి ధర్మజ భీమార్జునుల ఇంద్రతేజుల యమవాయు ఇంద్రులవలన కనినది. నకుల సహదేవులు మాద్రి అశ్వినుల వలన కన్న అమరసంతానము.

ఇచట ముగ్గురకంటె నెక్కువగ కుంతి సంతానము కోరలేదు. ఏలయన దేవరన్యాయముతో సంతానమునొందు స్త్రీ ముగ్గురకంటె నెక్కువపొందినచో ఆ స్త్రీ పాతివ్రత్యము భంగమమగునని వలదని పల్కినది. కాని తన సవతియగు మాద్రికి సంతానములేకున్న బాగుండదని, మరియు నామె పోరుపడజాలక ఆమెకును సంతాన మివ్వవలసి వచ్చినది. ఇయ్యెడ కుంతి తంత్రము గమనింపవలసి యున్నది. ఆమెకు మంత్రోపదేశము చేసినచో తనకంటె నెక్కువమంది పుత్రులను గనునెమో యని భావించినది. అందుల కామె తానె మంత్రోచ్చారణము చేయుదుననియు, ఏదేని దేవతను మనస్సున ధ్యానించుమనియు, మాద్రికి సలహా నిచ్చినది ఆ మాద్రియు కొంచెము తెలివికలది యగుటచే నొక్కసారి యిద్దఱు దేవతల ధ్యానించినది. కాబట్టియే ఆమెకు నకుల సహదేవులు ఇద్దఱు జన్మించిరి. పిమ్మట నొకనాడు మాద్రి సర్వాంగసుందరముగ నలంకరించుకొని యుండగా నామెనుజూచిన పాండురాజు మన్మథపీడితుడై సంగతుడయ్యెను మరుక్షణముననే ఆతడు శాపవశమున మరణించెను. మాద్రియు తన కారణమున భర్త మరణించెనని సహగమనముచేసినది. కుంతిమాత్రము ఋషులు, పిల్లల పోషింపకుండ నీకది కూడదని నివారించుటచే జీవించి యుండినది.

18

పాండవులను సుహృద్యూతమని పిలిచి దుర్ద్యూతమాడి కౌరవులు ఓడించి వెడలనడచిరి పాండవు లరణ్యవాసమునకు పోవునపుడు చాల మంది బ్రాహ్మణులు వారిని వెంబడించిరి. ధర్మరాజు వారిని వలదన్నచో శాపమిచ్చెదమని పల్కగా భయపడి ధర్మజుడు మిన్నకుండెను. ఆ బ్రాహ్మణులందఱు తమ ఆహారమును తామె సంపాదించుకొని ధర్మజునకు జయము చేకూరునట్లు దీవించెదమని వెన్నంటివచ్చిరి. కాని ధర్మరాజు మాత్రము తన కారణముగ వచ్చిన బ్రాహ్మణుల కాహారమెట్లని చింతిల్లు చుండెను. వెళ్ళినరోజు ఉపవాసముండి గంగలో కంఠదఘ్నముగ నీటనిల్చి బ్రాహ్మణుల తిండికై బిట్టు విలపించెను. పిమ్మట ధౌమ్యుని సలహాననుసరించి సూర్యోపాసనచేసి సూర్యానుగ్రహముచే అక్షయపాత్రను వరముగ నొందెను ఆ పాత్రమూలమున ద్రౌపది అతిధులకు, అభ్యాగతులకు బ్రాహ్మణులకు, తన భర్తలకు, ఆహారమును సమర్పించి, తాను భుజించి పాత్రము పరిశుభ్రముచేసిన నిక నానాటికి అందు ఆహార ముత్పత్తి కాదు. ధర్మరాజు ఇట్లు యజ్ఞయాగాదులచేయుచు నిరతాన్న దానశీలుడై పన్నెండేండ్లు కాలము గడపెను. రాక్షసు లెందరో మాయోపాయములతో పూర్వవైరముల సాధింపదలపడిరి. కాని పాండవులు దుష్టశిక్షణకే అవతరించుటచేసి రాక్షసుల చాలమందిని చంపుచుండిరి. ఇట్లు కొంతకాలము గడువగా శ్రీకృష్ణుడు, సాత్యకి, బలరాముడు వీరిని జూచుటకు వచ్చిరి. కృష్ణుడును పాండవుల శాంతగుణమును జూచి కౌరవులపై మిక్కిలి కోపించెను. ధర్మరాజు మాత్రము కౌరవులను జంపరాదని పల్కుచు వారి చేతులు పట్టుకొనెను. అంతియగాక పదమూడేండ్లు తర్వాత తామే యుద్ధమున కౌరవుల విహతుల గావించెదమని పల్కెను. కాని ద్రౌపదికి జరిగిన పరాభవము మాత్రము సహింపరానిదై సమస్త రాజలోకమునకు తలవంపులుగ నుండెను. దుష్ట చతుష్టయము బలమును జూచుకొని దుర్యోధనుడు కుడిచి కూర్చుండజాలక పాండవ పరాభవమునకు తలపెట్టెను.

కాని యిందులకు ప్రత్యక్షముగ ధృతరాష్ట్ర భీష్మాదులు ఒప్పుకొనరు

కావున కర్ణశకునుల సాయముచే ఘోషయాత్ర నెపమున పాండవులున్న అరణ్యప్రాంతమున సమస్త పరివారముతో, భార్యాసహితుడై విలాసముగ దుర్యోధనుడు పోవ బయలుదేరెను. కాని ధృతరాష్ట్రుడు ఘోషయాత్రకే వలదని వారించెను. ఎట్టకేలకు అంగీకరించెను. పాండవుల పరిహసించుటకు కౌరవులు వచ్చిరని తెలిసిన దేవేంద్రుడు చిత్రరథుడను గంధర్వరాజును బంపి దుర్యోధనుని బంధించి తెమ్మని పంపెను. అంత నా గంధర్వరాజు దుర్యోధనుని సైన్యసహితముగ యుద్ధమున నోడించి, కర్ణుని రథము విరుగగొట్టెను. తరువాత చిత్రరధుడు దుర్యోధనుని బంధుమిత్ర పరివార సమేతముగ ఖైదీలచేసి కట్టికొని పోవుచుండెను. ఇక చేయునదిలేక మిగిలిన సైన్యము ధర్మరాజును సమీపించి నీ యనుజ వ్రాతము గావవే కరుణ నిండారంగ రాజోత్తమా! అని ప్రార్థించిరి కాని భీముడు మాత్రము తమ శత్రువులైన కౌరవులకు పరాభవము జరుగుచున్నదని సంతసించి - కాగలపని గంధర్వులే తీర్చుచున్నారని గంభీరముగ పల్కెను. అంత ధర్మరాజు భీముని శాంతింపచేసి దుర్యోధనాదుల విడిపింప నాజ్ఞాపించెను. ధర్మరాజప్పుడు సద్యస్కంధమను యజ్ఞము చేయుచుండుటవలన తాను పోవుటకు వీలులేదనియెను. ధర్మరాజు శాసనము ననుసరించి భీమార్జున నకుల సహదేవుల గంధర్వులతో పోరుటకై పోయిరి.

అర్జునుడు చిత్రరధుని దుర్యోధనాదుల విడువుమని కోరెను. కాని

లాభము లేకపోవుటచే వారి దారిని బాణములచే నడ్డగించెను. అపుడు చిత్రరధుడు అర్జునునికి ఇంద్రుని పంపున తాము వచ్చుట నెఱింగించి అర్జునుని యిష్టానుసారము దుర్యోధనుని ధర్మరాజుకడకు కొంపోయెను. అపుడు ధర్మరాజు వాని బంధముల తొలగించి పొమ్మని చెప్పెను. కాని దుర్యోధనుడు ధర్మరాజుచే రక్షింపబడినందులకు చింతిల్లి ప్రాయోపవేశమునకు పూనుకొన నిశ్చయించెను. ఇంతలో కర్ణుడు వచ్చి దుర్యోధనుడు గెలిచివచ్చెనని భావించి పొగడుచుండెను అందులకు దుర్యోధను డింకను విచారగ్రస్తుడై యుద్ధమున తానుపొందిన పరాభవమును గూర్చి కర్ణునకు చెప్పుచు - కం|| పుడమి వివరంబు లేదే| అడగెద నన్నట్టిదయ్యె నప్పుడు కర్ణా| అని విలపించెను, ప్రాయోపవేశ సమయమున కర్ణుడు, శకుని యెంతయో చెప్పి చూచిరి కాని లాభము లేకపోయినది అపుడు పాతాళవాసులైన రాక్షసులు తమ అంశావతారుడైన దుర్యోధనుడు నశింపరాదని భావించి, ఒక హోమమును గావించిరి. అందు కృత్య యను రాక్షసి జన్మించి, దుర్యోధనుని పాతళమునకు తెచ్చిపెట్టినది. అంత రాక్షసులు యుద్ధమున భీష్మాదులు రాక్షసావేశ పూరితులై పాండవుల నిహతుల గావించెదరనియు, తప్పక జయము చేకూరగలదనియు పల్కిరి. ఈ మాటలు వినిన దుర్యోధనుడు సంతసించి కర్ణుని ప్రతినకు ఉత్సాహపూరితుడై ప్రాయోపవేశమును విరమించి గృహగమనోన్ముఖుడయ్యెను. కాని దుర్యోధనుని పరాభవము సంగతి ఉదయమే ఊరంతయు ప్రాకినది. మొట్టమొదట దుర్యోధనుడు రాజధానియందు అడుగుపెట్టగనె భీష్ముడు జరిగిన సంగతిని గూర్చి ప్రశ్నించెను. జరిగిన సంగతి నెరింగినవాడై పాండవుల మంచితనమును వేనోళ్ళ పొగడెను.

అరణ్యవాసము పదమూడునెలలు గడచిన పిమ్మట ద్రౌపది

ఆవేశపూరితురాలై కౌరవులను జంపుమని భర్తల కోరినది. కాని ధర్మరాజు తేనెపూసిన కత్తివంటివాడు. కావుననే సమయభంగ మొనర్పరాదనియు, పదుమూడేండ్లకు పిమ్మటనే కౌరవుల యుద్ధమున చంపవలయుననియు చెప్పెను. మొత్తముమీద ధర్మరాజు అసత్యదోషమునకు పాల్పడలేదు. ద్రౌపది మాత్రము తాను చెప్పినమాట అసత్యదోషపూరితము కానేరదనియు, ఒకసంవత్సరమునకు ఒకనెల ప్రతి ప్రసవము చాలుననియుకాబట్టి సమంజసమే యని పల్కినది. ధర్మరాజు అపుడు కౌరవుల చంపుటకు నెలలక్కరలేదనియు, పదుమూడు ఘడియలే చాలుననియు ధీరముగ పల్కెను. అందులకు ద్రౌపది కాలవిలంబన మోర్వలేనిదై ఆవేశముతో దైవమును దూషించెను. అందులకు ధర్మరాజు దైవనింద చేసిన భార్యను లెక్క సేయక - మేము ధర్మమున నడచుచుండియు నిన్నిపాట్లేల పడవలసి వచ్చెనా? అని ఎప్పుడు విమర్శించుచుండియు కారణము కనుగొనలేకపోయితిని. ఇప్పుడు విస్పష్టమైనది. ధర్మదూషణ దైవదూషణము చేయు భార్యవు దొరుకుటవలన మా ధర్మమంతయు నిష్ఫలమై పోయినది అని యెత్తిపొడుపుగమాటాడెను. అపుడు ద్రౌపది భర్తచుట్టు ప్రదక్షిణించి క్షమాభిక్ష నర్థించినది. ధర్మరాజు ద్రౌపదిని పశ్చాత్తప్తవై పొరబాటున పల్కితినంటివి. అది యిదియే మొదటి తప్పిదమగుటచే క్షమించితిననెను. ఆ సమయమున వ్యాసుడు వచ్చి ధర్మరాజును బొగడి శైవయోగముతో పాశుపతాస్త్రము సంపాదింపుమని చెప్పిపోయెను. పిమ్మట ధర్మరాజు నాజ్ఞచే అర్జును డందులకు పూనుకొని తపస్సు నారంభించెను.

ఇట్లు అర్జునుడు సంసిద్ధుడగుట కొక కారణమున్నది. ధర్మరాజు రక్తము

చూచువరకే శాంతచిత్తుడు కాని, రక్తము కంటబడినచో వీరవిహారము చేయగలవాడు. కాని అర్జునుడు అస్త్రప్రయోగమునందు శాంతస్వభావము విమర్శము కలవాడగుటచే అతడే ఆయుధ సంపాదనమున కర్హుడని వ్యాసుడు చెప్పిపోయెను. అర్జునుని తపస్సమయమున ఇంద్రుడు పరీక్షింపనెంచి అప్సరసల నంపెను. వారి అల్లరికి అర్జునుడు అటు ఇటు కదలలేదు. అందులకు వారి అశక్తతను ఇంద్రునితో చెప్పగా ఇంద్రుడు అర్జునుని తపశ్శక్తి మెచ్చి వచ్చి శైవయోగము చెప్పిపోయెను. శైవయోగముతో శివోసాసన ప్రారంభ##మైనది. శివుని మాయవలన అర్జునుని అక్షయతూణీరములు, బాణములు వట్టిపోయినవి. అపుడు అర్జునుడు గాండీవముతో శివుని నెత్తిపై మొత్తగా అదియు శివుడు మాయముచేసెను. అపుడు అర్జునుడు శివునితో కలియబడి పిడికిలితో నెత్తిన మొత్తగా మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యెను. పాశుపతమిచ్చి మంత్రోపదేశము చేసిపోయెను. ఇంద్రుడు అర్జునుని బలపరాక్రమమునకు మెచ్చి, ఆహ్వానించి అర్ధసింహాసనముపై కూర్చుండబెట్టుకొనెను. తనవద్దనున్న విశేషాయుధముల నిచ్చి వేల్పులందఱచేత సర్వాస్త్రము లిప్పించెను. అర్జునుడు దేవలోకమునందున్నప్పుడే ఊర్వశి ఇంద్రునాజ్ఞతో అతనిపై కోరికతోవచ్చి నిరాశ##యై అర్జునుని నపుంసకుడవగుమని శపించినది. అందులకు ఇంద్రుడు అతనిని నీ ఇంద్రియజయము కీర్తనీయము తండ్రీ - అని పొగడి, ఈ శాపము అజ్ఞాతవాసము సంవత్సరము మాత్రము అనుభవించిన తీరునని శాపవిమోచనమును ప్రసాదించెను. మరియు దేవతలకోరికపై నివాతకవచులను కాలకేయులను రాక్షసులను విజయుడు సంహరించెను.

ఇట్లు దేవలోకమున ఐదురోజులుండి (భూమిపై ఐదేండ్లు) సంగీతాది

విద్యలన్నియు విజయుడు గడించెను. తిరిగి వచ్చిన పిమ్మట ధర్మరాజు అస్త్రముల ప్రదర్శింపుమని యడుగ అర్జునుడు అన్నగారికి ప్రయోగోప సంహారములు జూప, నారదుడు అస్త్రప్రయోగము ఎదురు శాత్రవులు లేకుండ కూడదని చెప్పెను. ధర్మరాజునకు ఈ లోపల శివునివలన శక్తి ఆయుధము లభించినది ఒకరోజున పాండవులు వేటకు పోగా ద్రౌపది యొంటరిగా నుండగ సైంధవుడామెను కామించెను ద్రౌపది అందులకు గినిసి. తన భర్తలు అగ్నులవంటివారనియు, చిక్కినచో దహింపగలరనియు బెదరించినది. కాని లాభము లేకపోవుటచే వానిచే బలాత్కారముగ రథమెక్కింపబడక తానె రథమెక్కి కూర్చుండి వానిని అనేక విధముల నిందించినది. ఈ సమయముననే వేటకు వెళ్ళిన ధర్మరాజునకు అపశకునములు పొడగట్టుటచే తమ్ములందఱతో తిరిగివచ్చి ద్రౌపదికి జరిగిన పరాభవము తెలిసికొనెను. వెంటనే పాండవులు వాని వెన్నంటి పర్విడుచు ద్రౌపది రథమువెంట కాపలాగా దుష్టుని నిందించుచు బోవుచున్న ధౌమ్యులను ఆపి సైంధవునితో తలపడిరి. అప్పుడు పాండవులకు వాని సామంతులతో సేనలతో మహాయుద్ధము జరిగినది. చాలమంది నశించిరి. అంత సైంధవుడు భయపడి ద్రౌపదిని దించి తాను రథముపై శరవేగమున బోవుచుండెను. ద్రౌపదిని గైకొని ధర్మజుడు నకులసహదేవులతో వెనుకకు తిరిగెను. కాని భీమార్జునులంతటితో తృప్తినొందక వాని వెంటనంటిరి. ధర్మరాజు వారితో దుస్సల తలచి వాని నొక్క తప్పునకు గావుడని నుడివెను. సైంధవుడు రథముదిగి పలాయనము చిత్తగించెను. కాని భీమార్జునులు వెన్నంటి వాని పట్టుకొని వచ్చిరి. భీముని గ్రుద్దులకు వానికి పైప్రాణములు పైనపోవుచుండెను. అర్జును బోధతో వాని చంపుట చాలించి, తల చెక్కలెగయునట్లు గొరిగి, పాండవదాసుడనని చెప్పుకొనునట్లు ఒప్పించి తెచ్చి ధర్మజుని కాళ్ళపై బడవైచిరి. ధర్మరాజు వాని ఇంద్రియలోలతను, హీనతముడవని నిందించి దయదలచి విడిచిపుచ్చెను.

ఈ పరాభవమును భరింపజాలని సైంధవుడు పాండవులను యుద్ధమున

గెలువవలయునని శక్తికై తపస్సు నారంభించెను. అంత శివుడు ప్రత్యక్షమై ఒకనాటి యుద్ధమున అర్జునుని తప్ప నల్వురిని గెలువగలవని చెప్పెను. ఇట్లు అరణ్యవాసము పన్నెండు వత్సరములు పాండవులు తపము లాచరించి లోకమునగల ఆయుధములనెల్ల సంపాదించిరి. మునుపె పాండవు లజేయులు. ఈ అరణ్యవాసమున సంపాదించిన అస్త్రశస్త్రాదులతో లోకైక వీరులై నిర్భయముగ కౌరవుల నెదిరింపనుండిరి. ఇట్లు పన్నెండేండ్లు గడువనున్న చివరిదినముల బ్రాహ్మణుని అరణి నొకమృగము అపహరించుటచే తదన్వేషణకై వాడు బయలుదేఱిరి. మార్గమధ్యమున వారికి దప్పిక యగుటచే జలాశయము కొఱకై చెట్టునెక్కి చూచిరి. అల్లంత దూరమున జలాశయమొండు గన్పట్టుటచే తొలుత సహదేవుడు జలాహరణార్థము పోయెను. కాని అచట నున్న యక్షుని ప్రశ్నలకు సమాధాన మివ్వకుండుటచే సహదేవుడు నీరుత్రావి మూర్ఛాగ్రస్తుడయ్యెను. ఇట్లే నకులభీమార్జునులు సమాధానము లివ్వక నీరుత్రాగి గాఢనిద్రలో మునిగిపోయిరి. కాని అర్జునుడు మాత్రము యక్షప్రశ్నలు వచ్చు శబ్దమును బట్టి శబ్దవేది శరప్రయోగమును గావించెను. కాని లాభములేక తానును మూర్ఛనొందెను. ఎంతకు తమ్ములు రాకుండుట జూచి ధర్మరాజే అచటికి వచ్చెను. తమ్ముల దుస్థితికి చింతిల్లెను. ధర్మరాజును కూడ అశరీరవాణి భీమాదులను వలె ప్రశ్నించెను.

అపుడు ధర్మరాజు అశరీరవాణికి నమస్కరించి ప్రత్యక్షమగుమని

ప్రార్థించెను. ఆ యశరీరభూతము యక్షరూపమున నగపడి అడుగ యక్షప్రశ్నల కన్నింటికి సమాధానమిచ్చెను. అందులకు సంతసించి యక్షుడు పడియున్న తమ్ములలో నొక్కని బ్రదికించెదను. కోరుకొనుమని చెప్పగా ధర్మాత్ముడగు ధర్మరాజు నకులుని బ్రతికింపుమని ప్రార్థించెను. ఇప్పట్ల ధర్మజుని ధార్మికదృష్టి, వినయము స్పష్టమగుచున్నది. మాద్రీసుతుని కోరుట ధర్మరాజు కర్మతంత్రమునకే. కుంతి సంతానములో తానున్నాడు కాబట్టి మాద్రిసంతతిలో నొక్కని బ్రదికింపగోరెను దానివలన తన సవతి తల్లికి తృప్తియగునని ధర్మరాజు కనబరచిన ఈ దృష్టికి యక్షుడు మిక్కిలి సంతసిల్లి అందఱను బ్రదికించెను. అంత నా యక్షుడు తాను యముడనని చెప్పి తన రూపము జూపి ధర్మరాజు జ్ఞానమును వేనోళ్ళ పొగడెను. అంతియగాక పాండవులు అజ్ఞాతవాస సమయమున నెట్లున్నను నోటితో చెప్పినగాని ఎవ్వరిచే గుర్తింపబడనట్లు వరమిచ్చెను. మరియు బ్రాహ్మణుని అరణి గైకొనితెచ్చిన మృగము తానె యని చెప్పి తిరిగి యిచ్చిపోయెను. పిమ్మట పాండవులు వారము రోజులలో అరణ్యవాసము ముగించి, అజ్ఞాతవాసమున ప్రవేశించిరి. కాని వారు నాల్గురోజు లరణ్యమున గడుపునపుడు తెలివియున్న కౌరవులకు చిక్కి యుండెడి వారని తోచుచున్నది. దైవవంచితుల నెవడు బోధింప గలడు? అయ్యెడ పాండవులు బ్రాహ్మణులను తిరిగి పొమ్మని, ధౌమ్యద్రౌపదులతో రథములపై బయలుదేఱి విరాటనగరమునకు సమీపమున నాగి, రథములను ద్వారకకు పంపి, దాసజనమును పాంచాలమునకు పంపిరి. ఇక ధౌమ్యునకు తమ అగ్నులనిచ్చి ఇష్టమువచ్చిన దెసకు పొమ్మనిరి. పిమ్మట పాండవులు మత్స్యదేశమునకు పోయిరి. పోవుటకు ముందే ఆయుధముల నన్నింటిని శవముతో బంధించి, అస్త్రదేవతలను ప్రార్థించి వృక్షముపై గట్టిరి. అంత ధర్మరాజు స్నానాదులు నిర్వర్తించి ప్రవాహమునుండియే ధర్మదేవతను ప్రార్థించి వాని వరమున అతడు వెంటనే సన్న్యాసి అయ్యెను. ఇట్లే ధర్మదేవతాదత్తములగు అజ్ఞాతవాసమునకు తగిన వేషములు వహించి విరాటనగరము చేరిరి. ఆనాడు విరాటరాజసభ బహిరంగముగ జరుగుచుండెను. వీరిని చూచి అచటివారు ఆశ్చర్యపడుచుండిరి. సన్న్యాసి వేషధారియగు ధర్మరాజు విరాటుని సభకు నంతనింత దూరమున నుండగనే అతడు వితర్కించి సభతోగూడ లేచి యెదురువోయి నమస్కరించి వానిని దెచ్చి యున్నతాసనమున నుంచెను.

ఇట్లు దైవసహాయమున సార్వభౌముడగు ధర్మజుడు సామంతునకు

నమస్కరింప కుండ దప్పినది. మొత్తముమీద దైవసంకల్పమున పాండవులు విరాటనగరమున కీచకవధకై ప్రవేశించినట్లు భావింపనగును విరాటుని ప్రశ్నమునకు ధర్మరాజు తాను ద్విజుడ, గురువిషయ జాతుడ, ధర్మరాజు సఖుడనని చెప్పుచు గృహస్థుడననియు ధ్వనింపచేసెను. ఇట్లే భీముడును వలలుడై వంటలవాడుగ చేరెను భీమునకు ఆకలి యెక్కువ యగుటచే పాకశాల తనదిగ చేసికొనెను. ఇక అర్జునుడు నపుంసకుడేయని పరీక్షవలన తేల్చి, విరాటుడు అంతఃపురమున కన్నియలకు ఆటలు పాటలు చెప్పుటకు చేర్చుకొనెను. ఇక నకులుడు తాను హీనకులుడనని చెప్పికొనెను హీనకులుడనగా తక్కువకులము వాడనియు, హీ హీ నకులుడనియు అర్థము. ఇట్లే సహదేవుడు గొల్లవాడుగ చేరెను. ద్రౌపదియు సైరంధ్రిగ జేరినది.

19

పాండవులు విరాటనగర ప్రవేశము చేయుసరికి అప్పటికి షుమారు

తొంబదియేండ్ల ప్రాయము వారైయుండిరి. ద్రౌపదికి దెబ్బదియేండ్ల వయస్సుండి యుండవచ్చును. విరాటనగరమున నున్నప్పుడు భీముడెందఱనో మల్లులనోడించెను. అచట చేరి పదునొకండు నెలల పదునైదు రోజులైన పిమ్మట సైరంధ్రిగనున్న ద్రౌపదిని కీచకుడు ప్రేమించి తన సోదరియగు సుధేష్ణను ద్రౌపదిని యొప్పించుటకై ప్రార్థించెను. వాడు సుధేష్ణకు సవతితల్లియగు, సూతస్త్రీకొడుకు. సైరంధ్రియందుగల కీచకుని కామభావమును సుదేష్ణ యెంతగనో దూషించి నివారింప జూచినది. కాని లాభములేక సైరంధ్రిని వారుణి నెపమున కీచకునికడ కంపినది. అపుడు కీచకుడు ద్రౌపదిని ప్రత్యక్షముగ బలాత్కరించబోయెను. అందులకు ద్రౌపది కోపించి తన పతుల ప్రాభవమును - దుర్వారోద్యమ బహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్గర్వాంధ ప్రతీవీర నిర్మధనవిద్యాపారగుల్‌ మత్పతుల్‌ - అని హెచ్చరించినది. అంతియగాదు గీర్వాణకృతులగు వారిచే చచ్చెదవనియు హెచ్చరించినది. తరువాత వాని బారినుండి తప్పించుకొని బయటికి వచ్చినది. ఇంతవరకు సుధేష్ణ కీచకుని ఆరాటమునకు అడ్డు కట్టలు వేయుటకు యత్నించినది. కావున నీమె మంచిదే యగుచున్నది. తప్పనిసరిగ పంపవలసివచ్చి వంపుటచే నామెను నిందింపవలసి వచ్చినది. ద్రౌపది తప్పించుకొని విరాటరాజు సభ##చేయుచున్న రచ్చపట్టుదగ్గరకు వచ్చుచుండెను.

ఆ సమయముననే కీచకుడు ఆమె జుట్టు పట్టుకొనగా నామె ప్రార్థనచే

ముందుగనే సూర్యుడు పంపిన అదృశ్యుడగు రాక్షసుని శక్తి వలన నాతని బడద్రోచి సభలోనికి వచ్చినది. కాని అవమానములపాలైన కీచకుడు మరల పోక సిగ్గువిడచి అట్లే నిలబడుటకు విరాటరాజు మిక్కిలి చింతించెను. వాడు బలవంతుడగుటచే నేమియుచేయలేక విరాటుడు పొమ్మని బ్రతిమాలెను. ధర్మరాజు, భీముడు ఆ యాపదను జూచిరి. భీమునకు భయంకరమైన కోపమువచ్చినది. ధర్మరాజునకు ముత్యములవంటి చెమట బిందువులు పాలస్థలమున నలంకరించినవి. ఆ సమయమున భీముడు రచ్చచెట్టు పెల్లగించి కీచకుని చంపవలయునని భావించెను. కాని అన్నగారి కనుసన్నచే వారింపబడెను. అంతియగాక ధర్మరాజు యొక్క నర్మగర్భవాక్కులకు కట్టుబడియుండెను. ఆ సమయమున ధర్మజుడు - వలలుండెక్కడ జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే! ఫలితంబై వరశాఖ లొప్పగ అనల్పప్రీతి సంధించుచున్‌! విలసచ్ఛాయనుపాశ్రితతికి న్విశ్రాంతి గావింపగా గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపగా చెల్లునే! అని భీమునితో పల్కెను. విలసితచ్ఛాయతో నున్నట్టి యీ చెట్టును చంపరాదని నివారించుటచే నాగిపోయెను. ఇక విరాటరాజు చేయునది లేక కీచకుని పొమ్మని సైగ చేసెను.

బలవంతుడైన బావమరదిని విరాటు డేమియు చేయజాలక

మిన్నకుండెను. ద్రౌపది మాత్రము తనవంటి బలవంతులకు గంధర్వుల ఇల్లాలి కిట్టి పరాభవము జరుగగా, నెవని యిల్లాండ్రకిక యాపద రాకుండును అని కోపావేశమున బల్కినది. అందునకు ధర్మజుడు మాత్రము - వారిజాక్షి! నీ పరాభవ మందఱు చూచినదియే. నీ పరాభవంబున కోపింపజాలరే గంధర్వులకు తరిగాదుగాక! చనుము నీవు సుధేష్ణ సదనమునకు - అని పల్కగా ద్రౌపది యింకేమియో చెప్పబోయెను. వెంటనే ధర్మజుడు - గరువతనముగల ఇల్లాలు శైలూషివలె సభల నాటాడవచ్చునా? అని అజ్ఞాతవాసమున కామె భాషణములు భంగమగునేమోయని గద్దించెను. అందులకు ద్రౌపది కినిసి పరాభవబాధ నొందియున్నదిగాన కసి నాపుకొన లేక నా భర్తలవు గంధర్యులేవురలో నొకడు జూదమాడువాడు. ఒకడు నటుడుగాన జూదమాడువాని భార్యకు గరువతనం బెక్కడిది? అంతియగాక నటుని భార్య నటి యగుటలో నాశ్చర్యమేమున్నది అని - ఏశైలూషిగా ననంగరాదు కంకభట్ట! అని చెప్పి వెళ్ళిపోయినది. అలసిసొలసి చెల్లాచెదురైన యలకలతో వచ్చిన ద్రౌపదిని చూచి సుధేష్ణ యేమిది? అని ప్రశ్నించినది. అందులకు ద్రౌపది నీ వలననే యిట్టి కష్టము వచ్చినదని చెప్పినది. స్నాన భోజనాదుల వర్జించి కీచకవధోపాయ మాలోచించుచుండెను. అందులకు భీముడే తగినవాడని యెంచి పాకశాలకు అర్థరాత్రి పోయి భీముని తట్టిలేపినది. భీము డదరిపాటున లేచి-ఏల? ఈ అర్థరాత్రి నీ రాక? అని పల్క తెలిసియుండియె నీ విట్లడుగుచున్న నేను చెప్పి మాత్ర మేమి ప్రయోజనమని తన వగనంతయు వెళ్ళబోసినది.

మరియు భీమునితో ఉ. నన్ను పరాభనించి సదనంబునకున్‌

జనికీచకుండు మున్నున్న తెఱంగు తప్పక సుఖోచితశయ్యను నిద్రచేయ నీ కన్నుమొగుడ్పు నూఱటకు కారణమెయ్యది భీమసేన! మీ యన్న పరాక్రమంబు వలదన్నదొకో దయమాలి తక్కటా! అని ద్రౌపది బిట్టువిలపింపసాగినది. అపుడు భీముడు ధర్మజుని గొప్పతనమును, శాంతమును గూర్చి చెప్ప నామెయు నొప్పుకొని యెట్లయినను ప్రస్తుత పరిస్థితినిబట్టి కీచకుడు చావకున్న తానే చచ్చెదనని పట్టుబట్టినది అపుడు భీముడు కీచక వధోపాయము నాలోచించి ద్రౌపదిని కీచకుని మోహించినట్లు నటించి వాని నొంటరిగ నర్తనశాలకు రమ్మని చెప్పిన రాత్రి విజనమగు నచ్చట వానిని మాటుబెట్టెదననియు చెప్పెను. ఇక ద్రౌపది యట్లే యని తన నివాసమునకు పోయి మామూలుగా నుండ కాముకుడు దుర్విదగ్థుడుగాన మరునాడాత డచ్చటికివచ్చి మాటాడజొచ్చిన భీముని వాగ్భలమున నైహికాముష్మిక భయములేనిదై ద్రౌపది అర్ధరాత్రమున విజనమవునర్తనాగారమునకు రమ్మని ఒకడవేరమ్మని కట్టడిచేసి పంపెను. అపుడు కీచకుడు విరహజ్వర పీడితుడై రాత్రి కొఱకు - మాయరవి యేల క్రుంకడొకొ - అని ఉపాలంభనము ప్రారంభించెను. భీముడు సర్వసన్నద్ధుడై వచ్చి సైరంధ్రినొక మూలనుంచి తానొక శయ్యపై పండుకొనెను. అపుడు కీచకుడు - సింగంబున్న గుహానికేతనమునకున్‌ శీఘ్రంబునన్‌ వచ్చు మాతంగంబున్‌ బురుడించుచున్‌ - భీముడున్న యెడకు వచ్చెను. మొదట కీచకుడు భీముని సైరంధ్రియే యని భావించి కీచకుడు తన ప్రాభవమంతయు నేకరువుపెట్టి తాకగా భీముడు కొన్ని మాటలాడి మెడలంకించుకొని వంగదీయ నతండును గంధర్వుడనుకొని యెదిరించి లాగుకొన నిట్లు గూఢనిమర్థనముల కొట్టుకొనుచుండిరి. అజ్ఞాతవాసము చెడునేమోయని భీముడు, వ్యభిచరించు చోట తన్నులు తగిలెనన నామోషియని కీచకుడు చప్పుడులేకుండ బోరిరి. ఇంతలో భీముడు మూర్ఛనొంది లేచి కీచకుడు పోబోగా వానిజుట్టు పట్టి లాగి చంపివేసి పొట్టచించి కాళ్ళుచేతులు దానిలో దూర్చి నేలమీద మెదిపి ముద్ధచేసెను.

తర్వాత రహస్యముగ నిప్పుతెచ్చి ఆవెల్తురున భీముడు ద్రౌపదికి

కీచకశవము చూపించెను. అంత ద్రౌపది భీముని కైవారము చేసినది. భీముడు యథాప్రకారము పాకశాలకుపోయెను. ఇక ద్రౌపది పవలెవరైన వచ్చిన అజ్ఞాతవాసముననున్న భీమాదులెవ్వరు నేమియు చేయరాదని తెల్లవారు లోపల ఉపకీచకులను తుదముట్టించవలయునని చూచినది. తానె కావలి వారల పిలిచి తన భర్తలగు గంధర్వులచేత వీడు చచ్చెనని చెప్పిచూపెను. వారు చెప్పగా కీచకుని తమ్ములు నూటనల్వురు మిక్కిలి దుఃఖించి సైరంధ్రియే యిందులకు కారణమని యామెనుబట్టి తమ అన్నతో దహనము చేయనెంచిరి. కీచకుని శవముతో నామెనుకూడ కట్టి శ్మశానమునకు పోవుచుండిరి. ద్రౌపదియప్పుడు శవాసనముపైనున్న చింతామణివలె ప్రకాశించినది. అంత నామె కేకలతో నాధులార! గంధర్వ రత్నంబులార! నన్ను నుపకీచకులు తమ అన్న శవముతో గట్టి తీసికొనిపోవుచున్నారు. రక్షింప వేగరావలయు మీరు - అని పెద్దగా నేడ్చినది. ఆ మాటలతో భీముడులేచి చూచి వారికంటె ముందు కోటగోడమీదుగాదూకి శ్మశానము చేరియుండెను. ఇతనిని చూచిన ఉపకీచకులు భయపడి వరుగెత్తనారంభించిరి. ఉపకీచకులను భీముడు తుదముట్టించుటయు నైనది.

ద్రౌపది మరునాడు స్నానముచేసి పరిశుద్ధురాలై ఊరిలో

ప్రవేశించునప్పుడు ఆమెను చేర జంకి పౌరులెల్లరు నిటునటు పారుట

చిత్రముగ నుండెను. ఆమె అర్జునుని పాఠశాలకు పోయినది. అర్జును

డామెనుజూచి-

కం|| ఆ పాపాత్ముల నీచ

వ్యాపారక్రమము వారలందఱు మృత్యు

ప్రాపితులైన తెఱంగును

నీ పలుకుల నెఱుగవలయు నెలతుక చెపుమా!

అని జరిగిన సంగతి నెఱిగింపకోరెను. అపుడు సైరంధ్రి వానితో తన

కృతార్థత్వము సూచించుచు-

గీ|| కన్నియల కాట గఱపుచు నున్న నీకు

నకట ! సైరంధ్రి యిప్పడేమయ్యెనేని

ఖేద మొక్కింతయును లేమిగాదె సస్మి

తాననుండవై సన్నిటు లడుగుటెల్ల !!

అని కొంచెము ఎత్తిపొడుపుగా నన్నది. దాని కర్జునుడు నీవు కష్టపడుటకు

నాకెంత దుఃఖముగా నున్నదియో నీవు నై జమెఱుగవు. నేనేమి సేతును అని తన దీనస్థితిని నివేదించెను. అందులకు నీ మది నేను కొంత ఎఱుగని దానగాను, నీ విట్లుండుటయే నా కిష్టము, అని సమాధానించునప్పటి ద్రౌపది మనస్తత్వ వర్ణనము చూచి తీరవలయును. ఆమె సుధేష్ణ దగ్గరకు పోగా జరిగినదంతయు నెఱింగిన ఆమె ద్రౌపదిని - మా పురమును రాష్ట్రమును వదలిపొమ్మెందైనన్‌ - అని కోపావేశమున పల్కినది. అంత ద్రౌపది మునుపటివోలె పదమూడు రోజులుమాత్రము నీ యింటనుండుట కొప్పుకొన్న నా భర్త లగపడి మీకు మేలుచేసి నన్ను గొనిపోదురు. అందరకు నప్పటికి సంతసము కాగలదు. అనిన నామె అంగీకరించెను.

ఈ వార్త దేశమంతయు ప్రాకగ పాండవులు విరాటుని కొలువునందున్నట్లు

కౌరవులు దీనిచే పసికట్టిరి. గూఢచారులు వచ్చిరేకాని, పాండవుల జాడ తెలియజాలక ఎందుకు లేరని చెప్పిరి ఇక గత్యంరములేక దుర్యోధనుడు సభ##చేసి దుశ్శాసనాదులను పాండవుల జాడగూర్చి ప్రశ్నించెను. దుశ్శాసనుడు మాత్రము పాండవులు చచ్చినచోట పూరియన్‌ మొలవదే యని మడిసిరని మాటనిచ్చెను. అందులకు ద్రోణుడుమాత్రము పాండవులు మరణించలేదని జవాబిచ్చెను. అంతియగాక వారు అమానుషతేజులని చెప్పెను. భీష్ముడు మాత్రము ధర్మజుడున్నయెడ కఱవు కాటకము లుండవు. అట్టి దేశమున పాండవుల నెదుకుమని సమాధానించెను. కాని దుర్యోధనుడుమాత్రము కీచకుడు పాండవులచే హతుడయ్యెనని తలచెను. కీచకుని బలమున కోటుపడి విరాటుడు పన్ను కట్టకున్నను దుర్యోధనుడు వానిపై నెత్తిపోక ఊరకుండెను ఇప్పుడా భయము పోయినదిగాన విరాటునిపై నెత్తిపోయిన పాండవ లడ్డమువచ్చిన అజ్ఞాతవాసము చెడినదిగాన మరల అడవికి పొమ్మనవచ్చును. వారు లేకున్న విరాటుని సొమ్మెల్ల చూరగొని కసితీర్చుకొనవచ్చునని తలచెను. దానికిగా ఉత్తర గోగ్రహణ - దక్షిణ గోగ్రహణముల బెట్టించెను. సుశర్మను దక్షిణముగా బంపి, తాను సైన్యముతో ఉత్తరముగా పోవ బయలుదేరెను. అష్టమి నవములు యుద్ధమునకు మంచివి, అని అష్టమినాడు దక్షిణ గోగ్రహణము, నవమినాడు ఉత్తరగోగ్రహణము సాగించెను. అమావాస్యనాడే కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభ##మైనది, ఏలన జ్ఞాని అమావాస్య రోజున మరణించిన చంద్రమండలము వేరుగా నుండదుగాన సూర్యమండలము భేదించుకొని పోగలడు. ఇందులకే ఏమీ తెలియనివాడు ఏకాదశినాడు చస్తే, అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడే చస్తాడు. అను సామెత బుట్టినది. ఇట్లు అష్టమినాడు సుశర్మ విరాటుని ఊరికి దక్షిణమున గోవుల బట్టెను.

విరాటుడు వారితో పోరికి పోవుచుండ. ఇక విరాటునివైపు సారధ్యములు

తామే చేసికొనుచు ధర్మజ నకుల సహదేవులు నల్వురు యుద్ధమునకు పోయిరి. మహాయుద్ధము సాగినది. సంధ్య చీకటిలో కొంచెము సేపాగి అర్ధరాత్రమున వెన్నెలలో యుద్ధము మరల చేయుచుండగా నుశర్మాదులు విరాటుని ఓడించి కట్టి తీసికొనిపోవుచుండిరి, విరాటుని సైన్యములెల్ల పారిపోవుచున్నవి. ఇది చూచిన ధర్మరాజు విరాటుని విడిపింపవలయునని తమ్ములతో చెప్పెను. ఈ నలువురుమాత్రమే శాత్రవులతో తలపడిరి. ఆ యుద్ధమున భీముడు రెండువేలు నకులుడు ఏడువందలు, సహదేవుడు ఐదునూర్లు. ధర్మరాజు వేయిరథముల శాత్రవులవి నుగ్గు గావించిరి. అట్టి సమయమున భీముడు భీమావేశముతో సుశర్మ రథ్యముల జంపి విరాటుని విడిపించి సుశర్మను దాను పట్టుకొని బంధించితెచ్చి విరాటుని రథస్తంభమున కంటగట్టెను. ఇక సుశర్మ సైన్యములన్నియు కాందీశీకము లయినవి. విరాటుని యావు లొక్కటియు తప్పిపోకుండ భీమ నకుల సహదేవులు పొదివికొనివచ్చి తమ గోపాలుల కప్పగించిరి. విరాటుడు పాండవులని యెఱుగకయు వారల నలువురకొనియాడ మొదలిడెను. దానివలన సుశర్మ తమ్ము గుర్తించునేమో యని ధర్మజుడు, నీవు మమ్ముగొనియాడవలదు. ఈ సుశర్మను, వీరితరపువారిని విడిచిపుచ్చుమని అట్లు చేయించి తామా రాత్రిశేష మటనొక నదీపులినమున గడిపి తెల్ల వారిన తర్వాత జయాటోపముతో నూరిలో ప్రవేశింపదలచి, నిశ్చింతముగా మాటలాడుకొనుచు కాలము గడుపుచుండిరి.

తర్వాత సూర్యోదయసమయమున దుర్యోధనాదులు కౌరవులువచ్చి

విరాటునగరమునకు నుత్తరముననున్న గోవుల మందల బట్టుకొని పోవుచుండ, గోపాలకులు గ్రామములోనికివచ్చి విరాటుని చిన్నకొడుకైన ఉత్తరునితో చెప్పిరి. చిన్నవాడుగాన ఉత్తరుడు విచారింపక తనకు సారధిలేడని, ఒక సారధి దొరికిన కౌరవుల గెల్చి పశువుల తేగలనని గప్పాలు కొట్టెను. నన్నుజూచి కౌరవులు అర్జునుడని భయపడునట్లు చేసెదననియు వాడనెను. అదివిని సైరంధ్రి లోలోన కుత్సించుచు అర్జుననివద్దకుపోయి పరిస్థితిచెప్పి అతని యిష్టప్రకారము ఉత్తరచేత ఉత్తరునకు చెప్పించి, ఎట్టకేలకు బృహన్నల నాతనికి సారధిగ నొప్పించి యుద్ధమునకు పంపెను. అప్పుడుత్తర కౌరవులగెల్చి వారి తలచీరలు తెమ్మని బృహన్నలకు చెప్పెను. ఉత్తరుడు కురుసైన్యముచూచి భయకంపితుడై రథము దిగి కాలికి బుద్ధిచెప్పెను. ఇక బృహన్నల చేయునదిలేక తన కేశములచే వీవుకప్పుకొని ఉత్తరుని వెంటాడి పట్టుకొనివచ్చెను. శత్రువులకు వెన్నుజూపి పోరాదు కాబట్టి బృహన్నల అట్లుచేసెను. ఇక బృహన్నల తానుయుద్ధము చేయుదుననియు, ఉత్తరుని సారధిగ నుండమని యిష్టములేకున్నను, ఒప్పించి మఱ్ఱిచెట్టుమీద పెట్టిన అస్త్రముల గ్రహించెను. సందర్భానుసారముగ ఉత్తరుని ధీరునిజేసికొన తాము పాండవులమని తా నర్జునుడనని తన పేళ్ళ నన్నింటని వాడడుగగా చెప్పుచు, పదునొకండవపేరు కృష్ణుడనియు చెప్పెను. వానికి ధైర్యము వచ్చినది. ఈత డర్జునుడైన వీని రథముతోలి నేను పేరు పొందెద ననుకొనెను అర్జునుడు తలచినప్పుడే శంఖము దేవదత్తము చేతికి వచ్చెను. అట్లే పెట్టక కట్టక మౌళింబుట్టిన క్రియ కిరీటము తలపై వచ్చి నిల్చినది. ఇక నీతని యుద్ధపద్ధతి గమనించిన కౌరవులు - బాహుల చాయలుం గమనభంగియు అర్జును నట్లయని యూహించి, అర్జునుడే యని భావించిరి. ద్రోణు డర్జును గుర్తించి వానికి అజ్ఞాతవాసభంగ మగునేమోయని భయపడి కనుసన్నతో రెండర్థముల మాటలతో బీష్ము నిట్లడిగెను -

శ్లో|| నదీజలం కేశవనారికేతు

ర్నగాహ్వయో నామ నగారిసూనః

ఏషోంగనా వేషదరఃకిరీటీ

జిత్వావయన్నేష్యతి చాద్యగావః

దానికి బీష్మ డెఱుంగని యట్లు శత్రువులకు నిమ్మగుచోటు గడచి వచ్చితిమి ఎవరు వచ్చినను భయపడవలదని దుర్యోధనునకు చెప్పుచు అర్జును నజ్ఞాతవాస కాలము వెళ్ళిపోయినదని ద్రోణునకు సూచించెను. ఆ యర్థము తెలిసికొని ద్రోణుడు నిర్భయముగా వచ్చుచున్నవా డర్జునుడు మనము వాని గెలుచుట కష్టము. అతడు దేవలోకములను, రాక్షసలోకములను గెలిచినవాడు. శివునితో బాహుయుద్ధము చేసినవాడు. కాన వానిచేత దెబ్బలు తినుటకంటె వానితో ముందుగా రాజీచేసికొనుట మంచిది. అని చెప్పెను. దానికి దుర్యోధనుడు, కర్ణుడు కోపించి యిష్టమువచ్చినట్లు ద్రోణుని తిట్టిరి అశ్వత్థామయు వారితో వాదులాడి ద్రోణుడు సిగ్గులేక యుద్ధము చేసినను నేను మాత్రము చేయనని గట్టిగా బలికెను. బీష్ముడు వారల నందరిని బ్రతిమాలి దుర్యోధనుని కర్ణుని నిరసించి అర్జునుడు వచ్చుచున్నాడు గాన మనలోమనకు వైరము తగదు అని పలికి అందఱ నేకముఖము చేసెను దుర్యోధను డడుగ బీష్ముడు పాండవుల అజ్ఞాతవాసము అధికమాసములతో గూడ తిథులలెక్కతో నిన్నటితో వెళ్ళిపోయినది. కాననే తెలివిగలవా డర్జునుడు నేడు బయటబడెనని విస్పష్టముగ అనెను. బీష్ముని మాటలతో అంకిలిదేఱిన ద్రోణుడు కౌరవసైన్యములు నాలుగు భాగములుగ చేసి ఒక భాగము గొని దుర్యోధనుడు ముందు హస్తిపురి పోవుచుండునట్లును ఒకభాగము సైన్యము విరాటుని పశువులచుట్టు కమ్ముకొని తోలుకొనిపోవుచుండునట్లుగాను, మిగిలిన రెండు భాగములు కలపి ఒక వ్యూహము పన్నుకొని వారివెనుక నేగునట్లును అమర్చి, అర్జునుడు వచ్చినప్పుడే సైన్యము యుద్ధముచేయుచుండ రాజు గోవులు ఇంటికి తప్పించుకొని పోవునట్లు నమర్చి, తాను బీష్ముడు, నశ్వత్థామ, కర్ణుడు ఈ సైన్యము నడపించుకొనుచు పోవుచుండిరి.

అంత ఉత్తర సారధ్యములో అర్జునుడు దేవదత్తము నూదుచు, గాండీవము సారించుచు, ఇంద్రదత్త కిరీటము మెఱయ జెండామీద హనుమంతుడు మ్రోయ వానిచుట్టు భూతములార్వ మహాసంరంభముగా వచ్చి వెనుక సైన్యములో దుర్యోధనుని గానక బీష్మ ద్రోణకృపాచార్యులకు నమస్కార బాణములు వేయుచు, ఆ సేనప్రక్కగా గడచిపోయి పేరు చెప్పి కేకవేసి అదలించి తనరథమును బీష్మాదుల సైన్యమునకు గోవులతో బోవు సైన్యమునకుమధ్యమముగా తోలించి కేకలతో బొబ్బలతో సైన్యము చెదరి తూర్పునకు పారిపోవునట్లుచేసి తానువచ్చిన రథమార్గమున గోవుల బట్టించి గోపాలకుల దోలుకొనిపొమ్మని తానుకాపాడుచు గోవులమరల్చె. అంత నా సైన్యము లన్నియు నొక్కటైనవి. రాజుకూడ మరలివచ్చి వీరితో కలిసెను. అప్పుడన్ని సైన్యములతో నాయకులతో అర్జునకొక్కనికి మహాయుద్ధము సాగినది. చూచుటకు దేవతలు వచ్చి ఆకాశ మలంకరించిరి. అట్టిసమయమున -

మ. బలమెల్లన్వెఱ రెండుపాయలుగశుంభ##ద్వేగుడై చొచ్ఛియా

వలగా నడ్డమువచ్చి నాలువుగదుర్వారోద్థతిం బోయిమూ

లల నానాశకలాకృతిం దొరసి లీలాయాన దుర్దాంతుడై

వలయంబుల్సని చించిచిక్కుపఱచున్‌ వైకల్యసంపాదియై.

ఇట్లు తుములముగా సైన్యములనెల్ల నాశనముచేసి ప్రత్యేకముగా నాయకులతో మాటామాటికి పోరాడి యోడించి పారిపోవు కర్ణుని నిందించి, అతడు చూచుచుండ అతని తమ్ముని జంపి, బీష్ముని మూర్ఛపుచ్చి తక్కుసైన్యములనెల్ల నఱకి దుర్యోధనునితో పెద్దయుద్ధముచేసి అతడోడి పాఱుచుండ

ఉ. క్షత్రియుడోడునే తగదుకౌరవరాజ! యొకండనే వృథా

పుత్రులలోన చిన్న నిను పోరికి పిల్వగ పోక పాడియే!

అని నా చేతిలో నోడిపోయి యే మొగముతో హస్తిపురి నూరేగదవు.

సింహాసనమున నెట్లు కూర్చెండెదవు. యుద్ధములో చచ్చుట మంచిది. ఓడిపోవుటకన్న. జూదమిక్కడ నాడంగరాదు సుమా! ''నీ యట్టివాడు నిస్సీ పోయిడిదే యిట్లు పోకు పోకు'', మనిన భూనాయకుడు మరలి త్రొక్కబడ్డ యహిగతి గవిసెన్‌ - అప్పుడున్న నాయకులు మిగిలిన సైన్యములు నొక్కటియై యెదిరించి అర్జును ననేక శస్త్రాస్త్రములతో సందులేకుండ వీరరసావేశమున ప్రహరించుటయు, ఆ అర్జునుడా బాణముల వానలు తనకు సారథికి గుఱ్ఱములకు రథమునకు తగులకుండ కాచికొనుచు నాయకుల నెవరినీ చంపినను తన తోబుట్టువుల ప్రతిజ్ఞలకు భంగము వచ్చునేమోయని వీలయినను జంపక భంగపెట్టి పంపుదమని వారిపై ఇక గంధర్వాస్త్రము మంత్రించి వేయగ నది సమ్మోహనాస్త్ర మగుటచే నందరును మూర్ఛిల్లిరి.

ఈ సమయముననే అర్జునుడు ఉత్తరుని కౌరవవీరుల తలపాగలు

కోయుమని చెప్పెను. ఉత్తరుడట్లు చేయుచుండగ, భీష్మున కా యస్త్రవిశేషము తెలిసియుండుటచే మూర్ఛ నుండి తేరిచూచెను. ఉత్తరుడు చేయుచున్న పనిని చూచి బీష్ముడు - కౌరవవీరుల శిరముల గోయుచున్నాడని భ్రాంతి నొందెను. తానొక్కడు అర్జునునితో యుద్ధముచేసి యోడెను. చేతులు కాళ్ళు నాడక మిక్కిలి ఆశ్చర్యము నొందెను. ఇంతలో అందరు మూర్ఛతేరి ఏడి అర్జునుడు? అని ఆయుధముల దాల్చి సన్నద్ధులగుచుండ చూచి బీష్ముడు వారందఱతో.

ఉ. మోహన బాణపాతమున ముందలిచీర లెఱుంగకున్నయీ

బాహుబలంబుతో గడగి పార్థుని తాకెడుబుద్ధిక్రమ్మరన్‌

సాహస వృత్తిచేసి యవిచారత పోయితిమేని వాడు పూ

ర్ణాహుతి సేయడే మనలందఱ నొక్కట మార్గణాగ్నికిన్‌.

అని చెప్పి ఒడలెఱుగక మూర్ఛనొంది నీవల సైనికులుండ కుంతికొడుకు

గాన, ధర్మాత్ముడుగాన తలపాగలు మాత్రము కోయించి తృప్తినొందెను. తలలు కోయించిన ఈనాటితోనే పనితీరిపోయెడిది. ఔరా! వీని కరుణాతి శయము చెప్పశక్యము కానిది. నీకు ఇట్లు పాండవులు దొరికిన ఊరకుందువా! అతడు మన ప్రాణములమీద ఆశవదలిన మనకు అంత పంతమేల? అని దుర్యోధనుని వారించెను. అప్పుడందరు దెబ్బలుదినియుండి మేనులు విరవిరపోవుచు చేయునదిలేక యింటిమొగముబట్టి పోవుచుండిరి. కర్ణదుర్యోధనులు నుస్సురనుచు వారివెంట పోవుచుండ నర్జునుడు వెంబడించి కర్ణదుర్యోధనుల కిరీటములలో మణులు మిట్టకోలలతో రాల్చి కర్ణుని వీపు పగులచేసి, బీష్మ ద్రోణ కృపులకు నమస్కారబాణములు వైచి అందఱతో పెద్దకేకవేసి పోయివచ్చెదనని చెప్పి అర్జునుడు ఉత్తరునితో చెప్పి తన రథము మరలించెను.

మరల ధనుర్భాణములు మునుపటి చెట్టుమీద కట్టిపెట్టి దివ్యమహిమగల జెండా, దేవదత్తము మొదలగు సాధనముల ప్రార్థించి అంతర్థానముచేయించి అర్జునుడు బృహన్నల వేషముతోనె తొట్టిలోనుండి, ఉత్తరుని ధనుర్భాణములు ధరించి రథముపై నుండచేసిపోవుచు గోపాలకుల పిల్చి ఉత్తరుడే కౌరవసైన్యములగెల్చి గోవుల మరల్చెనని ఊరిలో చెప్పుమని పంపెను. ఇది ఉత్తరగోగ్రహణము.

దక్షిణ గోగ్రహణమున జయించివచ్చిన విరాటు డుత్తరుడు కౌరవ సైన్యములతో ఒక్కడు యుద్ధమునకు పోయెనని విని భయపడి వాని సంగతి ఏమయినదో కనుగొని సైన్యముల వానికి సహాయము పంపుమని మంత్రులతో వ్యగ్రుడై మాటలాడుచుండ నాకబురు వచ్చినది. తనకొడుకు కౌరవసైన్యముల గెలిచి వచ్చుచున్నాడని విన్నంతనే విరాటుడు సంతోష గర్వములతో పలుకుచుండ ధర్మరాజు బృహన్నల సారధిగాన ఉత్తరుడు జయించెననెను. దానికి విరాటుడు కోపించి సారధితెలివి గుఱ్ఱములు తోలుటకు గాని శస్త్రాస్త్రములతో నెదురించు కౌరవుల గెల్చుటకు నెట్లు ప్రయోగించును. అని అనుచు నుమాశము మీద జూదమాడనెంచి ధర్మజుని పిలిచి పలకలాగుకొని ఉద్యుక్తుడగు విరాటునితో - జూదమాడుట యెంత లెస్స మునుపు ధర్మరాజు జూదమాడి రాజ్యమును, తమ్ములను, పెండ్లామును, ఓడి బాధపడెను. గాన యిది మంచిది కాదనుచు, చేరి జూదమాడు చుండ మరియు విరాటుడు తన కొడుకును పొగడ - ఉత్తరుడు కౌరవుల గెల్చిన వింతకన్న నాశ్చర్యమేమి కలదు? బృహన్నలకు యుద్ధము చేయవలెనని కోరికపుట్టి ఉత్తరుని సారధిగా గొనిపోయి వారలగెల్చి యావుల మరల్చి యుండవచ్చును. కాన పురిలోన బృహన్నల జయము చాటించుమనెను. ధర్మజుని పట్టు అట్టిది.

ఇక విరాటుడు అది సైపక చేతిసారెతో కంకభట్టును గొట్టెను. గంటిపది నెత్తురు కారుచుండ సైరంధ్రివచ్చి పైట చెరగుతో తుడుచుచుండెను. విరాటుడది యేమన సైరంధ్రి ఉత్తముడగు నీతని రక్తము బొట్టులెన్నిపడిన అన్నియేండ్లు దేశము అనావృష్టితో కఱవనుభవించును. నీ కట్టి యాపద వచ్చుట యిష్టములేక యిట్లు చేసితి ననెను. ఇంతలో ఉత్తరుడు అర్జునుడు వచ్చిన వారిగౌరవించి, సారధిని పంపి, రధికుడవు కొడుకుతో సభచాలించి విరాటుడంతిపురి కరిగెను. ఉత్తరుడు తండ్రితో ఒక మహాపురుషుని సాయముతో జయమయినదని చెప్పెను. ధర్మరాజు గంటి అర్జునుడు చూడకుండ వస్త్రము కప్పికొనియుండెను. అప్పటికి విరాటుడు నమ్మనున్న ఉత్తరుడు భయపడుచున్న నన్ను నొప్పించి సారధిగా చేసి తానర్జుడనని చెప్పి అప్రతిహతగతితో కౌరవుల మార్కొని గోవుల మరల్చి కౌరవుల పరాభవించిన, ఈబృహన్నల అర్జునుడు. నిన్న కౌరవుల మాటలాడునప్పుడు వారివారి మాటలనుబట్టి నేను నమ్మితిననెను. ఆరాత్రియందఱు పాండవులు, ద్రౌపది, ధర్మరాజు మకాములో చేరి వారి యుద్ధము కబురులు వీరు, వీరియుద్ధము కబురులు వారు చెప్పుకొన్న తర్వాత - అర్జునుడు - ధర్మరాజు నాకు మొగము చూపకుండ వస్త్రము కప్పుకొని యుండెను. నేనేమి తప్పుచేసితిని. అజ్ఞాతవాసము వెళ్ళిపోయినది గదా! మనల నీ సంవత్సరము పోషించిన వాని గోధనము పోవుచుండ కాపాడుట అవసరముగదా? అని పోయితిని. అని చింతింప ధర్మజుడు - ఏమియు లేదు. విరాటుడు కొడుకు జయము కొనియాడ నేను బృహన్నల యుండ ఉత్తరున కేమికొదవ లేదన కోపముతో సారె తీసికొని కొట్టిన నీవు చూడకుండ గంటిని దాచితినని అర్జునునకు ధర్మజుడు చెప్పెను. దాని కందఱు విరాటునిపై కోపించిరి.

20

ధర్మరాజు మాటలతో భీమాదులు శాంతించి విరటునిపై కోపము నుపసంహరించుకొనిరి. ఆ మరునాడు ధర్మజుడు విరాటరాజు సింహాసనముపై కూర్చుండ మిగిలిన వారును ఆ యా ఆసనము అలంకరించిరి. యమధర్మరాజు వరము వనల ధర్మరాజు తన నోటిమీదుగ తాను ధర్మజుడనని చెప్పువరకును అందఱు కంకుభట్టనియే చూచిరి. అట్లు సింహాసనము నలంకరించిన కంకుభట్టును జూచి విరటుడు ఆశ్చర్యకోపములతో నిదియేమి? అని ప్రశ్నించెను. ధర్మజుడు తన యాజ్ఞ సుయాగముగ ప్రజల పాలించినవాడు. సూయాగమనగ గర్బిణీస్త్రీలకు నొప్పులు కామితము తీర్చుట ప్రజలకు కావలసిన విచ్చి కాపాడిన ధర్మవ్రతుడు ధర్మరాజు. ఇతడు దిగ్విజయ మొనరించియు అజాతశత్రుడనిపించుకొన్నవాడు. అని చెప్ప నమ్మక తక్కిన నల్వురు ఏరి? అని విరటుడు మిగిలిన వారి కూర్చి యడిగెను. వారందరును అతనికి తెలియచేయబడిరి.

శకునిని నిన్నటి యుద్ధమున మామా! అని సంబోధించి - ఇవి బాణములు కాని అడ్డసాళులు గావని యెత్తిపొడిచెను. అని యిట్టి మాటలు చెప్ప విరాటుడు దిమ్మెరపోయి ధర్మజు పాదములపై బడెను. భీమార్జున నకుల సహదేవుల కౌగిలించుకొనెను. విరాటుడు తన సర్వస్వము రాజ్యము ధర్మజున కప్పగించి తాను సేవించుకొనెదననెను. ఉత్తరుని పలుకులతో సుశర్మనోడించి ధర్మజాదులు, కౌరవలు నోడించి యర్జునుడు, సంపాదించిన రాజ్యము వారిదె వారికి మనమిచ్చుట యెట్టిది? అనగనె ఉత్తర నిచ్చుట కంగీకరించిరి. కాని అర్జునుడామెను భార్యగా స్వీకరించుట కిష్టపడక కోడలుగ స్వీకరించుట కిష్టపడెను. హరికి మేనల్లుడైన అర్జునుపుత్రుడభిమన్యుడు మహా పరాక్రమశాలి, అందగాడు, చిన్నవాడు. కాని వానికి పిల్లనిచ్చుట, దాన అర్జునుడు వియ్యంకుడగుట విరాటునకు మిక్కిలి ప్రియముగా నుండెను. ఇక పైరంధ్రికాదు. ఆమె సుహారాఙ్ఞి కనుక ఆమెను గౌరవింపుమని సుధేష్ణకు కబురుచేసిరి. ఆనాడు పాండవులకు విరాటుడు విందుచేసెను. వారు మంచి యుల్లాసమున నుండిరి. ఆ మరునాటి నుండి విరాటుని సాయముతో పాండవులు తమకు వేరుగా డేరాలు వేయించుకొనిరి. ఆ చోటునకు ఉపప్లావ్యమని పేరుంచిరి. తమ పేర ఖర్చు వ్రాయించుచు ఆహారపదార్థముల తెప్పించుకొనుచుండిరి. తమకు రాజ్యము ప్రాప్తించి నప్పుడు బాకీ తీర్చెదమని వారి యభిప్రాయము. ధర్మజుడు విడిగ మరియొక చోట శిబిరములందుండుటచే ప్రజలు కూరలు పెరుగులు మొదలగు పదార్థములు, ధనములు, ధాన్యములు వలసినవెల్ల ధర్మరాజునకు బహుమతిగా నిచ్చుచుండిరి. వానితోనె వారి శిబిరములు యందలి కోశాగారములు నిండిపోవుచుండెను. ఇక బంధముక్తులగు రాజులు అజ్ఞాతవాసము నుండి బయటప న ధర్మజునికి నాస్తితో నిచ్చు ధనముల కంతము లేకుండెను. ఇట్లుండి ఉత్తరాభిమన్యుల వివాహము సాగించిరి. యాదవ పాంచాలాదులందఱు సర్వస్వము తెచ్చిరి. మహా వైభవముగ వివాహమహోత్సవము నెరవేరినది.

ఇక ఐదవరోజు కృష్ణుడొక సభ నేర్పాటుచేసి పాండవుల రాజ్యప్రాప్తిని గూర్చి ముచ్చటించి ఒక దూతను బంపి అడిగించిన, వారు రాజ్యమిచ్చిన సరే కాకున్న రాజులనెల్ల బిలిచి చివరకు మమ్ము బిలువుండనెను. అందులకు బలరాముడు పాండవులు ధర్మాత్ములయ్యునుపాయముగా నడచుచు చివరకు పొరపాటుపడి తప్పటడుగు వేసిరి. ఏలయన జూదమాడి రాజ్యభ్రష్టులైరి, వారు తెలివిగలవారై గెలిచిరి. కావున కౌరవుల తప్పులేదు. అని అందుచే పాండవులే దూతనంపి తమ రాజ్యమును దేహియని సౌమ్యముగా నడుగుట సమంజసమనెను. అందులకు సాత్యకి బలరాముని ఆక్షేపించెను ధర్మరాజు వేడుకపుట్టి జూదమాడలేదనియు, ఈమాట బలరాము డనరాదనియు త్రాగుబోతు మాటలుకూడ ననియు ఆక్షేపించెను. అంతియగాక దూతనుబుచ్చి ధర్మరాజున కుచితంబుగ కౌరవులు రాజ్యభాగము నిచ్చిన గొనుట సమంజసమని బల్కెను. దుర్యోధనుడు చక్కగ మార్గమునకు రాకున్న బాణములతో త్రోవకు తెచ్చెదనని సాత్యకి భీకరముగ బల్క సభవారందఱు, అతని మాటలే సమంజసమనియు బలరాముని మాటలేమి మాటలనియు ఆక్షేపించిరి. అపుడు కృష్ణుడు సభ చాలించి గృహమునకు పోబోయెను. మరియు నెవరినైన ముందు దూతగ బంపి చూచి పనికాకున్న తరువాత యుద్ధము చూతమనియు ముందుగనే రాజులందఱకు కబురు పెట్టుమనియు పాండవుల కార్యభారమంతయు ద్రుపద మహారాజుదే యనియు చెప్పి పోయెను.

ముందు ద్రుపదపురోహితుని రాయబారిగ పంపనిశ్చయించి యట్లే గావించిరి ఆతడు కౌరవసభ##కేగి ప్రత్యేకముగ బీష్మద్రోణుల కట్టుకొని, చివరకు సభలో మాటాడ నుంకించెను. పాండవుల కెట్లయినను తేజోలాభము కలిగి రాజ్యమువచ్చునట్లు చేయుటయే పురోహితుని కోరిక సమ్మతించి పాండవరాజ్యము వారికిచ్చి వేయుడనియు, లేకున్న ధృతరాష్ట్రునకు బుద్ధికలుగునట్లు చెప్పుడని పెద్దల కోరియు ద్రుపదుని పురోహితుడెన్నియో పాట్లుపడెను. ఈ పురోహితుని భాషణములువిని భీష్ముడు విప్రస్వాభావికమై కొంచెముతీక్షణముగానున్నను ధర్మనిరూపణము చేయుటయందు సర్వోత్తమమైన మాటలని కమ్ముకొని పలికెను. దుర్యోధనుడు పాండవాజ్ఞాతవాసము పూర్తియైనదా లెక్కచూడుమని భీష్ముని ప్రశ్నింప, అత డుత్తరగోగ్రహణమునాడే ఆ సంగతి విశదమైనదని తెల్పెను. ఆవుకు సంవత్సరమునకు మూడువందల అరువది జనపకట్టలుకొను పెద్దమనిషి ఇంకొక నలువదికూడ కొనరాదా? అని అడుగువారి అవియేచాలునని సమాధానము చెప్పగా, అప్పుడప్పుడు తిథులు పెరిగి త్రిద్యున్పృక్కులని వచ్చుగదా కొన్ని కట్టలు పెరుగవలసి వచ్చునన అవములువచ్చి కొన్ని తిథులు తగ్గునుగాన సరిపోవుననెను. భీష్ముని, పాండవుల లెక్కయది భీష్ముని మాటవిని నమ్మక దుర్యోధనుడు అజ్ఞాతవాసము కాకముందె అర్జునుడు బయలుపడెనని దీనికి నుచిత మాచరింపుమని ధర్మజునకు కబురుపెట్టెను. ధర్మరాజు లెక్కసరిగా నున్నందున నిండెననుము అని బదులుచెప్పెను. తర్వాత సాత్యకి ద్రుపదులు ఒక్కొక్క అక్షౌహిణి సేనతోవచ్చి పాండవులతో చేరిరి. కృతవర్మ అక్షౌహిణితో దుర్యోధనుని చేరెను. ఇక శల్యుడు నకుల సహదేవుల మేనమామ ఇతనిని కాఫీహోటలు స్నేహముతో తన వైపు త్రిప్పుకొనవలెనని దుర్యోధనుడు తలంచెను కాన మారువేషములతో తిరుగుచు శల్యుని ప్రయాణమునకు సౌకర్యముల నొడకూర్చుచుండెను. అందులకు సంతసించి శల్యుడు దుర్యోధనునివైపు యుద్ధము చేయుటకు నిశ్చయించెను. అంతటితో నూరకుండక పాండవుల చూచి వచ్చెదనని వెళ్ళి, అవసరముకల్గిన వారికి సాయముచేయగలనని పాండవులకును తాను కర్ణునకు సారధియైనచో అర్జునుని కనిపెట్టి యుండెదనని మాటనిచ్చి వచ్చెను.

ఇక కృష్ణమందిరమున కృష్ణుడు నిద్రించి యుండగా ముందు దుర్యోధనుడు, పిమ్మట అర్జునుడును వెళ్ళిరి. దుర్యోధనుడు కృష్ణుని శిరమువైపు సింహాసనము నధిష్ఠించియుండెను. అర్జునుడు వినమ్రుడై పాదములచెంత నిలువబడియుండెను. కృష్ణుడు ముందుగనే యర్జునుని చూచి, యేమికావలయునో ముందుగ వానిని కోరుకొనుమని యడిగెను. తర్వాత దుర్యోధనుజూచి యేమిపని యన యుద్ధమునకు సాయముకోరి ముందువచ్చితినిగాన నాకేసాయము చేయుమని కోరెను పదివేలమంది నారాయణ గోపాలబలము లొకవైపు, యుద్దము చేయక ఊరకయుండు నేనోక్కడ నొక్కవైపు, ఈ రెంటిలో చిన్నగాన ముందుకోరవలయువాడు అర్జునుడనెను. అర్జునుడు కృష్ణునే కోరుకొనెనుగాని దుర్యోధనుడు మాత్రము అర్జును తెలివితక్కువవలన కృష్ణుని మాయచేసి గొప్పబలము సంపాదించితినని యుత్సాహముతో బోయెను. ఇక బలరాముడు యుద్ధము చేయదలంపక తీర్థయాత్రలకు పోవనిశ్చయింప కృష్ణు డందులకు సంతసించెను. అర్జునుడు కృష్ణుని యుద్ధముచేయకున్న మంచిదియే సారధిగ నుండుమని కోరెను. పాండవులు అరణ్యవాసమునకుపోవునపుడు ద్రోణుడు వారిని అనుసరింప నిశ్చయించెను. కాని ఆకాశవాణి పాండవ పక్షమున నున్నచో యుద్ధమున ధృష్టద్యుమ్నునకు సర్వసేనాధిపత్యమును, నీకుఅంత కంటె తక్కువ ఆధిపత్యమును కల్గునుగాన, నీవు కౌరవపక్షముననే యుండుట మేలని పల్కినది. ఇక ద్రుపదపురోహితుని రాయబారమునకు ధృతరాష్ట్రుడు నీవు పొమ్ము. నేను ఆలోచించి తగినవాని పాండవులవద్ద కంపెదనని బ్రాహ్మణు పంపివేసి, సంజయుని రాయబారమునకు ఉపప్లావ్యమున కంపెను. తరువాత సంజయుడు ధర్మజుని చూచుటకై బయలుదేఱిపోయెను. అపుడు శ్రీకృష్ణుడు అర్జునుడున్న డేరాకుపోయెను. కబురుచెప్పగానే శ్రీకృష్ణుడు లోనికిరమ్మని అంగీకరించెను. సంజయుడు వేషముమార్చి లోనికిపోగా అర్జునుడు పాదపీఠమును సమర్పింప నాతడు దానిపై చేతులుంచి తాను క్రిందకూర్చుండెను. తర్వాత సంజయుడు కార్యము ముచ్చటింపగా అర్జునునికన్న మున్నుగా శ్రీకృష్ణుడు వారి దుర్ణయముల నుచ్చరించి వారు చెడువారుకాని, బాగుపడువారు కారనిచెప్పెను. మరునాడు ధర్మజుని నిండుకొలువులో సంజయుడు మాటలాడెను. సంజయుడు భక్తుడు, ధర్మజ్ఞుడుగాన వెలితిలేకుండ పలికెను. కాని పంపినవారు నీవేమైన నిచ్చెదమన్న సంజయుడింక బాగుగ మాటాడువాడు. వారుపాలు పంపని లేకుండ పాండవుల శాంతుల చేసిరమ్మన్న చేయునదిలేక ఈ మూలముగా ధర్మాత్ముడవు అజాతశత్రునిచూచుభాగ్య మబ్బెనని తన్మాత్రమునకే వచ్చెను.

సంజయు వంపినందుకు ధర్మజుడు కొంత చిడిముడిపాటు నొందెను. సంబంధము కలవారి నేరినై న బంపక అస్వతంత్రుడగు సంజయునంపిరేయని యాతనిబాధ. సరే! ధర్మరాజు తమకు రాజ్యమిచ్చుట న్యాయమని సంజయునితో చెప్పెను. అందులకు సంజయుడు చిక్కకుండ దక్కకుండ చెప్పుచుండెను. మరియు కోప ముపసంహరింపుమనియు, బంధువుల చంపి పాపముకట్టుకొనెదవా? నీ యట్టివాడవని పల్కెను. ఇక ధర్మజుడు ఆతతాయిలను పాములవలె చంపవచ్చుననియు, అట్లుచేసిన భ్రూణహత్య దోషము పోవుననియు, అసలింతకును భీష్మద్రోణులు మిన్నకుండుటచే! నింతపుట్టినదనియు చెప్పెను. మరియు యుద్ధము చేయవలసి వచ్చెనని ధర్మజుడు బాధనొందగా సంజయుడు ఇంతవరకు మీకు గడువలేదా! ఇప్పుడు మాత్రము గడువదా! కాబట్టి యుద్ధమేల? మీరు శాంతులు గదా! అని సమాధానించెను. కౌరవులు దుష్టులై మీకేమియు నీకున్నను నీవు యుద్ధముచేయుటకంటె భిక్షాన్నముతినుట మంచిదనెను. అందులకు కృష్ణుని కన్నులును ఎఱ్ఱబడినవి. సభలోనున్న రాజులెల్ల కోపించిరి. ధర్మజుడెట్టకేలకు ఐదుగురికి నైదూళ్ళిచ్చునట్లు చేయుమని సంజయునితో పల్కెను. అందులకు కృష్ణుడును సమ్మతింపలేదు. కారణము కౌరవులతో రాజీబడిననొ వారి దుర్మార్గమును సాగనిచ్చినవార మగుదమని భావించి యొప్పుకొనలేదు. కావున సంజయు డున్నవిషయములలెల్ల మొగమోటమి లేకుండ నన శ్రీకృష్ణుడీ రాజీ కుదురునదికాదు. అయినను నేనైన అచ్చటకువచ్చి భీష్మాదుల తోడుచేసికొని చెప్పిచూచెదను. అట్లయిన కౌరవులు పాపమునకు, చావుకు తప్పి బ్రదుకుదుమోయని కృష్ణుడు చెప్పి సంజయు నంపెను. సంజయుడారాత్రి హస్తిపురమునకేగి ధృతరాష్ట్రుశీలము మంచిదికాదని నిందించి మరునా డచ్చట జరిగిన విశేషములు చెప్పుదునని యింటికిపోయెను.

21

ఇక నాటిరాత్రి విదురుడు - జూదపుసిరి కానపడంగరాదని చెప్పుచు ధర్మరాజు ఆప్రమేయ గుణపూజ్యుడని ధృతరాష్ట్రునితో చెప్పెను. మరియు నీతుల నెన్నింటినో తెలియచేసెను. భగవద్భక్తులతో నుత్తమోత్తములు విదురసంజయులు, సంస్కృతమున నీవిషయమంతయు ప్రజాగరపర్వమను పేరుతో నున్నది. విదురుడు స్మరించి సనత్సుజాతుని రప్పించెను. వీనిచే ధృతరాష్ట్రునకు తత్త్వోపదేశము విదురుడు చేయించెను. సనత్సుజాతుడు విద్య-అవిద్య అను రెండు కలవనియు, విద్యచే నవిద్యను నిరసింపవలెననియు, రెండక్షరములు సంసారము, మూడక్షరములు మోక్షమనియు నవి - ''మమ, నమమ'' అనునవి అనియుచెప్పి ఆ ధృతరాష్ట్రుడడిగిన ప్రశ్నములకెల్ల సమాధానముచెప్పుచు తత్త్వోపదేశముచేసి పోయెను. సంజయుడు తొలుత ధర్మరాజు చెప్పినట్లు పిన్న పెద్దలకు ఆశీర్వచన నమస్కారములు తెలియజేసి, ధర్మరాజురాజ్యము మాయదియని చెప్పినట్లుకూడ వివరించెను.

అసలు వాస్తవము విచారించినచో ధృతరాష్ట్రుడు గ్రుడ్డవాడగుటచే పాండురాజే రాజాయెను. కొడుకులు మైనర్లుగా నుండ పాండురాజు మరణించెను. మైనరు వెళ్ళగానే హస్తిపుర సామ్రాజ్యమున పట్టాభిషిక్తుడై ధర్మరాజు ఐదేండ్లు రాజ్యముచేసిన తర్వాత దుర్యోధన ధృతరాష్ట్రుల దురాలోచనమున పాండవులు కాశీకేగుట, లక్కయిండ్లతో కాల్చుట, అయి పాండవు లజ్ఞాతులై యక్కడక్కడ తిరిగి ద్రౌపదిని వివాహమాడి మరలవచ్చి, హస్తిపుర సామ్రాజ్యము మరల నైదేండ్లు ధర్మరాజు నాధిపత్యముతో చేయుచుండిరి. అప్పటికి రాజ్యము పాండవులది యనితేలినది కదా! కాకున్న ధర్మజునకన్న మున్నుగా దుర్యోధను నేల అభిషేకింపరాదు? అప్పుడు ధృతరాష్ట్రు మాయోపాయమున రాజ్యము విభక్తమైనది. అప్పటికి అర్థరాజ్యమైన పాండవులకు కలదుగదా! వారి పురనిర్మాణము, రాజ్యనిర్వహణము అరువదినాలుగేండ్లు జరిగిన తర్వాత జరాసంధుని చంపి రెండువంతుల రాజ్యము, ఈ యర్థరాజ్యము కలుపుకొని రాజసూయాదులు చేసి మహావైభవమున నుండ నోర్వలేక పిలిచి జూదమాడి పరాభవించి పిదప ధృతరాష్ట్రుడు ఈ రాజ్యము మీదియే. అది సుహృద్ఱ్యూతము, అని రాజ్యమునిచ్చి పంపెనుగదా! పునర్ద్యూత మని పిలిచి రాజ్యముతో సంబంధము లేదు. ఈ పందెమున నోడిన పన్నెండేండ్లు అరణ్యవాసము ఒకయే డజ్ఞాతవాసము చేయవలెను. అజ్ఞాతవాసమున కనుగొన్న మరల పదమూడేడులు అట్లు చేయవలెను? అని పందెము పెట్టి ఆడిన ద్యూతము ప్రకారమైనను అనుకొన్నట్లు వదమూడేండ్లు నిర్విఘ్నముగ, అరణ్యాజ్ఞాతవాసము లొనరించివచ్చిన వారి రాజ్యభాగము వారికీక కాజేయుటకు దుర్యోధన ధృతరాష్ట్రులకేమి యాధారము కలదు. కాన రాజ్యమంతయు మాయది. తుష్యతు దుర్జనః - అను న్యాయముతో మొదలి రాజ్యము మీదియనిన మా తండ్రి సంపాదించిన రాజ్యము మాకిండు. కానిచో నదియు మీరే కైకొని మేము ఇంద్రప్రస్థములో నుండి సంపాదించిన మా రాజ్యము మాకిండు? అదియు కాకపోయిన మాకయిదుగురకు ఐదూళ్ళిచ్చి తక్కినదంతయు మీరే గైకొనుడు, అని ధర్మజుడు చెప్పెను. మీరేమి అనెదరనుమని సంజయుడు గట్టిగా చెప్పెను.

దీనినిబట్టి పాండవుల రాజ్యము పెద్దదియని తోచుచున్నది. అందునను రెండువంతులు జరాసంధునిది. ఒకవంతు మాత్రమే పాండవులది యగుచున్నది. కాబట్టి మొత్తముమీద జరాసంధ వధానంతరము రాజ్యము మరింత పెరిగి. రాజసూయమునకు పూర్వమే జరాసంధరాజ్యము కలయుటచే పాండవుల భాగమే పెద్దది యగుచున్నది. ఇది యంతయు నిచ్చుటకు ఇష్టపడకున్న ఐదూళ్ళయిన నిమ్మనిరని సంజయుడు మొగమాటమిలేకుండ చెప్పెను. దీనివలన సర్వశాంతి యగునని పల్కెను ఇందులకు కర్ణదుర్యోధను లంగీకరింపలేదు. నన్నయగారు తన భారతభాగమున దుర్యోధన ధృతరాష్ట్రులు విగతదయాహృదయులని పేర్కొనెను నన్నయ దుర్యోధనుని ముందు పేర్కొనుటయే ధృతరాష్ట్రుని దౌరాత్మ్యాతిశయము నొడుపుచున్నది. రాజ్యమివ్వకున్నచో ధర్మరాజేమి చేయగలడని ధృతరాష్ట్రుడు ప్రశ్నించెను? రాజు లట్టివారలగుటచేతనే - రాజ్యాంతే నరకం ధ్రువమ్‌ - అని ప్రతిరాజును నరకమునకే పోవలయుట చెప్పబడెను. ఈ శాస్త్రములెల్ల సత్యములా అనవలదు. ఆస్తికులలో నాస్తికులలో. అస్తికులే నష్టపడనివారని పెద్దలు చెప్పిరి. శ్లో|| నాస్తి చేన్నాస్తి నోహాని రస్తిచేన్నాస్తికో హతః - అని శంకరులు సెలవిచ్చిరి. నాస్తికుల మతము నిజమైన ఆస్తికులకు నష్టము లేదు. ఆస్తికుల మతమే నిజమగుచో నాస్తికులకు చోటులేకున్నది. కావున రాజ్యాంతమున నరకమున్నది. కాని ''యస్మిన్‌ మహింశాసతి'' అన్నట్లు రాజ్యముచేయు దిలీపాదులకు నరకములేదు. ఏలయన వారు ధర్మ ప్రభువులు. ఒకసారి దిలీపుడు రాజ్యము చేయుచుండగా బోగముసాని వస్త్రము వాయుదేవునిచే నెగురకొట్టబడెను. ధర్మముతప్పి నడచిన వానిపై దిలీపుడు కోపించి, వాయుదేవుని పట్టుకొని రమ్మని భటుల కాజ్ఞనిచ్చెను. వారు పట్టుకొనిరాగా, అట్లేలచేసితివని దిలీపుడు వాయువును ప్రశ్నించెను. అందులకా వాయుదేవుడు నిజమేయని యొప్పుకొని తనపని గాలి వీవన వేయుట యనియు, కాబట్టి తన తప్పు లేదనియు చెప్పగా, తన మనస్సున కామము లేదని చెప్పుమని దిలీపుడు వాని శిరస్సుపై చేయిపెట్టెను. అందులకు శిక్షింపుమని వాయువు దిలీపుని యడిగెను. ఇదియే నీకు పరాభవమని చెప్పి దిలీపుడు వానిని పొమ్మనెను. కాబట్టి రాజు ధర్మవర్తనుడై యుండవలయును. రాజు లంచమునకు లొంగరాదు.

ధృతరాష్ట్రున కెంతయేని మేలుచేసినవాడు పాండురాజు. ధృతరాష్ట్రునిచే నూరశ్వమేధములు చేయించెనట. సామంతులచే మ్రొక్కించెనట. అట్టిపాండునకెంతయో కీడుచేసినవాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి కృతఘ్నుని పీనుగునైన కుక్కలును తాకవని విదురుడు మున్నేచెప్పెను. ధర్మరాజు రాజ్యభాగ మీకున్న యుద్ధమునకు రాగలడని సంజయుడు చెప్పెను. అందులకు దుర్యోధనుడు ఎవరితో రాగలడనియు? ధృతరాష్ట్రుడేమి తీసికొని రాగలడనియు ప్రశ్నించిరి. యుద్ధమునకు అర్జునుడు వచ్చినచో కృష్ణుడు సారధియగును. కనుక ఆ భగవంతున కెదుటనుండి యుద్ధమెవ్వరును చేయజాలరని చెప్పెను. ఇంకను వారి ఆయుధములు వారి శక్తిసామర్థ్యములును చెప్పెను. కాని అట్టి వారినిగూడ నెదిర్చి నిలువగలనని కర్ణుడు పల్కెను. అపుడు భీష్ముడు వానిని యుపాలంభించెను. అందులకు కోపించిన కర్ణుడు భీష్మానంతరముగాని తాను ఆయుధమునంటనిని శపథము గావించెను. అంతియగాక తాను అర్జునుని చంపువరకు కాలిగోళ్ళు తీయననియు ప్రతినపట్టెను - ఇట్లు కౌరవులలో పుట్టినకలకలము పాండవులకు శుభసూచకమే యైనది.

ఇక ధర్మరాజు కృష్ణుని రాయబారిగ బంపనెంచి తమ్ములతో ద్రౌపదితో శ్రీకృష్ణుని డేరాలోనికిపోయి -

కం|| ఆపదc గడవం బెట్టగ

నోపి శుభంబైనదాని నొడగూర్పనుమా

కీ పుట్టువునకు పాండు

క్ష్మాపాలుడు నిన్ను జూపి చనియె మహాత్మా ||

అని ప్రార్థించెను. ధర్మజుని భక్తి స్నేహ విశ్వాసములకు శ్రీకృష్ణుడు దిమ్మెరపోయి నీవేమిచెప్పిన నది నేనవశ్యత చేసెదనని చెప్పెను. దానికి ధర్మజుడు కౌరవసభ##కేగి తమ లోపము లేకుండ మాటలాడి సంధికుదుర్చుకొని రమ్మని, మమ్ము నిట్లు నిలువబెట్టుమని, బంధువుల చంపనోపనని పలువిధముల చెప్పెను. ఇట్లు ధర్మరాజు భీమార్జును లందఱును వరుసగా తమ తమ సందేశముల విన్పించిరి. కాని వీరందఱును ఏదో ఒకవిధముగ సంధి నభిలషించి చెప్పిరి. సహదేవుడు మాత్రము యుద్ధమే యుక్తమనెను. ఏలన భాగార్హులమగు అన్నదమ్ముల బిడ్డలము మీకు రాజ్యమిచ్చి పోయి మేము పదమూడేండ్లు అరణ్యాజ్ఞాతవాసములు చేసితిమి కదా! అట్లే మాకు రాజ్యమిచ్చిపోయి మీరును పదమూడేండ్లు విఘ్నేశ్వరుని బొడ్డులో వ్రేళ్ళు పెట్టిన వైశ్యులవలె అరణ్యాజ్ఞాతవాసముల సల్పివచ్చిన తర్వాత మీకీవలసిన రాజ్యభాగమును మేమిచ్చెదము. కాకున్నరా అరచేత ప్రాణములు పెట్టుకొని యన్నాడు. మాయలు పన్ను నేర్పులిక చెల్లవనియు పల్కెను.

ఇక పాంచాలదేశమున బుట్టి మహావీరులగు పాండవుల ధర్మపత్నియై, ప్రతి వింధ్యాదులగన్న వీరమాతయగు ద్రౌపది తాను పరాభవ మందియున్నదిగాన ఈ రాజీప్రయత్నములు చూచి, విని భగ్నమనోరథయై కనలి కృష్ణునితో గద్గదకంఠయై తన సొద నిట్లు చెప్పుకొనినది. అంతలంతలు పనులుచేసి దాసులకు దొరలు తిండిపెట్టరా? అదియు లేకుండ వెడలనడచి ¸°రా! ఇప్పుడు హక్కు ఏమియు లేని మనవంటి సంజయునిచేత చెప్పి రాయబారమా! సారమేమున్నది! ఇచ్చునది, పుచ్చుకొనునది యేమియు లేదుగదా! శాంతింపుడనియా! శాంతింపకేమున్నది. మా పెద్దతండ్రి శాంతింపు మన్నాడు. ఇంకనేమి కావలెనని ఈ కంటినీరు తుడుచు పై పై మాటలకే యుధిష్ఠిరుడు మనసార సంతసించెను. మునుపే శాంతుడగు ఈ అజాతశత్రువునకు శాంతి సాధనము లెవ్వి సంపాదించుకొనవలెను. యుద్ధమైన నెవరు గెలుతురో? ఎవరోడుదురో? ఓడిన చచ్చుటకన్న కష్టము అని గదా. యుధిష్ఠిరుని మాటలు. ఉన్న గౌరవముకూడ పోవునట్లు తమకీ తక్కువ దనము నేల కొనితెచ్చుకొనవలెను. విచారించిన ఈ సంధి వారికి మంచిది గాని మనకు కాదు. తన వారిని కొట్టలేక చేతులాడక ఈ మెత్తబడుట కాని పోరిలో మర్ధింపదలచిన కౌరవుల గెల్చు విషయంబున శంకింప బని లేదు జయము మనదే! ఏకీడైన సైపవలెననుటకు వారేమి బ్రాహ్మణులా! వీరు శాంతించినను వారు కోరిన ఐదు ఊళ్ళైన నిచ్చెదరా! ఐనను నేను పరాయిదానగాని, వారు వారు ఒకతెగ గాన వారికి వారంత మాత్రమీకుందురా! దీనికి తార్కాణము వారు వీరు గలసి నన్ను సభకీడ్చి జుట్టుపట్టి లాగి గుడ్ఢలూడ్చి పరాభవించిరిగాని వారి మర్యాదల కేమియు లోపములు లేవుగదా, కృష్ణా! యాజోపయాజుల వరముతో అగ్నికుండమునబుట్టితిని భరతవంశమునకు పేరు తెచ్చి నిలువబెట్టిన పాండురాజునకు కోడలనైతిని జనవంద్యులగు భర్తల నేవుర బొందితిని నీతి పరాక్రమముల నారితేరిన కొడుకుల గంటిని. కూ అనిన నొక్కదూకున నగపడు పుట్టింటి అండగలదు.

ఇవి యన్నియు నట్లుండ గుణగరిష్టుడవగు నీవు దేవుడవు. నీ చెలియలిని సుభద్రను జూచు ప్రేముడి చూపుకన్న మిన్నయగు గౌరవముతో కలిసిన బాంధవముతో సంభావించెదవు నన్ను, ఇట్టి నన్ను ఒక చెప్పరానివాడు వసుధామరుల మంత్రములతో పవిత్రతమములైన వారి ధారలతో రాజసూయావభృదమున పావనతమములైన వెండ్రుకలబట్టి ఈడ్చుచుండ బ్రాహ్మణులకే శాంతియుండదే? క్షత్రియోత్తముల కక్కటాయిట్టి శాంతి ఎక్కడనుండి వచ్చినది. అయినను జూదములో మాటపోయిన వచ్చు నసత్యమున కోర్వక సత్యసంధులు అప్పటి కూరకున్నను అప్పటినుండి యెన్నియోమారులు పదుమూడేండ్లు గడచిన శత్రువద మొనర్చెదము. నీ పరాభవ దుఃఖము పోకార్చెదము అని నను ఊరడించిన మాటలే యేట గలిపిరి. అయిన వారిజాక్షులయెడ అబద్ధము లాడవచ్చునని యేకవియైన చెప్పెనేమో! నా యన్నా! యిన్ని యేల? ఆలోచనము కూడ లేనివాడై కోడలిక నంకమువచ్చిన కులమునకెల్ల కలంక మనక నన్ను దాసిగ చేసిపుచ్చిన మహాపురుషుని పాలికి నా పతులు మా పెద్దతండ్రి యని సంధికి పోవుచుండ నేనును తగుదునని యా కొంపలో కోడరికంబు సేయ చెచ్చెర పోవుదునా! అటుగాక వారి దృష్టిలో దాసీని గాన శృంగారపు కట్టగొని యూడ్చిపెట్ట పోవుదునా? ఈ నాగతి నిర్ధారణ చేసి లోకవంద్యా! నీవు సంధికి పొమ్ము రక్కెసతాల్మితో ఈ పరాభవము నిన్నినాళ్ళు నిప్పునొడిలో ధరించునట్టు లోర్చితిని. ఇప్పుడు కూడ నిది ఆరకున్న నన్ను నిర్ధహింపకుండునా? తేజము గల భర్తలు, సర్వ లోక పరిపాలకుడవు, తోబుట్టువగు నీవు కలిగి నన్నీ సొదతోనే చావుమనెదరా?

అన్నా! ఒక్కటి చెప్పెద వినుము. పాండవుల కౌరవుల నొక్కటిగా నుండుమనుము పాండవవీరుల ననికి తేకుము, రాజీమాటలేల? యుద్ధమును కుదుర్చుకొనిరమ్ము. నా పరాభవమును సహింపలేని నా కొడుకులు ఐదుగురు, సుభద్రకొడుకును ముందు పెట్టుకొని యుద్ధమునకు నడచెదరు. చెప్పినమాటవిను కొడుకులతో సైన్యములగొని వృద్ధుడగు మాతండ్రి వీరికి బాసటగా రాగలడు. ఇట్లు నాకసి తీరును అని ద్రౌపది యేడ్చుచు వెండ్రుకలు కృష్ణునిముందు బెట్టి, దేవా! ఆ వెంట్రుకలు బట్టి యీడ్చిన ఆ చేయి ముందు ముక్కలు ముక్కలయిపోయి దానికి మూలమగు తన దుష్కృతమును దలచి యేడ్చిన తర్వాత దుశ్శాసనుడు చావవలెను. తొడలువిఱిగి పడియున్న దుర్యోధను పీనుగును నేను ధర్మజుడు కన్నార జూడకున్న నెవరిపరాక్రమము లెందులకు? అని యేడ్చు ద్రౌపది నూరార్చి దాసీలచే వెండ్రుకలు ముడిపించి, తల్లీ! నీ యేడ్పులవంటివి కాని శత్రువుల పెండ్లాల యేడ్పులువిను సమయము వచ్చినది. నీవు ఏడ్వనేల? నేను కొంచెము నెమ్మదిగా ఆలోచించి చెప్పిన మాట మేరువు తిరిగినను నెరవేరకుండదు. శత్రుసంహారముచేసి, నీ పరాభవ మడగించి తేజముననొప్పు భర్తల కనుగొనెదుగాక! యముని వాహనమగు దున్నమెడలోని గంటలమ్రోత వినబోవు కౌరవులకు నా రాజీ మాటలు చెవికెక్కవు. అని అనేకవిధముల ద్రౌపది నూరార్చి పాండవులు మరల మరల చెప్పు నప్పలుకుల నూకొనుచు శ్రీకృష్ణుడు రాజీయైన మంచిదేకదా! తప్పక అది యగునని నిరుత్సాహముగ నుండకుడు. సైన్యములు, ఆయుధములు సిద్ధముచేసికొన ఎప్పటికప్పుడు సిద్ధముగా నుండుడు. సంధి కాకపోయిన పక్షమున మనము శాంతముగ మాటాలాడుట పెద్దల మదికెక్కుట. వారే యుద్ధముకోరిన వారిపగిది వీరివారిని చంపిన పాపము వారికి సంధించి, నేను పున్నెము మూటగట్టుకొని వచ్చెదను - అని చెప్పి భగవంతుడు హస్తిపురికి రాయబారిగ పోయెను.

22

శ్రీకృష్ణపరమాత్మ పాండవుల రాచకార్యము నిమిత్తము బయలు దేరి ఆ రాత్రి కుశస్థలమున నిలచి బ్రాహ్మణ లాహ్వానింప కొలది పరివారముతో విందుల నారగించుచున్నాడని గూఢచారులు చెప్ప విని, ధృతరాష్ట్రుడారాత్రి ముఖ్యులైనవారితో కొలువిచ్చి దుర్యోధనునితో సర్వలోకములకు అభిగమ్యుడగు భగవంతునకు అభిగమ్యులమైతిమి. ఇంతకన్న ఏమికావలెను? మన గృహములెల్ల కస్తూరితో అలికించి, కర్పూరముతో మ్రుగ్గులు వెట్టించి, చాందినీలు కట్టించి, పూలపఱపులతో అలంకరింపుమనెను ఆ దుర్యోధనుడు మనయిల్లు మనము అలంకరించుకొనుటయే గదా! దీనిలో నష్టమేమియని మనసున తలచి అంగీకరించెను. సంతోషావేశమును అణచుకొనలేక మఱియు ధృతరాష్ట్రుడు అందరు వనుచుండగ నాయింటిలోగాని, దుర్యోధను నింటిలోగాని, దుశ్శాసను నింటిలోగాని, ఇంకను మనవారి నివాసములలో నేయేవస్తువు శ్రీకృష్ణున కింపునింపునో, అదియెల్ల ఆ దేవునకు నే నొసంగెదనని బిగ్గఱగా చెప్పెను దానికి విదురుడు నీకు ఉపకారముచేసిన తమ్ముని కొడుకులకు ఐదు ఊళ్ళు ఈయలేని నీకు ఇంతటి త్యాగబుద్ధి యెక్కడనుండి వచ్చినది? నీ తలపు నేను కనుగొంటిని. ఏదో ఒకవిధముగ శౌరిని లంచమిచ్చి మోమోటబెట్టి పాండవుల కేమియు లేకుండ ఎగురకొట్ట నెత్తిన యెత్తిదిగా తోచుచున్నది. మేరు వంత ధనరాశి నిచ్చినను శ్రీకృష్ణు డర్జును నెడబాయునా? ఇవి అన్నియు నక్కరలేదు. పాండవుల పనికై విజయముచేయు ఆ దేవుడు చెప్పిన పలుకులు మర్యాదగా విని అంతయో ఇంతయో వారలకిచ్చి సమాధానపడుటయే ఆస్వామి నారాధించుట యగును. కాన ఆపనియందు జాగరూకుడవగుమనెను.

దుర్యోధనుడదివిని విదురుడు చెప్పినట్టిదియే యగును. యాదవుడు భేదతంత్రమున పాండవులనుండి వేరుపడువాడుగాడు. అదిగాక మనము వానికి లంచమిచ్చిన అసమర్థులమై యనుసరించినట్లు తలంపగలడు. కావున ఒకడుగావచ్చిన వానిమనమందఱము కలసి కట్టి కొట్టునబెట్టిన పాండవులు దిక్కులేక మరల నడవుల కేగుదురు. వారికి సాయమైన సామంతులు కాందిశీకులగుదురు. నే నప్రతిహతముగ రాజ్య రమావిలాసము ననుభవించెద నిది నామతము, అని తన అభిప్రాయము నెఱుకచేసెను. అదివిని భీష్మాదులెల్ల దిమ్మెరపోయి యిట్టి అవినీతులకేమి సేయగలమని దిగ్గున లేచిపోయిరి ధృతరాష్ట్రుడు అశక్తతతోప కొడుకుతో దేవుడు అఘటన ఘటనా పండితుడు. సర్వలోకైక వీరుడు. జ్ఞాతులమగు మనల గలసి మెలగుడని చెప్పుటకు దూతగా వచ్చుచున్నాడు. అట్టివాని బాధింపరాదని రాజనీతి. ఇదిగాక భగవంతుడు ఇంటికివచ్చుట ఇంతటిమేలని చెప్పశక్యమా? అతండేమి చేసెరా పాపాత్మా? అని భర్తించెను ఇట్టులా రాత్రి వేగెను. కృష్ణుని మరియాదగా తీసికొనివచ్చుటకు తగినవారి నంపిరి. దేవుడు కాలకృత్యములు తీర్చికొని వీరి ఆహ్వానముతో వచ్చుచుండ దుర్యోధనాదు లెదురేగిరి.

శ్రీకృష్ణుడు హస్తిపురికివచ్చి మొగసాలవద్ద రథము డిగ్గి సాత్యకియు కృతవర్మయు నిరుపార్శ్వముల రాగా దుర్యోధనాదులు ముందు సందడిబాపుచుండ ధృతరాష్ట్రుని కొలువునకు వచ్చి ఉభయకుశలోపరి, పాండవుల సౌజన్యము విశదమగునట్లు ధర్మజుడు చెప్పినరీతి పెద్దలకు నమస్కారము. సములకు నాలింగనాది గౌరవములు, చిన్నలకు దీవనలు. చెప్పి కొంతతఱికి దుర్యోధను నింటికి పోయి అచ్చట ముచ్చటలతో దుర్యోధనుడు తాను శ్రీకృష్ణునకు చేయించుచున్న విందును వీనులవిందు జేయ నా దేవుడు మెల్లగా తానావిందు కుడువనొల్లనని చెప్పెను.

దుర్యోధనుడు కర్ణాదుల గలుపుకొని మారాజున కిష్టుడవు, మాకు బంధుడవు మాయింట భుజింపననుటకు తగినకారణము లేదనెను. భగవంతుడు వాని చేయి చేత తెమల్చుచు నేను ప్రస్తుతము పాండవ కార్యార్థిని. దూతను నేను నీయింట భుజించిన తరువాత కార్యము నెరవేరకున్న కృష్ణుడు వారిసొమ్ముతిని మోమోటపడి కార్యము చెఱచెనందురు దూతలు ముందుగా శత్రులింట భుజింపరాదు. వారును వారిం గుడువబెట్ట రాదు. దైవవశమున దేహమున కేతెవులు వచ్చినను అది వారిదుష్క్రతి యందురు. మేము శత్రువులమా అందువేమో? సందేహమా! నాకు పాండవులు ప్రాణములు వారినిజూచి సైపనివాడవు నీవు. ప్రాణముల బాధించువారు శాత్రవులే కారా? నీవు ప్రేమగా పిలిచి పెట్టుటలేదు నాకాపద యనగా నన్నము పెట్టువారు లేకపోవుటలేదు కాన నీయింట నిప్పుడు కుడువనొల్లను. నీవారల ఇంటను భుజింపను. ఈ యూరిలో విదురుడొక్కడు యోగ్యుడని ఆతని అన్నము తినదగినదని నిర్ణయించితిని. కాన అచటకు పోయెదననీ చెప్పి - యొప్పించి లేచిపోవుచుండ ముందుగా ఇండ్లకు పోయివచ్చి దారిలో శ్రీకృష్ణుని-మాయిండ్ల కానుక లాయత్తము చేసి వచ్చితిమి మహాత్మా! విజయముచేసి వానినెల్ల గ్రహింపవలయునని ప్రార్థించు భీష్మద్రోణాదులతో మీ యందఱ యిండ్లకు వచ్చినట్టే మీ కానుకలెల్ల గ్రహించినట్టే యని విదురునితో వాని యింటికేగెను.

భీష్మాదులును మోములు చిన్నబుచ్చుకొని యిండ్లకేగిరి. దీనిలో దేవునియభిప్రాయము - అన్నలు తమ్ములు జూదమాడినను వారిరాజ్యము వీరు, వీరి రాజ్యము వారు లాగుకొనినను మీరు సంబంధము కలిగించుకొని వచ్చును ఊరకుండవచ్చును. కాని ఒక మహాసభలో సామాన్యస్త్రీకి పరాభవమగుచున్నను సమర్థులు సైచి చూడరాదు. అందున ధేవాంశలో అగ్ని కుండమున జనించిన ప్రసిద్ధయగు రాజ్ఞికి పరాభవము జరుగుచుండ శక్తి కలిగి వారింపకుండుట, అదిచేతగాకున్న లేచిపోకుండ అక్కడనే చూచుచుండుట యిది అనుమోదించుట అను నేరమున చేరుచున్నది.

శ్లో|| కర్తాకారయితాచైవ ప్రేరకాశ్చనుమోదకః

సుకృతే దుష్కృతేచైవ చత్వారస్సమభాగినః ||

అని యున్నదిగాన, మీరపరాధులలో భాగస్థులుగాన మీ కానుక లక్కరలేదని దేవుని అభిప్రాయము. అది యెఱిగిన భీష్మాదులు కన్నములో తేలుకుట్టిన దొంగలవలె సరిబుచ్చుకొనిపోయిరి. భగవంతునకు భక్తుడగు విదురుని యింట విందెట్లు జరిగెనో? అధి అవాఙ్మానసగోచరము, అనుభ##వైకవేద్యము. విదురుడు రాచకార్యము ప్రసంగించి రాత్రి చెప్పిన దుర్యోధను దురభిమానమును వ్యక్తపఱచి ఈరాజీకి నీవేల వచ్చితివి? ఇంతటితో బొమ్మనెను. బంధువులలో విరోధమువచ్చి కొట్టుకొనుచుండ శ్రీకృష్ణు డడ్డమువచ్చి వారింపకపోయెను, అని లోకులు అనుకొనకుండ రాజీకీ తగిన ప్రయత్నమంతయు శక్తివంచనములేకుండ చేసెదను. మంచి పనిచేసి దానివలన పున్నెము నార్జించెదను. కాదనిన దుర్యోధను నెత్తిన ఈపాపమెల్ల గట్టిబోయెదను. వారేమి చేయుదురోయని భయపడవలదు. నేను నిక్క మల్గిన అందు అక్కడేనియు బ్రదుకజాలడు. అదియును పాండవులకు మేలేయని సమాధానించి నిదురపోయి మరునాడు తగురీతి దుర్యోధన ప్రభృతులాహ్వానింప ధృతరాష్ట్రుని నిండుకొలువున కా స్వతంత్రుడు పోయెను. మునులు భగవంతుని సంధివాక్యచాతుర్యమును వినుటకు విచ్ఛేసిరి పౌరులు, జానపదులు, యుద్ధార్థమువచ్చినరాజులు, నిండిన కొలువున శ్రీకృష్ణు బూజించిరి. కృష్ణున కిరువైపుల సాత్యకీ కృతవర్మలు కూర్చుండిరి. వెనుకపీఠమున చేతులుమోపి విదురుడు కూర్చుండెను. తక్కినవారెల్ల సుచిత పీఠముల కూర్చుండిరి. కర్ణ దుర్యోధను లేకాసనమున నుండిరి అందఱు వింజంబాకిడినభంగి నవశము దాకారితచిత్త వృత్తులై యుండగ, ఆ సర్వవందితుడు సభ్యులనెల్ల ఆదరముగ జూచుచుస్మిత పూర్వముగ ధృతరాష్ట్రు నామతించి యిట్లు పలికెను.

''భరతవంశము ధర్మమునందు పరాక్రమమునందు పేరువడసినది. అందు శంతనుడు వంశకర్త సర్వసమర్థుడగు భీష్ముడు తన తండ్రికి నై రాజ్యము వదలుటచే వాని ప్రత్యక్షమున సవతితల్లి కొడుకు చిత్రాంగదు తరువాత విచిత్రవీర్యుడు రాజ్యముచేయుచు స్వర్గతుడైనవాని క్షేత్రముల యందు ధర్మముగ క్షేత్రజ సంతానము సంపాదించి భీష్ముడు వంశ మంతరింపకుండ కాపాడెను అందు నీవు నీతమ్ముడు పాండురాజు ధర్మోత్తరులరు. నీ యింద్రియ వైకల్యమున పాండురాజు రాజ్యముచేయుచు నిన్నను వర్తించుట లోకవిధితము వాని కుమారులైదుగురిని వాని యనంతరము మునులు మీకు అప్పగింప తగురీతి బెంచి వారినిరాజ్యములం ధభిషిక్తులచేసి వారివలన తేజోలాభముల నందితివి. వారు దిగ్విజయ మొనరించి రాజసూయాదు లొనర్చి మహావైభవముననుండ నీకొడుకు జూదము వెపమున వారి భంగపెట్టి అడవులకు బంపుట లోకవిదితము. వంశక్రమాగతమగు సుచరిత్రమ మిప్పుడు తప్పనేల? వారి బిలిపించి తగు పదవినిలిపి వంశ ప్రతిష్ఠనిలుపుకొనుము. ఎంతయున్నను చాలకుండునట్టులుండుటస్వభావము! దాని మార్చుకొనజాలినప్పుడే పురుషుని పౌరుషము కావున మామా ఆలోచింపుము. మాతండ్రి చెప్పినట్టు లరణ్యవాసము, అజ్ఞాతవాస మట్లొనర్చివచ్చిన మాకు మాభాగ మీక ఎవ్వారేమి చేయగలరు. ధనకనక వస్తు వాహనాది భోగసమయముల మాపెద్ధతండ్రి మమ్మును వెలిబెట్టి తన కొడుకులనే అనుభవింపజేయునా? ఇతడు బ్రతికియున్న రూరేండ్లకు మాకు నాయన కన్ని వేరుగా నొరులు రక్షకభటులు లేరు అని పాండవులు చెప్పుమనిరి. నీవేమనియెదవో? అనుము. నీకొడుకుల మదినున్న లోభము మానిచి వారిని నీలోనికి దెచ్చుకొనుము. నీయందలి భక్తితో వారిట్లను చుండిరిగాని వారేమియు నసదుగారు. అవి అన్నియును తలంచుము. నే నా వైపుననుండి వారితో వచ్చుచుండ నాకెదురై మీరు గెలుపుగొనలేరు. నిశ్చయము. నా ప్రార్థన నంగీకరించి వారి నీలోనికిదెచ్చుకొని కీర్తినొందుము. నీ కొడుకులు నూటయైదుగురునై భీష్మాదులు మేలుగోరుచుండ రాజలోక మెల్ల నీకు భృత్యులై మెలగ ఆటునిటు యుద్ధమునకు వచ్చినవారెల్ల ఉల్లాసముతో ఇండ్లకేగ జగము మేలెట్లుండునో అటు చూడము.'' అని ఈ విధముగా భగవంతుడుచెప్పి, మునులచే చెప్పించి, ఇందు ఎవరికి కీడైనను నీకు దుఃఖము తప్పదు. విమర్శించుకొనుమని చెప్పెను. భీష్మాదులను చెప్పిరి.

ఇవి యన్నియు లెక్కసేయక, దుర్యోధనుడు దేవునితో కృష్ణా! విచారించినచో నావలన నేమియు తప్పులేదు. ధర్మజుడని పేరుగాని జూదపువ్యసనముగల ఆ రాజు శకునితో జూదమాడి ఓడిపోయెను. అతడు దానిలో తెలివిగలవాడగుటచే గెలిచెను. నా మంచితనముతో ఆ శకుని వలన నాకు కొంత సంక్రమింప వచ్చును. ఇంతమాత్రముతో జూదగాండ్ర జూదము వారించుటకుగాని వారు ఓడినధనముల వారికిప్పించుటకుగాని నాపూచి యేమిగలదు. పాండవులు లేనినేరములన్నియు నాపై మోపి పలువుర ప్రోవుచేసికొని నాపై నెత్తి విడిసిరిగదా! ఇది తెల్లము. ఇదంతయు జూచి ఆత్మరక్షణమునకై నాకు తగిన వారల నేనును ప్రోవుచేసికొంటిని. ఇంత అయిన తర్వాత భయమేటికి? అది కాక నా చిన్నతనమున అంధుడైన మాతండ్రి తమ్ముని కొడుకులని పక్షపాతముతో ఏదియైన సంక్రమింపచేసినను న్యాయమునకది యెల్లయెట్టు లొప్పుకొందును? పాండవులకు వాడి సూదిమొన మోపినంత భూమియు నీయను. వారేమి సేయుదురో సేయనిమ్ము. వారుగాని మేముగాని సంగ్రామంబునం జయంబుగొని రాజ్యముచేయుట నిశ్చయించితిని. అని వక్కాణించెను అనేకు లనేకవిధములచెప్పిరి. మనవంశములో పెద్దవానికి రాజ్యాధికారము లేదు. ప్రతిమహారాజునకు మువ్వురుకొడుకులు. వారిలో దేవాపి పెద్దవాడు. వాడు చర్మరోగముగలవాడగుటచే వాని రాజుగా చేసికొనుటకు ప్రజలొల్లరైరి. రెండవాడు బాహ్లికుడు. మాతామహారాజ్యము నాక్రమించుకొని యుండి ఇది వదులుకొనెను. మూడవవాడు శంతనుడు రాజయ్యెను. శంతనుసంతతిలో నేను రాజ్యము వదలితిని సత్యవతి కొడుకులగు చిత్రాంగద విచత్ర వీర్యులలో చిన్నవాడు విచిత్రవీర్యుడు రాజయ్యెను. విచిత్రవీర్యుని సంతతిలో ధృతరాష్ట్రుడు గ్రుడ్ఢివాడగుటవలన రెండవవాడు పాండురాజు రాజాయెను. కనుక నీకు రాజ్యములో పాండవులు దయ దలచి యీకున్న హక్కేమియు లేదని భీష్ముడు చెప్పెను.

శ్లో|| మయ్యభాగిగ రాజ్యాయ కథం త్వం భాగమిచ్ఛసి

అరాజపుత్రోహ్య స్వామీ పరస్వంహర్తుమిచ్ఛసి||

నాకు రాజ్యములో భాగములేనిదేనీకు భాగమెట్లువచ్చును? రాజ్యము చేసినవాని కొడుకునకు రాజ్యము వచ్చును. స్వామియైనవాడు సంపాదింపవచ్చును. నీవు రాజ్యముచేయనివాని కొడుకువు. పాండవుల కన్న స్వామినికావు. నీవు రాజ్యముగోరుట పరధనము నపహరింపదలచుటయే యని ధృతరాష్ట్రుడనెను.

శ్లో|| రాజ్యంతు పాండో రిదమప్రధృష్యం

తస్యాద్యపుత్రాః ప్రభవంతి నాన్యే

న్యాయాగతం రాజ్యమిదంచ కృత్స్నం

యుధిష్ఠిరశ్శాస్తువై ధర్మపుత్రః||

ఇది పాండురాజు రాజ్యము కాదను వారెవ్వరును లేరు. వాని కొడుకులిప్పుడు సర్వసమర్ధులైయున్నారు. కాన మనకు హక్కులేదు. న్యాయముగా ప్రాప్తమైన ఈ రాజ్యమంతయు ధర్మపుత్రుడగు యుధిష్ఠిరుడే పరిపాలింపవలయును. అని గాంధారి చెప్పినది ఇట్లెందరు చెప్పినను వినక దుర్యోధనుడు కొవుకూటమునుండి దిగ్గున లేచిపోయి, దుష్టచతుష్టయము కలసి శ్రీకృష్ణు బట్టుకొను సన్నాహమున నుండెను అది కనిపెట్టి సాత్యకి తనవాడగు కృతవర్మతో జెప్పి యాదవ సైన్యములతో బయటి వారలనెల్ల నీవు జంపుము. లోపలివారినెల్ల నే జంపెదను. అని ఏర్పాటు చేసివచ్చి శ్రీకృష్ణునితో రహస్యముగ చెప్పెను. శ్రీకృష్ణుడు దీని కింత రహస్యమేల? అందఱకు తెలియునట్లు పెద్దగా చెప్పుమనెను. సాత్యకివారి అశక్తదుర్జనతను సభకు ఎఱుకచేసెను.

అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో మీరుమీరు అన్నలుతమ్ములు కొట్టుకొనిచచ్చుచుండ వలదని మధ్యవర్తిగా చెప్పవచ్చిన నాపై నింతయలుక ఏల? నాపైకి వచ్చిన దుర్యోధనాదులు రెండుదెబ్బలు కొట్టిన నేనొక దెబ్బయైననుగొట్టి వారిపని చక్కబెట్టి పోయివచ్చెదను సెలవిమ్మనెను. అప్పుడు గాంధారి ధృతరాష్ట్రులు విదురునిబంపి దుర్యోధను బిలిపించిరి. వాడు మొగము రాజుచుండవచ్చి సభలో గూర్చుండెను. అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో నీకొడుకెంత అవినీతుడో చూచితివా? అనెను. గాంధారి - నీ కొడుకు దుర్మార్గుడని యెఱిగి వానివెంటబడి నీవు పోనేల? వాని పెత్తనమేమికలదు? రాజ్యము పాండవులు నీకిచ్చినది. అందులో నీవు వారల కేమి యిచ్చెదవో నీనోటితో ననుము. ఎవ్వరేమి చేయగల రనెను ధృతరాష్ట్రుడా విషయమున నోరుమూసికొని భగవంతునితో కృష్ణా! నాకొడుకు నెట్లయిన మాటలుచెప్పి యొప్పించమని ప్రార్థించెను. శ్రీకృష్ణు డాయా యీ మాటలు చెప్పుచు నేనొకడననియే కట్టివేయుటకు త్రాళ్ళు సంపాదించితివి కాబోలు! ఇంకను చాలత్రాళ్ళు కావలయునని నవ్వి విశ్వరూపము జూప నందరు నిశ్చేష్టులైరి. భీష్మాదులు మునులు ఆనందనిమగ్నులై ఆ రూపము గనుగొనుచుండిరి. ధృతరాష్ట్రుడది తెలిసికొని ప్రార్థింప వానికి దివ్యదృష్టి ప్రసాదించిన గాంధారియు కంటిపట్టమువిప్పి దాని తిలకించెను. అంత నారూప ముపసంహరించి భగవంతు డూరక సభాభవనము వెలువడెను. వానివెంబడి ధృతరాష్ట్రుని సభ##యెల్ల వెలువడినది. మునులంతర్హితులైరి. వారందఱితో భగవంతుడు కుంతియింటికివెళ్ళి మేనత్తను ప్రశంసించి కౌరవసభలోని విశేషములుచెప్పి నీకొడుకుల కేమి చెప్పదవో? చెప్పుము. మా యమ్మ ఏమనినది? అని వా రడుగుదురుగదా! అనెను.

కుంతి నీ విక్కడకేల వచ్చితివి? జూదమునాడు సత్యము చెల్లించుకొన అడవిపాలైన నా కొడుకుల నేమియు అనలేక ఊరకుంటిని. దాని వలన పాండురాజు తేజమే యశ##మే అంతరించి పోయినది. ఇప్పుడు దాని నెమకితెచ్చుకొనవలదా? నన్ను వీరమాత ననిపించుమని యుధిష్ఠిరునితో చెప్పుము. చేతులబలమితో వచ్చిన కలిమి ననుభవింపుమని వారల కెల్ల జెప్పుము విదుల యను వీరమాత చరితము వారలకు జెప్పుము. రాచకార్యములలో నాయంతది ద్రౌపది దాని యిష్టప్రకారము చేయుమని చెప్పుము. దేనికైనను నిర్వాహకుడవు నీవే యున్నావు - అని చెప్పి వదలెను సెలవు తీసికొని కృష్ణుడు ఉపప్లావ్యమునకు వచ్చెను.

అట్లు ప్రయాణమై పోవుచు కర్ణు నొంటరిగా తీసికొనిపోయి నీవు సూర్యుని వరమువలన కుంతికి పుట్టితివి. కాన నీవును పాండవుడవే! సూతపుత్రుడవు కావు. నేనీరహస్యము దెలుప విని నిన్ను పాండవులు చేర్చుకొందురు. వారికి వీరికి ప్రభుడవు నీవు - అని ప్రలోభింపచేసెను. దానికి కర్ణుడు-కృష్ణా! ఈ విషయము నేనింతో యంతో వినియుంటిని. నీ మాటతో గట్టిగా నమ్మితిని. కాని అతిరహస్యమగు నా జన్మమిపుడు బయటబెట్టనేల? దానివలన మాకు గౌరవము లేకపోగా అర్జునున కోడి వారితో కలిసితినని నాకు, కర్ణునకు భయపడి వాని గలుపుకొనెనని యర్జునునకు లోకాపవాదము కలుగగలదు. ఇంతయేల - నే నన్ననని తెలిసిన ధర్మరాజు రాజ్యము నంగీకరింపడు. అట్టి ధర్మాత్ము డీ లోకములు శాశ్వతముగ నేలవలదా? మాబోంట్లెల్ల ఈ మహాసంగ్రామమున దేహములు త్యజించి ఉత్తమలోకముల కేగుదు మింతియసిద్ధాంతమని శ్రీకృష్ణునొప్పించి వెనుకకు తిరిగిపోయెను. దీనిలో కర్ణుని పట్టుదల ధర్మప్రవృత్తి తేటతెల్లమగుచున్నది. శత్రువులలోనైన మంచిని ప్రకటించుట తనవారిలో నైన చెడ్డను వెలిబుచ్చుట కృష్ణస్వామి స్వభావము.

తరువాత కృష్ణుడు హస్తిపురిలో జరిగిన సంభాషణము వృత్తాంతము నెల్ల పూసగ్రుచ్చినట్లు చెప్పి ఇక మీ యిష్టము వచ్చినట్లు చేయుడు, నన్ను గట్ట యత్నించిన వానితో నింక మీ సంధియేమి కుదురునని వేరుగ ఉపాయమేమియు లేమి తిరిగి వచ్చితినని చెప్పెను. ధర్మజుడు ఏమి చేయు మనియెదనని గ్రుచ్చి గ్రుచ్చి అడుగ యుద్ధము కాక వాని వశపఱుచుకొను ఉపాయ మెద్దియు లేదనిచెప్పెను.

కృష్ణుని శిబిరమునకు పంపి తనతమ్ముల నేమిచేయుదమని సలహాయడుగ వారందరు ఇందు మనయాలోచన యేమికలదు? భగవంతుడే అక్కడకుపోయి వారి స్వభావములన్నియు తెలిసికొని సంధికాదని వచ్చియుద్ధమే కర్తవ్యమని గట్టిగా చెప్పెనుగదా! అదియే కర్తవ్యమనిరి. అయినను ఈదినమెల్ల ఆలోచించి రేపు మీ నిశ్చయము తెలుపుడనెను. మరునాడు వారలట్లే చెప్పిన వినివిని ధర్మజుడు అయిన మీయిష్టము నాచరింపుడనెను.

రెండువైపుల యుద్ధప్రయత్నము లుత్సాహముతో జరుగుచుండెను. కౌరవులు శకునికొడుకు నులూకుని రాయబారిగ పంపిరి. వాడు వచ్చి మీకు మగతనమున్న నడవులకేల పోయెదరు? కృష్ణుడు మిమ్మునెల్ల నొక మూకగ అమర్చి బెదరించి రాజ్యము లాగవలెనని యత్నించెను. ఆయూపు తప్పినది కదా! ఇకనేమి గతి? చేతనయిన అరచేతులలో ప్రాణములు బెట్టుకొని యుద్ధమునకు తరలుడు. కానిచో మరల అడవులకు పొండు. ఈ భీముడు దుశ్శాసను నెత్తురు ద్రావెదనని గప్పాలుకొట్టెనుగదా! ఇంకను ద్రావడేమి? దుర్యోధను తొడలు గదతో గొట్టెద ననెనుగదా! మరచి పోయెనా! కర్ణుని చంపెదనన్న అర్జునుని ప్రతిన ఏమి యయ్యెను! పదుమూడేండ్ల నుండి తూపులు త్రుప్పుబట్టెనేమో? ఇన్ని మాటలేల? మీచేత నయిన పనులు చేయుడు మీకు మేమిచ్చునది లేదని తెల్లమయినది కదా! భయపడి అయిదూళ్ళు అడిగితిరి. పాపమదియు లభింపదాయె! భీష్మద్రోణాదులు మాదిక్కు మీకు అడియాసలు చెల్లవు అని ఇట్టివియే నోటికివచ్చినట్లు పలికెను. దానికి రాజులెల్లరు కోపోద్ధీతులైరి దూతగాన వాని శిక్షింపకుండ ధర్మజుడు వస్త్రమాల్యాదు లొసంగెను. కృష్ణుడు వానికి ప్రతిసందేశము చెప్పెను.

ఓరీ దురాత్మా! అనినని యెల్ల అనినట్లు జరుగగలవు. తొందరగానె అనుభవిపంబోవుచు రుచులడుగనేల? నేనక్కడ చెప్పియే వచ్చితిని గదా! కల సర్వపదార్థములు యాచకులకు బంధుమిత్రులకు కొల్లబెట్టుడు అనుభవింపదలచిన కోర్కులెల్ల అనుభవింపుడు. ఆలస్యము లేదుగాన అరచేత ప్రాణము లిడి అడవికి నడవుడనియు.

ఉ|| ఎందును నెవ్వరుంబడని యెంతయు కష్టముపాటు వచ్చినc

గొందలమంది పాండువిభు కోడలు దువ్వులనున్న గో

విందుడ! రమ్మటcచుc బలవించుట యీగగరాని యప్పుదో

లెందలపోయ వ్రేగయి చలింపక యున్నది యెప్పుడున్మదిన్‌||

అనియు

గీ|| ఇట్టియే! దేరు గడవంగ నెందు నుతికి

నెక్కు గాండీవ మేడ్తెఱ నెక్కువెట్టి

రెండు దొనలును బూని కిరీటి యనికి

వచ్చు నేడెల్లి యెందుc బోవచ్చు మీకు||

అనియు ఇకను వాగ్వ్యయమేల? ఆయుధముల బలాబలములు చూచుకొనుడు-కౌరవసభలో ఈ చిగురుమాట దుర్యోధనునితో ననుము.

గీ|| బవరమెల్లియ బిరుదవై బరవసమున

వచ్చి చావుము చావక బ్రదుకరాదు

కృష్ణసారధికంబగు జిష్ణురథము

తొడరి నీవెందు చొచ్చిన తోడచొచ్చు||

అని చెప్పి పంపెను. ఇక ధర్మజుడు సేనాపతి నెవని చేయుదమన-వేయేటికి దృష్టద్యుమ్నాయత్తము జేయు మీవు సైన్యము లెల్లన్‌ - అని శ్రీకృష్ణుడు చెప్పెను.

ఈ మధ్యలో వ్యాసుడు ధృతరాష్ట్రుని యొద్దకు వచ్చి కృష్ణుని మాటలు వినక సంధిచెఱచుట ప్రమాదమని చెప్పగా అతడు తనకొడుకుతో చెప్పమనెను. దానికి వ్యాసముని, మైత్రేయుడు వచ్చి చెప్పును. వానిమాటల వినుమని చెప్పిపోయెను. తర్వాత మైత్రేయుడు వచ్చి పాండవవీరుల నాజియందు జయించుట కష్టముగాన రాజీ చేసికొనుమని చెప్పగా ఆమునిని వాని మాటలను లెక్కచేయక దుర్యోధనుడు వెకలియై తొడలు చఱచు కొనెను. దానికి అలిగి మైత్త్రేయముని నన్ను అలక్ష్యము చేసితివిగాన నీ తొడలు మహాయుద్ధమున భీముని గదతో విఱుగగలవని శపించి, ధృతరాష్ట్రుడు ప్రార్థింప పాండవులతో సంధిచేసికొనిన నా శాపము జరుగదు. యుద్ధమే అయిన నిది తప్పదని చెప్పిపోయెను.

అతిరథ మహారథాది నిర్ణయసమయమున భీష్ముడు కర్ణుని అర్థరథుడనుటచే కర్ణుడు కనలి భీష్ముని యుద్ధసమయమున తాను యుద్ధము చేయననియు, అతడు గెలిచిన తాను వనవాసి నయ్యెదననియు, భీష్ముడు సచ్చినతాను పాండవుల జంపి దుర్యోధను అసపత్న రాజ్య మేలించెదననియు ప్రతిజ్ఞ చేసెను. కౌరవసేనలకెల్ల భీష్ముడు సేనానాయకు డయ్యెను. భీష్ముడు మొదటనే శిఖండిని ఆడుది మగవాడైనవాడు గావున వాడు గొట్టినను నేను చూచుచుందును గాని తిరగగొట్టనని, పాండవులగొట్ట చేతులు రావని, తక్కినవారెల్లనామునుమునబడి యేమయ్యెదరో జూడుమని, మీటు గల రాజరథికుల నాటికి వేవుర వధింతుననియు పదిదినములు యుద్ధము చేసెదననియు, నరుశరముల నన్నుదాకి పడవేయునందాక ప్రతిబలంబు వీరులనెల్ల వేటాడెదననియు, దుర్యోధనునకు బాసయిచ్చెను. ఇట్లు ఉభయ పక్షములవారును సన్నద్ధులై కురుక్షేత్రమునకు నడిచి దృషద్వతి యను నది పొంత పాండవులును, శమంతపంచకమునొద్ద కౌరవులును శిబిరములువేసి నివసించిరి.

తరువాత వ్యూహముల పన్నుకొని రెండువైపులవారు రంగమునకు వచ్చిరి. యుద్ధ ప్రారంభమునకు మున్ను రథముదిగి వినీతవేషముతో చేతులు జోడించి ధర్మరాజు భీష్ముదెసకు బోయెను. వాని భావము నెఱుగ లేక పాండవ సైనికులెల్ల చిన్నపోయి పలికిరి. కృష్ణుడు మాత్ర మది యెఱిగి తక్కిన పాండవులతోగూడ తాను నట్లే భీష్ముని వద్దకు పోయెను. భీష్ముడు మొగమటు త్రిప్పుకొని - వచ్చి మంచిపని చేసితివి. రాకున్న శపింపదలచితినని, ధనమునకు పురుషులు దాసులు, నేను దుర్యోధనునితో నర్థసంబధము కలవాడ నగుటచే ధర్మప్రధానుడవు. కౌరవ వంశవర్ధనుడవు అగు నీ కేమాత్ర ముపకారము చేయజాలనైతిని, క్లీబునివలె మాటలాడు చుంటివి, అని ధర్మజుతో తన అభాగ్యమును జెప్పెను దానికి ధర్మజుడు పితామహా! నీవు వానిసొమ్ము తిన్నందున వానివైపు యుద్ధము చేయుము. మనుమడనైనందుకు నన్ను మనసులో దీవింపుమని కోరి, ఆతని వధోపాయము తర్వాత రమ్ము చెప్పెద ననిపించుకొని పోయెను. ఇట్లే ద్రోణకృపాచార్యశల్యులదర్శించిముచ్చటించితక్కువారలకుదుర్నిరీక్ష్యుడై వచ్చి రథమెక్కి కిరీట ధమరాదుల గ్రహించి శత్రుసైన్యములజూచుచు పెద్దగా ఈకౌరవులలో ఎవరైన మాలో కలియవచ్చిన వారి నా తమ్ములతోపాటు చూచెదనని పలికెను. అదివిని ధృతరాష్ట్రుని వేశ్యాపుత్రుడగు యుయుత్సుడు కౌరవుల దుష్టత్వము నుగ్గడించుచు నీవు ధర్మాత్ముడవగుటవలన నీలోనికి వచ్చితినని తన సైన్యముతో పాండవుల గలిసెను. అతని తనవారి కప్పగించి ధర్మజుడు నాకు ఐదుగురు తమ్ములు. ఈ యుయుత్సుడు యుద్ధములో చచ్చినను నేను బ్రదుకననెను. కాన పాండవపక్షమెల్ల యుయుత్సుని యుద్ధములో కనిపెట్టి యుండవలసివచ్చెను. ధర్మపక్షమున జేరుట, మంచివాడు, పాండవుల పరోక్షమున మహారాజయ్యెను.

23

శ్లో|| కరకమల నిదర్శి తాత్మ ముద్రః

పరికలితోన్నత బర్హిబర్హచూడః

ఇతరకర గృహీత వేత్రతోత్రో

మమ హృది సన్నిధి మాతనోతు శౌరిః-

రెండు సైన్యములు సన్నద్ధములై యుండ జూచి దుర్యోధనుడు ద్రోణాచార్యునియొద్దకరిగి ఉభయపక్షములనున్న వీరుల నెన్ని 11 అక్షౌహిణుల మహావీరులతో సన్నద్ధమై భీష్మాభిరక్షితమగు మన సైన్యము తేలికగా కన్నట్టుచున్నది. 7 అక్షౌహిణుల సేనతో భీమసేనరక్షితమగు పాండవ సైన్యము సారవత్తరముగా కన్పట్టుచున్నది. ఇదియేమని అడిగెను. అది గ్రహించి భీష్ముడు తనపక్షము దైన్యము దక్కినయోధులు వినకుండ తన శంఖమునూదెను. దానివెంటనే కౌరవపక్ష వీరులెల్ల శంఖములనూది సింహనాదములతో రోదపి నింపిరి. వెంటనే పాండవులును అట్లుచేసిరి. వారి నాదమున కౌరవులనాద మడగినట్లుండెను. దేవదత్త పాంచజన్యముల మ్రోతలో సర్వము నడగిపోయెను. అప్పుడు అర్జునునికోరికపై శ్రీకృష్ణుడు రథమును రెండు సైన్యముల మధ్యమున నిలువబెట్టెను. అర్జునుడు పర సైన్యమున నున్న వారలెల్ల తనవారలేనని వారల జంపుటకు సాహసింపక మెతకబడి మూడులోకముల రాజ్యమువచ్చినను నేను వీరలచంపను. భూలోకమాత్ర మేలుటకు ఈ బంధువుల జంపుటకు మనమొప్పకున్నది - అని శస్తాస్త్రముల వదలి రథముపై కూలబడెను. శ్రీకృష్ణుడు వాని మాటలెల్ల ఖండించి క్షత్రియుడవగు నీకు ఇది పథముకాదనెను.

అర్జునుడు కృష్ణా! ఎవరిని పోషించుటకు రాజ్యము ధనము సంపాదింపవలెనో అట్టి గురువులు, తాతలు, జ్ఞాతులు, కొడుకులు, కొమ్మలు నశింపనుండిరి. తర్వాత జయించిమాత్ర మేమి చేయుదుమని కారుణ్యముతో నా చదివిన చదువులెల్ల విస్మృతములైనవి. విజ్ఞాన మడగినది. కాన నే నీకు శిష్యుడనైతిని. నిన్నాశ్రయించిన నన్ను ప్రబుద్ధుజేయమని ప్రార్థించెను. శ్రీకృష్ణస్వామి కిరీట కుండలములతో, నెత్తినధరించిన నెమలిపింఛము ప్రకాశించుచుండ దక్షిణహస్తమున జ్ఞానముద్రనువహించి బెత్తము, కొరడా, పగ్గములు ఎడమచేత దాల్చి అర్జునునకు కర్తవ్యము నుపదేశించెను. అట్టి బోధము అర్జును నిమిత్తముగాగొని సర్వలోకమునకు చేసినబోధము. అధికారి భేదమునుబట్టి భేదవాదములున్నను భగవంతుని బోధము అనగా భగవద్గీత, వేదములు, శాస్త్రములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు ఏకవాక్య మేకమతమని పదునెనిమిది అధ్యాయములతో సులువుగ బోధించెను. ఈ గీతముగూర్చి మా తండ్రిగారు నేను బ్రదికినంతకాలము చెప్పుచుందును, వినుడు ఆయువు చాలనిచో మరల జన్మించి వచ్చిచెప్పెదనని ఒక సభలో వాక్రుచ్చిరి.

అంత తెలివిలేకున్నను నా ఎఱిగినంతయు ఇచ్చట జెప్పు నవకాశములేదుగాన సంగ్రహించి ప్రస్తావనవశమున అనుచుంటివి. ''క్షంతవ్యోమే అపరాధః''

శరీరము కనబడుచున్నది. ఇది జడమ అజ్ఞులకును సులువుగ రుజువు చేయవచ్చును. దీనియందు సర్వప్రకాశమగు తెలివిగలదు. దానినే సంవిత్తు అందురు. ఈ రెండు భేదము కనుగొనలేనివాడు అజ్ఞుడు. అది ఎఱిగి వ్యవమరించువాడు జ్ఞాని. దేహము పోయినప్పుడు ఆ సంవిద్రూపమగు జీవుడు నశించుటలేదు. దీని నిర్ణయమునకే సాంఖ్యయోగాది శాస్త్రము లనేకము లేర్పడినవి. ఎవరెట్లు చెప్పినను జీవుడు - దేవుడు - మాయ - ఈ మూడింటిమీద సర్వము ఆధారపడియున్నది. మాయపోయిన జీవుడు దేవుడు ఒక్కడేయని యుపనిషన్మతము. మాయను తెలిసికొని వదలిన జీవుడు శుద్ధుడగునని సాంఖ్యులమతము. అట్లు శుద్ధుడైన జీవుని మరల మాయ వశముచేసికొనకుండ అన్యుడగు దేవుడు చేయుచుండునని యోగులు చెప్పుదురు. పరమార్థమున సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమగు బ్రహ్మ మొక్కటియే సత్యము. ద్వితీయపదార్థమే లేదు. కలవంటి లోకమున వ్యావహారిక పాపపుణ్యములవలన చిద్రూపమున కేమియు మార్పులేదు. దేహము, జీవుడు, ఇంద్రియములు, వాయుచేష్టలు, దైవములు కలసిన వ్యావహారికమున ఏపనియైన నెరవేరును. అట్టి పాపమును గానిపున్నెమునుగాని నే జేసితినని కర్తృత్వము తనపై వైచికొనుటయే అజ్ఞానము. ఇందఱు కలసిచేయు వ్యవహారముతో నాకు సంబంధములేదు. నే నంతటనెప్పుడు నుండువాడను. ఆకాశమునకు ఇతర భూతగుణములు అంటనట్లు పాపపుణ్యాది అంతఃకరణ గుణములు నన్ను అంటవు అను నిశ్చయముతో సాక్షిగనుండుట జ్ఞానము. సంవిద్రూపుడవు టీవుడు చంపువాడు గాడు చచ్చువాడు గాడు. కాన నా బంధువులు, నేను చంపను అనుటెల్ల అజ్ఞానమే. చచ్చునది జడమైన దేహము. అది ఎట్లును నిలువదు. చావని జీవుని జంపువాడు లేడు. ఇట్టులుండ వీరు బంధువులని నేను జంపువాడనని అహంకారము వదలి ప్రవర్తింపుము. నీకు పాపమంటదు. అటుగాక అహంకారముతో నేను యుద్ధముచేయననిన వ్యావహారిక శాస్త్రములబట్టి ''క్షత్రియస్య యోద్ధవ్యః'' అను స్వధర్మమునువదలి వర్తించు నీ కెట్లును పాపముతప్పదు. 'స్వధర్మే నిధనం శ్రేయః'' ఇంకొక ధర్మము బాగుగనున్నదని తాను చేయుటకన్న తన ధర్మమున జరుగకున్న చచ్చినను మేలు

కాన నీకు యుద్ధ మవశ్యకర్తవ్యము. అని తత్త్వజ్ఞాన పురస్సరముగ అర్జును బోధించుచు వాని యడిగిన ప్రశ్నములనెల్ల సమర్థించుచు, ఆతడు కోరగ తన విశ్వరూపము ప్రదర్శించి అందు ఈ యోద్ధలెల్ల తన నోటిలో బ పోవుచున్నట్లు చూపి నీవు చంపకున్నను వీరెట్లును జచ్చువారే! నీవు నిమిత్తమాత్రముగ నుండి కీర్తిగైకొనుము లెమ్ము. అని అర్జునుని ధీరునొనరించి కృష్ణదేవుడు యుద్ధమునక ఉద్యుక్తునిచేసెను. అట్లు ప్రారబ్దమగు యుద్ధమున మొదటినాడు సమానముగా పోరి సాయంకాలముచూచి రెండుపక్షములవారు వారివారి విడిదలలకు పోయిరి. భీష్మాదులు ప్రతిదినము కాల్యములదీర్చి యుద్ధమున కేగునప్పుడు ఆయుధములనంటి పాండవులకు జయమని రంగమున బ్రవేశించి రాక్షసావేశము వచ్చినట్లు యుద్ధము చేయుచుందురు. రెండవనాడు సాయంసమయమున పాండవులు చెలరేగుట జయమునొందుట జూచి దుర్యోధనుడు భీష్మునుపాలంభించెను.

మూడవనాడు రెండుజాములవరకు పాండవులకే విజయము. మూడవజామున భీష్ముడు విజృంభించెను. పాండవసైన్యములు భీష్ముని మీద మొగకట్టలేక కాందిశీకములైనవి. కృష్ణార్జునులు బాణపంజరబద్ధులైరి. కృష్ణుడు చెప్పినను తాతగారగు భీష్ముని గొట్టుటయందు అర్జునునకు ఉత్సాహము రాలేదు. అప్పుడు కృష్ణుడు మునీకోలతో రథమునుండి డిగ్గి భీష్ముని జంపెదనని వానికి కెదురుగా బోవుచుండెను. దానికి అర్జునుడును రథము దూకి వెంటనంటి శ్రీకృష్ణుని నడుము రెండుచేతులతో బిగ్గపట్టి నేలకు ఈడిగలబడి పదియడుగులలోపల దేవుని నిలిపి స్వామీ! యుద్ధములో నెంతవారలైన కొంచెముసేపు వెనుబడకుందురా? అంతమాత్రమున నీవు చెలరేగిన మా ప్రతిష్ఠ నశించిపోవునుగదా? దయచేయుముదేవా? నిన్ను నొప్పించిన భీష్ముని పాటు చూచెదరమ్మని వేడుకొని నొగలెక్కించి తానును రథమెక్కి గాండీవముగొని విజృంభించి నాల్గవజామెల్ల కౌరవసైన్యముల పీనుగుపెంటలు గావించెను. భీష్మాదు లెవ్వరును ఎదిరింపలేకపోయిరి. అప్పుడు భీష్ముడు ఆకసము జూచి ద్రోణునితో

గీ|| కృష్ణసారధ్యమున నొప్పు క్రీడియపుడు

కౌరవానీకముల నెల్ల కసిమసంగె

కృష్ణసారధ్యమున నొప్పు క్రీడియిపుడు

ఎంత సేయంగవలయుc దానంతసేసె!!

అని సూర్యుడు ఎఱ్ఱవారుట జూసి ఆ నెపమున యుద్ధము చాలించి తన సైన్యములతో విడిదల కరిగెను. పాండవులును కృష్ణార్జునుల అతిలోక విక్రమమును పొగడుచు శిబిరముల కరిగిరి. పై పద్యములో ఒక కృష్ణ శబ్దమునకు విరాట్పుతుడగు ఉత్తరుడర్ధము. ''కృష్ణో విరాట్సుతే'' అని నిఘంటువు గలదు. ఉత్తరుడు సారధియగు గోగ్రహణము అంతసేసిన అర్జునుడు కృష్ణస్వామి సారధియైన యిప్పుడు ఎంతచేయవలెనో అంతయు చేసినాడని పద్యార్థము. దీని నెరుగక అచ్చులో నీపద్దెము ననేకులు అనేకవిధములుగ దిద్ధి ప్రకటించుచున్నారు.

నాల్గవనాడు భీష్ముడు మకరవ్యూహముబన్ని యుద్ధమునకువచ్చెను ధర్మరాజు నానతో ధృష్టద్యుమ్నుడు అర్ధచంద్రవ్యూహము పన్నెను. అందు భీష్ముని కెదురుగా అర్జునుని బెట్టి ఒక కొమ్మున భీముడు మఱొకకొమ్మున ధృష్టద్యుమ్నుడు నిలచి తక్కినవారల మధ్య నిలిచిరి. అర్జునుడు తాతగారిని కొట్ట మోమోటపడెను. అదిచూచి ధర్మజుడు ధృష్టద్యుమ్నుని చేతగాని వ్యూహము పన్నితివని ఆక్షేపించెను. వాడు సరిగనె పన్నితిని. దీని లోపమేమి? అన ధర్మరాజు అర్జునుని ఆ కొమ్మునకు బంపి భీముని దెచ్చి భీష్ముని కెదురు నిలుపుమనెను ధృష్టద్యుమ్నుడు వినయముతో రాజాజ్ఞను దెలుప అర్జునుడు నవ్వుచు భీమునిచోటికి పోయెను. భీముడు అట్టి రాజాజ్ఞను విని భీష్మునికి తన రథ మెదురుగా తోలించెను. భీముడు పిడికిలితో కూర్చుండి వేరే ఆయుధము లేకుండ తన రధాశ్వములు భీష్ముని రధాశ్వముల ముట్టెలు ముట్టెలు కొట్టుకొనుచున్నను తనసారధి నింకను తోలుమని గదిమి తోలించెను. భీష్ముడు చేయునదిలేక తన రథమును తప్పతోలించుకొని తొలగిపోయెను. ఆ సందున భీముడు కౌరవుల మకర వ్యూహములో ప్రవేశించి చేయిపిడికిలితోనే బెదరించుచు వ్యూహము చెడగొట్టివచ్చి ధర్మజు మెప్పు నొందెను.

కం|| మకరవ్యూహం బనియెడు

మకరాలయ మపుడు దర్ప మహిమోజ్జ్వలుడై

మకరక్రీడం జండత

మకరాభీలముగ జొచ్చె మారుతి యధిపా! (తిక్కన)

5-6-7 రోజులు సామాన్యముగ నిరుదెరుగువారు పోరిరి. ఎట్లయినను ప్రతిదినము పాండవులదే జయము. 8వ నాడు పాండవుల పరాక్రమ మతిశయమగుటయు దుర్యోధనుడు భీష్ముని సేనాధిపత్యము చాలించుకొనుమని కర్ణుని దెచ్చుకొనెదనని నిష్ఠురముగా ననెను. దానికి భీష్ముడు నొచ్చియు రేపు జూడుము నా పరాక్రమమని బాసయిచ్చి 9వ నాడు మూడవజామున పాండవయోధుల సెలకట్టనీక విజృంభించి ఎక్కడ జూచిన తానై రౌద్రావేశము జూపెను. అర్జునుడును మెత్తవడెను. అపుడు శ్రీకృష్ణుడు చక్రముగొని భీష్ముని చంపెదనని రథముదూకి పోవు చుండ అర్జునుడున మరల వెంటనంటి రథముమీదికి ప్రార్థించి తెచ్చను. కాని ఆ నాల్గవజామున కూడ అర్జునుడు విజృంభింపలేకపోయెను. ఏలయన, దివ్యాస్త్రములతో తాతను జంపుట యుచితముగాదు. సామాన్యబానముల నాయన లెక్కచేయడు. తండ్రిలేని తమ్ము బెంచిన తాత నెట్లు కొట్టనగునని మెత్తబడెను. ఆనాడు మాత్రము ప్రొద్దు చూచుకొని పాండవులే ముందు యుద్ధము చాలించుకొని పోయిరి.

ఆ రాత్రి సభలో ధర్మరాజు కృష్ణునితో యుద్ధము చాలించి అడవికేగెదనని సహాయమువచ్చిన రాజులనెల్ల భీష్మున కెరవేయలేనని బెదరించెను. కృష్ణుని మాటలును ధర్మజునకు నచ్చలేదు. చివరకు భీష్మునొద్దుకుపోయి సెలవుగొని వచ్చెదనని తగుపరివారముతో తమ్ములు కృష్ణుడు వెంటరాగా భీష్ముని శిబిరమునకు అర్ధరాత్రివేళ పోయెను. ఉభయకుశల ప్రశ్నాచారముల కనంతరము భీష్ముడు - వచ్చినపనిని యేమని యడుగ ధర్మజుడు తాతా! నీవు యుద్ధములో మూడవకన్ను దాచుకొనివచ్చిన రుద్రునివలె దూకెదవు. నిన్ను జయించు ఉపాయమేమి? అని నిన్ను ప్రార్థింప వచ్చితినన, ఆ తాత ఆ మనుమని ఆదరించి రేపు శిఖండిని మధ్యనిలిపి అర్జునుడు తీవ్రముగా గొట్టిన పడిపోయెద నట్లు చేయుడని సెలవిచ్చి పంపెనేగాని తాతగారినట్లు కొట్టుటకు అర్జునుడు ఇష్టపడకపోయెను. కృష్ణుడెన్నియో చెప్పి యెట్టకేలకు బలవంతముగ ఒప్పించెను. 10వ రోజు రెండుజాములు దాటినతర్వాత భీష్ముడు సైన్యముల నురుమాడుచు దారిచేసికొని ధర్మజుడున్న చోటికి పోయి తనకు కాలము వచ్చినదనియు శిఖండి నడ్డము వెట్టి అర్జునునిచే గొట్టింపుమనియు, ఇంతియకాక మీరందరు అన్ని ఆయుధముల గొట్టి పడవేయుడనియు చెప్పెను ధర్మరాజు సెలవీయగా పాండవ సైన్యము లన్నియు నొకపెట్టున శిఖండిని ముందు బెట్టుకొని భీష్మునిదాకెను. అర్జునుడు శిఖండిని కాచుచుండెను భీష్ముని కాపాడబోవు ద్రోణుని కడ్డపడి ధర్మజుడు నకుల సహదేవుల సాయముతో నిలువ రించుటయు, తప్పించుకొనిపోలేక ద్రోణుడు తన కొడుకుతో ఇది ప్రాణములు దాచుకాలము గాదు. ధర్మరాజు మొగమున తీవ్రమగు కోపము గానవచ్చుచున్నది. ఈతనిని తప్పించుకొని నేను రాలేక యుంటిని భీష్మునకు నీవు సాయమై నిలువబడుమని చెప్పిపంపెను. శిఖండియా ఉత్సాహముతో నెదిరించినను వావి బాణములు భీష్మునకు పువ్వులు చల్లినట్లుండెను.

అపుడు కృష్ణుని ప్రేరణతో తప్పనిపని యిదియని యెంచి అర్జునుడు తన గాండీవమునుండి బాణములు శిఖండి ధనస్సును తాకుచు వాని బాణములవలె పోవునట్లు దృఢముగా వేసెను. ఆ దెబ్బలు భీష్ముడు మెచ్చుకొని అవి అర్జునుబాణములు, శిఖండివికావు. ఒక్కొక్కబాణము ఒడలెల్ల బ్రద్దలు చేయుచున్నది. అని మనుమని పరాక్రమము మెచ్చుకొనుచు విరధుడై విగతాయుధుడై పడిపోయెను. అప్పుడు రెండువైపులవారు ఆయుధములు విడచి ఆ మహాత్ముని దరకి దుఃఖితులై పోయిరి. అర్జునుడు మాత్రము ఆయుధహస్తుడై పోయెను. ఆ తాతకోరగా ఈ మనుమడు మూడుబాణములు మంత్రించివైచి భీష్ముని తలక్రింద ములుకులు మెత్తగా మోపి పిడులు నేలకాని వేరు వేర నిలుచునట్లు అంపశయ్యకు దగిన దిండువెట్టెను ఆ మహాత్ముడు దాహమని అడుగుచుండ నెందరో నీళ్ళు దెచ్చిరి. అవి త్రావనని తేజోమయాస్త్రవిన్యస్తమగు భూమినుండి వెలువడి వచ్చి తననోట జొచ్చు నీరైన త్రావెదననియు చెప్పి గంగాపుత్రుడు, అట్టివి నీవు తేగలవని అర్జునుని యడుగగా అతడవి సాధించి తాత దప్పిని మాన్చెను. అప్పుడు భీష్ముడు తన మనుమని నీవు నరుడను మునివి నారాయణ సహాయార్థమవతరించితివి. అని పెద్దలు చెప్పగా వింటిని. నీ కసాధ్యము లేదు నేనెంత జెప్పినను నినక దుర్యోధనుడు సంధిసేయక ముప్పు తెచ్చుకొనెను - అని చెప్పెను. అందఱు మాటలాడకుండ భీష్మునికి రక్షణార్థము జనులను నియోగించి ఇరువాగులవారును బోయిరి. ఇక దుర్యోధనుడు కర్ణుని దెచ్చుకొని సర్వసేనాధి పత్యమిచ్చి యుద్ధము చేయనెంచెను. గాని కర్ణుడు విజ్ఞుడగుటచే ధనురాచార్యుడు, గురుడుండ అది తనకు తగదని చెప్పి ద్రోణున కా యాధిపత్య మిప్పించెను.

భీష్ముని తర్వాత తనకు సర్వసైన్యాధిపత్యమిచ్చిరని మెచ్చుకొని దుర్యోధనునకు ఇష్టము వచ్చిన వరమిచ్చెదను, కోరుకొనుమనెను దానికి పొంగి దుర్యోధనుడు - దుష్ట చతుష్టయము ఆలోచించి ధర్మరాజును యుద్ధములో ప్రాణములతో పట్టితెచ్చి తన కప్పజెప్పుమని కోరెను. అందులకు ద్రోణుడు సంతసించి ధర్మజుని అజాత శత్రుత్వ మిప్పటికి సార్థకమైనది. నీవంటి శత్రువుడవు వాని చంపుమనక ప్రాణములతో తెమ్మంటివి! తెచ్చి యిచ్చిన ఏమి చేసెదవు? గెలిచితినని కీర్తిగొని రాజ్యమిచ్చెదవా? అని యడిగెను. వాడు గరువతనము లేనివాడు గాన వెంటనే బయటబడెను. మనము ధర్మజుని జంపిన తక్కిన నలువురు నాలుగూళ్ళు తెమ్మనెదరు. ఐదుగురును మనము శక్తిమంతులమై చంపినను కృష్ణుడు చక్రముతో అందఱ సంహరించి కుంతిచేతనైన రాజ్యము చేయించును గాని నారాజ్యము చేయుట సహింపలేడు కాన ధర్మజుని ప్రాణములతో దెచ్చిన మరల జూదమాడి అడవికిబంపిన ఎవరిని నామీదకు రాకుండ ఆతడే చేయును. నే నప్రతిహతముగా రాజ్యమేలుకొందు ననెను. ద్రోణుడు మనమున కుత్సించి - అర్జునుడు నాకన్న అనేక దివ్యాస్త్రములు శివునివద్ద స్వర్గమునుండి సంపాదించినవాడు. వాడుండ నీ పని సాగనీడు. కాన అర్జునుడు లేని సమయమున ధర్మజుడు పారిపోకుండిన ఎంద రడ్డమైనను చెండి పట్టుకొనివచ్చెదను. పారిపోయిన ఓడినట్లేగదా! అనెను. దుర్యోధనుడు ద్రోణునిచేతిలో ధర్మజుడు పట్టువడుననియే నమ్మి తన శిబిరము లంతట ద్రోణప్రతిజ్ఞ చాటింపించెను. ధర్మజు డిది వేగులవారివలన తెలిపి కొని తమ మీటింగులో అర్జును నిది యెట్లని యడిగెను. దానికి అర్జునుడు -

కం|| క్షోణీనాయక ! నామేc

బ్రాణము కలుగంగ నిన్నుబట్టికొనంగా

ద్రోణునక కాదు సగణ

స్థాణునకైనను వశంబె తలపేమిటికిన్‌||

అని చెప్పెను. ఇక ద్రోణాధిపత్యముతో యుద్ధము సాగినది. పది దినముల నుండి యుద్ధముచేయకుండ నుండిన కర్ణుడుగూడ భీష్మదర్శనము చేసి - వచ్చితి రాధేయుడ! కనువిచ్చి ననుంజూడు భరతవీరాగ్రణి! అని ఓదార్చుచుపోయి తనకు, యుద్ధమునకు సెలవిమ్మనెను. అంతనా భీష్ముడు నీవు కౌంతేయుడవు. సంధిప్రయత్నము చేయుమని అందించిన కర్ణుడు యుక్తియు కముగ మాటలాడి ఇంతకు మూలము నేను. ఇప్పుడు నేను వారిలో కలియుట వారికి, నాకును యశస్కరముకాదు మురరిపుని, పార్థుని తలంకించి పేరుదెచ్చుకొని వీరభోగము ననుభవించెద నట్లు శాపింపుమన బీష్ముడు - ఇంతకు జాలుదువే నెఱుగుదును బొమ్మని యనిచెను.

ఆవిధమున వచ్చి రెండుసేనలు సమముగా పోరెను గాని ద్రోణుడు ధర్మజు బట్టుకొనలేకపోయెను. ఇంటికీ పోవునపుడు ద్రోణుడు దుర్యోధనునితో నే జెప్పినది యిట్టిదియేగదా! అర్జునుడు దగ్గరనుండ వాని బట్టుకొన శక్యముకాదు రేపు మరొకరంగముబెట్టి వాని తొలగించిన ధర్మజు నేను బట్టెదననెను. దానికి సుశర్మాదులగు సంశప్తకు లా పని మేము చేసెదము. అంతియగాని పారిపోము, అని సంశాపములు పలుకుటచే సంశప్తకులయినవారు మరునాడు అర్జునుని మేము వేరే యుద్ధరంగముబెట్టుకొనుచున్నా మచ్చటికి రమ్ము. రాకున్న నీవు మాకోడినట్లే యని పిలిచిరి. అర్జునుడు యుద్ధమునకు ఎవరు పిలిచినను బోయెదనని ప్రతిన కలవాడగుటచే ధర్మజుని జాగ్రత్తగా నుండుమని బీమాదులతో గలిసి యుద్ధముచేయుచుండుమని సత్యజితుడను పాంచాలకుమారు జూపి యితడు బ్రదికియుండ నిన్ను ద్రోణుడు పట్టలేడు. అంత చిక్కు తటస్థించిన నీవు శిబిరమునకు బొమ్ము, తక్కువవారు యుద్ధము చేయుచుందురని చెప్పి యటువోయెను.

అక్కడ సంశప్తకులతో అర్జునునకు ఎడతెగని పోరైనది. ఇక్కడ ద్రోణునితో తక్కు పాండవపక్షమునకు తీరనిపోరయినది. అందు మూడు జాములు పోరిపోరి ధర్మజు గాపాడ భారపడిన సత్యజిత్తుని ద్రోణుడు సమయించెను. తక్కిన బీమాది వీరుల దగ్గరకురాకుండ దూరముగా తోలి వారేమియు చేయలేక చూచుచుండ ద్రోణుడు ధర్మజుని రథము పొదిని పట్టనుంకించుచుండెను. అది సంశప్తకులతో బోరు అర్జునుడు ఆరు కోసులదూరమునుండి రథవేగముతో ద్రోణుని సమీపించునంతకు బాణముల సోనలు గురియుచువచ్చి ద్రోణునకు చేతులాడకుండునట్లు చేసి ద్రోణ ధర్మజుల రథములమధ్యమున తన రథమును జొనిపెను. ద్రోణుడు నిరాశుడయ్యెను. ధర్మజు డవ్వలకు తప్పుకొనిపోయెను. అర్జునుడునవ్వుచు మామూలుగ పోరుచుండెను. ఇది యద్భుతకర్మము. ఆరుక్రోసులనుండి బాణములు కురియుట - ధర్మజుని గురుని బారికి తప్పించవలెను. గురుని మేన తన బాణముతో గాయముకారాదు. ఆరుక్రోమలసుండి, ఐదు క్రోసులనుండి యిట్లు దగ్గరకువచ్చినను ఎంత యూపుతో లాగిన తన బాణములు ద్రోణునిచుట్టు పంజరముగా క్రమ్ముకొని కాయముగాయముకాకుండ జేయగలవో ఆ ఫక్కీ ఆయనకే తెలియును. ఇంతలో నస్తమయమైనది. ఇరువాగులవారు శిబిరముల కేగిరి. దారిలో ద్రోణుడు దుర్యోధనునితో నెంత శ్రమపడినను చేతికిచిక్కు వేళ కర్జునుడు రానేవచ్చెను. ఏమి చేయుదుము? రేపు నిట్లే రెండవరంగము బెట్టింపుము నా ప్రతిన నెరవేర్చుకొన యత్నించెదనని చెప్పెను. ఆ రాత్రి గడవ మూడవనాడు మామూలుగా అర్జునుని సంశప్తకులు బిలిచికొనిపోయిరి. ఇక్కడ ద్రోణుడు కౌరవసేనల పద్మవ్యూహముగ బన్నించెను. ఆ వ్యూహము జూచి పాండవపక్షమువారు దిమ్మరపోయిరి. దాని భేదింపనేరక వారు దూరముగా తమ మోహరము త్రిప్పుకొని పోయి ఆలోచించుచుండిరి. అప్పుడు ధర్మజున కొక ఆలోచనము కలిగినది. ఈ వ్యూహ మర్జునుడు, కృష్ణుడు ప్రద్యుమ్నుడు, గాక ఒరులు భేదింపలేరు. వారిలోవాడుగాన అభిమన్యుడు చిన్నవాడైనను దారితీయగలడు. వాని ముందుబెట్టుకొని మనమెల్ల వాని గాపాడుచుపోయి యీనాటి భండనము గెలువవలెను. మనమందరము గాపాడుచుండ సహజ విక్రముడగు అభిమన్యునకేమి లోటు అని తోచుటతోనె ధర్మరాజు వాని బిలిచి సాంత్వనముగా చెప్పెను. అభిమన్యుడు నది తనకు కీర్తికరమగు పనియని యొప్పుకొనెను వాని సారధి యనుమానించుచున్నను వాని బదరి అభిమన్యుడు ద్రోణపాలితమగు పద్మవ్యూహము లెక్కచేయక ఎదిరించి పోయెను.

ఆ|| మెఱుపు మెఱసినట్లు మెఱయించి యరదంబు

కర్ణికార కేతు కాంతివెలుగ

అంబకముల గురుని నలయించి మించి యిం

ద్రజుని కొడుకు మొగ్గరంబుసొచ్చొ|| (తిక్కన)

అట్లుపోవు అభిమన్యు చుట్టుకొనిపోవు పాండవవీరుల సైనికులతనికి ప్రాపుకాకుండ ఒక్కనా డర్జునుడు లేనితఱి తక్కు పాండవుల గెలుతునన్న శివుని వరమున సైంధవుడు నదికికొండవలె నడ్డమువచ్చెను. కాన నెవ్వరు వానికి తోడులేకపోయిరి.

అభిమన్యు డొక్కరుడు పద్మవ్యూహముజొచ్చి చించి చెండాడి మూడుజాములు ఒక్క చేతిమీద కౌరవులనెల్ల నాపి విక్రమించుచుండ వానిచే దెబ్బలుతిని యోడిపారిన కర్ణుడు గురునిచేరి - ఈ అర్జునపుత్రుడు తండ్రినిమించి మన సేనల నేలకు గోలకు తెచ్చుచున్నాడు. అర్జునుతో పోరెరుగుదము కాదే! వాని చేయింత బెట్టిదమ్ము కాదు. వీని నెట్లుగెలువ వచ్చుచునని వాపోయిన నా యాచార్యుడు ధర్మసమరమున వీని జయించుట యరిది. అధర్మమనక పలువురుచేరి మాయ యుద్ధమున చేతిలో ధనువు విరిచి, తర్వాత చూచుకొందమని యనుటయు, కర్ణుండు అతని కభిముఖముగా పోయి దెబ్బలుతిని పారిపోయినట్లు పోయి ఆవలగా వెనుకకువచ్చి శరవైభవమున నతనివిల్లు నరుకుటయు, భూరిశ్రవుడు వాని గుఱ్ఱముల చదియ మోదెను. తక్కినవీరు లందరు రథమును, సారధిని, సర్వపరికరము నుగ్గునూచ మొనర్చిరి. ఒక్క ధనుస్సుతె గెలిచివచ్చెదనని ద్రోణుని పద్మవ్యూహము సొచ్చిన ఏకవీరు డింకొక విల్లులేమి గదగైకొని ప్రద్యుమ్నుని చెప్పిన విద్యాబలమున ఆకసమున కెగసి నాలుగుగడియల సేపు విహరించి క్రిందికివచ్చి ఒక్కొక్కరి గొట్టుచు పైకిపోవుచు మునుపటి కన్న కౌరవుల కాందిశీకుల నొనరించి అశ్వత్థామ రథముమీద దూకి ఆయన పారిపోగా అందున్న ఆయుధముల నెత్తుకొనిపోయి సూర్యుని చూచుచు ఇంక నిట్లే నాలుగుగడియలు గడిపిన ఇంటికి పోవచ్చునని ప్రతీక్షించు చుండ అప్పుడే సుఖముగ వీరపాణాదులతో తృప్తుడై వచ్చిన దౌశ్సాసని గదగొని, ఆకసమున కెగసి వానితో పోరాడి యిద్దఱు నిలకువచ్చి గదా యుద్ధముచేసి అన్యోన్యఘాతములతో ఇద్దఱును మడిసిరి. ఒక్కని బాలుని అన్యాయముగ నిట్లుచేసిన మీరు రేపు అర్జునుచే నొక్కడును బ్రదుక బోరని ధర్మజుడు పెద్దగా నరచెను. పాండవవీరులు ఆ దినశేషము నట్లే గడిపి, అస్తమయమైన యుద్ధము చాలించి శిబిరముల కతి దుఃఖముతో నరిగిరి. కౌరవులు సంతసముతో బోయిరి. ధర్మజు డింటికిపోయి యభిమన్యునిగూర్చి దుఃఖించుచుండ వ్యాసభట్టారకుడు వచ్చి దుఃఖశాంతిగా చెప్పిన తనదుఃఖము వీరుడై చచ్చిన అభిమన్యునికొఱకు గాదనియు, అర్జును రక్షించుకొనుట కొఱకనియు చెప్ప, అట్లయిన మేలని నీవే జయింతువని చెప్పి అంతర్థానమునొంది పోయెను.

అర్జునుడు సంశప్తకులతో పోరిపోరి సాయంకాలము తిరిగివచ్చుచు నపశకునముల నాలకించి ధర్మరాజును ద్రోణుడు పట్టుకొనెనేమో? అని శంకించి యడుగగా ధర్మరాజు సుఖముగానే యున్నాడుగాని, మనకు నింక నేదియో అమంగళము జరిగినట్లు తోచుచున్నది. అని చెప్పు కృష్ణుని మాటలతో మరింత దుఃఖము వొడమ నట్లేవచ్చి యేడ్పు మొగములతో తన కగబడకుండ తప్పించుకొను పరిజనులజూచి, ధర్మరాజు డున్నచోటికి వచ్చి, అచ్చట అభిమన్యుడు లేకుండుటకు వగచుచు, నన్న నడిగి తెలుసుకొని, నేను లేనివేళ నా కొడుకు నొక్కని కాపాడలేకపోయితిరి. మీ రాయుధము లలంకారార్ధము దాల్చితిరికాని, అభిమానమునకు కాదని తన యోధుల నిందించి, ధర్మరాజుచెప్పగా అభిమన్యునకు తాతోడుపోకుండశివునివరమున నుదీర్ణుడవు సైంధవు డెల్లవారి నానాడాగుట విని కోపించి అట్లయిన రేపు సూర్యుడస్తమింపకమున్నె ఆ సైంధవు తల తరిగెదను. అట్లు చేయలేకపోయిన గాండీవముతో నే నగ్నిలో ప్రవేశించెదనని ప్రతిన సేనెను. దుఃఖము కోపముగా మారినది. దానికి కృష్ణుడు నాతో నాలోచింపకుండ ప్రతినసేసితివి, ఆ వైపుననున్న ద్రోణాదులు మనను చంపనిచ్చెదరా! ఇది దుర్ఘటమని చెప్పి అర్జునుని డేరాలోని కతని తీసికొనిపోయి శరములు మంత్రించి చుట్టునుబెట్టిన మంటపమునచేర్చి నీవు ప్రతిదినము చేయు శివపూజ నొనర్పుమనెను. అర్జునుడును కృష్ణుని గూర్చుండబెట్టి శివపూజ చేసెను. వాని నిద్రింపుమని చెప్పి తాను తన డేరాలోనికేగి దారుకుడు పాద సేవ చేయుచుండగా పవ్వళించి నిద్రరాక దారుకునితో వచ్చిన కార్య వ్యతిక్రమమును జెప్పుచు, రేపు నాకు అర్జునునెడగల స్నేహమును లోకము గుర్తింపవలెను. ఎట్టు లేచెదనొ చూడుము! దారుకా! నీనీ గుర్తుగ శంఖమూదినపుడు నీవు మన రథమును వ్యూహములోనికి దేవలెను జుమీ! అని వానినే పల్లెయనిపించి రాత్రి నిట్లు గడుపుచుండెను. అర్జునునకు ఒక కలవచ్చెను. అందు తానును, కృష్ణుడును ఆకాశగమనమున కై లాసమునకేగి తాను కృష్ణునియందు పూజించిన పూవుల నా శివునినెత్తిన జూచి యచ్చెరుపడి, శివుని ప్రార్థించి, ఆ దేవు నానతితో నొక కొలనులోనున్న శివుని ధనుర్భాణముల దెచ్చి శివాజతో నొక కుమారుడు చూపింప, పాశుపతము ప్రయోగించువైఖరి క్రొత్తచేసికొని ఆ విభు డుపదేశింప మంత్రాదికము విని తదాశీః ప్రసాదమున ప్రసన్న మనస్కుడై, వచ్చినట్లు తోచెను. అప్పటికి తెల్లవారవచ్చినది. ఆ శుభసూచనమున నా వీటివారెల్ల నుల్లాసముతో నుండిరి.

ఇక కౌరవుల స్కంధావారములో అర్జునుని ప్రతినవిని అందఱు వ్యగ్రులుగ నుండ సైంధవుడు కంపనపడ్డ కాకివలె నటమటించి దుర్యోధనునితో నే నొక్కడనే తన కపకారము చేసితినా! అర్జునుడు నన్ను జంపబూనెనట. వాని ప్రతిజ్ఞకడ్డుపడువారు ముల్లోకముల లేరు నేను కనబడకుండ నా దేశమున కేగెదనన, స్వకార్యపరుడగు దుర్యోధనుడు వాని ద్రోణునికడకు గొనిపోయి, పర్యాలోచనము చేయగా నా గురుడు నేనొక వ్యూహముపన్ని నిన్ను అర్థునుడు చేరరాకుండ నాపెదను, యుద్ధరంగము విడిచి పోవలదు. అదిగాక పిల్లలగని పెద్దవాడవై పుణ్యపాపముల నెల్ల ఆరితేరిన నీకు పారిపోవు టుచితమా చచ్చినను, బ్రతికినను కీర్తి చాల గలదని బోధించెను. ఎట్లయిన అర్జును ప్రతిజ్ఞ చెఱచిన నతడు సులభముగ అగ్నిబడి చచ్చును. వానితో గూడ తక్కిన పాండవులు పోదురని ఆ ప్రయత్నమున నుండిరి. కాలకృత్యముల దీర్చుకొని ఇరుగువాగును యుద్ధరంగమునకు నడిచిరి. ద్రోణుడు ముందువైపున శకట ప్యూహము, వెనుకవై పున అర్ధపద్మప్యూహము నదుకువేసి, ముందు బండిపోలునుంచి డొలుపుమధ్యమువరకు సూచీవ్యూహము సూదిమాదిరి బారుగా నిలిపి, సూది బెజ్జము బండిడొలుపు మధ్యనుండు మేకు వెనుక పద్మవ్యూహము, మధ్య కర్ణికా నొక్కటిగా ముడిపెట్టి పదిక్రోసులు వెడలుపు, పన్నెండు క్రోసులు పొడవుగా దేవతలకు జూడరాని ఆశ్చర్యకరమగు మహావ్యూహము బన్ని మధ్యమున సైంధవు నునిచి వానిచుట్టు అశ్వత్థామ, కర్ణాదుల పదిరథముల వారి నిలిపి, తాను ద్వారమున నిలిచి అభేడ్యముగ యుద్ధము సాగించెను.

ఆ వ్యూహమును జూచి దేవతలు ఆశ్చర్యమగ్నులైరి. అర్జునుడు తనకు తోడువచ్చెదనను సాత్యకిని ధర్మరాజు గురునిచే పట్టుబడకుండ కాపాడుమని పనిచి, కృష్ణసారధికమగు తన రథమును వ్యూహాభిముఖముగ నడుపుచుండ, దర్మర్షణుడు గజసేనలతో నటకువచ్చి అర్జును నేనొక్కడనే నేడు నిలిపెదనని ఎదిరించి వానిచే హతసైన్యుడై, దెబ్బలుతిని ద్రోణుని చాటునకు పారిపోయెను. ఇక కృష్ణుడు తన రథమును ద్రోణున కభిముఖముగా నడిపెను. ద్రోణుని జూడగనే అర్జునుడు గురువు నెట్లు కొట్టుదునా! అని మెత్తబడి కృష్ణుననుమతి చేతులు జోడించి భక్తితో పలికెను.

ఉ|| మేలుదలంపు శోభనము మేకొని చేయుమునాకు పాండుభూ

పాలుని ధర్మనందనుని పంకజనాభుని యట్లకావె? మ

త్పాలన వత్తికీవు నిను ప్రార్థనచేసి భవత్ప్రసాద లీ

లాలసితుండనై మొనదలంకగ జొచ్చెద భూసురోత్తమా.

అని నన్ను, అశ్వత్థామను ఒక్కవిధముగ జూచి, పెంచి విద్యల శిక్షించితిని. అనఘా! నాకు ద్రోహముచేసిన సైంధవుని గూర్చి చేసిన నా ప్రతిన మెట్లు నెరవేరునో యట్టి యుచితము నాలోచింపు మనెను ద్రోణుడు నవ్వి, నన్ను గెలువక ఎట్లు వ్యూహముజొచ్చెదవు; యుద్ధము చేసి పొమ్మనెను. ఐనను అర్జునునకు తెంపు గలుగలేదు. అట్లయిన మీరు ముందుగా నామీద బాణములు వేయుడు, నేను తర్వాత వేసెదనని, మెల్లగా, యుద్ధమునకు దిగియు, మోమోట మెనయుచున్న కిరీటి నుపలక్షించి కృష్ణుడు ద్రోణునకు ప్రదక్షిణముగా రథము త్రిప్పుచు, వెనుకకు పోయినప్పుడు ద్రోణుని విడిచి వ్యూహములోనికి రథము తోలెను. ద్రోణుడును అర్జునా! అర్జునా! ఇది యేమి; శత్రువుల గెలువకయే సుప్రతిష్టుడవు కాదలచితివా! అని వెనుకనుంచి బాణములు కొట్టుచు, వెంబడిపడెను. నీవు గురుడవుగాని శత్రువుడవా; నీ యొద్ద ఓడినను మాకు ప్రతిష్ఠయే యనుచు ముందుసైన్యముల నఱికివేయుచు, కృష్ణుని సారధ్యము నేర్పున, తన శరలాఘవముతో కొంతదూరమేగిన తర్వాత ద్రోణుడీ సందున నందఱు వ్యూహమున జొచ్చిన ప్రమాదమగునని ద్వారము కాచుకొనబోయెను.

అప్పుడు కృష్ణుడా వ్యూహము పన్నిన గురుని నేర్పు మెచ్చుచు అర్జునా! వ్యూహము చూచితివా యనెను. అర్జునుడు ఇదియొకవ్యూహము కాదు. ఇచ్చట శకటవ్యూహములో సూచీవ్యూహ నమర్పబడినది ఇంక ముందుముందేయే వ్యూహలక్షణముల నదికెనో అక్కడక్కడ తెలిసి కొని జాగ్రత్తగా నడుపవలెననెను. అత్యంత వేగముతో నరనారాయణుల ఆ రథము సూచీవ్యూహము, శకటవ్యూహము ఛేదించుకొనుచు, లెక్కలేని వీరరధికుల నెల్ల సాధనములతో నాశనముజేయుచు పోయి వెనుక నంట వేసిన అర్థపద్మవ్యూహమును జూచి మెచ్చుచు అచ్చటికి తగిన విధమున ప్రవ ర్తించుచుండ, అర్జునునితో నారాయణుండు ద్రోణాదులగు వీరుల శరములు శరీరములనిండ నాటి గుఱ్ఱములు డప్పినొందియున్నవి. ఇవి వెన్నుమునుగు నీరిలో నాప్యాయన మెనయవలెను అంత జలము లేకున్నను త్రాగుటకైనను నీరులేకున్న నేడు నిన్ను గెలిపింపలేవు అనెను. దానికి నవ్వి అర్జునుడు బావా! ఇవిగో జలములు అని చెప్పుచునే అంతలో నొక బాణము నేల బగులగొట్టి ఆ సందున నెగసిన జలధారకు చుట్టు కట్టివేసి, అది చెరువుచేసి పైన బాణములతో నిల్లుగట్టి చూప కృష్ణుడు గుఱ్ఱములను రథమునుండి విడిచి యా చెరువులోదించి ఒడలిబాణములుపీకి, మాలీసుచేసి, నీరుద్రావించి, దివ్యాస్త్రముతోవచ్చి జలమువెంబడి నప్పుడే మొలచిన గ్రాసముమేపి, తెచ్చి రథమునకు గట్టెను ఈలోపల అర్జునుడు రథము, లేకుండ ఒక్కడు క్రింద నిలిచియున్నాడు గదా యని దానిపైబడిన సైన్యములెల్ల వానిచే నుగ్గునూదమగుచుండెను. అప్పుడుల్లాసభాసురముఖుడై యర్జునుడు రథమెక్కెను.

అప్పు డచ్చట రాజులెల్ల శాత్రవుల మహావ్యూహములోనికి ఒక్కరథముతో తోడులేకుండ వచ్చి పైబడు శాత్రవుల లెక్క సేయక, చెఱువు త్రవ్వి గుఱ్ఱములకు మాలిసుచేసి, సారధి మరల రథమునకు గట్టువరకు నేలనుండి ఎఱుగనట్లు వచ్చిన చతురంగసైన్యముల నుగ్గుసేయుచు, ఈ రథమెక్కిన వీరుడింక నెవరికి సాధ్యుడగును! వీనిచే సైంధవుడు చావక బ్రదుకునా? వీరలు శత్రుమధ్యముననున్నట్లులేదు. ఆడువారిలో నాటలాడుచున్నట్లున్న దీ మహాయుద్ధము - అనిరి. అట్లు త్రోచినడచి పద్మవ్యూహము ఛేదించుకొని కర్ణికవద్దకు పోవునంతకు నచ్చట సైంధవునకు కాపుగానున్న సైన్యములు వెలుకపాఱి విన్నబోయెను. చుట్టునున్న కర్ణాదు లాదరముతో సైంధవు కాచుచుండిరి. ఆ సందున సైంధవు వరాహధ్వజము దూరముగా నున్నట్లు చూచి అర్జునుడు - ఇడుగో వీడే సైంధవుడు! అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవుడు, ముఖ్యులుగా పదిమంది వీరరధికులు పోటుమగలు గాన వీనిచుట్టు కావలియున్నారు. వీరేమి కావగలరు? ఇంక ఈ సైంధవుడేమి బ్రదుకును? సైంధవునితల క్రిందపడకముందు సూర్యమండలమును బోనిచ్చెదనా! అంత యవసరమైన బాణపంజరములో సూర్యుని బిగించి సైంధవుతల నఱికెదననెను. అప్పుడు ఘోరముగా ననేక సైన్యములతో మహావీరులతో కృష్ణునకు, అర్జునునకు చేతులు కాళ్ళు ఆడనియంత మహాహవము సాగెను. ఈ లోపల దుర్యోధనుడు హుటాహుటిగా ద్రోణుని వద్దకువచ్చి గురుడనియు జూడక అనరాని మాటలని రాత్రి నమ్మకముగా చెప్పుటబట్టి మేము సైంధవుని యుద్ధరంగమునకు దెచ్చితిమి. లేకున్న నింటంబెట్టి వచ్చువారము. వ్యూహము గట్టిగ బన్నిన నేమి లాభము? అర్జును వదిలితివి. అతడు వ్యూహమంతయు చెల్లాచెదురుచేసి, సైంధవుని యొద్దకు చేరినాడు. నీవు పాండవపక్షపాతివి. అర్జునునకు సైంధవు నప్పగించి నింత చేసితివి - అన ద్రోణుడు చిఱ్ఱరేగి పాండవుల శరవేదనతో నా యొడలు మండుచుండ నీవు మాటలతో నొప్పించవచ్చితివా? అర్జును శక్తి యెఱిగి నీవిట్లనవచ్చితివా! ఇంతయగునని నేను భీష్ముడు చెప్పినను వినక సంధి చెఱిచి చావుదెచ్చుకొంటిని. పాండవులు మిక్కిలివారు నీవు తలచినంత సులభమా! వారిని గెలుచుట, నీవు దుష్టుడవు. నీ పక్షములో చేరుటవలన నాశక్తి యడగారి పోయినది పొమ్మని విధిలించిన, అతడు మెత్తబడి వేడుకొన నొక కవచము నభిమంత్రించి తొడిగి, పోయి అర్జునుతో పోరాడుము. వాని బాణములు నిన్నేమియు చేయవు. సైంధవుగాపాడుకొనుమని పంపెను. ఆ మదముతో దుర్యోధనుడు అర్జును నెదిరించి నీవు పాండురాజునకు నిజముగా బుట్టిన, పారక నిలువుమని పోరాడజొచ్చెను. అర్జునుబాణము లా కవచము భగ్నముచేయలేక మిట్టిపడజొచ్చెను. సర్వకవచ విచ్ఛేదిని యను నస్త్రము అర్జునుడువై చిన సర్వాస్త్రవిచ్ఛేదిని యను అస్త్రమున దానిని అశ్వత్థామ నఱకెను. అప్పుడు అర్జునుడు ఉపాయశాలిగాన కవచములేని అరచేతులలో ప్రకృతి బాణములు జొనుప, వాని ముంజేతులుచాచి, తీపుపుట్టిన దుర్యోధనుడు ఆ కవచము నూడదీసి పారవైచి ద్రోణుని దిట్టుచు వెనుకకొదిగెను.

ఇట్టి ఘోరయుద్ధమున అర్జును డేమిచేయుచుండెనో? ఒక్కరథమే పోయెనని చింతించి ధర్మరాజు పంపగా సాత్యకి, ద్రోణుని దారి యిమ్మని ప్రార్థించి వానిచే నాక్షేపింపబడినవాడై ముఖమున జొరబడలేక ప్రక్కనున్న ఒక సైన్యమును నఱుకుచుబోయి, దారినబడి అర్జునుడు పోయిన త్రోవన సూచీవ్యూహముననున, శకటవ్యూహమున ననేకుల జంపుచు, దాటి పద్మప్యూహముననున్న యర్జునునకు దాదాపు దగ్గఱకుపోయెను. ఈ లోపల సాత్యకిచే దెబ్బలుతిని యోర్వలేక దుశ్శాసనుడు పారిపోయి ద్రోణుని వెనుక నొదుగ నా ద్రోణుడు ఏమి! యువరాజ విభునకు సేమమే! సైంధవుని యేమిచేసె నరుడు నీవీ మనుజేతులతో నిటు లేమిటికి తిరిగివచ్చి తని-అడుకులు తిన్నప్పుడున్న యానందము కడుపున కుట్టెత్తినప్పుడుండునా? పాండవులు నాడు దయలేక అట్లు పఱచితిరి. ఇప్పుడొక సాత్యకి చేతనే ఉడిగిమడగవలసివచ్చెను. భీమార్జునుల బారిబడిన నేమయ్యెదవో? ఇంకనైన నన్నతో నాలోచించి పాండవుల కైదూళ్ళయిన నిప్పింపుము. కానిచో మీ కొఱకు ప్రాణము లఱచేతిలోబెట్టుకొని నీకు సహాయముచేయ వచ్చిన రాజుల వెంటగొని, చావుకుతెగించి వారితో దాకుము - అని నిష్టురములు పలికి కుత్పించిన నతడేమియు ననక మరలిపోయి, సాత్యకిచేత మరల తన్నులుతిని ఇంకొకవైపున కొదిగెను. అట్లుపోవు సాత్యకితో భూరిశ్రవు డెదిరించెను. సోమదత్తుడు శివునివరమున తన్ను పరాభవించిన శిని, సత్యకుడు నప్పటికి లేకపోవుటచేత నా శిని మనుమడగు సాత్యకిని పరాభవింపగోరి, కన్నకొడు కగుటచే నట్టికాలమువచ్చి తీవ్రముగా పోరెను.

కొంతసేపటికి నిద్ధరును విరధులై మల్లయుద్ధమునకు జొచ్చి పెనగునపుడు సాత్యకిని క్రిందబడవైచి, భూరిశ్రవుడు వాని ఱొమ్ముత్రొక్కి, కత్తిదూసి వీనినాలుక గోయుదునని ఎడమచేతితో వాని నాలుక బట్టుకొనెను. దీనికొఱకే రాత్రి కృష్ణుడు దారుకునితో నన్ని మాటలుచెప్పి గుర్తుగ పాంచజన్యము నూదినపుడు తన రథమును దెమ్మని చెప్పియుండెను. ఇప్పుడు కృష్ణుడు భూరిశ్రవునిజంపి, నీ శిష్యుడు నీకొఱకింత కష్టపడి యొక్కడు ఇంత వ్యూహములో సాహసించివచ్చిన సాత్యకిని కాపాడుమని చెప్పి ఈ దుర్మార్గుడే నిన్న చేతిలో నాయుధములేని అభిమన్యు గుఱ్ఱముల నన్యాయముగా జంపెనని అర్జునునకు నీ సెక్కజెప్పెను. దానికి అర్జునుడు ద్వంద్వయుద్ధములో నొకనిమీద రెండవపక్షమువారు ప్రహరింపరాదు. అయిన చూచుచు శిష్యుని చావనిచ్చెదనా? యని పలికి కృష్ణుడు తొందర పెట్టినను తొందరపడక వాని జంపకుండ కత్తితోనున్న వానిచేయి మాత్రము నఱికి సాత్యకిని కాపాడెను. భూరిశ్రవుడు విఫలప్రయత్నుడై తన్నుదూఱిన నర్జునుడు నిన్న అభిమన్యున కతడుచేసిన అన్యాయమును వాక్రుచ్చి నిరుత్తరు జేసెను. సాత్యకి తప్పించుకొని యింతలో లేచివచ్చి భూరిశ్రవు కంఠము నఱికెను. కృష్ణుడు శంఖమూద దారుకుడు తెచ్చిన రథము సాత్యకికి నిచ్చిన దానినెక్కి సాత్యకి విక్రమించెను.

ఇంతలో ధర్మజుడు భీమునంపెను. భీముడును ద్రోణుని దారియడిగిన ద్రోణుడు పరిహసించుచు - అర్జునుడు మ్రొక్కిపోయెను. సాత్యకి యర్ధించిపోయెను. నీవు మొనగాడవుకూడ దారి యిమ్మని యడిగెదవు నే నిక్కడ నెందులకుంటి ననుకొంటివి? అని యెత్తిపొడిచిన భీముడలిగి, అర్జునుడు దేవరాక్షసవ్యూహములోనైనను నఱికికొనిపోవునుగాని, తగులు వడువాడు గాడు నీకు, నాయనకు నేమి మొగమోటమో అది యట్లుంచుము. నీవు గురుడవైన స్వేచ్ఛగా ఇంటికివచ్చిన భోజనము పెట్టెదను కాని, శత్రువునకు జయ మీయవచ్చిన నిన్ను క్షమించెదనా? చూడుమని యొక గదత్రిప్పి విసరివైచిన నది యసాధ్యమని ద్రోణుడు ముసలివాడయ్యు భయమున రథముదుమికి పారిపోయెను. ఆ గదతో ద్రోణుని రథము, గుఱ్ఱములు, సారధిసర్వము నుగ్గునూచమయ్యెను భీముడు వ్యూహములోజొచ్చి అర్జునుడు, సాత్యకి నఱుకుచుకొనుపోయిన దారిన రథముతో నేగుచుండ వానికి భయపడి అందఱు దారియిచ్చి తొలగిరి. ఆ విధమున పోవు వానికి యింకొకరథము నమర్చుకొని, ద్రోణుడు మరల నడ్డము వచ్చి తీవ్రముగా కొట్టెను. దానికి కనలి భీముడు నిరాయుధుడై రథము దిగి ద్రోణుని బాణముల లెక్కసేయక పోయి ద్రోణుని రథము నెడమ చేతితో నొగలుపట్టి విసరివైచిన ఆ రథము గుఱ్ఱములతోకూడ కురుక్షేత్రమెల్లదాటిపోయి యెక్కడనో పడెను. ద్రోణు డీలోపల నెట్టులో రథము దూకి ప్రాణము దక్కించుకొనిపోయి యింకొకరథమునెక్కి ద్వారభూమికి పోయెను. అట్లువోయిన భీముడు సింహనాదము చేసిన గుర్తుతో అర్జున సాత్యకుల క్షేమమును భీముని గెలుపును నెఱిగికొని సంతసించెను.

తరువాత భీమునిచేత పదునొకండు మార్లు ఓడిపారిన కర్ణుడు పండ్రెండవసారి యెదిరించిన భీముడు తన రథము దిగిపోయి కర్ణుని రథమెక్కిచూడ నతని కగపడకుండ కర్ణుడు రథము బల్లక్రిందదూరి ప్రాణము కాపాడుకొని భీముడు పిరికిపంద! పొమ్మని రథము దిగి తన రథమున కేగుచుండ, తాను విల్లుగొని భీముని రథము నఱికి విరధుడగు వానితో యుద్ధముచేయ నతడు వాని బాణములకు యుద్ధములో తెగిపడియున్న మొండెముల నడ్డమువైచి పోరిపోరి, యనియు లేమి నప్పుడును పారిపోకయూరక నిలువబడెను. అప్పుడు కర్ణుడు వాని తన ధనుస్సుతో కడుపు పొడుచుచు తిండిపోతా! నీకీ యుద్ధమేల? కడుపునిండ తిండితినుచు నింటియొద్దనే యుండుము. అట్లుండలేకపోయిన నీవు తగినవారితోపోరుము. నావంటి వీరులపైకి రాకుము అనెను. భీముడు రోసమున రోజుచు వాని చేతిలో విల్లు లాగి విఱచిపైచి అర్జునుని ప్రతిన తలచి విడచివైచిన బ్రదికితివి పొమ్మని, తానర్జునుని దరికిపోయి కర్ణుడు నన్ను పరాభవించెను. నీ ప్రతిజ్ఞ తలచి వాని వదలితిని. నీవు వాని జంపెదవా? నన్ను వాని జంపుమందువా? అని తీవ్రముగా నడిగెను. అర్జునుడీ ప్రతిజ్ఞ యిట్లుండ నదియు నిప్పు డెట్లు చెప్పబడును. కొంచె మోర్చుకొనుము అని చెప్పుచు ఎదురైన కర్ణుని విరధునిచేసి యొడలెల్ల చిల్లులు పొడిచిన పారిపోవు కర్ణునితో - పదునొకండు పర్యాయములు భీమునిచేత నోడి పారిన నిన్నెవ్వరేమనిరి? ఎప్పుడో ఒకసారి వీరులకైన నోటమి వచ్చును. అంతమాత్రమునకు భీము నేమంటివి. తులువా! నీ కులము, గొనము తోచెంప్రజకుర - అని తిట్టి తరిమెను. దానికి భీముడు సింహనాదము చేసెను. ఇంతలో నిశోకుడు మఱొక రథము తయారుచేసికొని రాగా భీముడది యెక్కెను. ఇట్లు భీముడు సాత్యకి యటునిటు సహాయము చేయుచుండ నర్జునుడు దశరథముల వీరులతో పోరుచు సందుచూచి సైంధవుని పరాహధ్వజము నరికి పడవైచెను. దాని కచ్చటి యందరు భయపడి యర్జును గ్రమ్ముకొనిరి.

అప్పుడు కృష్ణుడు అర్జునా! ప్రొద్దుక్రుంక వచ్చుచున్నది. ఈ పదిరధములవారు మనకవకాశ మీయకున్నారు. కాన నేనొక మాయచేసి సూర్యుడు కనబడకుండ చేసెదను. అప్పుడు పొరబాటున కనబడిన సైంధవు తల నరికి ప్రతిన దీర్చుకొనుము. తర్వాత సూర్యుడగపడును అని చెప్పెను అర్జునుడు - ఇంకను రెండుగడియల ప్రొద్దు కలదు. జెండా నరికితిగదా! వీని తల నింతలో నరికెదను. నా పరాక్రమమునకు అప్రతిష్ఠ తేకుము. అని యనుచుండగనే వినక కృష్ణుడాపని చేసెను. అందరు అర్జునుడిక చచ్చునని పడమర సూచుచుండ దారిలో గొంతెత్తి సూర్యాస్తమయము చూచుచున్న సైంధవు తలను జరికాస్త్రమున నర్జునుడు నఱికెను కృష్ణుడు దాని క్రింద బడనీకు మనెను. అర్జును డా తలను బాణములతో నిలువుగా నడ్ఢముగా నాకాశమున ద్రిప్పుచు కసితో పైబడిన పది రథములవారితో, వారి సైన్యములతో పోరుట అత్యాశ్చర్యముగ నుండెను. ఇంతలో సూర్యు డందఱకు కనబడెను. పైబడిన సైనికుల పలచనచేసి అశ్వత్థామ కర్ణాది వీరుల నోడించి యర్జునుడు సైంధవు తల నింక నెంత సేపు పైననే త్రిప్పవలెనని యడుగగా కృష్ణుడు వీని తండ్రి వృద్ధక్షత్రుడు వీనికి రాజ్యమిచ్చి తపమునకు పోవువేళ నాకాశవాణి నీని తల శాత్రవులచే నాకస్మికముగ తునుమబడునని చెప్ప నటులైన వీని తల క్రిందవైచిన వానితల వెంటనే పగులగలదు. అని శపించిపోయెను. కాన అది శమంతపంచకము నొద్ద తపముచేయుచున్నవాని చేతులలో బెట్టిన క్రిందవైచిన శపించినవాడే చచ్చిన మనకు ముందుగూడ ప్రమాదము లేకుండును. ఆపని పాశుపతముగాక మరియొక అస్త్రమేదియు జేయలేదు. అమ్మహాస్త్ర ముపయోగింపు మనెను. అర్జును డట్లు చేయుటయు ఆ పాశుపతాస్త్రము వానితల బట్టుకొని బాణపరంపరాకారముగ పోయి యర్ఘ్యమిచ్చుచున్న వృద్ధక్షత్రుని దోసిలిలోబెట్ట వాడు చూడక వెంటనే క్రిందబడ వేసి తనతలయు బగిలి చచ్చెను. దానివలన అతడు మరల నింకొకశాపము బెట్టునను భయము లేకుండపోయినది. చూచువారెల్ల ఇందఱతో యుద్ధముచేయుచు నా శిరమును బంతివలె ఆకాశమున త్రిప్పనేల? చివరకది యెక్కడవైచెను? ఇంత యుద్ధమున వీరులు వానికి లెక్కగా లేదు. కృష్ణార్జునులకిది యాటగా నున్నది యని యాశ్చర్యమందిరి. అంత భీమార్జున కృష్ణ సాత్యకులు పోయి ధర్మజు దర్శించి నమస్కరించి జరిగిన వృత్తాంతము సెప్ప నాత డానంద బాష్పములతో నేను ధన్మాత్ముడనని వారి నందఱ గౌగలించుకొని గౌరవించెను.

ఇక దుర్యోధనుడు ద్రోణునికడకు పోయి యేడ్చుచు దిట్టి నీవు కప్పవలె నఱచు పామువు. నీవలన నష్టపడితిని. ధర్మజుని బట్టెదనని యబద్ధమాడితివి. సైంధవు గాచెదనని యర్జునునేకాక వానికి తోడు భీమసాత్యకులను బుచ్చి దుష్ప్రవేశమగు వ్యూహము పన్నియు లాభము లేకుండ చేసితివి. అని గురుని అనరాని మాటలని ఇంతియగాక నీవు యుద్ధము చాలించుకొని పొమ్ము. కర్ణునకు సేనాధిపత్యమిచ్చి పాండవుల గెలిచెద ననెను.

దానికి ద్రోణుడు నదిరిపడి ఎదురేడ్చి - ఏమి చేయుదము? పాండవులట్లు కాననమునకేగి నీవల్ల కష్టపడెనని తమంద రెరిగినదియే. ఆ దురితమింత చేయకుండునా! అది యటులుంచుము. పాండవుల వ్యూహము నెల్ల నాయొక్క చేతిమీద నాపి ప్రొద్దుకుంకు నంతవఱకు నెడతెరిపిలేకుండ శ్రమపడి పోరియు అగుణజ్ఞుడవగు నీచే మాటపడితిని. వారి యాయుధములు శరీరము మండించుచుండ నీ వొకవైపున ళరీరమే కాక యంతః కరణమును మండించుచుంటివి. అర్జును గెలువశక్యము కాదని మునుపే చెప్పలేదా? ఇంతమందిని రాకుండ నిలిపితినిగదా! వచ్చిన ముగ్గురివి నీ కర్ణుడు నీవు, నీ సైన్యములు గెలువలేకపోయితిరి. నా యనంతరము నీపాటు నీవు పడెదవుగాక పొమ్ము. నేనీరాత్రికూడ యుద్ధము చేసెదను, పాంచాలుర నెల్ల జంపినగాని కవచము విడువము. దివిటీలు వేయించు యత్నము సేయుమని చెప్పి నాచేత దెగని పాంచాలురున్న వారి నిశ్శేషము సేయుమని నాకొడుకునకు చెప్పుమనెను. ఆ మాటలు రుచింపక పోయి కర్ణునితో నిదియంతయు చెప్పి ద్రోణుని చాలించి యిక నీవు నైన్యాధిపత్యము నొంది శత్రువుల సంహరింపు మనెను. అది విని కర్ణుడు దుర్యోధనుని జూచి రాజేంద్రా! సముద్రములో బుఱ్ఱవైచిన బుర్రెడు నీళ్ళు వచ్చునుగాని సముద్రపు నీరెల్ల వచ్చునా? అర్జునునంత పరాక్రమములో నెంతటి వారంతగ నిలువవచ్చునుగాని వాని పరాక్రమమెల్ల నడంగింప నెవ్వరితరము. ఆ కుంతికడుపు చలువ యట్టిది మనము చిన్న నాటినుండి విషాన్నము బెట్టించి, పాములచే గఱపించి, గంగలో బడవైచి, లక్కయిండ్లలో గాల్చి, కాననమున కేగజేసి యొకనాశమునైన జూడగలిగితిమా? ఇంకను నట్లగా తలపుము ఎట్లయినను మొదలుపెట్టిన పని తుది జూడవలెను.

శ్లో|| అనారంభో మనుష్యాణాం ప్రథమం బుద్ధిలక్షణం

ఆరబ్ఢ స్యాంతగమనం ద్వితీయం బుద్ధిలక్షణం

అని రాజనీతి యనెను. కర్ణుని మాటలు విని అర్జునుని చూచిన పరాక్రమము దలచి దుర్యోధను డంతరమున-

ఉ|| ద్రోణుడుకర్ణుడుంగృపుడుద్రోణసుతుండును నేల! వాని గీ

ర్వాణులకైననుం జెనక వచ్చునె! యెవ్వరునాజి గౌరవ

త్రాణ పరాయణత్వమున దర్పము సూపగ లేమిదెల్లను

క్షిణ పరాక్రముండయిన క్రీడికి నిక్కపుటల్క వచ్చినన్‌||

అని దిమ్మరపోయి యూరకుండెను.

ఆ రాత్రి మహాయుద్ధము జరిగినది. కర్ణుడు రేగి యుద్ధము చేయుచుండ కృష్ణుడు ఘటోత్కచుని బిలిచి ఈ రాత్రి కర్ణుని నీవు గాక ఎవరు తలపడలేరు. నీవు వాని జయించి మీ తండ్రుల ఋణము తీర్చుకొనుము - అనెను. వాడు విజృంభించి మాయాయుద్ధము చేయుచుండ కర్ణునకు చేయియాడకుండెను. అప్పుడందరు కర్ణునితో నీకు ఇంద్రు డిచ్చిన శక్తి వీనిపైవైచి మర్యాదకాపాడుకొనుము. అర్జును సంగతి తర్వాత చూచుకొందమనిరి. అప్పటి కింకొక యుపాయము లేక కర్ణుడు శక్తితో వాని నమయించెను. క్రోధ శోకము లతో కర్ణు నెదిరించిపోవు ధర్మజునకు కృష్ణుడు వీడు రావణునంత వాడు. మనము లేనివాడు లోక మలోకము చేయును. వీడు కర్ణుని శక్తి కెరయగుటవలన మనమర్జును గాపాడుకొన గలిగితిమి. ఇది వాడు అర్జునునిమీద వేయవలెనని ప్రతిదినము వచ్చుచుండును. వారి వారలెల్ల నిది చెప్పుచుందురు. యుద్ధరంగమునకు రాగానే వాడు మరచునట్లు చేయుచుంటిని. ఇంక నెన్నాళ్ళు చేయుదుము ఇది మనకు మేలుకాలముగాని కష్టకాలము గాదని యందఱ దుఃఖము శాంతింప జేసెను. ఆ రాత్రి తెల్లవారినది. కాల్యముల దీర్చికొని రాత్రి నిద్రలేక శరీరములు తూలుచుండ నట్లే పోరాడుచుండిరి. ఐదవనాడు రెండుజాములయిన తర్వాత భీముడు కళింగసైన్యములతో యుద్ధముచేయుచు వాని గంధగజమును చంపెను. దానిపేరు అశ్వత్థామ. వినరాని మాటవిన్న అస్త్రసన్యాసము చేసెదనను ప్రతినగల ద్రోణుని యొద్ధకుపోయి-భీముడు ''అశ్వత్థామా హథః'' - అని చెప్పెను. ద్రోణుడు కొంచెమాలోచించి శివవరమున బుట్టిన అశ్వద్థామ చావనివాడని తానెరుంగును గాన కళింగసైన్యములతో నింతదనుక పోరిన భీముడు గజమును జంపెనేమోయని యాలోచించి మామూలుగా యుద్ధము చేయుచుండెను మూడుజాము లయినది. ద్రోణునకు కాలము దగ్గరకు వచ్చినది. కొండలమీదగాని, నీటిలోగాని అడ్డులేకుండపోవు ద్రోణుని రథచక్రము లంటినలజడి లటుకు లటుకుమని కొట్టుకొనుచు రథవేగము తగ్గిపోయెను. ద్రోణుడు తెలిసికొని ధర్మాత్ములవు పాండవుల కపకారము చేయుటవలన నట్టిదశ తనకు తటస్థించెననియు నిక యుద్ధము చాలించెదననియు తలచుచుండ నాకాశవాణి దాని సమర్థించెను.

ఇన్ని కారణములతో తనచావు తనకు దెలిసిన మహాత్ముడు; వీర ధర్మప్రకారము పాండవసైన్యముల వధించుచున్నట్లు సందుచేసికొని ధర్మజు నున్నెడకు పోయి యడంగుటయు నాతడు కృష్ణ ప్రేరణమున ''అశ్వత్థామ హతః'', అని పెద్దగానని ''కుంజరః'' అని మెల్లగా ననెను. అర్జునుడుమాత్ర మన్నతో మొదటినుండి సహజమవు సత్యమును వదలకుము. గురుని నసత్యమున జంపుటకన్న నన్యాయమెద్ధి? రాజధర్మముతో నిలపబడి గురుని చేతిలో చచ్చినను మనకపయశము లేదుసరిగదా! వీర భోగ్యములగు లోకముల చూఱగొందుము. బ్రదికి గెలిచిన రాజ్యమబ్బును. ఎట్లయినను బాధలేదు. అసత్యమాడవలదని గట్టిగా చెప్పుచుండెను. అది వినియు కృష్ణభీముల ప్రేరణతో ధర్మజు డట్లు పలికెను ఆ ''కుంజరః'' అను మాట వినబడకుండ సైన్యవాద్య ఘోషాదులన్నియు నడ్ఢుపడినవి దానితో ద్రోణు డస్త్రసన్యాసముచేసి రథముమీద కూర్చుండి యోగసాధనతో బ్రహ్మరంధ్రము బ్రద్థలుచేసికొనిపోయెను. ద్రోణుని తల నతని వధకై యాజోపయాజుల వరమున ద్రుపదుని యజ్ఞము నగ్నికుండమున బుట్టిన ధృష్టద్యుమ్నుడు, కృష్ణ పాండవాదులెల్ల వలదు వలదని కేకలు వేయుచున్నను తత్కాలజనితావేశమున కత్తితో నఱకెను. ద్రోణుడు సూర్యమండలము భేదించుకొని సిద్ధసాధ్య వందితమగు గతిగొనెను.

ఇదిగాక ఆతురతో కొడుకుచావును తెలిసికొన దలచివచ్చి అడిగిన ద్రోణుడు ధర్మరాజు ముఖమునుజూచి అడుగవలయునుగదా! ''అశ్వత్థామా హతః'' అన్నచోట ''కుంజరః'' అని మెల్లగా అనిన అక్షరస్థానములను బట్టి పెదవులు కదలవలెనుకదా! అది చూచుచున్న ద్రోణుడు 'హతః' తరువాత పెదవులు కదలుచున్నవి. ఆ మాట నాకు వినబడుట లేదు, పెద్దగా జెప్పుము అని యడుగరాదా! ఇంతమాత్రము చేతగానివాడు వెదకి కొనుచు ధర్మరాజు వద్దకు పోనేల? ఇదంతయు అనాలోచిత విషయము. ఇంకొక విషయము. స్వర్గారోహణ పర్వమున యోగముతో ఎగసి పోవుచున్న పాండవులు యోగశక్తిచాలక ఒక్కొక్కరే పడిపోవుటయు. భీముడు ధర్మజుని ప్రశ్నింపగా వారివారి యోగములు చెడుటకు కారణములు ధర్మజుడు సమాధానములు చెప్పుటయు కలదు. ఆ ప్రశ్నోత్తర మాలికలో అర్జునుడు పడినపుడు భీముడు ఇతడు కృష్ణునకు ప్రాణ స్నేహితుడు. బంధువుడు భక్తుడు ఇంద్రపుత్రుడు పూర్వజన్మలో నరుడను యోగి ఈ జన్మమున అనేక తపస్సులు చేసి శివునితో పోరాడి పాశుపతాస్త్రము తెచ్చుకొని స్వర్గములో ఇంద్రునితో గూడ ఐదుసంవత్సరములు ఇంద్రసింహాసనమున కూర్చుండి వచ్చినాడు. ఇతని యోగము చెడుటకు కారణమేమియు కనబడుట లేదు. అని యడుగగా, ధర్మరాజు యుద్ధప్రారంభమున అర్జునుని పిలిచి నీవొక్కడవు కౌరవసైన్యమును ఎన్ని రోజులలో వధింపగలవు?

అని ప్రశ్నింపగా నాతో ఆ అర్జునుడు నాకు ''కౌరవసైన్యము లెక్కలేదు. కౌరవులకు మూడులోకములలో దేవదాన వాది వీరులందరు సహాయమై వచ్చినను, మన సైన్యము గూడా వారిలో కలిసిననూ వీరి నందరినీ, అర్ధ నిమేషములో చంపగలను. అని నాతోచెప్పినాడు. అట్లు, చేయక పదునెనిమిది రోజులు యుద్ధము చేసినాడు. ఆ మాటలో అసత్యము వచ్చినది. కనుక యోగము చెడి శరీరము పడిపోయెను. అని భీమునితో ధర్మరాజు చెప్పెను.

ఈ విషయములో విచారింతము. అర్జునుని అసత్యము పరులకు నష్టము గల్గించునది గాదు. ఏలయన పదునెనిమిది రోజులలో చంపుదునని జెప్పి అర్థనిమేషములో చంపినయెడల ఆ అసత్యము శతృవులకు నష్టకరము. పదునెనిమిది రోజులలో మన బలమును చూపింతము గదా! అనుకొనుచుండ అర్థనిమేషములో జంపిన, శత్రువులకు నష్టము. మఱియు ఈయనకు అసత్య దోషము సిద్ధములే, అట్లుగాక వ్యతిరేకమయినది గనుక ఆయనకు అసత్య దోషము లేదు. ఆ అసత్యము వలన శతృవులకు నష్టము లేదు. ఇట్లుండ ఈ అసత్యమునకే అర్జునుని యోగము చెడిన యెడల గురువును జంపుటకు ''అశ్వత్థామా హతః'' అనిన ధర్మరాజు అసత్యము పెద్ద దోషముగదా! ఆ దోషమునకు ధర్మజుడేల పడిపోలేదు? ఈ అర్జునుడు భీముడు పడిపోయిన తరువాత కూడా ధర్మజుని ఇంద్రరథ మెక్కించుకొని ఆ శరీరముతోనే స్వర్గమునకు తీసికొనిపోయిరి గదా! ధర్మజునకు యమలోకములో తమ్ములు బాధపడు చున్నట్లు చూపిన ఇంద్రుడును, యముడును, ధర్మజుకోపమునకు భయపడుచు నీతమ్ములు స్వర్గముననే యుండిరి. ఇదంతయు నీకు నాటకమే చూపించితిమి. అని మంచిచేసికొని స్వర్గమునకు తీసికొని పోయిరి, అని కలదుగదా! గురుహత్యకు అబద్ధమాడిన వానియెడ దేవతలకు అంతభయము పక్షపాతము ఏల? ఈ విధముగా మంచి విమర్శబుద్థితో విచారించిన ధర్మజు డబద్ధమాడలేదు. అని భారత సిద్ధాంతము తక్కిన మాటలన్నియు కథలో ఎవరి మాటలు వారు మాట్లాడుదురు. అంతమాత్రమున పురాణధోరణి సమన్వయము చేసికొనుటయందు బుద్ధిమంతులు పొరబడరాదు. ఇది ద్రోణ పర్వ విధము.

ఈ కథలో పెద్ద చర్చలు గురుని విషయమై ధర్మజుడు అసత్యమాడవచ్చునా? అస్త్రసన్యాసము చేసిన ద్రోణుని శిష్యుడగు ధృష్టద్యుమ్నుడు నరుకుట న్యాయమా! వలదు వలదనిరి గాని యుధిష్ఠిరాదులంత అన్యాయము చేసిన ధృష్టద్యుమ్ను వధించిరా! పోనీ వెడలనడిచిరా? ఇది యంతయు నన్యాయమే యని అపోహలు గలవు. భీముని మాటతో ననుమానము గలిగిన ద్రోణుడేమి చేయవలెను? తన సైన్యములో దండ నాయకుడగు కొడుకు చచ్చెనో బ్రదికెనో తనకు తెలియదా? అంత తెలియనివాడు సర్వసైన్యముల నేకముఖముచేసి యెట్లు నడుపగలడు? ఒకవేళ దూరమునుండి తెలియకుండిన నశ్వత్థామను పిలువుమని కాని బ్రదికియున్నాడా? అని కాని అడుగ చెప్పుటకుకౌరవసైన్యములో నెవ్వరు దిక్కులేరా? దండనాయకులు బిలుచుటకు నెవరినెట్లు పిలువవలయునో అట్లు వేర్వేర శంఖధ్వనులు వారలకు గుర్తులుండునుగదా? ఆ పని మరచినాడా? అని ప్రతిప్రశ్నము లున్నవి. రాయబారమప్పుడే భీష్మద్రోణులయందు కృష్ణుడు నేరము విశదీకరించెను. దానికి భీష్ముడుధర్మజు మోముచూచుచు దానివలన తనపాపము పరిహారమగునని సూచించి పడిపోయెను అట్లే ద్రోణుడును తనవాడు చావనివాడని తెలిసినను తెలిసికొను మార్గము లున్నను ఇదివంకబెట్టి ధర్మరాజును జూచుటకు తన పాపాపనో దనమునకు అట్లుపోయియడిగెను. ధర్మజుని ''అశ్వత్థామా హతః'' అన్న మాటకాక ''కుంజరః'' అను మాటతో ఆయనకు ప్రయోజనములేదు. అట్లయిన కుంజరమా? నాకొడుకా? అని యడుగలేడా వినరాని మాట విన్న చచ్చెదనన్న ప్రతిజ్ఞ కదియే చాలునుగాక! అతడట్లు చేసెను. ద్రుపదుని యజ్ఞమున ద్రోణు జంపుటకు పుట్టినవాడు నిమిత్తమాత్రముగా తలగోసి నా డననేల? బ్రాహ్మణవృత్తిమాని క్షత్రవృత్తితో బ్రదికి ద్రోణునికి వృత్తికితగిన సంస్కారమైనగాని ఎంతయోగియైనను సూర్యమండలమును భేదింపలేడు. ఉత్తమలోకములేదుగాన శిష్యుడగు వీరుడీ నెపమున నట్లుద్ధరించెను. ఇది యంతయు భవితవ్యము. దీనిలో ధర్మజుడు కుంజరః అని మెల్లగానన్న దోషమునకు ముందు యమలోకము చూచెను. అంత మాత్రము సందులేకపోయిన నరకము పూర్తిగానే యనుభవింపవలసి యుండు, అని కధాభాగమును బట్టి సారాంశము తోచుచున్నది.

ఆ దినశేషమున అశ్వత్థామ ధర్మజు డసత్యమాడెనని, ధృష్టద్యుమ్నుడు తన తండ్రిని జుట్టుపట్టుకొని శిరము కోసెనని కడుకోపించి కోలాహలముచేసి పాండవ సైన్యమును నేలకు గోలకు దెచ్చి యాగ్నేయాస్త్రము వైచిన నది యర్జును నస్త్రముచే శమించుటయు, నారాయణాస్త్రము ప్రయోగించిన కృష్ణుడు పాండవపక్షమువారి నెల్లరథములు దిగి ఆయుధములు క్రిందబెట్టి నమస్కారము చేయుడని యట్లు చేయించిన నదియు నుపశమించుటయు నాతడు రథము డిగ్గి పారిపోవుచుండ, దారిలో వ్యాసమర్షి ప్రత్యక్షమై యడిగిన మహాత్మా! నా ఆగ్నేయాస్త్రము అర్జునాస్త్రముచే ప్రతిహతమాయెను. నారాయణాస్త్ర మూరకపోయెను. కృష్ణార్జునులు నాకన్న మిన్నలగుటకు కారణమేమియని యడిగెను.

నీవు పూర్వజన్మమున శివుని కరచరణాద్యవయవములతో నర్చ యందు పూజించితివి. వారు లింగాధిష్ఠానారూఢుని చేసి పూజించిరి. శివుని నర్చయందు పూజించుటకన్న లింగమున పూజించుట యధికఫలము, మీమీ పూజాఫలములు వేరువేరుగా ననుభవింపవలదా? ఇట్లు పోవనేల? నిలచి మొదలుపెట్టిన పని నెరవేర్చుకొని పోయెదవుగాక అని వానిని వ్యాసభట్టారకుడు మరలించెను. అంత నిరువాగువారు నస్తమయమువరకు బోరాడి శిబిరముల కేగిరి. దుర్యోధనుడు కోరికతీర తన కర్ణునకు సర్వసైన్యాధిపత్య పట్టాభిషేక మొనర్చెను.

24

మరునాటి యుద్ధములో నుభయ బలములు పోరాడినవి. అందు పాండవులకే విజయము సిద్ధించెను. వారుల్లాసముతో బోయిరి. కౌరవులు కర్ణాధిపత్యము వచ్చినను జయింపకపోయితిమని యుసురుసు రయిపోయిరి.

ఇక కర్ణుని రెండవనాటి యుద్ధము తీవ్రముగా జరిగినది కర్ణుడు తెగించి యానాడు తన గజాకారమగు దివ్యధ్వజమును పూజించి తెచ్చుకొనెను ఆయుధములన్నియు సిద్ధముచేసికొని, వాని యుపాస్య ల నుపాసించుకొని యుద్ధమునకు వచ్చుచు, దుర్యోధనునితో నాకును, నర్జునకును ఆయుధములలో, దివ్యాస్త్రప్రయోగములలో నెచ్చుతగ్గులు లేవు. లాఘవమున నాకన్న నతడు చాల తక్కువ వానికి విరుగని రధముకలిగి నను మనకు చాల రథములు వెంటనుంచుకొని ఒకటిపోయిన నొకటి వాడు కొనవచ్చును. వానికి అక్షయబాణతూణీరములున్న, మనము నంతకన్నా బాణముల దెచ్చుకొనవచ్చును. కాని కృష్ణుడతనికి సారదియగుటచే మనయూపులన్నియు దప్పించుచున్నాడు. కాన మనల శల్యుడు సారథ్యమున - తెలివి తేటలలో కృష్ణునంతవాడు. వానిని నాకు సారధిగా నమర్చిన నేను వారల జయించెదనని చెప్పుకొనెను. దుర్యోధను డాతని బ్రతిమాలి కాదన్నను ఎన్నింటికన్న మాటలుచెప్పి ఎట్టకేలకు కర్ణునికి సారధినిగా జేసెను. అప్పుడు శల్యుడు నేను హితము చెప్పెదను. కర్ణుడు కాదనరాదు. కోపపడరాదు. అట్లయిన మాకు పొందు కుదురునని మొదటనే చెప్పెను. రెండు జాములవరకు ననేక ద్వంద్వయుద్ధములు సాగుచుండెను. సంశప్త కులొకవైపున నర్జునునితో నెడతెగకపోరుచుండ, అశ్వత్థామ ఆరుకాండ్ల యెద్ధులు లాగలేక లాగుకొనివచ్చు బండ్లపైని బాణములుతెచ్చి యివియన్నియు కృష్ణార్జునులపైగాక మరియొకరిపైన వైవనని ప్రతినబూని యొకవైపున యుద్ధము చేయుచుండెను. మధ్యాహ్నమున కాబాణములయి పోయిన నాతడు మరలెను. సంశప్తకులను కించిదవశిష్టముగా, వధించి యర్జునుడు తన సైన్యము దరికి వచ్చుసరికి కర్ణుడు ధర్మజుని పరాభవించి తీవ్రముగా పోరుచుండ నిలువలేక ధర్మరాజు శిబిరమునకు పారిపోవుచుండెను.

అయినను విడువక వెంటపడిన, అప్పుడు భీమునిచేతిలో దూర్యోధనునకు చచ్చినంతపని వచ్చెను. దాని నుగ్గడించి శల్యుడు మనరాజు సచ్చిన నీవు ధర్మజు నేమిచేసి యేమి ప్రయోజనము? అని యొప్పించి దుర్యోధను ప్రాణత్రాణమునకు నచ్చటకు రథము నడిపెను. ధర్మజుడింటికి పోయెను కర్ణుడు భార్గవాస్త్రము ప్రయోగించి తీవ్రముగా పోరుచుండ వానియెదుట నెవ్వరు నిలువలేకపోయిరి. భీముడు మాత్రము ఢీకొని సైన్యముల నిలుపుకొని పోరుచుండెను. ఆ యుద్ధతీవ్రత్వముజూచి రాజు కనబడకపోవుటకు చింతించి పోయి భీము నడుగగా రాజుగారు యుద్ధరంగమున లేరు ఇంటికి బోయెనేమో? యనెను. నీవువెళ్ళి చూచిరమ్మన నేనుపోయిన నోడిపోయితి నందురు. నీవే పోయి చూచిరమ్మనె నీవు జయించుచుండుము, మేము మీ యన్నసంగతి చూచివచ్చెదమని కృష్ణుడు రథము త్రిప్పెను. అంతకుముందే కర్ణుని తీవ్రతజూచి సంశప్తకులతో, నశ్వత్థామతో యుద్ధముచేసిచేసి అలసివలసివచ్చిన యర్జునుడే-పట్టపగలింటి భాస్కరు పగిది కర్ణుడుగ్రమూర్తియై వెలుగుచున్నవాడు. మాధవా! మన రథము మరలనిమ్ము! అని కర్ణునకు ప్రతిష్ఠతెచ్చెను. అర్జునుడు భీమునితో కర్ణుడు తీవ్రముగా బోరుచున్నాడు. అరుగో సంశప్తకులు మరల సిద్ధమై వచ్చుచున్నారు. అశ్వత్థామయు నిప్పుడే రాగలండు. నేను పోయిన నెట్లు? అనిన భీముడు వీనిని, వారినిగూడ నే నొక్కడన నిలిపి పోరాడగలను, నీవే యింటికి పొమ్మనెను.

ఆ భీమునియూపు లోకాతీతముగా నున్నది వట్టివట్టి మాటలేకాక అప్పుడే కర్ణు నెదిరించి పోరాడి మూర్ఛనొందించి వాని రథముమీద నెక్కి ఆనాడు సభలో నన్నమాటలకు నేడు ధర్మజుని పరాభవించినందులకు వీని నాలుక గోసెదనని కత్తి జళిపించిన, శల్యుడు వానితో నిది చావు గాదు. మూర్ఛ మునిగిన వాని నాలుకగోసిన చచ్చును, అర్జునుడు వీని జంపు ప్రతినపట్టి యున్నవాడు నీవీ పనిచేసిన ఆ సత్యసంధు డగ్నిప్రవేశము చేసిన మీ యింటికి ముప్పురాదా? యని వారించెను. భీముడు సంతోషించి మామా! నీవు చెప్పుటనుంచి మాకు ముప్పుతప్పెను. నీమాట కాదనను, అని రథము దిగిపోయెను. ఇట్లు మహాభీమముగా యుద్ధము సాగుచుండ కృష్ణార్జునులు బిరమునకేగి ధర్మజుని దర్శించిన, వారు కర్ణునిజంపి వచ్చినారనుకొని వారి నగ్గించి మాటలవలన కర్ణుడు బ్రదికియుండెనని తెలిసి తాను బాధపడి యుండుటవలన అర్జును నిందించి నీ చేతకాకపోయిన గాండీవము కృష్ణునకిచ్చిన కర్ణు జంపెడువాడనెను. దానికి అర్జనుడు తన యన్నను జంపెదనని కత్తిదూసెను ఇది యేమన - గాండీవము నింకొనిరికి నిమ్మనువాని గొంతుకోయ ప్రతినబూనినవాడ ననెను. కృష్ణుడు వాకబదరి-ధర్మజు దూషింపుము. అది చంపినట్లే యని యట్లు చేయించెను. అర్జునుడు మరల కత్తిదూసి తన తల కోసికొనియెద నన నిదియేమి యని కృష్ణుడు - పూజ్యుడగు నన్నను దూషించినందుల కన్న, నీకు ధర్మము తెలియదు. ఆత్మశ్లాఘ చేసికొనుమర్జునా! అది చచ్చినట్లే యని యట్లు చేయించి, ధర్మజుని కోపపరిహార మగునట్లు ప్రార్థించి, తాను అర్జునుడు వాని పాదముల కెఱగి యుద్ధానుజ్ఞ తీసికొనిపోయిరి. అప్పు డర్జునుడు కర్ణుని చంపకుండ నీరేయి నీ కగపడనని ధర్మజుతో చెప్పిపోయెను.

కృష్ణార్జునులు మరల యుద్ధరంగమునకు వచ్చువేళకు యుద్ధభారమంతయు భీముని చేతిమీదనే యున్నది. ఇంతలో దుశ్శాసనుడువచ్చి తాను మున్ను పెట్టిన బన్నములెల్ల వాక్రుచ్చి తనతో యుద్ధముచేయుమని, సోత్స్రాసముగా బలికిన భీముడు రేగి వాని విరధునిచేసి, గద విసిరి వాని బడవైచి తాను రథము దిగిపోయి, వాని చుట్టును తిరుగుచు, ఇంకొకరు వానిని రక్షింపరాకుండ పొదివి, ఓరీ ధుశ్శాసనా! నీవు నా కగపడితివి. అప్పుడాడిన మాటలుగాక, ఇప్పుడును వెదకికొనుచువచ్చి యిన్ని మాట లాడితిని. జూదమునాటి ప్రతిన నెరవేర్చుకొనియెదను నీ కిక్కడ నెవ్వరేని దిక్కుగలిగిన బిలుచుకొమ్మని పెద్దగా జెప్పుచు రౌద్రాకారముతో చుట్టును దిరుగుచు అప్రతిష్ఠపాలై పోయెనుగాని, ధృతరాష్ట్రుడేమి సంపాదించెను? ఆ సభలో ద్రౌపదికి పరాభవము చేయవలదని తాననిన యింత పుట్టదుగదా! మీ చేత నీకు భర్తలేడు అనిపించుకొనిన దాని మగడిప్పుడు వచ్చినాడురా! మా మగవార లింతపని చేసిరని అప్పుడు విఱ్ఱవీగిన కాంత లిట్లు అపతిత్వదీనత నొందుచుండిరని పలుకుచు ప్రాణముండగనే వక్షస్థలము బ్రద్ధలు చేసి నెత్తురుద్రావి తలకుపోసికొని ఒడలెల్ల రక్తమయుడై పిడికిలిబట్టుకొని చుట్టును తిరుగు భీమునిపై బోలేక భీతితో దుర్యోధన, కర్ణ, కృపాశ్వత్థామాదులెల్ల దిమ్మరపోయి చూచిరి. ఇట్లు ప్రతిన దీర్చుకొని, నా రెండు ముఖ్యప్రతిజ్ఞలలో నొకటి తీరినది చాటు మాటు కాకుండ దుర్యోధనుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ మొదలగువీరు లేమియు చేయలేక చూచుచుండ, పాండవపత్ని కేశాంబరముల నాకర్షించిన వాని జంపి నెత్తురు ద్రావితిని. ఇంక రెండవదికూడ ఇట్లే తీర్చబోవుచున్నానని వాని నొక్కత్రొక్కు త్రొక్కి చంపి, విశోకుడుతెచ్చిన రథమెక్కి కౌరవుల కెదురుగా నడచెను. అంతకుముందేవచ్చి భీముని ప్రతిజ్ఞ కడ్డువచ్చువారిని నఱక సిద్ధపడియుండి, ప్రతిన నెరవేరుటకు సంతసించి యర్జునుడును కలసికొనెను.

ఇక జాము ప్రొద్దున్నది. కర్ణుడు మనసు చెడి తాను జూచుచుండగా నింత ఘోరము జరిగినది. గనుక నింక నా పౌరుష మెన్నటికి అని తెగించి అర్జునుతో నెదుర్కొనెను. రెండు వైపులవారు చూచుచుండిరి. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము సాగినది. కర్ణుడు సర్పముఖాస్త్రము అర్జునుపై ప్రయోగించెను అది కంఠమునక సరిగా గుఱివెట్టక తొందరచే పాలస్థలమునకు సూటిచేయుటచే శల్యుడాక్షేపించెను. మరల గురివెట్టుమనెను. కర్ణుడొక బాణము రెండుమార్లు గురివెట్టునా? యని వాడట్లే వైచెను. అది వచ్చువేళకు కృష్ణు డర్జునుని రథము నాలుగంగుళములు భూమిలోనికి నదిమెను. ఆ యస్త్రము అర్జును కిరీటము నెత్తుకొని పోయి తల రాలేదని తిరిగి వచ్చుచుండ - అదియేమని అర్జునుడడుగగా ఇది తక్షకుని కొడుకగు సర్పరాజము. ఖాండవ దహనమప్పుడు ఇది పారిపోవుచుండ నీవు నడిమికి నరికి అగ్గిలో పడవైచితివి. ఆ తల నాటి నుండి కర్ణుని యొద్ధనుండి నీమీది పగతో కిరీటమపహరించి అంతతో బోగ మరలి వచ్చుచున్నది. - అని కృష్ణుడు చెప్పెను. అర్జునుడు దాని నారు బాణములతో ముక్కలు ముక్కలు చేసెను.

ఇంద్రుడిచ్చిన శక్తి ఘటోత్కచునిపై పోయి సర్పముఖాస్త్రమిట్లయిన కర్ణు డుస్సురుమనెను. ఇంతలో బ్రాహ్మణ శాపమున కర్ణుని రథచక్రము భూమిలో క్రుంగెను. అది యెత్తకొనియెదను కొంచెము సేపాగుమని దర్పముగా నడిగెను. దాని కర్జునుడు కొంతసేపు ఆగెను. కృష్ణు డాక్షేపించెను కర్ణుడు రథమెత్త ఆ రథమును వదలక భూమి యంతయు దానితో లేచివచ్చెను. మరల రథమెక్కిన నింకను క్రుంగెను. మరల నాగుమనిన వాని దుర్మార్గములన్నియు చెప్పి యభిమన్యుని విల్లు చాటుగా నుండి యెట్లు నఱికితివని నిరుత్తరుజేసి కృష్ణుడు ప్రేరేప అర్జునుడొక యస్త్రము మంత్రించివైచి వాని బడవేసెను. కర్ణుడు నేలబడి నంతనే రథము చక్రము పైకివచ్చినది అట్టి నాయకుడు లేని మ్రోడుపడిన రథమును శల్యుడు తోలుకొనిపోయెను. ఇట్లు 17వ నాటి సాయంకాలము కర్ణ రహితులైన దుర్యోధనులు శిబిరముల కేగుట, పాండవులు జూదమున నోడి అడవికి పోవునంతటికన్న దీనముగా నుండెను. కర్ణపర్వము తుది ఫలశ్రుతి వ్రాయబడినది.

చం|| అనలుడు భాస్కరుండును సుధాంశుడు నధ్వర సంప్రవర్తకుల్‌

వినుము నరేంద్ర ! యీ క్రతువు విష్ణుమయంబిది నిర్వహించి ర

ర్జునుడును కర్ణుడున్‌ సమరరూపమునందగ నీ ప్రబంధ మిం

పొనరం బఠించి నవ్వినిన నొందు నరుంజిరసౌఖ్యసంపదల్‌||

అని తిక్కన వ్రాసెను. ఇక్కడికి వర్ణ్యమయినది. తక్కినది కధావిశేషమునకు ప్రసింగింపబడినది.

18వ దినమున శల్యుని సేనాధిపతిగా చేసికొని కౌరవులు యుద్ధమునకు వచ్చిరి. రెండుజాములలో ధర్మజుడు వాని బడవైచెను. మూడవ జాములో దుర్యోధనుడిక నీవే సేనాపతివి మామా! యని శకునిని మాటతో సేనాపతిని చేసెను. వాడు పోరి నకుల సహదేవుల చేతిలో సకుటుంబ సపరివారముగా చచ్చెను. కృపకృతపర్మాశ్వత్థామలు పారిపోయిరి. 1 అక్షౌహిణులు నాయకులు నశించిరి.

కం|| వలవలని మూకలో కా

ల్నిలువక గుఱ్ఱంబు డిగ్గి నీ కొడుకు గదా

కలిత భుజుండై యొక్కడు

తొలగి చనియె నేమి చెప్పుదుం గురునాధా!

అట్లు వోయి దుర్యోధను డొక చెఱువులో జల స్తంభన విద్యతో దాగియుండెను. అది తెలిసికొని పాండవులు పోయివాని నిష్ఠురములాడి బయటకు రావించి భీమునితో గదా రణము గోరిన వాని యిచ్చమైనట్లు చేసిరి. ఆ యుద్ధము చూచుటకు బలరాముడును వచ్చెను. బలరాముడు దుర్యోధనపక్షపాతి. కృష్ణుడు పాండవక్షపాతి యను పేరున్నను స్వపక్ష పరపక్ష నిర్దూమధాముడు కావుననే దేవుడనవలసి వచ్చినది. భీమ దుర్యోధనుల గదాయుద్ధము సాగినది. కొంత సేపునకు కృష్ణుని యాలోచనమున నర్జునుడు వాని తొడగొట్టుమని భీమునకు సంజ్ఞచేసెను. భీముడు తెలిసి కొనియు తొందరపడక తనకు భారమైనను పోరాడుచుండెను. అప్పుడు పల్టీకొట్టు దుర్యోధనుని గదాతాకుతో భీముడు మోకాళ్ళునేలమోపి దిమ్మరపోయి కూర్చుండబడెను. ఆసమయమున దుర్యోధనుడు మరల భీముని పైగా పల్టీకొట్ట వచ్చుటజూచి ఆ యెగపినప్పుడు కూర్చుండియే వానితొడలకు బట్టించి భీముడు గదవిసరగా నతడు తొడనలిగి క్రిందపడెను. అప్పుడు బలరాముడు గదాయుద్ధమున తొడలు విరుగగొట్టుట భీముడుచేసిన యధర్మమని కృష్ణునితోగూడ నందఱ నిందించెను. దానికి బలరామునితో కృష్ణుడే మాటలాడెను. దెబ్బతిని మోకరింపబడిన వానిపై పల్టీకొట్టవచ్చునా? ఆ దిమ్మరపోయినవాని నింకొక దెబ్బకొట్టిన చచ్చునుగదా! ముందు అధర్మము దుర్యోధనుడు చేయుటవలన తన ప్రాణము కాపాడుకొనుటకు ప్రతినతీర్చుకొనుటకు నట్లు కొట్టెను. అదియుగాక మైత్రేయముని శాపమున వాని తొడలు భీముని గదచే నిరుగవలసియున్నవి.

ఇవి యన్నియు తెలిసియున్న దుర్యోధనుడు తనతొడల గాపాడుకొనవలదా? ప్రమాదమన్న ననుభవింప నిమ్ము.

ఉ|| ధారుణి రాజ్యసంపద మదమ్మున ద్రౌపది కృష్ణ నిట్లు రం

భోరునిజోరు దేశమున నుండగcబిల్చిన యిద్దురాత్ము దు

ర్వార మదీయ బాహుపరివర్తిత చండగదాభిఘాత భ

గ్నోరు తరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరమ్మునన్‌.

అని భీముడు ప్రతిన చేసెనుగదా! అది తప్పయిన నుగ్రరణాంతరమ్మున గధతో తొడలెట్లు గొట్టెదవు? అది యధర్మముగాన ప్రతిన మార్చుకొమ్మని యచ్చటి సభాస్తారులగు భీష్మాదు లెవరైన ననిరా? భీముడప్పుడే వాని తొడలు విరుగగొట్టవలసినది. ధర్మాత్ముడుగాన నిన్నినాళ్ళాగినాడు. ఇది యంతయు నెరిగిన నీవైనను అధర్మమగు ప్రతిన మోర్చుకొమ్మని భీమునికి జెప్పియుంటివా? ఇందు భీముని తప్పేమియు లేదనుచుండ బలరాము డౌనౌను, శిఖండి నడ్డము పెట్టి తాతను బడగొట్టిన అర్జును తప్పులేదు. అసత్యమాడి గురుని జంపించిన ధర్మజుని తప్పులేదు. రధచక్రము క్రుంగినప్పు డర్జునునిచే కర్జుజంపించిన నీతప్పునులేదు. ఒక తప్పయిన ననవచ్చును. అన్నియు తప్పు లయినప్పుడు దాని విమర్శమిం కేల? అని బలరాముడు తీవ్రముగా మాటలాడెను. దానికి భగవంతుడు అన్నిటికి సమాధానము చెప్పి పాండవుల తప్పు ఇసుమంతయు లేదు కలికాలము రాబోవుచున్నది. ఇట్టి వన్నియు ధర్మములుగానే చెల్లునని బలరాముని నవ్వలకు బుచ్చెను. దుర్యోధనుడు ''కంసదాసుని పుత్ర! కావుము నీ దురాచారము'' లని కృష్ణు నాక్షేపించినవానికి నివి యన్నియు చెప్పి మాటలాడకుండ చేసెను ధర్మరాజు ''పాపపుణ్య చింత యింకేమిటికి పద్మనాభా!'' అని ధర్మరాజు తమకు నిట్టివియే కొన్ని యప్రతిష్టలు ఎంత ధర్మముగా నడచినను రానేవచ్చినవి - అని విసువుతో ననిన-నిది నాపని. మీకేమియు దోసము లేదు. ఇట్లే ఏకలవ్యుని వ్రేలు కోయించితిని. అట్లే చేయకున్న దుర్యోధనుడు వానిని దెచ్చుకొనిన నాకు సంకటమయ్యెడిది, అని చెప్పెను ద్రోణుడు ఏకలవ్యుని వ్రేలు కోయించుటకూడ తనపనియే యని చెప్పు శ్రీకృష్ణుని ప్రసంగమునుబట్టి తప్పొప్పుల నిర్ణయించు భారమెవ్వరికిని లేదు.

ఇది యిట్లుండగా మహాత్ముల చరితముల తప్పులెన్ను వారికి వారి తప్పులలో భాగము పంచుకొన నేనని పెద్దలు చెప్పుచున్నారు. ఆర్షగ్రంథములలో నెక్కడ సంధియము కలుగునో అక్కడనే దాని సమాధానము నుండును. సందేహము తీరిన దాకా చదువుచు పెద్దల నడిగి తెలిసి కొనుటయే దాని మందని మాతండ్రిగారు చెప్పిరి. ప్రకృత మనుసరింతము.

అంతట పాండవులు కౌరవ శిబిరములకేగి యక్కడి ధనదాన్యాదులు మిగిలిన సైన్యములు లెక్కలు చూచుకొని దాసదాసీజనుల నాదరించి, తమ శిబిరములలో ఒక అక్షౌహిణీ సైన్యము మిగులుగా దాని సేనాధిపతి మొదలగు వారికి జాగ్రత్తగా నుండుమని వారొక్క నది యొడ్ఢున నారాత్రి గడపిరి. పాండవు లైదుగురు కృష్ణసాత్యకులట్లు లేకునికి కృప కృతవర్మా శ్వత్థామలు దుర్యోధను దర్శించి యీ ముగ్గురిమీద నశ్వత్థామను సైన్యాధిపతిగ జేయించుకొని యారాత్రి శిబిరము మీదికిపోయి పాండవుల యక్షౌహిణి సేనను ధృష్టద్యుమ్నుని నిద్రించువారి నెల్ల నఱికి కసిదీర్చుకొని పోయి ప్రాణము పోవుచున్న దుర్యోధనునితో చెప్పి పాండవులు లేక పోవుటచే ఈపరాక్రమము సాగినది వారున్న శిబిరము మీద పోవుట కుదరినిదే! ఇప్పుడువారు పైనబడకుండ తప్పించుకొనవలెనని పారిపోయిరి కృతవర్మ ద్వారకకేగెను. కృపుడు హస్తినాపురికేగెను. అశ్వత్థామ సన్యసించి గంగయొడ్ఢున తపముచేసికొనుచుండెను. దానికి దుఃఖించుచు ద్రౌపది ప్రేరణతో భీముడు అశ్వత్థామపై బోవుచుండ కృష్ణార్జునులును వానికి కాపుగా వెనుకనుండిపోయిరి. భీము డతని నిష్టురములాడ అశ్వత్థాను బ్రహ్మ శిరోనామాస్త్రము మంత్రించి పాండవేయదార గర్భముల నెల్ల నిదినశింపచేయు ననివేయ అర్జునుడును కృష్ణుని పనుపున బ్రహ్మశిరోస్త్ర మేవేసి దాని నాపెను. ఆ రెండు పోరుచుండ వ్యాసనారదులు వచ్చి యుద్ధమంతయునైన తుదిని నిదియేల? వీని నుపసంహరింపుడని చెప్పిన విని యర్జునుడు వారి మాటలనాదరించి తన యస్త్రము నుపసంహరించెను. అశ్వత్థామ కదిచేతకాలేదు. అట్లు చెప్పిన తనకు నామర్థాయని దాని మరింత దీవింపజేసెను. కృష్ణుడు వాని ''పాండవేయ దారగర్భములు'' అను మాటకు పాండవి అన పాండురాజుభార్య. ఆమె కొడుకులు పాండవేయులు. వారి దారల గర్భములపై నిది ప్రసరించును గదా! అందొక్కటినేను సంరక్షించెదను. గర్భములు నిన్నేమిచేసినవి. ఐన నిట్లుజేసిన పాపమనుభవింపుము. మూడువేల సంవత్సరములు దుర్గంధభూషిత శరీరుండవై కుష్టురోగము ననుభవింపుమని శపించెను. వ్యాసనారదులు దానిని ధృఢ పరిచిరి. ఆ యుద్ధములో పాండవుల దప్పించి నందుకు దుఃఖించి యస్త్రము నుద్దీప్తము చేయ దానిచే నప్పుడు పాండవదార గర్భములన్నియు నశించెను. భగవంతుడు ఉత్తర గర్భమును కాపాడెను. కులము పరిక్షిణ మైనప్పుడు పుట్టెనుగాన పరీక్షిత్తని పేరుపెట్టెను.

తర్వాత ధర్మరాజు చచ్చిన భారత వీరులకెల్ల సంస్కారము లాచరించి, కృష్ణునాజ్ఞచే పట్టాభిషిక్తుడై భీష్ముని వలన ధర్యములు నేర్చుకొనుట వంకపెట్టి శాంత్యానుశాశికపర్వముల ధర్మప్రవచన మిప్పటికి గల రాజకుమారుల ప్రబోధార్థముగ చెప్పించి తా నశ్వమేధము నొనర్చి గత కల్మషుడై ముప్పదియారేండ్లు రాజ్యము చేసి చివరకు పరీక్షిత్తునకు ¸°వరాజ్యమిచ్చి యుయుత్సునకు మహారాజ్యమిచ్చి సుభద్రను పై పెత్తనమున కమర్చి ద్రౌపదితో వారు స్వర్గమున కేగిరి. అందు ధర్మరాజును శరీరముతోనే స్వర్గమునకు తీసికొనిపోయి తమ్ముల చూపుమని యాతడడుగ యమలోకమునకు తీసికొనిపోయి నరకము చూపగా కోపించి యామహాత్ముడు శాపమువెట్టునేమో యను భయముతో నారదు వెంటబంపి, అవసరమైనప్పుడు దేవేంద్రుడు యముడు ప్రత్యక్షమై వాని యడిగిన వానినెల్ల సమర్థించి నా తమ్ముల నేల నరకములో బడవైచితిరి? వారేమి తప్పు చేసిరి? అని యడుగ నీ తమ్ములు తప్పు చేయలేదు. నరకమునకు రాలేదు. మహాత్ముడవగు నీవే గురునిమిత్తమున ఆడిన అసత్యలేశమునకు నీకు నరకము చూపవలసి యిట్లు చేసితిమి. నీ తమ్ములు నరకములో నున్నట్లు చూపుట యొక్క నాటకము. మేము కల్పించితిమి. అని ఆయనను స్వర్గమునకు శరీరముతోనే తీసుకొనిపోయిరను గ్రంధమునుబట్టి, పాండవుల తప్పులన్నియు మన మనుకొనుటదక్క నిక్కములు గావని తోచుచున్నది. నిక్కములైన నింద్ర యములు మా నాటకమని యేల చెప్పుదురు? ఇది యంతయు ప్రసక్తాను ప్రసంగముగా వచింపబడినది కాని - యిచట భారతము నంతయు చెప్పుటకు ప్రారంభింపబడినది కాదు. అట్లయిన కొన్ని వత్సరములు పట్టును.

ఈ భారతము సంస్కృతమున హరివంశ, విష్ణు, భవిష్యములతో నూరు పర్వములగును. ఇది త్రిపురాసుర సంహారముతో ముగింపబడినది. అందును శివుడు మూడుసార్లు మూడు పురముల యసురుల నశింపచేసినట్లున్నది. అందువలననే గచ్ఛద్వ్యాఖ్యాత గ్రంథము నంతను సందేహించి - ఇది చారిత్రాత్మకము గాకున్నను నిందు గ్రహింపదగినది పరమార్థమేయని వచించెను. అది యెట్లన త్రిపురములు స్థూల సూక్ష్మకారణ శరీరములు. ఇందు మొదట శివానుగ్రహమున స్థూల శరీరము నందలి రోగాదులుపోగా సాధకుడు ఉపాసనమున కర్హుడగును. శరీరదార్ఢ్యమునుబట్టి సూక్ష్మశరీరమున కామాదులు రేగిన రెండవసారి శివుడు సూక్ష్మమును శుద్ధిచేయుట. శారీరకరుజలు మానసికకామాదులు పోయిన పిమ్మట కారణశరీరమందలి తమముపొంగి జడసమాధి నాపాదించును. మూడవసారి శివానుగ్రహముతో నది పోయిన దేవతలు స్వస్థులైరని దీని భావమనియు తక్కిన భారతమునంతయు నిట్లే సమన్వయించుకొమ్మని యాయన చెప్పెను. ఈ విధముగా విద్యలన్నియు పరంపరగా జ్ఞాన చోదనమునకే ఏర్పడెను. వృత్తి రహిత స్థితిని కూడ తెలిసికొను సంవిత్తే అనగా చరమవృత్తియే ప్రకృతి. దాని కాశ్రయము బ్రహ్మము. కాన కర్మకాండములో కర్మములాచరించి యుపాసనవలన ప్రబుద్ధులైయున్నట్టు లుండుటయే ముక్తి. కాన వేదాది విద్యలలోనే కథలు చెప్పినను అవి యన్నియు మోక్షసాధకములే. కథలు కూడ బోధము కొఱకే ఏర్పడినవి. దీనికి దత్తాత్రేయమహాత్మ్యమున నొక కథ చూడుడు.

కేవల కర్మప్రధానుడగు నొక సోమయాజి ప్రతిదినము వైశ్వ దేవము చేసి బలిదానము చేయుచుండ నా బలి క్రిందపడకుండ మాయమై పోవుచుండెను. అట్లు కొంతకాలము చనిన ఒకనాడు బలి వదలుసరికి ఒక బ్రహ్మరక్షస్సు చేయిపట్టి దానిగొని తినెను. అందులకా దంపతులు భయాశ్చర్యముల నందుచుండ నా రాక్షసు డిట్లనెను. ఈ రావిచెట్టు నందుండి నే నెన్నియో పాపములు చేసితిని. ఎన్ని చేసినను ఆకలిదప్పి తీరుటలేదు. కొంతకాలమునుండి నీ విచ్చు బలి పిడచ తినుటపలన నాకాకలి దప్పులు తీరి సుఖముగా నుండి ఎవ్వరిజోలికి పోకుండ నుంటిని. కాన మీకేమైనా నుపకారము చేసి కృతార్థుడ గావలెనని కనబడితిని. వరమర్థింపుడనెను. సోమయాజి కేమి కోరవలెనో తెలియలేదు. సోమిదమ్మ వాని కన్న పటుత్వము కలది, దంపతు లిద్దఱు నాలోచించి శ్రీదత్తాత్రేయ స్వామి నొకసారి చూపుమని యర్థించిరి. ఆ బ్రహ్మరాక్షసుడు మీ రడుగ రానిది యడిగితిరి. ఆ స్వామి యీ యూర నప్పుడప్పుడు తిరుగుచుండును. కాని నాయట్టి వానికి వారికి నెంత దవ్వు! అయినను మీ యుపకారము నెంచి చూపెదను కాని ఆయన మీకు స్వాధీనుడగుట దుర్లభము కాన మూడుమార్లు చూపెదను మీ యదృష్టమెట్లున్నదో? సిద్ధముగ నుండుడు అని చెప్పి యంతర్థానము నొందెను.

ఒకప్పుడు వచ్చి సోమయాజిని గొనిపోయి మాంసపు దుకాణము వద్ద బేరము చేయుచున్న వానిని దూరముగా నుండి అడుగో దత్తదేవుడు అని చెప్పి రాక్షసుడు చూపుచుండెను. సోమయాజి మాంసపుదుకాణము వద్ద నెట్లు పోవను. ఆ మాంసముగొను వాని నెట్లాశ్రయించును? అట్లే చూచుచుండ నల్లదేవుడంతర్థానము నొందెను. రెండవమారు చండాల వాటిక వద్ధనున్న వాని జూపెను. సోమయాజి భార్యబోధమున, రాక్షసుని బోధమున వాని యొద్ధకు పోయెను. ఆ దేవుడొక పశుశవమును కత్తితో కోసి యా ముక్కలు కాకులు మొదలగు పక్షులకు, కుక్కలకు బెట్టు చుండెను. స్వామి వానిని బెదిరించి కొట్టితిట్టి పంపెను. రాక్షసుడిక నీయన దేవుని కొలువలేదని నిరాశుడై విసువుకొనెను. పతివ్రతయవు సోమిదమ్మయు పతినిక మీరు పోవలదు. దేవునకు మనమీద దయలేదేమో? మీరు బాధలు పడలేరు - అని యుపచారములు చేసి వాని గాయములు మాన్పెను సోమయాజి యా యిద్ధఱ మాటలను బట్టి స్వామి సమాశ్రయమున పరమార్థము గమనించి ఈతూరి చూడుడు! నేనును పట్టుపట్టెదను. అని యొక నిశ్చయమున నుండెను. బజారున వారి యింటి ముందుగా పిచ్చివాని వలె పోవుచున్న స్వామిని మూడవసారి రాక్షసుడు చూపెను. ఆయన వెంటబడి సోమయాజి పోవుసరికి స్వామి స్మశానసమీపమున కేగెను. వెంటనే పోయి సోమయాజి హఠాత్తుగా సాష్టాంగ ప్రణామము చేయుచు రెండుపాదములు గట్టిగా పట్టెను. స్వామి కొట్టినను తిట్టనను బెదరించునను విడువలేదు. ఇక వాని విడిపించుకొన స్వామి చేతకాలేదు. అప్పుడు ప్రసన్నుడై ఏమికావలయునో కోరుకొమ్మనెను. సోమయాజి కేమియు తోచలేదు. రాక్షసుడు కాని, భార్యగాని చెప్పలేదు. అప్పుడేమియు తోచక తాత్కాలిక బుద్ధితో ఈ దినమున మాయింట శ్రాద్ధము, అందు భోక్తగా మిమ్ము విమంత్రించుచుంటి ననెను. స్వామి చిత్రితుడై యట్లే స్నానము చేసి వచ్చెదను. నీవుపోయి యా ప్రయత్నమున నుండు మనెను.

సోమయాజి యింటికి వచ్చి జరిగిన సంగతి భార్యకు చెప్పి ఏమి కోరవలెనో? నీవు చెప్పకపోతిని నాకేమియు తోచలేదు. శ్రాద్ధభోక్తగా నిమంత్రించితిని. ఆయనయు వచ్చెదనని యొప్పుకొనెను. పాకము చేయుమనెను. సోమదమ్మ తమ భాగ్యమునకు మెచ్చుకొనుచు పాకము సిద్ధము చేసెను. దర్భలు నర్చనపాత్రలు వగైరా సోమయాజి సిద్ధము చేసెను. స్వామి శుద్థసమాచారుడై వచ్చెను. సోమయాజి స్వామికి నర్ఘ్యము, నాసనము నిచ్చెను. స్వామి రెండవ బ్రాహ్మణు డేడి యని యడిగెను. ఈ యానందములో వారు రెండవ బ్రాహ్మణుని పిలువలేదు. మరిచి పోయిరి సోమయాజి చేతులు పిసికికొనుచు భార్యదగ్గరకు పోయి యా ప్రమాదమును చెప్పెను. ఆమె స్వామి వద్దకు వచ్చి దేవా! మీ యాజ్ఞయయిన పిలిచెదననెను. స్వామి పిలువమనెను. సోమిదమ్మ వాకిలిలోని కరిగి సూర్యుని జూచి లోకబాంధవా! కర్మసాక్షి! శ్రాద్ధమున పితృస్థానమున భోక్తగా దత్తాత్రేయస్వామి వారు దయచేసినారు. విశ్వేదేవస్థానమున అంతవాడవు నీవుగాక వేరెవరు గలరు. స్వామి సెలవీగా నే ప్రార్థించుచుంటిని అని పిలువ సూర్యుడు నొక బ్రాహ్మణుడుగా మండలము నుండి దిగి వచ్చెను. సోమయాజి వానికి విశ్వేదేవస్థానమున నాసనమిచ్చి పూజించెను. దానికి నచ్చెరువువడుచు దత్తదేవుడు మూడవ బ్రాహ్మణుడేడీ విష్ణుస్థానము లేని శ్రాద్ధము వ్యర్థముగదా! అనెను మరల సోమయాజి బిత్తరపోయి దిక్కులు చూచుచుండెను. సోమిదమ్మ గార్హపత్యాగ్ని వద్దకు పోయి ఈ సంగతి యంతయు చెప్పి విష్ణుస్థానమున కాహ్వానించిన నగ్నిదేవుడా కుండము నుండి వెలువడి వచ్చి బ్రాహ్మణరూపమున నర్చితుడై విష్ణుస్థానమున గూర్చుండెను. ఇక సోమయాజి యాధావిధిగ శ్రాద్ధము నెరవేర్చెను. శ్రాద్ధానంతరము భోక్తల భోజనపాత్రములాబమ్మ రక్కసి కొసంగుడని దత్తదేవుడు చెప్పెను. అట్లు చేయ తదుచ్ఛిష్టాను భవమున రాక్షసత్వము పోయి దివ్యశరీరముతో వారి కెల్లనమ్రుడై సెలవు దీసికొని విమానారూఢుడై దివ్యలోకముల కేగెను. సూర్యాగ్నులు మెచ్చు కొని కర్తల నాశీర్వదించి పోయిరి. దత్తస్వామి సర్వవిద్యలు సర్వమహిమలు నీ యందు భాసించును. నీవు లోకోద్ధారము చేయుచు నిష్టమైనంత కాలము ఇందుండి తర్వాత నీ పత్నితో గూడ బ్రాహ్మలోకమున కేగుము. అని యాదేశించి యంతర్థానము చేసెను. ఇట్లు కర్మకాండము మోక్షోపాయమైనది కదా!

ఇంకను భారతమున సుదర్శనోపాఖ్యానము గృహస్థాశ్రమముననే ముక్తి నొందవచ్చునని చెప్పుచున్నది. దానికి అతిధిపూజ ముఖ్యము, అందు తన దేహము ప్రాణము పత్నీపుత్రాదులు పశుభవనాదులు సర్వము నతిధికొఱకే యను భావముతో పత్ని నతిధి సత్కరించిన సుదర్శును నతిధి యగు ధర్మదేవత మెచ్చి వరములిచ్చి మృత్యువును జయించితివని చెప్పిపోయెను. ఇట్టి ప్రసంగములనేకములు గలవు. కాన కర్మోపాసనాదికములు ముక్తికి పరంపరాకారణములు. స్వరూపజ్ఞానము సాక్షాత్కారణము. కావుననే శ్రీశంకర భగవత్పాదుల వారు వేదములు, స్మృతులు, పురాణములు, నితిహాసములు - ఇవి యన్నియు వాక్యావాంతర వాక్యకలనచే నేకవాక్యమని యనుగ్రహించిరి. స్వరూపజ్ఞానము భాసింపగనే పుణ్యపాపములు లేకుండును. అవి లేకున్న జన్మజరాదులు నడంగును. అదియే బ్రాహ్మియవస్థితి. దాని కనేకమార్గములున్నను, శ్రోతలుయనుగతి శ్రీమద్భగవత్పాదుల వారి దక్షిణామూర్తి స్తవమందలి నాకు తోచిన భావము ననువదించి ముగించెద.

25

శ్లో|| విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం

వశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా

యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమేవాద్వయం

తసై#్మశ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||

అద్దమునందు నగపడుచున్న నగరమువలె తనలోనున్న విశ్వమును నిద్రవంటి తన యందలి మాయచేత వెలుపల నునట్లు చూచుచు ప్రబోధ సమయమున సజాతీయ విజాతీయ స్వగతభేదము లేని స్వస్వరూపమును మాత్రమే యనుభవించినట్టి శ్రీమంతుడగు గురురూపమున సాధకుల కుపాసనీయుడగు దక్షిణామూర్తి స్వామికిదె నా నమస్కృతి.

అద్దమునందు ఇంకొక వస్తువు వాస్తవముగ నుండు నవకాశము లేదు. అయినను కనబడుచున్నది కదా? అదియెట్లు? అదియే మాయ. మాయయన అసత్యవస్తువు సత్యముగా భాసించుట. లేనివస్తువు భాసించుట ఎట్లు? నిద్రలో లేని వస్తువులు భాసించుట లేదా? అవి మెలకువలో లేనివని నిశ్చయింపబడుట లేదా! అట్లే అజ్ఞాన దశలో అగపడు ఈ ప్రపంచము స్వరూపజ్ఞాన దశయందు భిన్నముగ గన్పట్టుట లేదు. ఇచ్చట మనోజన్యజ్ఞానమును గొన అందఱు జ్ఞానులమనుచున్నారు. ఈ జన్యజ్ఞానము అజ్ఞానమే. దీనికి కారణమగు అఖండ జ్ఞాన స్వరూపమగు వారు జ్ఞానులు. ఆ దశలో ''బ్రహ్మసత్యం జగన్మిధ్యా'' అని అనుభవించుచు సాధకులకు అట్టి యజ్ఞానమును దొలగించువాడు గురుమూర్తి గు-అన అంధకారమని. రు-అన దాని తొలగించు వాడని పెద్దలు అందురు. కాన అజ్ఞానాంధకారము పోగొట్టి తన స్వానుభవమును శిష్యునందు ప్రకాశింపజేయుశక్తి గలవాడు గురుమూర్తి సగుణబ్రహ్మము, దక్షిణముఖమగు పరమేశ్వర స్వరూపము దానికి నమస్సు. అన ప్రహ్వీభావము ప్రపంచోన్ముఖమగు ననుభవము బ్రహ్మాభిముఖ మగుటయే ప్రహ్వీభావమున కర్థము.

శ్లో|| బీజస్యాంతరివాం కురోజగదిదం ప్రాఙ్ని ర్వికల్పంపున

ర్మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం

మాయావీవ విజృంభయత్వపి మహాయోగీవయ స్స్వేచ్ఛయా

తసై#్మ శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణా మూర్తయే!

విత్తనము నందలి యంకురమువలె సృష్టికి పూర్వకాలమందు వికల్ప రహితమైనది, యయ్యుతరువాత మాయచేకల్పింపబడిన దేశముయొక్కయు కాలముయొక్కయు భేదవిధములచేతనైన విచిత్రత్వములచేత చిత్రింపబడిన ఈ జగమును గారడివానివలె నే దేవుడు విప్పార జేయుచున్నాడో? మహాయోగివలె నొక్కడే నానారూపములతో నడుగుచున్నాడో అట్టి శ్రీదక్షిణామూర్తి యని యుపాసింపబడు శ్రీ మన్మహా గురుమూర్తి కొఱకైన నా నమన మిదె తన్మయత కగునుగాక?

శ్లో|| యసై#్యవ స్ఫురణం సదాత్మక మపత్కల్పార్ధకం భాసతే

సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యోబోధ యత్యాశ్రితాన్‌

యత్పాక్షాత్కరణాద్బవేన్నపునరావృత్తిర్భవాం భోనిధౌ !

తసై#్మ శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణా మూర్తయే||

ఏ గురుమూర్తి యొక్క సద్రూపమగు ప్రకాశము అసత్ప్రాయ వస్తు రూపము గలదిగా భాసించుచున్నదో ఏ దేవుడు తన్నాశ్రయించినవారికి తత్త్వమసి యను వేదవాక్యముచే ప్రత్యక్షముగ ప్రరూపమును బోధించుచున్నాడో ఏ భగవంతుని బోధానుభవము వలన మరల ఈ సంసార సాగరమందు రావలసినపని లేకుండబోవునో అట్టి శ్రీగురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి నిదె నమస్సు ప్రహ్వీభావము.

శ్లో|| నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం

జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్స్పందతే

జానామీతి తమేవ భాంతమను భాత్యేతత్స మస్తంజగ

త్తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే||

చాల చిల్లులుగల కుండలో నున్న పెద్ద దీపపు వెలుతురువలె నెవని స్వరూప జ్ఞానము చక్షురాదింద్రియముల వెంట బయటికి స్రవించుచున్నదో తెలిసికొనుచున్నానను నొకడే విభుడు స్వయముగా భాసించుచుండగా వాని స్ఫురణము ననుసరించి ఈ జగమంతయు భాసించుచున్నదో అట్టి శ్రీకరుడగు గురుమూర్తికి ఆ బీజమును భాసింపజేయు వాడగు శ్రీ దక్షిణామూర్తికి, స్వామికి మా మనోవాక్కాయ కర్మముల ప్రహ్వీభావమది. అనగా నివియన్నియు తత్ప్రవణములగుట. సగుణవిషయమున నమస్కృతి. గుణాతీత భావమున తాద్రూప్యస్థితి.

శ్లో|| దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాంబుద్ధించ శూన్యం చిదుః

స్త్రీబాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః

మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణ

తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే!

ఆడువారు, బాలురు, గ్రుడ్ఢివారు, జడులు పోలికగాగల మిక్కిలి భ్రాంతులగు మతవాదులు అహం నేను అనుచోట తమ్ము తామెరుగక దేహమును గాను ప్రాణమును గాను ఇంద్రియములను గాను మనస్సును గాను బుద్ధిని గాను శూన్యమును గాను చెప్పుచున్నారు. తద ర్ధమగు సర్వసాక్షి స్వరూపము స్ఫురింపచేయుచు మాయాశక్తి యొక్క విలాసముల వలన నేర్పడిన వారి వారి వ్యామోహముల మొదలంట నశింపజేయునట్టి శ్రీ మద్గురుమూర్తికి దక్షిణామూర్తికి నిదె నమస్సు.

శ్లో|| రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛా దనా

త్సన్మాత్రః కరణోప సంహరణతోయో భూత్సుషుప్తః పుమాన్‌

ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే

తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!

మాయ చక్కగా వ్యాపించుటవలన రాహుచే గ్రహింపబడిన సూర్యచంద్రుల యట్టివాడై సత్తామాత్రుడైన పురుషుడు సుషుప్తినొందినవాడగును. మెలకువ వచ్చినప్పుడు నేనింతదనుక నిద్రించితినని యేసాక్షి తత్కాలమందునుగల తన్ను గుర్తించుచున్నాడో యట్టి శ్రీ గురుమూర్తికి దక్షిణామూర్తికి నిదె నమస్కృతి. గాఢనిద్రలో నింద్రియాదులు పరమించినను తన్ను దాననుభవింపకున్న మెలకువ వచ్చిన తరువాత గుర్తింపలేడు. అనుభూత విషయమే స్మృతిగోచరమని సిద్ధాంతము. సుషుప్తానుభవమున లేని కరణాదులు అహం శబ్ధార్థములు కానేరవు.

శ్లో|| బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వ వస్థాస్వపి

వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంత స్ఫురంతం సదా

స్వాత్మానం ప్రకటీ కరోతి భజతాం యోభద్రయా ముద్రయా

తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!

నేను బాలుడను అనువానికి కొన్నినాళ్ళకు వయస్సు రాగా నేను వయసులో నున్నవాడ ననుకొనునపుడు బాల్యము పోయినను ''నేను'' పోలేదు. తరువాత నేను వృద్ధుడ నన్నప్పుడు ¸°వనము పోయినను ''నేను'' పోలేదు. అట్లే నేను మేల్కంటిని. నేను కలగంటిని. నేను గాఢనిద్ర నొందితిని. అనునప్పుడు జాగ్రత్స్వప్న సుషుప్తులు మారుచున్నను నేను మారుట లేదు. ఇట్లు సర్వావస్థలయందు నహమని లోపల నెల్లప్పుడు స్ఫురించుచున్న స్వస్వరూపమునే దేవుడు అజ్ఞానమును తొలగించుటచేత భద్రమగు జ్ఞానముద్రచేత భక్తులకు ప్రకటించుచున్నాడో అట్టి శ్రీ గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఈ ప్రణామము.

శ్లో|| విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత

శ్శిష్యా చార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః

స్వప్నే జాగ్రతివా యఏష పురుషోమాయా పరిభ్రామిత

స్తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!

ఈ పురుషుడు మాయచే మిక్కిలి విభ్రాంతి నొందింపబడినవాడై మెలకువ యందుగాని కలయందుగాని కార్యకారణ ధర్మముతోను ప్రభుభృత్యసంబంధముతోను గురుశిష్య రూపముతోను అట్లే తండ్రులు బిడ్డలు నను విధముతోను నిట్లే భార్యాభర్తృత్వాది న్యాయముతోను విశ్వమును గనుగొనుచుండెనను మాట యేది కలదో? అట్టి భ్రాంతిని తొలగించి ఈ విశ్వమును సచ్చిదానంద స్వరూపమగు తన్నుగానే నిద్రా దృష్టాంతమున ననుభవింపజేయు శ్రీ గురుదేవునకు దక్షిణామూర్తిస్వామికి నిదే ప్రణతి.

శ్లో|| భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాధో హిమాంశుఃపుమా

నిత్యాభాతి చరాచరాత్మక మిదం యసై#్స్యవమూర్త్యష్టకం

నాన్యత్కించ నవిద్యతే విమృశతో యస్మా త్పరస్మా ద్విభో

స్తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే!

భూమి, జలము, అగ్ని, గాలి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, చిదాభాసుడు - ప్రతి శరీరములయందు తోచు జీవుడు ననునెవని యెనిమిది రూపములే ఈ జంగమ స్థావరాత్మకమవు విశ్వముగా దోచుచున్నదో, గురు బోధతో విమర్శించి చూచువానికి ఏ పరాత్పరుడవు విభునికన్న నన్యమగునది యానంతయు నుండదో, అట్టి దక్షిణామూర్తి రూపుడవు గురు స్వరూపమున నిదె చేరి యుంటివి అని తొమ్మిది శ్లోకములతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులవారు ఒక ప్రకరణమును జూపియున్నారు ఇదియే మనము ప్రారంభములో చెప్పుకొన్న బ్రహ్మము. భూమము నను తత్త్వమునుండి యవ్యక్తము దానినుండి మహత్తు అద్దానివలన అహంకారము తర్వాత సూక్ష్మభూతములు, పంచీకృత భూతములు నిట్లు క్రమ స్పష్టమగు నీ వ్యావహారిక ప్రపంచమున విజ్ఞానమును వదలి జ్ఞానియగు వానికి వ్యవహారము విరామము నొంద నేది మిగులునో యదియే సత్య స్వరూపము, సంవిత్తు, ఆనందము - నని గురుశిష్య దృష్టితో శబ్ధింపబడు నవరూపమగు రూపము

శ్లో|| అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం

తథారసం నిత్య మగంధ వచ్చయత్‌

అనాద్యనంతం మహతః పరంధ్రువం

నిచాయ్యతం మృత్యుముఖాత్ప్రముచ్యతే||

అనియు

శ్లో|| తదాస్తిమిత గంభీరం

నతేజో నతమస్తతం

అనాఖ్య మనభిప్రఖ్యం

సత్కించిదవ శిష్యతే||

అనియు శ్రుతిస్మృతుల ననేకముల జూపి వ్యవహారములో జేయు గురుల బోధమువలన దోచుప్రకాశము. ఇది యనుభవమునకు వచ్చిన కర్తవ్యము లేదు. మిగిలినది భూమ మొక్కటియే.

ఓమ్‌

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

Naaku Thochina Maata    Chapters